‘రోబో’ కాంత్‌

rajani kanthపేరు :రజనీ కాంత్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: స్టారాధిస్టారుడు.

ముద్దు పేర్లు : వాజీ. శివాజీ. శివాజీరావు గైక్వాడ్‌ ( అసలు పేరు ఇప్పటికీ ముద్దుగానే వుంటుంది.)

విద్యార్హతలు : బీ.ఎస్‌.సి . అంటే తెలుసా? (బ్యాచిలర్‌ ఆఫ్‌ స్వింగింగ్‌ సిగార్‌) చేతిలో సిగార్‌ను(సిగరెట్టును) విసిరితే అది రెండు పల్టీలు కొట్టి నోట్లో పడుతుంది.(నాలా చాలా మంది ప్రయత్నం చేసి మూతులు కాల్చుకున్నారు.బ్రహ్మానందం లాంటి ‘పొట్టి రాయుడు’ పక్కవాళ్ళ మూతుల్ని కాలుస్తారు.)

హోదాలు : సూపర్‌ స్టార్‌నయినా ఒకనాడు బస్‌ కండక్టర్‌ నన్న విషయాన్ని మరచిపోను.(అందుకే… ‘నా దారి రహదారి’ అంటాను. బస్సు వెళ్ళాల్సింది రహదారే కదా!)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: వయసును దాచను. గ్లామరుండేది విగ్గుల్లోనూ, మేకప్పుల్లోనూ కాదు.. స్టెయిల్‌ లో…!

రెండు: శతసహస్రకోటీశ్వరుణ్ణీ నేనే..సర్వసంగ పరిత్యాగినీ నేనే.

అనుభవం : అందరూ -నన్ను హిమాలయాలంత ఎత్తు ఎదిగానూ- అంటారు. నిజమా కాదా.. అని తేల్చుకోవటానికి హిమాలయాలు వెళ్ళివస్తాను. అయినా ఎదగటానికీ, ఎదక్కపోవటానికీ నేనెవర్నీ..? ‘ఆ దేవుడు శాసిస్తాడు, ఈ ‘రజనీ’ చలం పాటిస్తాడు.)

సిధ్ధాంతం : సెక్యులరిజం.( అప్పుడే ‘బాషా’, అంతలోనే ‘బాబా’)

వేదాంతం : నాన్నా! ‘నందులు’ మాత్రమే గుత్తులు గా వస్తాయి. ఆస్కార్‌ ఒక్కటే సింగిల్‌ వస్తుంది. ఏదో ఒక రోజు వస్తుంది లెండి.

వృత్తి : మ్మూ…! లక లక లక లక…! ఆ రేంజ్‌లో పాత్రలోకి వెళ్ళిపోతాను. నేను ఏ పాత్ర వేస్తే ఆ పాత్ర కనపడదు. రజనీ కనిస్తాడు. గాంధీ పాత్ర వేయలేదు కానీ, వేస్తే ‘రజనీ గాంధీ’ కనిపిస్తాడు. ఆ మధ్య ‘రోబో’ కాంత్‌ ను చూసి వుంటారు కదా! ‘రోబో’కు కూడా మన స్టయిల్‌ వచ్చేస్తుంది.

హాబీలు :1. అప్పుడప్పుడూ ‘రజనీ’కీయాలు చేయండి. (మనం చేస్తే వాటిని రాజకీయాలు అనకూడదు). అక్కడ కూడా మన పంచ్‌ లైన్స్‌ వుంటాయి. 1996 ఎన్నికలప్పడు ఏమన్నానో తెలుసా? ‘జయలలిత పార్టీ (ఎఐఎడిఎంకెను) మళ్ళీ గెలిపిస్తే తమిళ నాడును దేవుడు కూడా బాగు చేయలేడు’ అన్నాను. కానీ తర్వాత 2004లో మళ్లీ ఎఐఎడిఎంకె కే మద్దతు ఇచ్చాను.

2. లాభాలను పంచుతాను. నష్టాన్ని నేనే భరిస్తాను. నా సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు ఇచ్చిన సందర్భాలున్నాయి.

మిత్రులు : కాని వారెవ్వరూ… అందరూ మిత్రులే.

శత్రువులు : సినిమాలోనే వుంటారు. జీవితంలో వుండరు. మరాఠా కుటుంబం మాది. కన్నడ రాష్ట్రంలో పుట్టాను. తమిళనాడులో ఎదిగాను.

జపించే మంత్రం : ‘కొలవరి..కొలవరి డీ’. అర్థం అడక్కండి. అర్థం కానిదే మంత్రం మా అల్లుడు (ధనుష్‌) చెప్పాడు.

విలాసం : దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ.. ఇంక ఇల్లేల.. సొంత ఊరేల…!!(ఇలాంటివి అడక్కండి నాకు వేదాంతం వచ్చేస్తుంది.

గురువు : నిత్య ‘బాలు’డూ, నిండు ‘చంద్రుడూ’ ఎవరో చెప్పుకోండి చూద్దాం. బాలచందర్‌.

జీవిత ధ్యేయం : ‘బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్టు’ ఇలాంటి డైలాగులు పేల్చుతూ, వినోదింప చేయటం.

-సతీష్ చందర్

(గ్రేట్  ఆంధ్ర వారపత్రిక 14-20 డిశంబరు2012 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply