సంపన్న దరిద్రులు

చంద్రబాబు నాయుడు

అదేమి దరిద్రమో కానీ,
దేశంలో దరిద్రులే కాదు, దరిద్రం నటించే వాళ్ళు కూడా ఎక్కువే.
రేషన్‌ కార్డు దగ్గర బీదవాడు పరమ బీదవాడుగా నటిస్తాడు.
ఫీజు రాయితీ కోసం ఆదాయ ధ్రువపత్రం తెమ్మనండి. నెలకు వంద రూపాయిలతో నలుగురం బతికేస్తున్నామంటూ పత్రాన్ని సృష్టిస్తాడు.
ముప్పొద్దులా మూడు పెగ్గుల మందు బిగించే బిచ్చగాడు కూడా, బువ్వ తిని మూడు రోజులు అయిందని చెప్పి అడుక్కుంటాడు.
అత్తవారింటి ముందు అల్లుడెప్పుడూ జీతం చాలని దరిద్రుడే. నాలుగు లక్షలు చందా వేస్తే, నాలుగు చక్రాల కారు కొనుక్కుంటానంటాడు.
అందరికన్నా లంచమడిగే వాళ్ళు పరమ దరిద్రులు.
వాళ్ళు చేప్పే సాకులు దీనాతి దీనంగా వుంటాయి:
చెయ్యి చాపే అటెండరు- టీనీళ్ళ కోసమంటాడు. ఫైలు కదిపే గుమస్తా బిడ్డ పెళ్ళికంటాడు. పచ్చని సంతకం పెట్టే అధికారి పిల్లల చదువులకంటాడు.

సిఫారసు చేసే ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు చేసిన అప్పులు తీర్చటానికంటాడు. మంజూరు చేసే మంత్రి అనుచరుల పోషణ కంటాడు.
అదేదో అంతర్జాతీయ వాడు విశ్వసంపన్నుల జాబితాను ప్రదర్శిస్తే, ఇద్దరో ముగ్గురో మాత్రమే భారతీయులు కనిపిస్తుంటారు.కానీ కాస్త తెగించి అదే పత్రిక

బీదవాళ్ళ జాబితాను ప్రకటిస్తే, అసలు దరిద్రులకన్నా, ఇలాంటి దరిద్రులే అగ్రభాగాన నిలుస్తారు.
ఇలాంటి దొంగ దరిద్రుల్లో కొంతమందిని సమాజం తయారు చేస్తే, ఇంకొంతమందిని సర్కారే తయారు చేస్తుంది.ఆచరించలేని పరిమితులను ఆదాయం

దగ్గరా, ఖర్చు దగ్గరా పెడుతుంటుంది.
ఉచిత వైద్యం, ఉచిత విద్య- ఇలాంటివి కల్పించే చోట, కనీస ఆదాయాన్ని కుదించి పెడుతుంది. ఈ ఆదాయ పరిమితిని, బిచ్చగాళ్ళు, చెత్త ఏరుకునే

వారు సైతం అధిగమిస్తారు. అలాంటప్పుడు అంతకన్నా తక్కువ ఆదాయం చూపించి బుకాయించకుండా ఎలా వుంటారు?
ఎన్నికల కమిషన్‌ అభ్యర్థుల ప్రచార వ్యయానికి పెట్టే పరిమితిని పాటిస్తే, ప్రచారం తన ఇంటి పరిసరాలు కూడా దాటదు. హోర్డింగులూ, బ్యానర్లూ,

బహిరంగ సభలూ, యాత్రలూ, ఊరేగింపులూ- ఎంత ధర్మబధ్ధంగా చేసుకున్నా, ఖర్చు కోట్లు దాటుతుంది. ఇది బహిరంగ రహస్యం. కాబట్టి వారు ఖర్చు ఎలా

చూపిస్తారు? వేలల్లోనో, తప్పితే, ఒకటీ, రెండూ లక్షల్లోనూ దరిద్రంగా చూపిస్తారు.
ఆదాయపు పన్ను విషయంలో చెప్పనవసరమే లేదు. ఈ శాఖ పెట్టే పరిమితుల వల్ల కుబేరులు కూడా తమని తాము కుచేలురంగా ప్రకటించుకుంటారు.

ఫలితంగా ఆడితప్పని హరిశ్చంద్రులు, అబధ్ధమాడని ధర్మరాజులు కూడా, ఆడిటర్‌ మాటలకు తలూపి సంతకాలు చేస్తారు.
ఇలాంటి దరిద్రపుగొట్టు వాతావరణమున్న చోట చట్టసభకు రాబోయే వాళ్ళు కానీ, వచ్చిన వాళ్ళుకానీ, తమకి తాము ‘ఆస్తి’కులమని(ఆస్తులు వున్న

వారమని) చెబుతారా? ఈ విషయంలో తామందరమూ ‘నాస్తి’కులమే( ఆస్తి లేని వారమే) అని ప్రకటించుకుంటారు.
దొంగ గుడ్డివాడి వల్ల గుడ్డివాళ్ళకి నష్టమే; చూపున్న వాళ్ళకీ నష్టమే. గుడ్డి వాళ్ళ నందరినీ అనుమానించి జాలిపడటం మానేస్తుంది చూపున్న సమాజం.

చూపున్నవాళ్ళందరూ యింతే, తమని మోసగిస్తునే వుంటారని తెంపు చేసకుంటుంది గుడ్డివాళ్ళ సమాజం.
అలాగే, దొంగ దరిద్రుల వల్ల ఇటు దరిద్రులకూ నష్టమే; అటు సంపన్నులకూ నష్టమే. నిజమైన దరిద్రుడిని ఆదుకోవటం మానేస్తుంది సంపన్న ప్రపంచం.

సంపన్నులందరూ ఇలాగే నటిస్తారని నమ్మటం వల్ల ఆశలు వదలుకుంటుంది బీద ప్రపంచం.
అందుకే, ఈ ‘స్వయం ప్రకటిత దరిద్ర’ సంపన్నులున్న చోట, ఎవరయినా తెగించి తాము నిజంగానే సంపన్నులం కాము- అని ప్రకటించుకుంటే ఎలా

వుంటుంది?
ముంతలు వేళ్ళాడే తాటిచెట్టు కింద నిలబడి, నిజంగానే ‘డెయిరీ మిల్క్‌’ తాగితే, నమ్మేవారెవరు?
అలాంటి కష్టమే నారా చంద్రబాబు నాయుడిగారికొచ్చింది.
తొమ్మిదన్నరేళ్ళు ఏకబిగిన ముఖ్యమంత్రిగా చేసి కూడా తనకంటూ ఇప్పుడు( తన పేరు మీద) ఒక డొక్కు అంబాసిడర్‌ కారూ(18 ఏళ్ళ క్రితం కొన్నది),

తాకట్టులోవున్న ఇల్లూ, కాస్త నగదూ వెరసి అక్షరాలా నలభయి లక్షల రూపాయిలు మాత్రమే నని ఆయన ప్రకటించారు.
నిజమే కావచ్చు. కానీ, నమ్మాలంటేనే కష్టం.
సాక్షాత్తూ తాము భగవత్‌ స్వరూపులమని చెప్పుకునే సర్వసంగపరిత్యాగులయిన బాబాలూ, స్వామీజీలూ వేలకోట్లకు పడగలెత్తి, భూస్వాములు గానూ,

‘ద్వీప’ స్వాములుగానూ వర్థిల్లుతున్న దేశంలో-
పాలించిన లేదా పాలించే నేతలు సంపన్నులు కారంటే నవ్వొస్తుంది.
సంపద విలువయినది; దరిద్రం గొప్పది.
రాజకీయాల కోసం ఆస్తి మొత్తం తగలేసుకున్న మనిషిని ముందుకు తెస్తే, వోటెయ్యక పోవచ్చు. కానీ గౌరవిస్తారు.
వోటూ కావాలీ, గౌరవమూ కావాలీ అంటే, సంపదా వుండాలి, దరిద్రంగా కనపడాలి. ఇదే నేటి రాజనీతి.
(ఈ వ్యాసం ‘ఆంధ్రభూమి’ దినపత్రిక 4-9-2011 సంచికలో ప్రచురితమైనది)

-సతీష్‌ చందర్‌

6 comments for “సంపన్న దరిద్రులు

Leave a Reply