శుభం కార్డు పడ్డాక, కూడా క్లయిమాక్సు కొనసాగే సినిమా చూశారా? అయితే చూడండి. యూపీయే ప్రొడక్షన్స్ వారి ‘రాష్ట్ర విభజన’ అనే చిత్రం అలాంటిదే. ఆంధ్రప్రదేశ్‌నుంచి తెలంగాణను వేరు చేసి రాష్ట్రంగా గుర్తించాలంటూ కేంద్ర కేబినెట్ చేసిన చేసిన తీర్మానం తర్వాత కూడా సినిమా కొనసాగుతోంది.
ముగిసింది కదా, అని థియేటర్లో తమ కుర్చీలలోంచి ప్రేక్షకులు పలుమార్లు లేవటం, కొనసాగుతుంటే మళ్ళీ కూర్చోవటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇప్పటి రాష్ట్ర రాజకీయం అలాగే వుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం లో తీసుకున్న తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటిస్తూ, ‘తెలంగాణ ఇస్తే, తన పార్టీ(టీఆర్‌ఎస్)ను విలీనం చేస్తానని కేసీఆర్ అన్న మాటను సీనియర్ కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అప్పుడే కథ కంచికి వెళ్ళిందని అందరూ భావించారు. ఇప్పటి సినిమాల్లో హీరో, హీరోయిన్లు మనస్పర్థలు క్లయిమాక్సు అంతా కొనసాగి, చివర్లో ఒకరిని చూసి ఒకరు న్నుగీటితే చాలు, ఇక కథ సుఖాంతమేలే అని భావిస్తారు. అదే పాత సినిమాల్లో అయితే ఇద్దరికీ పెళ్ళి చేసి, బాజాభజంత్రీలు మోగిస్తే కానీ, ప్రేక్షకులు థియేటర్ నుంచి వెళ్ళే వారు కాదు. నేటి తంతు అలాగే వుంది. టీఆర్‌ఎస్- కాంగ్రెస్‌ల ‘వివాహం'( విలీనం) జరిగినట్లేలే- అని దిగ్విజయ్ సింగ్ ప్రకటనతో ప్రేక్షకులు కుర్చీల్లోంచి లేవబోయారు.
ఈ లోగా ‘ఆగండి, ఆగండి’ సినిమా ఇంకా ముగియ లేదు- అని కేసీఆర్ వచ్చి అందరినీ కూర్చోబెట్టారు. ‘పార్లమెంటు కొచ్చి బిల్లు ఆమోదం పొందే వరకూ’ ఆగాల్సిందే- అన్నారు. ఆయన చెప్పినట్టే, కథ కొనసాగింది. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌నుంచి వెళ్ళాల్సిందే, ‘ఆప్షన్లూ, గీప్షన్లూ’ లేవని కేసీఆర్ అన్నారు. దాంతో హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రుల ‘అభద్రత’ అన్న ఎజెండాతో ‘సమైక్యాంధ్ర ఉద్యమం’ ఎగిసింది. సినిమా అక్కడితో ఆగలేదు. పార్టీలు అడ్డం తిరిగాయి. సమయానికి జైలు నుంచి బెయిలు మీద వచ్చిన జగన్ ‘సమైక్య’ నినాదం అందుకున్నారు. ముఖ్యమంత్రి ముందే సమైక్యం కోసం పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన భ్రమ కలుగజేశారు. ఇటు కేసీఆర్ హైదరాబాద్ పై ఎలాంటి ‘కిరి కిరి’ ఉండకూడదంటూ సభ పెట్టి, తెలంగాణ ఉద్యమాన్ని కిర్రెక్కించారు. సీమాంధ్రలో తగుల బెట్టిన దిష్టిబొమ్మల సంఖ్యలో కేసీఆర్‌వే ఎక్కువ వున్నాయి. సోనియా ఈ విషయంలో వెనకబడి పోయారు. దాంతో తెలంగాణలో తెలంగాణ తెచ్చిన నేతగా కేసీఆర్ ‘రేటింగ్స్’ పెరిగిపోయాయి. ఈ విషయాన్నే వివిధ సర్వేలు ధ్రువీకరించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కేసీఆర్ కొచ్చే స్థానాలే కాంగ్రెస్ స్థానాల కన్నా అధికంగా వున్నాయి. ఈ స్థితిలో కేసీఆర్ విలీనానికి ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోలేదు. పొత్తుతో సరిపెట్టుకోవచ్చులే- అన్న సంకేతాలను టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌కు పంపించారు.
ఇంత జరిగాకయినా, నమ్మాలి కదా-సినిమా ఇంకా కొనసాగుతుందని! సరికొత్త ట్విస్టులూ, టర్న్‌లతో కథ నడుస్తూనే వుంది. కేసీఆర్‌ను మళ్ళీ నేల మీదకు రప్పించాలంటే, తెలంగాణ ఏర్పాటులో మెలిక పెట్టాలి. కేంద్రాన్ని నడిపించే సోనియాగాంధీ ఎంతో చిత్త శుధ్ధితో, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను చేసుకుంటూ పోతోంటే, రాష్ట్రంలోనే వివిధ రాజకీయ పక్షాలే అడ్డుపడుతున్నాయని నిరూపించటానికి కాంగ్రెస్ ద్విముఖ వ్యూహాన్ని రచించింది. తెలంగాణ ఏర్పాటు వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో తలయెత్తే సమస్యలను పరిష్కరించటానికి ‘మంత్రి వర్గ బృందాన్ని(జి.ఒ.ఎంను) ఏర్పాటు చేయటం తెలిసిందే. ఆ బృందం ఏర్పాటు చేసేందుకు రూపొందించిన విధివిధానాల పై తమ వైఖరులను చెప్పాల్సిందిగా కేంద్ర హోం శాఖ మళ్ళీ రాష్ట్రంలోని వివిధ పార్టీలకు లేఖలు రాసింది. అందుకోసం ఓ సమావేశం ఏర్పాటు చేయటానికి కూడా సిధ్ధమయింది. ‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టుగా ఇలా మరో మారు పిలవటం వల్ల, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేసి ఇప్పుడు ‘కుయ్యో, మొర్రో’ అంటున్న చంద్రబాబు వైఖరిని బయిటపెట్టటం కూడా వ్యూహంలో ప్రధాన భాగమే.తెలంగాణ ప్రకటన తర్వాత కేంద్రాన్ని తప్పు పడుతున్నారు కానీ, తన తెలంగాణను కావాలంటున్నదీ, వద్దంటున్నదీ చెప్పలేదు. ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. అలా చేస్తే, ఆయన ‘రెంటికీ చెడ్డ రేవడి’ అవుతాడు. రెండు ప్రాంతాలలలోనూ మరింత దెబ్బతింటారు.
అలాగే, టీఆర్‌ఎస్ కాకుండా, ఒక్క మజ్లిస్, సిపిఎంలు మినహా మిగిలిన వారందరూ ఒకప్పుడు తెలంగాణ ఏర్పాటును సమర్థించిన వారే. ఇప్పుడు వారి, వారి వైఖరులు బయిట పెట్టటం వల్ల, కేంద్రం తెలంగాణను ఇవ్వాలనుకుంటున్నా ఎంత మంది అడ్డుపడుతున్నారో చూడమంటూ, టీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టవచ్చు. తెలంగాణ ఏర్పాటుకు తోడ్పడాల్సిన టీఆర్‌ఎస్, హైదరాబాద్ విషయంలో ‘అభధ్రత’ ను బూచిలా చూపించి, సమైక్యాంధ్ర ఉద్యమానికి పరోక్షంగా జీవం పోసిందని కాంగ్రెస్ నిరూపించటానికి ప్రయత్నించ వచ్చు. ఇలా చేస్తే, టీఆర్‌ఎస్ దారికి వస్తుంది. ఇది కాక, వైయస్సార్ కాంగ్రెస్ ఇప్పటికే హైదరాబాద్‌లోనూ, తెలంగాణ జిల్లాలోనూ కూడా ‘సమైక్యవాదులు’న్నారని నిరూపించే ప్రయత్నం చేస్తుంది. ఇలా చేయటం కూడా కేసీఆర్‌కు ఇబ్బందే. కాబట్టి ప్రధానంగా, కేసీఆర్ ను దారికి తెచ్చుకోవటం కోసం మళ్ళీ పార్టీలను కేంద్రం కదుపుతోందని తెలుస్తోంది. అంతిమంగా వేసే శుభం కార్డు మాత్రం ఇంకా ఆమడ దూరంలోనే వుంది.
-సతీష్ చందర్
30-10-2013
కాం’గ్రీ’సు యువరాజు పెండ్లిలా ‘శుభం కార్డ్’ ఆమడామడగా పడమటకు జరుగుతూనే వుంటుంది. మీరన్నట్లు అందాకా!
కాశ్మీరు భారతదేశంలో విలీనం ప్రక్రియా, ఈ నాటి ఆంధ్రప్రదేశ విభజన ప్రక్రియా ఆనాటి నెహ్రు నాయకత్వం లోను, ఈ నాటి వంశజుల అధ్వర్యంలోను అనంతంగా అంతులేని కథలా సాగుతోనే ఉన్నాయి. అటు ఇచ్చాపురంలోనూ ఇటు హిందూ పురంలోను, సుళ్ళూరు పేటలోను ఉన్న పౌరులకి విభజనా సమైక్యమా అన్న ప్రశ్న వర్తించదు. ఇది కేవలం రాజకీయనాయకుల సమస్య, లాభ నష్టాలు వారివే.
daandeamundi, evartetu poatea maakenduku meamu callagaa vunTea caalu, meamu rendu ceatulaa sampaadincukuntea caalu anea vaaLlu kuuDa koakollalea. kanuka aa ethics kuuda manakenduku?
manadi pidakalato kattina prajaswamy bhavanam. ikkada nirnayalu ilaaney untai. Maa party adhikaramloki vastunda raada aney praatipadikapainey maatal yuddalu saagutai. Prajalu ante vaariki lekkaleadu. Ee cinimaki Subham card padalante Gundelu baaga mandali. Aa mantallonchi yegirey nippuravvalu delhi peethanni antukunte gani vibhajana aagadu. Ledantey Mana Daddamma Neatalu vaari nayakula Bhajana Chestuney untaru.