రాలిన తూలిక

ఇంట్రో

కొంచెం దిగులు. కాస్త కంటి తడి. పిసరంత ఆనందం. పెదవుల మీదకు వచ్చిపోయిన చిరునవ్వు. ఇవి చాలు, గుంపు నుంచి పారిపోవటానికి. మొబైల్‌ మోగని, టీవీ కనబడని, డియోడరెంట్‌ వాసన రాని, కృత్రిమ కర స్పర్శలేని, పిజ్జాలతో రుచిచెడని చోటకు నా అంతట నేను వెళ్ళిపోతాను. అజ్ఞాతానికి అరణ్యమే అవసరంలేదు. వాకిలి చాలు, కారిడార్‌ చాలు, బాల్కనీ చాలు. వీటన్నిటి కంటే బాత్‌ రూమ్‌ మేలు. ఇష్టమైన తలపులతో నిలువెల్లా తడిసిపోతున్నప్పుడు ఎవరూ ఉండకూడదు. నా కలల హైవేలో నేను వెళ్తున్నప్పుడు, ఎదురుగా ఒక్క వాహనమూ కనపడకూడదు. నా ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను. ప్లీజ్‌ తలుపులు దబదబా బాదకండి. వెనక నుంచి హారన్ల రొద చేయకండి.

Photo By: Mike Bair

 

 

 

 

 

 

 

 

 

ఏకాకి ఆకాశంలో

ఎగిరే ఏ ఒంటరి పిట్ట

నుంచి జారిన ఈకలో అవి.

గుడ్డలో పెట్టి కుట్టేస్తే

తూలికా తల్పమే.

ఎందరినో నిద్రపుచ్చింది.

ఈకల కుప్పలోంచి

ఎలా తప్పించుకుని వచ్చిందో

ఒకటి నా చేతికొచ్చింది.

నా నిద్ర చెడగొట్టింది.

ఒక్కటే రాత.

ఇది ఏకాంతమా? ఈకాంతమా?

చిత్రం!

కాగితం మీద ఒక్కొక్క అక్షరం

ఏకాకి పిట్టల్లా.

దేనికదే ఎగురుతున్నాయి.

ఎన్ని తూలికలు రాలుస్తాయో!

-సతీష్ చందర్

 

2 comments for “రాలిన తూలిక

Leave a Reply