సిఎం సీటు ‘బీసీ’కా? ‘సీబీ’కా?

వంద సీట్లు. వెయ్యి కోట్లు. లక్ష ఫీట్లు.

ఇవీ బీసీల వోట్ల కోసం చంద్రబాబు పాట్లు.

ఇది విజన్‌ 2020 కాదు, రీజన్‌ 2014.

అనుమానం లేదు. ఇది ఎన్నికల గణితమే. ఆయన లెక్కల్లో మనిషి. ఇంతకు ముందు ఎన్నికల్లో ఇలాగే ‘నగలు బదలీ’ లెక్కలు వేశారు. ‘ఆల్‌ ఫ్రీ’ కూడికలు వేశారు. కానీ జనానికి ‘తీసివేత’లే అర్థమయ్యాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ‘తీసి వేశారు’.

కూడికలూ, తీసివేతలూ కాకుండా, ఇప్పుడు ‘భాగహారాల్లో’కి వచ్చారు. జనాన్ని ‘కులాలు’గా విభాగించుకుంటేనే కానీ, ఈ సారి బయిట పడటం కష్టమనుకున్నట్టున్నారు. ‘వెనుకడిన కులాల’ను ఎన్నుకున్నారు. ఆయన దృష్టిలో ‘వెనుకబడిన కులాలు’ అంటే వేరే అర్థం వున్నట్టుంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ, ఈ కులాల వారు తమ వెంటే వున్నారు. ఈ మధ్యనే జారిపోయారు. 2009 ఎన్నికలలో కొంత శాతం పోతే, ఆ తర్వాత వరసగా జరిగిన ఉప ఎన్నికలలో మిగిలిన శాతం పోయింది. ఇప్పుడు వారిని దారిలోకి తెచ్చుకోవాలి. అర్థమయిందిగా ఆయన నిర్వచనం ఏమిటో? తమ ‘వెనక(వెంట) పడిన’ వారే బీసీలు. అంతే కానీ వారి వారి సామాజిక, రాజకీయ ఆకాంక్షలతో పని లేదు.

బాబు ఇలా ఆలోచించటంలో ఆశ్చర్యం లేదు. అధికారం కోసం వెంపర్లాడే రాజకీయ పార్టీలన్నీ ఇలాగే ఆలోచిస్తాయి. వీరి దృష్టిలో రెండే కులాలు.( అంటే ధనిక, పేద- అని అంటారేమోనని అనుకుంటున్నారా? అమ్మా! ఆశ!!) నడిపించే కులాలు, వెంబడించే కులాలు.

నిన్నమొన్నటి వరకూ -కాంగ్రెస్‌, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌- రాష్ట్రంలో చక్రం తిప్పుతూ వచ్చాయి కదా! ఈ మూడింటిలోనూ మూడు నడిపించే కులాలున్నాయి. చెప్పకోండి కాదు, ‘చెప్పకండి చూద్దాం’ అన్నా సరే చెప్పేస్తారు: రెడ్డి,కమ్మ,వెలమ.( పచ్చిగా ఇలా కులాల పేర్లు చెప్పటం సభ్యంగా లేదు కదూ! అయినా తప్పదు.) అంటే ఆయా పార్టీల్లో అగ్రనాయకత్వం ఆయా కులాల చేతుల్లో వుంటుంది. ఇక ఈ పార్టీల్లో వెంబడించే కులాలుంటాయి. కాంగ్రెస్‌ లో ఎస్సీలూ, ఎస్టీలూ, తెలుగుదేశంలో బీసీలూ, టీఆర్‌ఎస్‌లూ ఎస్సీలూ, బీసీలూ – ఇలా వుండే వారు.

ఈలోగా ‘సామాజిక న్యాయం’ పేరుతో చిరంజీవి వచ్చారు.ఆయన తనని తాను ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలకు ప్రతినిథినన్నారు. సరే అరకొర సీట్లతో గెలిచి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇది జరిగాక, నడిపించే కులాల్లో నాలుగో కులంగా కాపులు(చిరంజీవి కులస్తులు) చేరారు. సరే, కాంగ్రెస్‌ను ఎదిరించి వైయస్‌ జగన్మోహన రెడ్డి ‘వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ’ని స్థాపించి ఉప ఎన్నికలలో ఘనవిజయాన్ని సాధించారు. ఈ పరిణామం మళ్ళీ ‘కుల’ కలం రేకెత్తించింది.

నడిపించే కులాల్లో ‘రెడ్లూ’ , వెంబడించే కులాల్లో ‘ఎస్సీలు’ కాంగ్రెస్‌నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వెళ్ళారు. కాపులు కాకుండా ఇతర బీసీలు తెలుగుదేశం వదలి వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఏమి చెయ్యాలి? ఈ ఇతర బీసీలను మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి.ఈ విద్య బాబుకు కొత్త దేమీ కాదు. ఒకప్పుడు ఎస్సీల వోట్ల కోసం ఇలాంటి పాచికే వాడారు. వారిలో వుండే ఉపకులాలను ‘ఎబిసిడి’లుగా విభజించారు. వారికి ఎలాంటి ప్రయోజనం జరిగిందో తర్వాత సంగతి. ముందు మాత్రం ఒక ఉపకులం వోట్లు తాత్కాలికంగా పొందగలిగారు. కానీ బీసీలను అలా చెయ్యటానికి వీల్లేదు. అక్షరాలా వారు ‘ఎ.బి.సి.డి’లుగానే వున్నారు. అందుకనే ఈ ‘అంకెల’ ప్రయోగం చేస్తున్నారు.

మండల సిఫారసుల అమలు తర్వాత దేశంలో బీసీల రాజకీయ చైతన్యం పెరిగింది. దాంట్లోనుంచి లాలూ, ములాయంలు రాజకీయ పక్షాలనే స్థాపించి, దేశ రాజకీయ చిత్ర పటాన్ని మార్చేశారు. కడకు మండల్‌ సిఫారసులనూ కుల ప్రాతిపదికన రిజర్వేషననూ వ్యతిరేకించి, ‘ప్రతిభ’ కోసం ప్రాణత్యాగాలు చేయించిన బీజేపీ కూడా పలుచోట్ల ‘బీసీ ముఖ్యమంత్రులతోనే’ నేడు పబ్బం గడుపు కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మన రాష్ట్రంలోనే బీసీల నేతృత్వంలో బలమైన రాజకీయ పక్షం పుట్టలేదు. తెలుగుదేశం పార్టీలో ఒక బీసీ నేత(దేవేందర్‌ గౌడ్‌) తెలంగాణ ఉద్యమానికి, ఈ బీసీ చైతన్యం కూడా జోడించి పార్టీ పెట్టారు కానీ, తిరిగి పీఆర్పీలో కలిపి, మళ్ళీ తెలుగుదేశంలో చేరిపోయారు. కాంగ్రెస్‌లో చిరంజీవి, బొత్స సత్యనారాయణల వల్ల కాపునేతలకు కొంత ప్రాతినిథ్యం వచ్చింది కానీ, ఇతర బీసీలకు రాలేదు.

ఇప్పటికీ కూడా చంద్రబాబు బీసీలకు మూడో వంతు సీట్లు ఇచ్చేస్తానంటున్నారు కానీ, ఒక బీసీ తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా చేస్తానని ప్రకటించలేక పోతున్నారు. ఈ విషయంలో టీఆర్‌ఎస్సే కొంత నయం .పార్టీ లో కీలక మైన స్థానాల్లో తన కుల నేతల్నీ, కుటుంబ సభ్యుల్ని వుంచుకొని కూడా, మాట వరసకయినా తెలంగాణ వస్తే ‘దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తాన’ని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి స్థానంలో తన కుటుంబం నుంచే వేరే సభ్యుణ్ణే చూడలేని స్థితిలో వుంటే, ఇంక బీసీలకు ఎందుకు ఇస్తారు లెండి!?

తెలుగుదేశం లో సిఎం సీటు ఎప్పుడూ ‘సిబి'(చంద్రబాబు)కే ‘బీసీ’ కి కాదు.

-సతీష్ చందర్

 

 

 

 

2 comments for “సిఎం సీటు ‘బీసీ’కా? ‘సీబీ’కా?

Leave a Reply