సామాజిక న్యాయమా? ‘సామాజిక వర్గ’ న్యాయమా?

మాట మాటే. మారదు. కానీ అర్థం మారుతుంటుంది.

కంపు కంపే. మారదు. కానీ ఒకప్పుడు కంపంటే ఇంపయిన వాసన. అంటే సుగంధమన్నమాట. కానీ ఇప్పుడు ఆ ఆర్థం నడవదు. ‘ఆహా,ఏమి ఈ మల్లెల కంపు!’ అని ఇప్పుడంటే బాగుండదు.

చీర చీరే. మారదు. కాకుంటే ఒకప్పుడు పురుషులు కూడా కట్టే వారు. కానీ ఇప్పుడు స్త్రీలు మాత్రమే కడతారు(నిత్యానంద భరితులయన కొందరు పురుష బాబాలు కూడా కడతారనుకోండి. అది వేరే విషయం.) . అర్థం వాడే వేళను బట్టే కాదు, వాడే మనుషులను బట్టి కూడా మారిపోతుంది.

caricature: balaram

సామాజిక న్యాయం! ఈ మాటకు అర్థం కూడా ఇలాగే మారిపోయింది. చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు ఒక అర్థం వుంటే, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక ఇంకో అర్థం వుంది. చిరంజీవి రాజకీయాల్లోకి రాక పూర్వాన్ని ‘చి.పూ’ (చిరంజీవి పూర్వం.. క్రీస్తు పూర్వంలాగా) అనుకుంటే, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించిన కాలాన్ని ‘చి.శ'( చిరంజీవి శకం) అనుకోవచ్చు.

చి.పూ18లో (పద్దెనిమిదేళ్ళ ముందు) సామాజిక న్యాయం అర్థం వేరు. అంటే పాపం! విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ మండల్‌ సిఫారసులు చేసినప్పుడు ‘సామాజిక న్యాయం’ అంటే, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విస్మృతికి గురయిన వారికి కూడా సమానావ కాశాలు కలుగు చేయటాన్ని సామాజిక న్యాయం అని భావించేవారు. చి.పూ10 నాటికి ఈ అర్ధం ఇంకాస్త నిర్దుష్టమై ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల’కు న్యాయంగా మారింది. అయితే చి.శ3 నాటికి( అంటే నేటికి) సామాజిక న్యాయం మరింత ‘విస్పష్టమై’ అది ‘సామాజిక వర్గ న్యాయం’ గా మారింది. అంటే, కేవలం ఒక్క ‘కులాని’కి లేదా ఒక్క ‘సామాజిక వర్గాని’కి మాత్రమే దక్కే న్యాయంగా పరిణమించింది.

అందుకు జూన్‌ 2012 లో జరిగిన ఉప ఎన్నికలే నిదర్శనం. వైయస్పార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటు స్థానం తో పాటు, 18 అసెంబ్లీ స్థానాల్లో 15 స్థానాల్నీ తీసేసుకుంది. మిగిలిన మూడింటిలో, తెలంగాణలో వున్న (పరకాల) స్థానం టీఆర్‌ ఎస్‌కు వెళ్ళితే, రెండు స్థానాలు కాంగ్రెస్‌కు వచ్చింది. గెలిచిన ఈ ఇద్దరూ చిరంజీవితో పాటు వచ్చి కాంగ్రెస్‌లో చేరిన వారే. అంతే కాదు. ఇద్దరూ చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వారే. వీరికి టికెట్లు రావటానికి చిరంజీవే కీలకం అన్నది వేరే చెప్పనక్కర్లేదు. తాను ఖాళీ చేసిన తిరుపతి స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించలేకపోయినా, ఈ ఇద్దరి విజయానికీ చిరంజీవి పరోక్షంగా కారకులయ్యారు.

గెలిచిన ఇద్దరి లో ఒకరు( తోట త్రిమూర్తులు) దళితులకు శిరోముండనం చేయించారన్న అభియోగాలను కూడా ఎదుర్కొన్నారు. ఆ కేసు చాలా కాలం నడిచింది. ఇలాంటి వ్యక్తులకు ‘టిక్కెట్టు’ ఇప్పించటం చి.పూ నాటి ‘సామాజిక న్యాయాని’కి వ్యతిరేకమవుతుంది కానీ, చి.శ నాటి ‘సామాజిక వర్గన్యాయానికి’ వ్యతిరేకం కాదని ఆయన భావించారేమో!

అసలు ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ’ వర్గాలు ‘చి.శ’లో వచ్చిన ఈ కొత్త నిర్వచనం తెలీక, ‘సామాజిక న్యాయం’ కోసం చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ)లో చేరారు. తమ అన్ని కులాలకూ ఆ పార్టీలో న్యాయం జరుగుతుందనుకున్నారు. అయితే చిరంజీవి ఈ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశాక కూడా మారిన కొత్త అర్థానికి( సామాజిక వర్గ న్యాయానికి) కట్టుబడివున్నారు. ఎక్కడా రాజీ పడలేదు. కాంగ్రెస్‌లో చేరాక, తన సిధ్ధాంతాన్ని మరింత సమర్ధవంతంగగా అమలు జరిపారు.

రాష్ట్ర కేబినెట్‌లో అవకాశాలు వచ్చాయి. పీఆర్పీనుంచి వచ్చిన వారిలో ఇద్దర్ని మంత్రుల్ని చేశారు. ఆ ఇద్దరూ( సి.రామచంద్రరావు. గంటా శ్రీనివాసరావు) చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వారే.(కాపులే).

ఆ తర్వాత సమాచార కమిషనర్ల నియామకంలో కూడా తన సామాజిక వర్గానికి చెందిన వారికి అధికంగా అవకాశాలు లభించాయి. ఆ తర్వాత వాటి మీద వివాదం చెలరేగి కొందరికే అవకాశం వచ్చింది. అ కొందరిలో కూడా చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వున్నారు.

ఇలా సందు దొరికితే చాలు, ‘సామాజిక వర్గ న్యాయానికి’ ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అంతే కాదు, తన సామాజిక వర్గానికే చెందిన బొత్స పీసీసీ అధ్యక్ష పదవిలో వుండటం వల్ల కూడా ఈ కృషికి కొంత న్యాయం జరుగుతోంది.

ఆ మాట కొస్తే, నిన్న మొన్నటి దాకా, కాంగ్రెస్‌ పార్టీ లో అగ్రభాగాన వున్న సామాజిక వర్గం వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వెళ్ళిపోతుంటే, చిరంజీవి సామాజిక వర్గం మాత్రం కాంగ్రెస్‌ కోటలో పాగా వేసింది.

ఎలా చూసినా, చిరంజీవి తాసు స్వంతంగా పెట్టిన పీఆర్పీ ద్వారా చెయ్యలేని ‘సామాజిక వర్గ న్యాయాన్ని’ కూడా, నేడు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా చెయ్యగలుగుతున్నారు.

ఇక మీదట చిరంజీవి కి కాంగ్రెస్‌ ఏ పదవి వచ్చినా, అది తనకున్న ‘సినీ గ్లామర్‌’ వల్ల కాకుండా, ‘సామాజిక వర్గ ‘ ఖాతాలోనే రావచ్చు.

ఇన్నాళ్ళకు రాజకీయ పరిశీలకులకు సైతం ఆయన సిధ్ధాంతం మీద స్పష్టం అయ్యింది. అదే ‘సామాజిక వర్గ న్యయామే’ ‘సామాజిక న్యాయం’!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర  వార పత్రిక లో 22-29 జూన్ 2012 వ సంచిక లో ప్రచురితం)

4 comments for “సామాజిక న్యాయమా? ‘సామాజిక వర్గ’ న్యాయమా?

    • Kameswara rao Annaya,
      I spoke to PRP leaders as earlier days Samaram & some Leftists, Socialists.
      They believe Chirangeevi.Mitra have some concepts about Cultivation, Scientific education.But these Bull-sheet people cheated to everybody.

  1. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న మహాపాపం ఫలితమే
తిరుపతి అవిలాల చెరువులో విరిసి మూడేళ్ళు ముగియకుండానే ప్రజల అదృష్టం బాగుండబట్టి నూరేళ్ళు నిండి కాంగ్రెస్ సముద్రంలొ నిమజ్జనమై ప్ర రా పా మట్టికొట్టుకుపోయింది. రాజకీయాల్లో ఎంత ‘కాపు’ కాసినా విత్తు చెత్తదైతే ‘ఫలం’ ఉండదు. చిరంజీవి సామాజిక న్యాయం అంటే సమాజం ఆయనకు సరైన న్యాయం చేసింది.

Leave a Reply