సీన్‌ కట్‌ చేస్తే…!

చిరంజీవి సినిమాల్లో నటిస్తారా? నటించరా?
నటించక పోతే ప్రాణత్యాగంకూడా చేస్తామనగలరు అభిమానులు.( అన్నట్టు అభిమానులనేవాళ్ళు నటించరండోయ్‌! అన్నంత పనీ చేసేస్తారు.)
నటిస్తే రాజకీయంగా ఎలా ఎదగ్గలవంటారు- పార్టీ కార్యకర్తలు. సొంత పార్టీ కార్యకర్తలకయితే ఏదో ఒకటి నచ్చచెప్పుకోవచ్చు. దత్తత పార్టీకి ఎలా చెప్పుకుంటారు?
సినిమాల్లో పూర్తికాలం నటిస్తే హీరోల్లో మొదటి స్థానం.
రాజకీయాల్లో జీవిస్తే అందుకు తగ్గ పాత్ర ఒక్కటే వుంది: ముఖ్యమంత్రి.
ముఖ్యమంత్రా? మెగా హీరోనా?
చిరంజీవి మనసులో ఏముంది? చిరంజీవికే తెలియక పోవచ్చు. కానీ మీడియాకు తెలుస్తుంది.
మీరూ తెలుసుకోవాలనుకుంటే ‘బ్రేక్‌ తర్వాత’… సారీ! మీరు చదువుతున్నది కాబట్టి ‘బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత’ చదవండి.
…. …. ….
‘రోబో’ సినిమా విడుదలవుతున్న రోజులవి.
ప్లీజ్‌! అడ్డురాకండి. అది చిరంజీవి సినిమా కాదనీ నాకూ తెలుసు. రజనీకాంత్‌ సినిమాయే. అందాలభరిణె ఐశ్వర్యరాయ్‌ సరసన కుర్రవాడయిపోయి మరీ ఆయన జీవించిన చిత్రమది.
‘రజనీ కాంత్‌ మోసం చేశాడు. నన్ను రాజకీయాల్లోకి తోసేసి తాను మాత్రం సినిమాల్లో వుండి పోయాడు’ అని ఎంతో ఆనంద పడుతూనే, కొంచెం దిగులు పడ్డారు. రసజ్ఞులకు మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది.
అప్పటికి రాజకీయాల్లోకి ప్రవేశించెయ్యటమూ, పార్టీ పెట్టెయ్యటమూ, ‘ఇంద్ర’ సినిమాలో మాదిరిగా ‘తొడ’లు కొట్టి ప్రచారం చెయ్యటమూ, ఇంట వోడి( సొంత నియోజకవర్గమయన పాలకొల్లులో), రచ్చగెలవటమూ( తిరుపతిలో) గెలవటమూ, పద్దెనిమిది మంది శాసనసభ్యులతో సంతృప్తి పడి పరమానందంగా శాసన సభకు వెళ్ళటమూ.. అన్నీ జరిగిపోయాయి.చిరంజీవి ఇంతటి వినమ్రుడా- అని కొందరు ఆశ్చర్యపోయారు కూడా. చిరంజీవి ఎక్కడున్నా చిరంజీవే. తత్వం తెలిసిన మనిషి. హిట్టునాడు పొంగిపోలేదు. ఫ్లాపు నాడు కృంగిపోలేదు. సినిమాలకయినా, రాజకీయాలకయినా ఒకటే సిధ్ధాంతం.అలాగే సినిమాల్లో అయినా, రాజకీయాల్లో అయినా- చిరంజీవికి బొమ్మకు ‘కనీస హామీ'(మినిమమ్‌ గ్యారంటీ) వుంటుంది. దాదాపు పద్దెనిమిది శాతం ఓట్లను తెచ్చుకున్న రాజకీయ చిత్రం తన ‘ప్రజారాజ్యం’. తనంతట తానుగా బొమ్మ ఆడకపోతే, ఆడించే వాళ్ళుంటారు.
ఇలాంటి భరోసా ముందు నుంచీ వుంది కాబట్టి, ‘రోబో’ నాడు చేసి ప్రకటనను అతి సాధారణంగా తీసుకున్నారు.
…. …. …..
ఇంకా వెనక్కి వెళ్ళితే,
తనకు ‘గంజీ’ తెలుసు, ‘బెంజీ’ తెలునునంటూ రాజకీయ ఆరంగ్రేటం చేసినప్పుడు కూడా, తాను పూర్తి కాలం రాజకీయాలకే అంకితమవుతానని, ఇదే లక్షలాది మంది అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య…. అయామ్‌ సారీ… మోతెక్కి పోయే ఈలల మధ్య ప్రకటించారు.
హీరోలకీ, అభిమానులకీ మధ్య వుండే అనుబంధం భగవంతునికీ, భక్తుని మధ్య వుండే బాంధవ్యం లాంటిదే. భగవంతుణ్ణి యుగానికి తగ్గ అవతారం ఎత్తమని భక్తులు డిమాండ్‌ చేసినట్టే, హీరోని తమ అభిమానులు కూడా డిమాండ్‌ చేస్తుంటారు.సినిమాల్లో వుండగా, చిరంజీవిని రాజకీయ అవతారమెత్తమని కోరారు. దశాబ్దానికి పైగా వారు చేస్తున్న ప్రార్థనలను మన్నించి ఆయన రాజకీయ అవతారమెత్తారు.
… … ….
ప్రస్తుతంలోకి వచ్చేస్తే,
ఊహించినట్టుగానే, చిరంజీవి రాజకీయ చిత్రం ‘ప్రజారాజ్యాని’కి పంపిణీ దారులు దొరికారు. కాకపోతే దాని పేరు మార్చి ‘కాంగ్రెస్‌’ అని పెట్టి, సర్కారు, సీడెడ్‌ ప్రాంతాలలోనే కాకుండా నిజాంలో కూడా విడుదలకు రంగం సిధ్ధం చేశారు.
ఇప్పుడు అభిమానులది మళ్ళీ కొత్త డిమాండ్‌. పాత అవతారం ఎత్తాలి.’మెగా స్టార్‌ సినిమాల్లో నటించాలి.’
నటించరని ఎవరన్నారు? ఆయనే అన్నారు.
‘నన్ను రాజకీయాల్లో ముఖ్యమంత్రి(హీరో పాత్ర)లో చూడాలనుకున్నారు నా అభిమానులు. నేను రాజకీయాల్లోనే వుండిపోతాను’ అని దాదాపుగా అనేశారు.ఇక ఊరుకుంటారా అభిమానులు..? దీక్షలు మొదలు పెట్టారు.
…. …. ….
మళ్ళీ సీన్‌ కట్‌ చేస్తే…
ఏకంగా బాలీవుడ్‌ బిగ్‌ ‘బి’ అమితాబ్‌ బచ్చన్‌ ఎంట్రీ ఇచ్చారు.
‘చిరంజీవి సినిమాల్లో నటించాలి’ అన్నారు.
‘నటిస్తాను అనేశారు’ చిరంజీవి.
…. …. ….
ఇక తేల్చేద్దాం. చర్చను ముగించేద్దాం.
భగవంతుని లీలలన్నీ ఒక్కొక్కప్పుడు భక్తులకు అర్థం కావు.
యువకుడూ(రాజకీయల్లో ఏభయ్యేళ్ళకు యవ్వనం వచ్చిందంటారు), ఉత్సాహవంతుడూ అయిన కిరణ్‌కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించాక, ఆ పోస్టుకు తమ దరఖాస్తును బహిరంగంగా దఖలు పరుస్తున్నారు మరికొందరు యువకులు.
తనకూ ముఖ్యమంత్రి కావాలని వుందని బొత్స సత్యనారాయణ అన్నారు.
ఇప్పుటీకే ఉపముఖ్యమంత్రి అయి కూర్చున్నారు దామోదర రాజనరసింహ.
ఆ వరసలోనే…
చిరంజీవి కూడా తన ముఖ్యమంత్రి స్వప్నాన్ని, ప్రజల కోరికగా బయిటపెట్టారు.
కాబట్టి….
చిరంజీవి నటిస్తారు… కానీ, రాజకీయాల్లో!
చిరంజీవి జీవిస్తారు… సినిమాల్లో!!

-సతీష్‌ చందర్‌
1-7-11

Leave a Reply