రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజీ ఫార్ములా: లాభసాటి ఓటమి!

తెలంగాణ!

తేల్చేస్తే తేలిపోతుంది

నాన్చేస్తే నానిపోతుంది.

తేలిపోతే, కాంగ్రెస్‌ తేలుతుందా? మునుగుతుందా? ఇప్పుడున్న స్థితిలో తేల్చకపోయినా మునుగుతుంది.

మునిగిపోవటం తప్పదన్నప్పుడు కూడా, కాంగ్రెస్‌ తేలే అవకాశం కోసం ప్రయత్నిస్తోంది. ఇది కొత్త పరిణామం. తేల్చటం వల్ల కాకుండా, నాన్చటం వల్లే ఈ ప్రయత్నం ఫలించగలదని ఆ పార్టీ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.

టీఆర్‌ఎస్‌ నేత కేసీఆర్‌ జోస్యం ప్రకారం నెలాఖరులోగా యూపీయే సర్కారు- ఏదీ తేల్చేట్టు లేదు. ఒక వేళ కాంగ్రెస్‌ తన వైఖరి పేరిట ఏదయినా చెప్పినా- అదే రాష్ట్రంలో చిచ్చేరేగుతుంది. ఈ ‘చిచ్చు’కు ఎవరి రిహార్సల్స్‌ వారు వేస్తున్నారు.

ఈ ‘చిచ్చు’ వల్ల రాష్ట్రంలో వచ్చే ఉద్యమాలు రెండు కావు, మూడు. రెండేళ్ళ క్రితం తెలంగాణ ఇస్తానని వెనక్కి తీసుకున్నందుకు రెండే ఉద్యమాలు వచ్చాయి. ఒకటి: తెలంగాణ ఉద్యమం, రెండు: సమైక్యాంద్ర ఉద్యమం. ఈ సారి ఈ రెంటితో పాటు: ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తోడయ్యే అవకాశ ముంది.

ఈ సారి కూడా యూపీయే తెలంగాణ ‘ఇస్తానని వెనక్కి తీసుకున్నదనే’ వంకతోనే తెలంగాణలో అలజడులు రేకెత్తించవచ్చు. టీజాక్‌ సెప్టెంబరు 30న తలపెట్టిన ‘లాంగ్‌ మార్చ్‌’ కూడా ‘మరోసారి మోసం’ అన్న నినాదంతో ముందుకు వెళ్ళే అవకాశం వుంది. చిన్నరాష్ట్రాల ఏర్పాటు వల్ల నక్సలైట్ల సమస్య తలయెత్తుతుందన్న – కుంటి సాకులతో ఇప్పటికే కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చిచ్చుకోసం ఒక అగ్గి పుల్ల గీసి పెట్టారు. (నిజానికి నక్సలైట్లు తాము స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది రాష్ట్రాల సైజు మీద ఆధార పడి వుండదు. సెజ్‌లూ, గనులూ, ప్రాజెక్టులూ- పెద్ద సైజులో ఎక్కడ వుంటాయో, ఎక్కడ వీటి పేరు మీద గిరిజనులను ఖాళీ చేయిస్తున్నారో అక్కడ వీరు మకాం చేస్తున్నారు.)

నేడు సీమలోనూ, ఆంధ్రలోనూ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పీఠం వేసుకుని కూర్చుంది. నిన్న మొన్నటి దాకా, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కూడా అదే పని చేసింది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఆ పార్టీ ‘ఏక ఛత్రాధిపత్యానికి’ గండి పడింది. ముందు (మహబూబ్‌ నగర్‌ లో గెలిచి) బీజేపీ, తర్వాత (పరకాలలో గెలుపునకు అత్యంత సమీపంగా వచ్చి) వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌కు చెమట్లు పోయించాయి. ఆ పార్టీకి గతంలో ‘సమైక్యాంధ్ర’ ముద్ర వున్నా, ఆ పార్టీ నాయకురాలు వై.యస్‌. విజయమ్మ నేడు తెలంగాణలో స్వేఛ్చగా పర్యటించగలగుతున్నారు. జనాన్ని విశేషంగా ఆకర్షించగలుగుతున్నారు.

ఈ స్థితిని ఇలా వదిలేస్తే, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీమ, ఆంధ్రలోనే కాకుండా, ఏదో మేరకు తెలంగాణలో కూడా పాగా వేయ గలుగుతుంది. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఎవరి మద్దతూ లేకుండా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతుంది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌ మద్దతు కోరాల్సిన అవసరం రాదు. అలాంటప్పుడు, ఇదే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో యూపీయేకు మద్దతు ఇస్తే ఇవ్వవచ్చు, ఇవ్వక పోవచ్చు. ఈ పరిస్థితి కాంగ్రెస్‌పార్టీకి ప్రాణాంతకమవుతుంది. ఎందుకంటే రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టుకుని వెళ్తున్న కాంగ్రెస్‌కు ప్రతీ రాష్ట్రం నుంచీ వచ్చే సీట్లు ‘అత్యంత అపురూపమ’వుతాయి.

మన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయినా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి మద్దతు ఇచ్చి, ప్రతిగా ఆ పార్టీ నుంచి ఎం.పీల వోట్లు పొందాలని తప్పకుండా ఆశిస్తుంది. కాాంగ్రెస్‌ రాష్ట్రంలో వరసగా మూడవ సారి ప్రభుత్వం ఏర్పాటు చేసే ముచ్చటే లేదని, పలువురు మంత్రులే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. లేకపోతే, తాము కాంగ్రెస్‌లోనే వుంటే, తమ్ముళ్ళనో, కొడుకులనో వైయస్సార్సీకి ఎందుకు పంపిస్తారు? కాబట్టి, ఎలా చూసినా వైయస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి పరిస్థితులు రోజు, రోజుకూ మెరుగు పడుతున్నాయి. తెలంగాణలో ఆ పార్టీకి దొరికిన పట్టు వల్ల ‘స్వంతగా ప్రభుత్వాన్ని ‘ ఏర్పాటు చేసుకునే దిశగా దూసుకుపోతోంది.

రాష్ట్రంలో వైయస్సార్సీ ప్రభుత్వం ఏర్పాటుకు, కాంగ్రెస్‌ తోడ్పాటు తప్పని సరి కావాల్సిన స్థితిని కల్పించాలి. ఇదీ కాంగ్రెస్‌ తాజా వ్యూహం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఉద్యమం రగులుకుంటే, తెలంగాణ గడ్డ మీద ‘ప్రత్యేక తెలంగాణ’ కు బేషరతు మద్దతు ఇచ్చే పార్టీల వారే తిరగగలుగుతారు. అలాంటప్పుడు మళ్లీ వైయస్సార్‌ కాంగ్రెస్‌కు ఇబ్బంది ఏర్పడుతుంది. ఉపఎన్నికల్లో అన్నట్లుగా ‘తెలంగాణ ఇవ్వగలిగే స్థితి ‘ తమ పార్టీకి రాలేదు- అని చెబితే వినక పోవచ్చు. విస్పష్ట మైన ప్రకటనను తెలంగాణ ఉద్యమ కారులు ఆశిస్తారు. అలా ‘స్పష్టం’ చేసేస్తే, ఆంధ్రలోనూ, సీమలోనూ ‘సమైక్యవాదులూ’, ‘ప్రత్యేక సీమ’ వాదులూ నిలదీస్తారు. స్పష్టం చేయకపోతే, వైయస్సార్సీ సీమాంధ్రకే పరిమితమయి వుంటుంది. దాంతో, 2014లో స్పష్టమైన మెజార్టీ దిశగా ప్రయాణించటం కష్టమవుతుంది. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కాంగ్రెస్‌ చేతిలో వున్న ‘అరకొర’ సీట్ల అవసరం ఆ పార్టీకి ఏర్పడుతుంది. అందుకోసం ‘కుండ మార్పిడీ’ లాగా కేంద్రంలో యూపీయేకు మద్దతు ఇష్టపూర్వకంగా ఇస్తుంది.

ఇప్పుడు ఏర్పడపోయే మూడు ప్రాంతాల ఉద్వేగాలకు ప్రాతినిథ్యం వహించటానికి కాంగ్రెస్‌ నుంచి కూడా నాయకులు సన్నధ్ధ మవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పక్షాన అప్పుడే మంత్రి జానారెడ్డి రంగంలోకి దిగి, ప్రత్యేక తెలంగాణ కోసం సంతకాల ఉద్యమం చేపట్టారు. రాయలసీమలో బైరెడ్డి రాజశేఖ రరెడ్డి రాష్ట్రాన్ని ‘మూడు ముక్కలు చేయాలన్న’ డిమాండ్‌ పెట్టారోలేదో, మళ్లీ మరో మంత్రి టీ.జీ. వెంకటేశ్‌ ఇదే అంశం మీద కొట్లాడటానికి మరోసారి కాలుదువ్వుతున్నారు. ఇక ఆంధ్రలో ముందునుంచే, సమైక్యాంధ్ర ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ నేతల కన్నా కావూరి, లగడపాటి వంటి కాంగ్రెస్‌ నేతలు ముందంజలో వున్నారు. గుర్తింపు కూడా వారికే వచ్చింది. వారు కూడా ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతే కాదు. ‘హైదరాబాద్‌’ విషయంలో మళ్ళీ పీట ముడి వేయటానికి నగరంలోని కాంగ్రెస్‌ నేతలు నాగేందర్‌, ముఖేష్‌లు ముందే ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టే, ప్రత్యేక తెలంగాణ కోరుతూ సోనియా కు రాసిన లేఖ మీద వారు సంతకాలు చేయటానికి సుముఖత వ్యక్తం చేయలేదు. ‘ముందు హైదరాబాద్‌ తేలనీయండి’ అన్నట్టుగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

అయితే ఈ సారి రేగే ‘చిచ్చు’ వల్ల టీఆర్‌ఎస్సే మళ్ళీ లాభ పడితే..? ఈ ప్రశ్నకు కూడా కాంగ్రెస్‌ వద్ద సమాధానం వుంది. ఈ సారి తెలంగాణ ఉద్యమానికి ‘పేటెంటు’ ఒక్క టీఆర్‌ఎస్‌కు మాత్రమే లేదు. ఈ విషయంలో బీజేపీ కూడా తన ఉనికిని చాటుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా ‘తెలంగాణ అంశం’ మీద అనుకూల వైఖరిని ప్రకటిస్తూ లేఖ రాయాలని ఉవ్విళ్ళూరుతోంది. కాబట్టి ఈ సారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల వచ్చే రాజకీయల లబ్ధిని మిగిలిన పక్షాలతో టీఆర్‌ఎస్‌ కలసి పంచుకోవాల్సి వస్తుంది. ఫలితంగా 2014 లో ఒక్క టీఆర్‌ఎస్‌ మాత్రం ‘తెలంగాణ సెంటిమెంటు’ వోటును దండుకోలేదు. ఒక వేళ అలా చేయగలిగినా, రాష్ట్రం కలసి వున్నంత కాలమూ, టీఆర్‌ఎస్‌ తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అలాగని వైయస్సార్సీతో పొత్తు కుదుర్చుకోలేదు. ఎటొచ్చీ తిరిగి కాంగ్రెస్‌ వైపే చూడాలి.

ఇటీవలి కాలంలో, కాంగ్రెస్‌కూ వైయస్సార్సీకి మధ్యవున్న దూరం మాత్రమే కాదు, కాంగ్రెస్‌కూ టీఆర్‌ఎస్‌కూ మధ్య వున్న దూరం కూడా తగ్గింది.

రేపు యుపీయేలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు రెండు పార్టీల మద్దతూ తప్పని సరి అవుతుంది. కానీ, కాంగ్రెస్‌ అవసరం టీఆర్‌ఎస్‌కు వున్నంతగా , వైయస్సార్సీకి లేని పరిస్థితి వచ్చిందనుకోండి. అప్పుడు రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్‌ ఆటకట్టు అవుతుంది.

అందుకే కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌ జోరు పెరిగినా భరించ గలుగుతుంది కానీ, వైయస్సార్సీ స్పీడు పెరుగుతుందంటే వణికి పోతుంది. ఈ ఒక్క ‘లాజిక్కూ’చాలు. తెలంగాణను తేల్చకుండా, చిచ్చువైపు మళ్ళించటానికి. ఈ ప్రాంతంలో వైయస్సార్సీ నేతల ప్రభంజనాన్ని , తొలుతు కాంగ్రెస్‌ సైతం సౌకర్యం భావించిన మాట వాస్తవమే. అందుకు కారణం- ఆ మేరకు అప్పట్లో టీఆర్‌ఎస్‌ తరిగి కాంగ్రెస్‌ వైపు చూసింది.

కానీ ఇప్పుడు కాంగ్రెస్‌కున్నది ఒక్కటే లక్ష్యం: తెలంగాణలో వైయస్సార్సీకి బ్రేకు వెయ్యటం. కానీ, ఒక్కసారి జనాదరణ మొదలయ్యాక, దానిని వెనక్కి తిప్పటం అంత సులభం కాదు.

అందుచేత మరో మారు తెలంగాణను తేల్చేపేరు మీద నాన్చటానికే యూపీయే నిర్ణయించుకున్నట్టు అర్థమవుతోంది.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక14 -21 సెప్టెంబరు 2012 సంచికలో ప్రచురితం)

 

1 comment for “రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజీ ఫార్ములా: లాభసాటి ఓటమి!

  1. తెలంగాణా తెచ్చేదీ , ఇచ్చేదీ 
కాంగ్రెస్సే… లేకుంటే చచ్చేదీ కాంగ్రెస్సే.. అని వాళ్ళు కాళ్ళు వేలాడేసి, నోళ్ళూ వెళ్ళబెట్టేసి… చాలా ఏళ్ళకిందటే చెప్పేశారు సతీశ్ చందర్ గారూ. ఇప్పుడు తేల్చినా, నాన్చినా ఫలితం ఒకటే.

Leave a Reply