‘లౌకిక్‌’ కుమార్‌!

పేరు : నితిష్‌ కుమార్‌

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

ముద్దు పేరు : ‘లౌకిక్‌’ కుమార్‌(పదిహేడేళ్ళ సుదీర్ఘనిద్ర తర్వాత మేల్కొని, నేనున్నది మతవాద పార్టీ అని గ్రహించి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నాను. మార్క్స్‌ చెప్పింది నిజమే సుమండీ.. ‘మతం మత్తు మందే.’), ‘అద్వానీష్‌’ కుమార్‌(గుజరాత్‌ అల్లర్లు దారుణమా? బాబ్రీ విధ్వంసం దారుణమా? అని ఎవరయినా నన్నడిగితే ‘రెండూ దారుణమే’ అంటాను. కానీ ‘గుజరాత్‌ అల్లర్లు ‘కాస్త ఎక్కువ దారుణం’ అని అంటాను. అందుకే ‘తక్కువ దారుణానికి’ కారకుడయిన అద్వానీ వైపే వుంటాను.)

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌( బ్యాచిలర్‌ అంటే ‘మోడీ’ తరహా బ్యాచిలర్‌ను అనుకునేరు. నేను కేవలం పట్ట భద్రుణ్ణి. అదికూడా ‘సకలవర్గాలకూ ప్రయోజనం చేసే వృధ్ధి’కి కారకుణ్ణి కాను. ‘నానో’ కారుల్ని చూపించి ‘టాటా’లను కౌగలించుకునే వాణ్ణి కాను.

హోదాలు :మోడీ లాగా ‘ప్రధాన అభ్యర్థి’ ని కాక పోవచ్చు. మోడీని ఢీకొనే ప్రధాన అభ్యర్థిని నిర్ణయించే హోదా రేపు నాకే వస్తుంది.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: అసలు సిసలు ‘ఓబీసీ నేత’ను. ‘ఓబీసీ’లలో పుట్టటం వల్ల ‘ఓబీసీ నేత’ కాలేరు. ‘ఓబీసీ’లకు మేలు చేయటం వల్ల ‘ఓబీసీ’ నేత కాగలరు. మోడీ కూడా ‘ఓబీసీ’ లకు చేశారు. కానీ, ఆయన దృష్టిలో ‘ఓబీసీ’ లంటే ‘అదర్‌ బ్యాక్‌వార్డ్‌ క్లాసెస్‌’ అని కాదు. అడ్వాన్స్‌డ్‌ బిజినెస్‌ క్లాసెస్‌ అని మాత్రమే అర్థం. తన రాష్ట్రంలో వారి వృధ్ధి చూసి ‘అభివృద్ధి’ అంటే ఇదేనని లోకానికి చెప్పాలని చూస్తున్నారు.

రెండు: ‘మైనారిటీల పట్ల ప్రేమ’. ( ‘మోడీ’కి కూడా ప్రేమే. కానీ వారిని ప్రేమిస్తూ కూర్చుంటే వోట్లు పడవని, వారి మీద ద్వేషం రగలించి, మెజారిటీ వోట్లను కూడగడతారు. కానీ, ‘మైనారిటీల’ వోట్లతోనే గెలుస్తాను.)

అనుభవం : శత్రువులతో మిత్వత్వం, మితృలతో శత్రుత్వం -సంకీర్ణ రాజకీయాల్లో బాగా లభిస్తుంది. లేక పోతే నాకు ‘విశ్వాస పరీక్ష’లో కాంగ్రెస్‌ వోట్లు ఎలా పడతాయి చెప్పండి.?

వేదాంతం : సిధ్ధాంతాన్ని బట్టి రాజకీయాలుండవు. రాజకీయాలను బట్టి సిధ్ధాంతాలుంటాయి. ఇప్పుడు చూడండి నాకు ‘సెక్యులరిజం’ నాకు అత్యవసరమయి పోయింది.

వృత్తి :వోట్ల లెక్కింపు. సాధారణంగా ఈ పనిని ఎన్నికలప్పుడు చేస్తారు. నేను అను నిత్యం చేస్తాను. (మహరాజ్‌ గంజ్‌లో) జరిగిన ఉపఎన్నికలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పార్టీ(ఆర్జేడీ) గెలిచిందంటే అందుకు కారణం ‘ముస్లిం వోట్లు’ అని ఎలా చెప్పగలిగాను? నిత్యగణన వలనే. కాబట్టే వెనువెంటనే బీజేపీతో విడాకులు తీసుకోగలిగాను.

హాబీలు :1. పేదల్నే నా బ్రాండ్‌ అంబాసిడర్లగా చూపించటం.

2. కలసి వస్తారంటే కమ్యూనిస్టుల్నీ పొగడటం.

నచ్చని విషయం :ఒక్కటే. నరేంద్ర మోడీ పేరును పొట్టిగా ‘న.మో’ అని పిలవటం. అంత గౌరవం అవసరమా?

మిత్రులు :ఇండిపెండెంట్లూ, కాంగ్రెస్‌ వారూ, కమ్యూనిస్టులూ(ఇప్పటివరకూ వీరే. నేను విశ్వాసపరీక్ష గెలవటానికి సహకరించారు కదా?)

శత్రువులు :సాటి ‘ఓబీసీ’లే. నా రాష్ట్రంలో(బీహార్‌లో) లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రాష్ట్రం వెలుపల నరేంద్ర మోడీ.

జపించే మంత్రం : జై సెక్యులరిజం, జై సామాజిక న్యాయం.

విలాసం : నిన్నటి వరకూ వన్‌ బై టూ సర్కారును పాలించాను. ఇప్పుడు సంపూర్ణమైన సర్కారును పాలిస్తాను.(బీజేపీ మంత్రుల్ని సాగనంపేశాను కదా) ఇది విలాసం కదా!

గురువు : అటల్‌ ‘బీహారీ’ వాజ్‌ పేయీ( ఆయనపేరులో నా రాష్ట్రం పేరు వుంది.. అందుకు.)

జీవిత ధ్యేయం : ముఖ్యమంత్రి పీఠం మీద మూడోసారి కూర్చున్నాను. అందరికీ నచ్చే అటల్‌జీ ప్రధాని పీఠం మీద కూర్చోలేదూ..? ఏదో రోజు ఈ అవకాశం నాకూ రావచ్చు.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్  ఆంధ్ర వార పత్రిక 22-29 జూన్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

3 comments for “‘లౌకిక్‌’ కుమార్‌!

  1. వాజ్‌పాయ్ అద్వానీ గార్ల నేతృత్వం వున్నంత సేపూనితీష్ కుమార్ ఆ కూటమిని వ్యతిరేకించలేదు. వాళ్ళమీద గురుత్వంతోనే వున్నాడు. అతను యిప్పుడూ అ కూటమిని వ్యతిరేకించి బయటకు వెళ్ళలేదు. మీరెత్తుతున్న లౌకిక అలౌకికాలు మీద స్పష్టత కూటమి లో వున్నదే. భజపా తనంత తానుగా అధికారం లోకి వచ్చే దాకా వాళ్ళ ధర్మాలన్ని అటకెక్కిచామని స్పష్టం చేశారు. కూటమి లో వున్నంతసేపూ వాటి గురించి ఎత్తమని వాగ్దానం చేశారు. ఇప్పుడు యీయన తన విభేదం విరోదం అంతా మోడీ మీదే. అతని tyrant attitude చాలా మందికి నచ్చనట్టుగానే అతనికి నచ్చలేదు. అతని నిరంకుశ లౌకికవాదం నిరంకుశ ప్రజాస్వామ్యం చాలా మందికి నచ్చదు. దానిని నితీశ్ కుమార్ నిశితంగా కుండబద్దలు గొట్టినట్టు బహిరంగం గా చెబుతూ వచ్చాడు. కానీ ఆ భజపా తమ కూటమి సహయోగులను పట్టించుకోకుండా ఏకపక్షం గా మోడికే పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించుకున్నాక అతనికి బయటకు రాక తప్పలేదు. ఆ పట్టాభిషేకం మిగిలిన పక్షాలకు సంతసం కావచ్చు కానీ ఒక పెద్ద సహయోగులకు నిశితంగా అయిష్టం వున్నప్పుడు, అలాచెయ్యడం తమను లెక్కచెయ్యకపోవడం గా బావించగూడదా? ఆ బయటకు వస్తూ యిది తనకు రాజకీయంగా లాభించకపోయినా చింతపడేది లేదని నిర్మొహమాటంగా చెప్పాడు. తన పార్టీ అంతా తన వెనక వుంది. శరద్ యాదవ్ కూడా ఆ కన్వీనర్ పదవికి రాజీనామా చేశాడు. It is as simple as that.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *