సతీష్ చందర్ ‘కింగ్ మేకర్’ ఆవిష్కరణ

Kingmaker Cover-fbcopyసతీష్‌ చందర్‌

కింగ్‌ మేకర్‌  (వ్యంగ్యం)

ఆవిష్కరణ సభ

వేళ: 29 అక్టోబరు 2013(మంగళవారం) సాయింత్రం గం.5.30లు

వేదిక: సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీమహాల్‌, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌

సభాధ్యక్షులు: శ్రీ పి.వి. సునీల్‌ కుమార్‌ ఐ.పి.ఎస్‌, నవలా రచయిత, కథకులుఇన్స్పెక్టర్‌ జనరల్‌, గుంటూరు

ఆవిష్కర్త, ముఖ్య అతిథి :శ్రీ ఎం.వేదకుమార్‌, ఛైర్మన్‌, తెలంగాణ రిసోర్స్‌ సెంటర్‌, ఎడిటర్‌, డక్కన్‌ ల్యాండ్‌

వక్తలు :శ్రీమతి సంధ్య, అధ్యక్షులు, ప్రగతిశీల మహిళా సంఘం

శ్రీ తెలిదేవర భానుమూర్తి, వ్యంగ్య రచయిత, పాత్రికేయులు

గ్రంథ పరిచయం: శ్రీ కె.యస్‌.డానీ, వ్యంగ్య రచయిత, పాత్రికేయులు

———————           ————————–        ————————–

కింగ్ మేకర్ గ్రంథానికి నేను (సతీష్ చందర్) రాసుకున్న మాటను కింద ఇస్తున్నాను. చదవగలరు.

‘వక్ర‘మార్కులెందరో!

అతడెప్పుడూ అంతే. వంకరగా మాట్లాడతాడు. తిన్నగా ఏదీ చెప్పడు.

‘భోజనం చేశావా?’ అంటే, ‘ఛ.ఛ.నేనెందుకు భోజనం చేస్తానూ, మా ఆవిడ చేస్తుంది. నేను తింటాను’ అంటాడు.

‘ఉద్యోగంలో చేరి పదేళ్ళయినట్లుంది. ఏమన్నా నాలుగు రాళ్ళు వెనకేశావా?’అనడిగితే, ‘రాళ్ళా? వెనకెందుకేస్తాను? భద్రంగా పడివుంటాయని కడుపులో వేశాను. అదేలే.., కిడ్నీలో వేశాను’ అని చెబుతాడు..

విసుగొచ్చి. ‘నీకు దేవుడెదురయినా కూడా,ఇలాగే మాట్లాడతావా?’ అని నిలదీస్తే, ‘భలేవాడివే. నాకు నేను ఎలా ఎదురవుతాను చెప్పు.’ అని వంకరగా చెప్పటమే కాకుండా, అష్టవంకర్లు తిరుగుతాడు.

ఈ ‘వంకరతనం’ గొప్పేమీ కాదు. అదో పెద్ద బలహీనత.

తిన్నగా, స్కేలు వాడకుండా, చెయ్యి వణక్కుండా, ఒక సరళ రేఖ గీయటం చేతకాని వాడు కూడా, సునాయాసంగా వక్రరేఖ గీయగలుగుతాడు. తెలీకుండా వచ్చిన ఆ ‘ఒంవులు’ కూడా బొమ్మకు అందాన్ని తెచ్చిపెడితే, ఆ నేరం ఆ ‘వక్ర’ మార్కుడిది కాదు.

వంకరతనాన్ని ఎవరో ఒకరు సరి చెయ్యాలి. లేకుంటే అది ‘కుక్క తోక’యి కూర్చుంటుంది. నా విషయంలోనూ అదే జరిగింది. ఒక్కరూ సరిచెయ్యలేదు.

కోరలూ, దంతాలు ఇవేవీ రాకముందే, పిల్లల్లో కోపం అనేది ఏర్పడి వుంటుంది. నోటి దగ్గర మిఠాయిని చటుక్కున పక్క పిల్లాడు ఎత్తుకుపోతే, తిక్కరేగదూ! అప్పుడు ఎవ్వరూ వంకరగా మాట్లాడరు. నోరారా,నేరుగా తిట్టుకుంటారు. ప్రతి తిట్టుకూ ‘బూతే’ ఆధారం.

అమ్మా, నాన్నలు ఉపాధ్యాయులు కావటం వల్ల, ఆ ‘బూతు’ నాకు దూరమయింది. ఎంత కోపం వచ్చినా, ఏడుపు తప్ప వేరే అభివ్యక్తి లేదు. ఎంత దిక్కుమాలిన ఏడుపయితే మాత్రం, ఎంత సేపని ‘రాగం’ తీస్తాం?

ఎదగ్గా, ఎదగ్గా ‘రాగాని’కి ప్రత్యామ్నాయం దొరికింది. అదే ఈ ‘వంకరతనం’. బూతుకి చలించని వాడు కూడా, వెటకారానికి ఉడుక్కుంటాడు. ఉడుక్కునేకొద్దీ ‘కారం’ పెంచాలనిపించేది. అలా మనం ఎక్కడ వుంటే, అక్కడ ఓ ‘ముఠా’ వుండేది. ఈ ‘సహ బాల ఫ్యాక్షనిస్టుల్లో’ ఒక్కడు కూడా – ‘ఇది తప్పురా’ అనలేదు. ‘తోటకూర దొంగతనం నాడే’ సరి చెయ్యాల్సిన తల్లి దండ్రులు కూడా కేవలం ‘బూతు’ మాట్లాడనందుకు ఆనందిచారు కానీ, అంతకు మించి ప్రమాదకరమైన ‘వంకర మాటలు’ నేర్చినందుకు వాతలు పెట్టలేదు. కాలేజీ కొచ్చాక, ఈ ‘బలహీనత’ను, ‘అర్హత’ గా గుర్తించారు. గురువులు ‘కారానికి’ కాస్త ఉప్పు జోడించారు. వెటకారాన్ని మాట్లాడేవాళ్ళే కాకుండా, రాసేవాళ్ళు కూడా వున్నారని చెప్పారు. వాళ్ళ పుస్తకాలను ‘బూతు’ పుస్తకాలు చదివినంత జాగ్రత్తగా, పాఠ్యపుస్తకాల్లో పెట్టుకుని మరీ చదివాను.

ముందు బాగానే వుంది. చదివేకొద్దీ నా ఏడుపు నాకు తిరిగి వచ్చింది. పైకే హాస్యపు పూత. లోపలంతా దు:ఖం, కరుణ, దయ, జాలి, ప్రేమ. రోజు, రోజుకీ మెత్తబడిపోతున్నాను. నాకు నచ్చనంతగా చప్పబడిపోతున్నాను. కొన్నాళ్ళకు నా లోని ‘ఫ్యాక్షనిస్టు’ నిలువెల్లా కూలిపోయాడు.

ఈ వక్రతలో విశాలత వుంది. ముఠా పోయి మంది వచ్చారు.

ప్రయివేటు పార్టీల్లోని జోకులూ, అవధానాల్లోని పండిత చమత్కారాలూ, పత్రికల్లోని ‘అట్లకాడ గయ్యాళుల’ కార్టూన్లూ చవకబారు దీపావళి బాంబుల్లా తుస్సు మంటున్నాయి.

అంతవరకూ కూతకే పరిమిత మైన ‘వక్రత’ రాతకొచ్చింది. ఈలోగా నేనే పత్రికల్లోకి వచ్చాను. పల్లెటూర్లో ‘పుల్ల ఐస్‌’ తినే కుర్రాణ్ణి ఫెడీల్మని తన్నితే వచ్చి, ఏకంగా నగరంలోని ‘ఐస్‌ క్రీమ్‌ పార్లర్‌’ లోపడ్డట్లయింది.

ఆగుతానా? ‘కాలాల’ కొద్దీ రాశాను. రాసే కొద్దీ ‘కాలాల’ను పరిచారు. ‘కాలమ్‌ రైటింగ్‌’ ఎంత గొప్పగా వుంటుందంటే, పక్కవాడు చదువుతాడు అని తెలిసి మరీ డైరీ రాసుకున్నట్టుంటుంది; పుచ్చుకున్న పిల్ల నేలకేసి కొడుతుందని ఎరిగి కూడా ప్రేమలేఖ రాసినట్లుంటుంది; ప్రతీ రాత్రి వచ్చేది ఆడ దయ్యం అవునో, కాదో, అసలు వచ్చేది దయ్యమో,కాదో అని తెలియ కుండానే వీధి గుమ్మం మీద ‘ఓస్త్రీ రేపు రా!’ అని రాసినట్టుంటుంది. అన్ని రహస్యాలే. కాకుంటే బహిరంగ రహస్యాలు. అందుకేమరి ‘కాలమింగ్‌’ అన్నది ‘వ్యక్తిగత పత్రికా రచన’ గా గణతి కెక్కింది. ‘వంకర తనం’ వున్న వాళ్ళు తలదాచుకునే సురక్షితమైన స్థావరం ‘కాలమ్‌’

‘ఆంధ్రప్రభ’ దినపత్రిక సంపాదకుడిగా వున్నప్పుడు రాసిన ఒక కాలమ్‌ ‘కింగ్‌ మేకర్‌’. ఈ శీర్షిక కింద రచనలు వెలువడి పదేళ్ళయింది. తాము ఇంకో ఏడాదిలోగా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని, రాష్ట్రంలో ‘నిద్రపోని, నిద్రపోనివ్వని’ చంద్రబాబుకీ తెలియదు; కేంద్రంలో ‘ఫీల్‌ గుడ్‌’ అంటూ పగటి కలలు కంటున్న అటల్‌ బీహారీ వాజ్‌ పేయీకి తెలియదు. కేవలం ‘చేతులూపు’ కుంటూ, రోడ్లమీద తిరిగేస్తే (పాద యాత్ర చేసేస్తే) ముఖ్యమంత్రి అయిపోవచ్చని వై.యస్‌ రాజశేఖర రెడ్డికి తెలియదు. చేతులు కట్టుకుని విధేయంగా వుండటం కూడా ‘ప్రధాని’కి అర్హత అయిపోతుందని మన్‌మోహన్‌ సింగ్‌ కూడా తెలియదు.అంతెందుకు? నెత్తుటి లో తడిసిన బ్యాలెట్‌ తనను ముమ్మారు వరించబోతుందని గుజరాత్‌లోని నరేంద్రమోడికి సైతం తెలియదు. ఇలాంటి కవ్వింపులేని క్లయిమాక్సు మధ్యలో చేసిన రచనలివి.

రాయటం మొదలు పెట్టాక ఒక్క రాజకీయంతో ఆగుతామా? చదువులూ, చట్టుబండలూ, రోగాలూ రొష్టులూ, ‘అంటు’ రోగాలూ, తలంటు రోగాలూ, కోటాలూ, కోరికలూ, అన్నలూ,అనుమానాలూ, ఖాకీలూ, కట్టు కథలూ, బేరాలూ, నేరాలూ, పల్లెలూ, పురుగుమందులూ- అన్నింటి మీదా నాకు ఇష్టమొచ్చినట్టుగానే, కాక అందరి కష్టాలు నాకొచ్చి పడ్డట్టుగా రాయబోయాను. నవ్వేడ్చాను.

ఇదే అనుభూతి మీకు కూడా కలుగుతుందని భావిస్తాను.

నాలాంటి ‘వక్ర’మార్కులెందరో! అందరికీ నా వందనాలు.

 – సతీష్‌ చందర్‌

24 అక్టోబరు 2013

Kingmaker is now available on Kinige

1 comment for “సతీష్ చందర్ ‘కింగ్ మేకర్’ ఆవిష్కరణ

  1. అందరి కష్టాలు నాకొచ్చి పడ్డట్టుగా రాయబోయాను. నవ్వేడ్చాను. అనడం బాగుంది . మిమ్మల్ని దగ్గరగా గమనిస్తూ ,,,,,, మీరన్నది నిజమే అనిపిస్తూ ,మీతో పాటు మరొక గురువులు డానీ గారిని కూడా కలుసుకోవాలని వచ్చేస్తున్నాను ……….. మీ శిష్యుడు _/\_

    కాశి రాజు

Leave a Reply