వెన్నెల ముద్ద

ఇలావచ్చి అలా పోయేవి ఎక్కువ మురిపిస్తాయి. మెరుపూ, చినుకూ, కెరటం, మోహం- అన్నీ అంతే. శాశ్వతం- అనుకునేవి ఏవీ అంతటి ఆనందాన్ని ఇవ్వలేవు. జీవితం కూడా అంతే కదా. తుర్రున వచ్చి తుర్రున పోతుంది. అందుకే అంత ఆశపెడుతుంది. ప్రేమ,ప్రేమ అని ఊరేగుతాం, కానీ, మొత్తం ప్రేమాయణానికి గుర్తులుగా మిగిలేవి కొన్ని క్షణాలే. సాయింత్రంపూట కాలేజి బస్సు ఎక్కేముందు, కలిసి తిన్న పానీ పూరీలూ, ఎవరి కంటా పడకూడదని పక్క పక్క సీట్లలో కూర్చుని డొక్కు థియేటర్లో చూసిన పౌరాణిక చిత్రాలూ- ఇవే కదా ఎప్పటికీ మురిపించే విషయాలు!!

ఫోటో:కిషన్ చందర్

ఫోటో:కిషన్ చందర్

వెలుతురునే

ముద్ద చేస్తే-

వెన్న ముద్దా కావచ్చు,

వెన్నెల ముద్దా కావచ్చు.

వెచ్చని చీకటిలో

చల్లని వెలుతురు.

తాను కరుగుతూ,

మనల్ని కరిగిస్తూ.

చివరికి ఐస్‌ఫ్రూట్‌లో

మిగిలిన పుల్లలా

ఎప్పటికీ నిలిచి పోయే

చిన్న జ్ఞాపకం!!

 -సతీష్ చందర్

4 comments for “వెన్నెల ముద్ద

  1. యెస్.. ఆ చిన్నపాటి వెన్నెల వెన్నముద్దల జ్ఞాపకాల కోసం జీవిత కాలాన్ని వెచ్చించడమే జీవించడం కదా

  2. తీపి జ్ఞాపకమైనా, చేదు జ్ఞాపకమైనా మన మదిని మందలించేవే… కదిలించేవే… మన జ్ఞాపకం మరిచిపోని చరిత్ర కాకపోవచ్చు కాని మన జీవితంలో మసిపోని మధుర ఘట్టం.

    ఈ మట్టిముద్దపై మనం శాశ్వతం కాదు. మన జ్ఞాపకం శాశ్వతం.

Leave a Reply