‘శ్రీని వాయిస్‌’ ఆఫ్‌ కన్ఫ్యూజన్‌’!

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : చలసాని శ్రీనివాస్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: నాకు ఉద్యోగంతో పనిలేదు. కావలిసింది హోదా… ప్రత్యేక హోదా. అవును ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తానన్న ప్రత్యేక హోదా కావాలి. ఆ హోదా ఇచ్చేస్తే, నేను ఇంకో ఉద్యమం చూసుకుంటాను. ఏదో ఒక ఉద్యమం చెయ్యటమే కదా మన ఉద్యోగం!

వయసు : మరీ అంత లేదు. కానీ లేని వయసును నెత్తిన వేసుకుని తిరుగుతుంటాను. అందుకు కారణాలు రెండు. ఒకటి: జాతీయోద్యమం జరుగుతున్న రోజులవి… పాలకొల్లు లో ఖద్దరు ధరించిన వారంతా ఒక చోట గుమిగూడారు… ఇలాంటి ఫ్లాష్‌ బ్యాక్‌లు టీవీ చర్చల్లో చెప్పటం. రెండు: నా వయసు వాళ్ళంతా జీన్స్‌, టీషర్టులు వేసుకుంటుంటే, నేను తెలుపు, నలుపు గెడ్డంతో ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ సిసిమాల కాలం నాటి డ్రస్సు వేసుకుంటాను.

ముద్దు పేర్లు : శ్రీనివాయస్‌ ఆఫ్‌ కన్ఫ్యూజన్‌. (సమైక్యవాదులేమో, నన్ను ప్రత్యేక వాదిగానూ, ప్రత్యేక వాదులేమో సమైక్య వాది గానూ అపార్థం చేసుకునే వారు లెండి. మన టీవీ చర్చలు ఆ రేంజ్‌లో వుండేవి. ఇప్పుడయినా నన్ను సరిగా అర్థ: చేసుకోవాలని మనవి. నేను సమైక్యవాదినే. కానీ అడిగేది ‘ప్రత్యేకం’ … రాష్ట్రం కాదండోయ్‌ ‘హోదా’ .. మళ్ళీ కన్ఫ్యూజనా? నేనేం చెయ్యలేను.)

‘విద్యార్హతలు : ‘మాస్టర్‌ ఆఫ్‌ ఫోటో కాపీయింగ్‌’ (అంటే.. కనిపించిన కాగితాన్నెల్లా జిరాక్స్‌ తియ్యటం. చర్చల్లో చూపించటం. అందులో మ్యాప్‌లు కూడా వుంటాయండోయ్‌. కడకు గూగుల్‌ వాళ్ళు ఈ విషయంలో మనల్ని ఫాలో కావాల్సిందే.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను అనేక రోజులు ఆహారం మానక పోవచ్చు. అయినా దీక్షా శిబిరాల్లో వుంటాను. కిలోమీటర్లు కిలోమీటర్లు నడవక పోవచ్చు, అయినా పాదయాత్రల్లో వుంటాను.

రెండు: ఉద్యోగుల్లో ఉద్యోగిని; ఉద్యమకారుల్లో ఉద్యమ కారుణ్ణి; మేధావుల్లో మేధావిని.

సిధ్ధాంతం :ఆలోచింప చెయ్యటమే కాదు, ఆలోచింప చెయ్యకుండా వుండటం కూడా మేధావుల కర్తవ్యం. ‘సమైక్య ఉద్యమ కాలంలో… ఒక వేళ రాష్ట్రం విడిపోతే… సీమాంధ్రకు ఏమి కావాలి…’ అని ఆలోచనే జనంలోకి రానివ్వలేదంటే, మేధావులు ఎంత కీలకమైన పాత్ర వహించారో అర్థం చేసుకోవాలి.

వృత్తి : పూర్తి కాలపు నాయకుణ్ణీ కాను; పూర్తి కాలపు వ్యాపారినీ కాను. అన్నీ పార్ట్‌ టైమ్‌ వత్తులే. కేవలం టీవీ చర్చల్లో పాల్గోవటమే పూర్తి కాలపు వృత్తి.

హాబీలు :1ఒక్కో దశలో ఒక్కో పార్టీకి దగ్గర కావటం. అలాగని పార్టీలు ఫిరాయించటం కాదు. ఆ మాట కొస్తే, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాను.

2. శాశ్వత స్నేహాలు, శాశ్వత వైరాలూ పెట్టుకోక పోవటం.

అనుభవం : రోలింగ్‌ స్టోన్‌ గేదర్స్‌ నో మాస్‌… అంటారు కదా! ( ‘మాస్‌’ అంటే వేరే అర్థం వున్నా, జనం- అనే అర్థం తీసుకుంటే నాకు ‘సూట్‌ ‘ అవుతుంది. అయినా జనం వెంట వుంటే నాయకుడంటారు… కానీ మేధావి అనరు కదా! మనం ఏమో ‘ఆంధ్రా మేధావుల వేదిక’ పెట్టిన వారమాయె.

మిత్రులు : ఏ సందర్భానికి ఆ మిత్రులు వచ్చేస్తారంతే. ఇప్పుడు ఒక్కసారిగా ఇద్దరు శివాజీలు మిత్రులయిపోయారు: ఒకరు హీరో శివాజీ, ఇంకొకరు కారెం శివాజీ.

శత్రువులు : నా అంతట నేను శత్రుత్వం పెట్టుకోనండోయ్‌.

మిత్రశత్రువులు :వాళ్ళెవరో తెలిస్తే నేనూ రాజకీయాల్లో రాణించే వాడిని.

వేదాంతం : మేము సమైక్యం అన్నప్పుడు ‘ప్రత్యేకం'(రాష్ట్రం) ఇచ్చారు; మేం ‘ప్రత్యేకం’ (హోదా) అన్నప్పుడు ‘సమైక్యం’ (రెండూ ఒకటే ) అంటున్నారు. ఇదేమి న్యాయం!?

జీవిత ధ్యేయం : ఏదో కారణం కనిపెట్టి నిరంతరం వార్తల్లో వుండటం.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక లోప్రచురితం)

Leave a Reply