వోటరే విజేత

చివరి నవ్వు వోటరే నవ్వాడు.

గెలిచినవారికి పూర్తి ఆనందాన్ని కానీ, ఓడిన వారికి పూర్తి విషాదాన్ని కానీ మిగల్చలేదు.

ఈ ఉపసమరం అద్దంలాగా ఎవరి నిజరూపాన్ని వారికి చూపించింది. పేరుకు 18 అసెంబ్లీ స్థానాలకూ, ఒక పార్లమెంటు స్థానానికీ జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు. కానీ ఫలితాలు మాత్రం రాష్ట్ర రాజకీయ నాడిని పట్టి ఇచ్చాయి.

 

వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఘన విజయమే సాధించింది. 18 అసెంబ్లీ స్థానాల్లోనూ 15 స్థానాలు గెలుచుకోవటమూ, ఉన్న ఒక పార్లమెంటు స్థానాన్నీ కైవసం చేసుకోవటం పెద్ద విషయమే. కానీ ప్రభంజనం కాదు. ఎందుకంటే, 17 స్థానాల్లో పోటీ చేసిన వారంతా జగన్‌ను ఈ రెండేళ్ళూ వెన్నంటి వున్న వారే. జగన్‌ కోసం కాంగ్రెస్‌ విప్‌ను ధిక్కరించిన వారే. కానీ వారిలో ముగ్గురు (కొండే సురేఖ, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ప్రసాద్‌ రాజు) ఓటమి పాలయ్యారు. ఇది చిన్న విషాదం. అయితే తమది కాని ఒక సీటు(తిరుపతి)ని వైయస్సార్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకొంది. ఇదొక ఊరట.

 

లెక్కల్లో చూస్తే, కాంగ్రెస్‌కు పరాజయమే మిగిలింది. కానీ ఘోర పరాజయం కాదు. ఆ పార్టీకి దక్కినవి రెండేస్థానాలు. కానీ ఆ రెండూ (రామచంద్ర పురం, నర్సాపురం) కాంగ్రెస్‌వి కావు(సాంకేతికంగా కాదు.). విధేయత పరంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ తోనే ఆ రెండు స్థానాల ఎమ్మెల్యేలుగా వున్నారు. ఇందుకు కాంగ్రెస్‌ ఆనందించ వచ్చు. కానీ చిరంజీవి ద్వారా కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డ (తిరుపతి) సీటును కోల్పోయింది. అంతే కాదు. తొమ్మిది అసెంబ్లీ సీట్లలో మూడవ స్థానంలోకీ, ఒక (పరకాల) అసెంబ్లీ సీటులో అయిదవ స్థానంలోకి కాంగ్రెస్‌ నెట్టబడింది. ఇది పెను విషాదం.

 

ఏ తీరుగా చూసినా తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయమే చవిచూసింది. కానీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోలేదు. ఏ ఒక్క సీటునూ గెలుచుకోలేక పోయింది. కానీ సగానికి సగం అసెంబ్లీ సీట్లలో(తొమ్మిదింటిలో) రెండవ స్థానంలో నిలిచింది. ఇది కాస్త ఊరట. కానీ మిగిలిన అసెంబ్లీ సీట్లతో పాటు, పార్లమెంటు సీటులోమూడవ స్థానంలోకి జారిపోయింది. ఇది విషాదమే. అన్నింటినీ మించి పార్టీ అధ్యక్షుడి సొంత జిల్లా(చిత్తూరు)లోని తిరుపతి సీటులో మూడోస్థానం లో వుండటం పెనువిషాదమే.

 

తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఏకైక అసెంబ్లీ (పరకాల) స్థానంలో టీఆర్‌ఎస్‌ సాధించింది ప్రతిష్టాత్మకమైన విజయమే. ఇది పంచముఖ పోటీలో నాలుగు పార్టీలను త్రోసిరాజని సాధించుకున్న విజయం. కానీ, వచ్చింది అతి స్వల్ప మెజారీయే(1562 వోట్ల తేడాయే). గట్టి పోటీ యిచ్చింది వైయస్పార్‌ కాంగ్రెస్సే. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్లమెంటులో ‘ప్లకార్డు’ పట్టుకున్నాడని నిన్నటిదాకా తిట్టిపోసిన జగన్‌ పెట్టిన పార్టీయే. జగన్‌ను తెలంగాణ కు రాకుండా నిలువరించిన టీఆర్‌ఎస్‌కు ఇది ఇబ్బంది కరమే.

 

ముందు జరిగిన మహబూబ్‌నగర్‌ ఉప ఎన్నికతో కొత్త ఊపిరి పోసుకున్న బిజెపికి, పరకాలలో పరాజయం ఘోరపరాభవమే. కానీ చిన్న ఊరట: ఇక్కడ కాంగ్రెస్‌ కన్నా , బిజెపి ఒక మెట్టు పైన వున్నది. కాంగ్రెస్‌ అయిదో స్థానంలోకి నెట్టబడితే, బిజెపి కనీసం నాలుగో స్థానంలోనైనా వుండగలిగింది.

 

చిరంజీవి తన పార్టీ(ప్రజారాజ్యాన్ని)ని కాంగ్రెస్‌లో కలిపేసినా, పదవుల విషయంలో ఒక ప్రత్యేక ‘పాయ’ లాగా ప్రవహిస్తుంటుంది కాబట్టి, ఆ గ్రూపుకు ఏమి దక్కిందన్నది కూడా చర్చనీయాంశమే. చిరంజీవే గెలిచి, తర్వాత స్వయంగా ఖాళీ చేసిన స్థానాన్ని(తిరుపతి) వైయస్సార్‌ కాంగ్రెస్‌ తన్నుకు పోయింది. ఇది తన వరకూ చూస్తే ఉనికిని కోల్పోవటమే. కానీ కాంగ్రెస్‌ ఇప్పుడు గెలుచుకున్న రెండు స్థానాలూ ఆయన సామాజిక వర్గానికి చెందిన వారివే (ఆయనకు అత్యంత సన్నిహితులవే). ఇది మళ్ళీ ఆయనకు వేరే రకమైన గుర్తింపు.

ఇదీ ఉప ఎన్నికల్లో వోటరు ఇచ్చిన తీర్పు తీరు.

నవ్వే వారికి ఎక్కడో దిగులు. ఏడ్చేవారికి ఎక్కడో ఆశ.

 

ముందున్నవి మరిన్ని ఉప ఎన్నికలు!

ఈ తీర్పు ఫలితం ఆయా రాజకీయ పక్షాల భవిష్యత్తు పై ఎలా వుంటుంది? ముందు కొందరు భావించినట్లు మధ్యంతర ఎన్నికలు రాష్ట్రానికి వచ్చేస్తాయా? వలసలు టోకుగానీ, చిల్లరగగానీ జరిగిపోతాయా? ఈ ప్రశ్నలకు సమాధానాల్ని మారిన సమీకరణల్నుంచి వెతుక్కోవాల్సి వుంటుంది.

 

వైయస్సార్‌ కాంగ్రెస్‌ విషయానికి వస్తే, ఈ పార్టీ సాధించిన విజయం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం కూలిపోదు. వైయస్‌ షర్మిల మాటల్లోనే చెప్పాలంటే, ‘ప్రభుత్వాన్ని అస్థిర పరచటానికి, తెలుగుదేశం పార్టీ సహకరించదు.’ అంతే కాదు. అసెంబ్లీలో ఈ పార్టీ వెంటవుండే తమ వారి సంఖ్య రెండుకు తగ్గింది కూడా( మూడు కోల్పోయి, ఒకటి అదనంగా గెలుచుకున్నది.)

ఇక కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలనుంచి వలసలు వుండవచ్చు కానీ, అవి గుంపగుత్తగా వుండవు. గుంపులుగా రారు. ఒక్కొక్కరుగా రావచ్చు. అందుకు కారణం- రాజీనామా చేసిన వారంతా ఉప ఎన్నికలో సుసాయాసంగా తిరిగి గెలుస్తారన్న హామీ పూర్తి స్థాయిలో లేక పోవటం. అయినప్పటికీ మెజారిటీ స్థానాలను చూసినప్పుడు కొంత మోజుపడతారు కాబట్టి, 2014 ఎన్నికలకు ఈ పార్టీలో తమ అభ్యర్థిత్వాన్ని భద్రపరచుకోవటం కోసమైనా రావచ్చు. కాబట్టి మరో రెండేళ్ళ పాటు వైయస్సార్‌ ఒక్కొక్కటీ, రెండేసి స్థానాల్లో అయినా సరే ఉప ఎన్నికలు జరిగే విధంగా వ్యూహ రచన చేసుకుంటుంది. ఆ విధంగా ఇప్పుడున్న ‘సానుభూతి’ని అప్పటి వరకూ కొనసాగేలా చూసుకుంటుంది.

జగన్‌ పై వున్న కేసులపై న్యాయపరమైనా పోరాటం చేస్తున్నా, ఆయన పూర్తిగా జైలు నిర్బంధం రావటానికి సమయం పడుతుందనే అంచనాల మీదనే ఆ పార్టీ నాయకులు వున్నారు.

మహిళవోట్లను విశేషంగా ఆకర్షించిన విజయమ్మ,, షర్మిల నేతృత్వంలోనే పార్టీ కార్యకలాపాలు నడుస్తుంటాయి.

 

ఇక కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకత్వం- తమ ఖాతాలోకి ఒకటి వచ్చినా, రెండు వచ్చినా ‘బోనస్సే’ అన్న ధోరణిలోనే ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. పార్టీ అధిష్ఠానాన్ని కూడా ఆ మేరకు మానసికంగా సిధ్ధపరచారు. అయితే గత ఉప ఎన్నికలో చేజేతులా మహబూబ్‌ నగర్‌ సీటును బీజేపీకి జారవిడుచుకున్నట్లే, ఇప్పుడు తిరుపతి సీటునూ కోల్పోవటంపై సంజాయిషీ ఇచ్చుకోవలసింది. అయితే అధిష్ఠానం అప్పటి ఓటమిని తీసుకున్నంత తీవ్రంగా, ఈ పరాజయాన్ని పరిగణించక పోవచ్చు. తిరుపతి తమకు (చిరంజీవి ద్వారా) సంక్రమించిన స్థానమే కానీ, గతంలో తాము గెలుచుకున్న స్థానం కాదని నచ్చచెప్పవచ్చు.

కాబట్టి ముఖ్యమంత్రిని మార్చాలనుకుంటే, ఈ కారణాన్ని నెపంగా చూపటానికి ఆస్కారం లేదు. కాకుంటే, వైయస్సార్‌ కాంగ్రెస్‌ వెంట వున్నట్లు ధ్రువ పడ్డ ‘మహిళా వోటు బ్యాంకు’ ‘ఎస్సీల వోటు బ్యాంకు’లు కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానాన్ని తప్పకుండా కలవర పరుస్తాయి. ఆలా ఆలోచిస్తే, ముఖ్యమంత్రి మార్పు వీలవతుంది. అది కూడా వెనువెంటనే చేయాల్సిన అవసరం వుందని భావించకపోవచ్చు.

 

ఇక సీను తెలంగాణాకి!

టీఆర్‌ఎస్‌ విషయానికి వస్తే, ఆ పార్టీ నేత పాచికలను వేగంగా కదిపే అవకాశం వుంది. ఈ ఉప ఎన్నికల కారణంగా ఇంతవరకూ సీమాంధ్ర రాజకీయ కేంద్ర బిందువయింది. (ఒక్క పరకాల మినహా మిగిలి ఉప ఎన్నికలన్నీ ఈ ప్రాంతంలోనే జరిగాయి). దాంతో వైయస్సార్‌ పై సానుభూతో, లేక ఆయన తనయుడిపై వున్న ‘అవినీతి ఆరోపణ’లో ప్రధాన రాజకీయాంశాలయి, తెలంగాణ అంశం తాత్కాలికంగా పక్కకు పోయింది. అదీ కాక, ఈ ‘సానుభూతి రాజకీయాలు’ అన్నవి తెలంగాణ ఇంటి గుమ్మం (పరకాల) వరకూ వచ్చేశాయి. పైపెచ్చు, తనకు ఊపిరాడనంత పోటీ ఇచ్చేశాయి. షర్మిల, విజయమ్మలు ఇదే ‘సానుభూతి’తో తెలంగాణ మిగిలినప్రాంతాలు తిరిగినా, వారికి దారులు తెరచుకుంటాయి. ఈ దారుల్ని మూయాలంటే, కేసీఆర్‌ ముందున్న ఏకైక ఆయుధం: మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయటం. అందులో ఈ ఉద్యమానికి (బీజేపీని ధైర్యంగా దూరం పెట్టి) తానే కర్థృత్వం వహించే పని చేస్తారు. ఇప్పటికే కొండా సురేఖ ఆయనకు సవాలు విసిరారు: ‘మూడు నెలల్లో తెలంగాణను తెస్తానని కేసీఆర్‌ చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడా?’ అని. ఈమె సవాలు చేసినందుకు కాకపోయినా, జగన్‌ ప్రభావాన్ని తెలంగాణ మీద పడనీయకుండా చేయటం కోసమైనా ఏదోరకమైన ‘ఉద్వేగాన్ని’ తెలంగాణ పేరు మీద రేపుతారు. గతంలో తెలంగాణ ఉద్యమం ఉధృతమైనప్పుడే జగన్‌ తన ‘ఓదార్పు యాత్ర’కు విరామం ప్రకటించాల్సి వచ్చింది.

బీజేపీ ఇప్పుడు లేచి పడ్డ అల. తెలంగాణ అంశాన్నే నమ్ముకోవటం వల్ల ఆ పార్టీకి ఒరిగింది తక్కువే. కాబట్టి, ‘హిందూత్వ’ రాజకీయాలను పునరుధ్ధరించుకునే పనిలో పడుతుంది.

చిరంజీవి ఇంత పెద్ద కాంగ్రెస్‌లో కూడా వ్యక్తిగానే మిగిలిపోయారు. కాకుంటే కాంగ్రెస్‌లో తన సామాజిక వర్గాల అభ్యర్థుల గెలుపును తన గెలుపుగా చాటుకుని, కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కోసం వేగిర పడతారు. ఇంతకు మించి తక్షణ రాజకీయ కార్యక్రమం ఆయనకు ఉండక పోవచ్చు.

 

పాత రూటు -కొత్త టర్నింగులు

అయితే ఈ ఉప ఎన్నికల తీర్పు మొత్తంగా రాష్ట్ర రాజకీయాల మీద ఎలా పడుతుంది?

 

రాష్ట్రం రాజకీయంగా రెండుగా చీలేవుంది.

తెలంగాణ లో టీఆర్‌ఎస్‌, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌లదే హవా నడుస్తోంది. ఇప్పటికీ ‘తెలంగాణ సెంటిమెంటు’ ఒక చోటా ‘వైయస్‌పై సానుభూతి’ ఒక చోటా వోటర్ల మీద బలంగా పనిచేస్తున్నాయి.

అసెంబ్లీ ‘బలం’గా వున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు, వెలుపల బలహీనంగానే వున్నాయి.

ఈ రాజకీయాలకు బీజేపీ, కమ్యూనిస్టుపార్టీలు ప్రేక్షక పాత్రే వహిస్తున్నాయి.

అంతకు ముందు రాష్ట్రంలో అగ్రనేతల (వైయస్‌, చంద్రబాబు) స్థానాలను, ఇప్పుడు జగన్‌, కేసీఆర్‌లే స్వాధీనపరచుకున్నారు.

తెలంగాణలో ‘ప్రత్యేక రాష్ట్ర’ నినాదం ముందు, ‘అభివృధ్ధి’ చిన్న బోయినట్లే, సీమాంధ్రలో ‘సానుభూతి’ ముందు, ‘అవినీతి వ్యతిరేకత’ చిన్నబోయింది.

ఇవన్నీ అందరూ ఊహించిన పరిణామాలే. కొన్ని ఊహించనివి కూడా జరిగాయి.

 

‘సానుభూతి’ మొత్తం వోట్లగా మారలేదు. జగన్‌ను అరెస్టు చేసి జైల్లోకి పెట్టాక కూడా, ఆయన తల్లీ, చెల్లీ ప్రచార యాత్రల్లో కన్నీటి పర్యంతమయినా కూడా, అన్ని సీట్లూ దక్కించుకోలేదు. భారీ మెజారిటీలు సాధించలేదు. కులం, ప్రాంతం అనే అంశాల ఎదురయిన కొన్ని చోట్ల ఈ సానుభూతి చిన్నబోయింది.

తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోనేంత దగ్గరగా వైయస్‌ పై సానుభూతి వచ్చేసింది.

అంటే ఇద్దరు కొత్త అగ్రనేతలు తెచ్చిన రెండు స్రవంతులు కూడా పరీక్షలకు గురవుతున్నాయి.

అందుకే,

ఈ ఉప ఎన్నికల్లో చివరి మందహాసాన్ని వోటరు తన వద్దనే వుంచుకున్నాడు.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 15-22 జూన్ 2012 వ సంచికలో ప్రచురితం) 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

2 comments for “వోటరే విజేత

Leave a Reply