సమాధానం తెలిసినట్టుగానే వుంటుంది కానీ, తెలియనట్టుగా కూడా వుంటుంది. కొన్ని అంతే. ప్రేమికుడా? అంటే? అప్పుడు ఇలాగే చెబుతాం.
కానీ కొందరు మహానుభావులు వుంటారు. మరీ నిర్వచనాలు ఇవ్వరు కానీ, చిన్న చిన్న క్లూలు ఇచ్చి వెళ్ళిపోతారు. గురజాడ అప్పారావు ఇదే పనిచేశారు.
లీడర్ గురించి చెప్పలేదు కానీ, పాలిటిష్యన్ గురించి చెప్పారు. నిజానికి చెప్పారూ అనటం కన్నా, చెప్పించారూ అనటం సబబు గా వుంటుంది.
‘ఒపీనియన్స్ చేంజ్ చేస్తేనే కానీ పాలిటిష్యన్ కాలేడు’ అని ఓ తుంటరి పాత్ర చేత అనిపిస్తాడు. చెప్పి శతాబ్దం దాటిపోయినా, నిర్వచనం నేటికీ వర్తిస్తూనే వుంది.
‘మాట ఇస్తారు, తప్పుతారు’
అది తమ పార్టీని మరోపార్టీలో విలీనం గురించి కావచ్చు. లేదా దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానన్న వాగ్దానం కావచ్చు.
‘అడుగు వేస్తారు. మడమ తిప్పుతారు’
ముందు విభజన అంటారు. తర్వాత సమైక్యమంటారు.
‘లేఖ ఇస్తారు. సాకు చెబుతారు’
ముందు, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసుకోవచ్చని రాసిచ్చేస్తారు. తర్వాత ‘అవి రెండు ముక్కలు కాదు.. రెండు కళ్ళు, రెండు చిప్పలు, రెండు చక్రలు, రెండు టైర్లు’ అని ‘సమనాయ్యం’ గురించి మాట్లాడతారు.
ఒపీనియన్స్ ని చేంజ్ చేస్తూ వుంటేనే, పాలిటిష్యన్ వృత్తిని చేంజ్ చేసుకోనవసరంలేదని ఇలాంటి వారు నమ్ముతారు.
ఈ పాలిటిష్యన్నేనా.. మనం ‘లీడర్లే’ మోనని భ్రమ పడుతుంటాం?
మరి లీడర్లెవరూ- అని గట్టిగా అంటే, మనం పాత జాబితా తీస్తుంటాం. గాంధీ, అంబేద్కర్, పటేల్, నెహ్రూ- ఇలా ఎవరికి నచ్చిన పేర్లను చెబుతూ పోతూవుంటారు.
అయినా కొందరికి ఈ డోస్ నచ్చదు. ఉరికంబాలెక్కిన వారినీ, ప్రాణాలిచ్చేసిన వారినీ గుర్తుకు తెస్తుంటారు. అది కూడా అందరికీ సౌకర్యవంతమైన శత్రువు చేతిలోనే చనిపోయి వుండాలి.
భగత్ సింగ్, అల్లూరి సీతారామ రాజు, సుభాష్ చంద్రబోస్ ఈ పేర్లు చెప్పగానే మనకి గట్టి ‘ఫీల్’వచ్చింది. మరి గాంధీ కూడా అలానే చనిపోయాడు కదా! కావచ్చు. కానీ గాంధీని చంపింది ఈ దేశం వాడు. వాడికి ‘వలసవాది’ అనే ముద్ర లేదు. కానీ మరో వాదం ఏదో వుండి వుండాలి. అది ఈ దేశంలోనే పుట్టి వుండాలి. ఇలా అనుకునే కొద్దీ, కోపం తగ్గి పోతుంది. ఎవడో ‘ఉన్మాది’ లే అని, ఆ నేరాన్ని ఓ ఒక్కడికే జమ కట్టేస్తేం కాబట్టి, అలాచేసి ఆ ఒక్కడినే ఉరి తీసేసారు కాబట్టి గాంధీది ‘వీరమరణం’ గా గుర్తించటానికి కొందరు ఇబ్బందులు పడుతుంటారు.
మొత్తం మీద ‘ఒపీనియన్స్ చేంజ్’ చేసే పాలిటిష్యన్లంటే అయిష్టమూ, ప్రాణ త్యాగం చేసిన పాత యోధులంటే ఆరాధనా పెట్టుకుంటాం. మొదటి రకం వాళ్ళు పనికిరారు; రెండో జాబితాలోని వారు తిరిగిరారు.
ఈ గ్యాప్‌లోకి కొందరు అమాయక చక్రవర్తులొచ్చేస్తున్నారు. వారిని చూడగానే, ‘నిజాయితీ పరుడు, సేవా ధృక్పథం కలిగిన వాడు’ అని అనిపిస్తారు. ఇలాంటి వారు ఏదో సమస్య పట్టుకుని, తెగే వరకూ లాగి, పాపులర్ అయిపోతారు. ‘లోక్ పాల్’ తో కేజ్రీవాల్ కాలేదూ! అలాగన్న మాట. ‘అవినీతి’ అనే ఒక్క భూతాన్ని తీసివేస్తే, దేశంలో మిగతావన్నీ తమంతటవే పోతాయని నమ్మేస్తారు; నమ్మించేస్తారు. కులతత్వం, మతతత్వం, స్త్రీ హింస- వీటికీ అవినీతికి సంబంధమేమిటో వారికీ తెలీదు, వారిని ఆరాధించే వారికీ తెలీదు.
కానీ ఈ అమాయకపు చక్రవర్తులు నేరుగా ‘సేవా సంస్థలో’ ,’ఎన్జీవోలో’ పెట్టుకోకుండా, రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో అర్థం కాదు. రాష్ట్రంలో కూడా ఒక మేధావి ఇలాగే వచ్చేసి రెండు దశబ్దాలు ఖర్చు చేశారు. పార్టీ కూడా పెట్టేశారు. ‘ఏక్ నిరంజన్’ లాగా ఒకే ఒక్క అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్నారు.
ఉత్త మంచి వాళ్ళు మహా అయితే సేవ చేస్తారు. వారు సేవకులు అవుతారు. కానీ నాయకులు కాలేరు.
సేవ చేయించాలి. అన్ని వ్యవస్థల చేత తనని నమ్ముకున్న వారికి సేవ చేయించాలి. అవసరమయితే ఆవ్యవస్థల మెడలు వంచగలగాలి. వాళ్ళు అనివార్యంగా నాయకులు అవుతారు.
ఇలా చేయించటం మొదలయినప్పుడు ‘జిందాబాద్’ లూ వుంటాయి, ‘డౌన్ డౌన్’ లూ వుంటాయి.
కానీ ‘డౌన్ డౌన్’లను అనతి కాలంలోనే ‘జిందాబాద్’ లుగా మలచుకోగలగాలి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే మెడలో నాగు పాముని విసిరినా, దానిని పూలమాలగా మలచుకోగలగాలి. ఇంకా చెప్పాలంటే సంక్షోభాలకు ఎదురు వెళ్ళాలి. అందుకే కొందరు నేతలు సంక్షోభం లేక పోతే అల్లాడిపోతారు. పనిగట్టుకుని తమ కోసం సంక్షోభం సృష్టించుకుంటారు.
అంతే కానీ, ‘నన్ను వీడు తిట్టేశాడు, వాడు తిట్టేశాడు’ అని గంటలు గంటలు లెక్చర్లు దంచరు. అలా చేసే అతడు ఎప్పటికీ లీడర్ కాలేడు.
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం)