సీమాంధ్ర కాంగ్రెస్ ‘మాయ’ఫెస్టోై!

ఆంధ్ర్రప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, చిరంజీవి తదితరులు.

ఆంధ్ర్రప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, చిరంజీవి తదితరులు.

ఎన్నికలలో ఎవరి టెన్షన్‌ వారికి వుంది. కారణం కోరిక. గెలిచితీరాలనే పట్టుదల. కానీ ఎలాంటి ఆందోళన లేని వారు కూడా రాష్ట్రంలో వున్నారు. వారే సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు. నిండా మునిగిన వారికి కొత్తగా చలి పుట్టుకు రాదు. వీరి పరిస్థితి అంతే. ఎలాగూ గెలవమని తెలిసిపోయాక, ‘అవశేషాంధ్రప్రదేశ్‌’లో అధికారానికీ, తమకీ సంబంధం లేదనీ ముందే అర్థమయి పోయాక, అన్ని పనుల్లూ తంతుల్లా జరిగిపోతాయి. పార్టీ టిక్కెట్ల పంపిణీ దగ్గర నుంచి, ప్రచారం వరకూ పధ్ధతి ప్రకారం జరిగిపోతాయి. రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నప్పుడే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ పరిస్థితి ఊహించి వుండాలి. కాబట్టి ఇక్కడి స్థితి వారిని ఎలాంటి ఆందోళనకూ గురి చెయ్యదు.

టిక్కెట్ల పంపిణీ జరిగిపోయింది. టిక్కెట్లు రాని వారు ‘రెబెల్స్‌’గా మారి, భారీ యెత్తున తిరుగుబాటు చేస్తారన్న బెంగ లేదు. ఎవరో కొద్ది మంది మినహా, సీమాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశావహుల తీరే వేరు. వారిలో అత్యధికులు గెలవాలని టికెట్టు ఆశించలేదు. చాలా మంది తాము రాజకీయ ఆరంగ్రేటం చేయటానికి, ఇదే తగిన సమయమని భావించి పార్టీ నేతల చుట్టూ తిరిగారు. వీరు కాకుండా మరో జాబితా కూడా వుంది. గత ఎన్నికలలో పలు పార్టీల టికెట్టు ఆశించి భంగ పడ్డవారూ, లేదా టిక్కెట్టు దక్కినా ఓడిపోయిన వారూ సీమాంధ్ర కాంగ్రెస్‌ చుట్టూ తిరిగారు. కాబట్టి రాకపోయినా పెద్దగా చింతించ లేదు.

‘సిట్టింగు’లు ‘సిట్టింగు’ల్లా లేరు. అందరూ ‘జంపింగు'(కేండిడేట్లు) గా మారారు. పెద్ద యెత్తున వైయస్సార్సీపీ, టీడీపీల్లోకి వలసలు పోయారు. చివర్లో అయితే పెద్ద పెద్ద నేతలు సకుటుంబ సమేతంగా తెలుగుదేశంలో చేరి, తెలుగుదేశం పార్టీని ‘సైకిల్‌ కాంగ్రెస్‌’గా మార్చేశారు. ఈ రకంగా కాంగ్రెస్‌లో పాత నెత్తురు పోయింది. వారి స్థానంలో సీమాంధ్ర కాంగ్రెస్‌లో వచ్చినది ‘ఉరకలేసే కొత్త నెత్తురు’ కాదు. గ్రూపు తేడా వచ్చి రోగికి ఎక్కించటానికి పనికి రాని నెత్తురే అధిక భాగం వుంది.

ఓటమి ముందే తెలిసిన వారికి వున్న సౌకర్యాలు అనేకం వుంటాయి. పెద్ద యెత్తున చేతులు కాల్చుకోనవసరం లేదు. అభ్యర్థులు నామినేషన్ల రోజున కూడా ‘బీరులు’ పొంగించనవసరం లేదు. ‘బిర్యానీ’లు తినిపించనవసరం లేదు. అసలు భారీ సంఖ్యలో జనం కూడా నామినేషన్‌ వేసే చోటుకి తరలి రానవసరం లేదు. ఈ ప్రాంతంలో పార్టీ బాధ్యులకు కూడా వారి సుఖాలు వారికుంటాయి. ప్రచారంలో నెరవేర్చాల్సిన అవసరం లేని వరాలు ఎన్నో ఇవ్వవచ్చు.

ఇంటికి వచ్చిన చుట్టం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలని నిర్ణయించేసుకున్నాక, ఆయనకిచ్చే విందు ఆఫర్లు ఎలా వుంటాయి? ‘అన్నయ్యగారూ! మీరు భోంచేసి వెళ్తారనుకుని, చికెన్‌ తెప్పించాను. ఫిష్‌ రెడీ చేశాను. ఫ్రైడ్‌ రైస్‌ చేద్దామనుకున్నాను…’ ఇలా లిస్టు పెరిగిపోతూనే వుంటుంది. ఇంటాయన కూడా ఈ జాబితాను పెంచేస్తూ వుంటాడు. ఎలాగూ ఆయన భోజనం చేసి వెళ్ళనని చెప్పాడు కాబట్టి, ‘రెచ్చి పోయి మరీ రిక్వెస్ట్‌’ చేసేస్తుంటారు.

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో వరాలు ఇలాగే వున్నాయి. తీర్చనవసరం లేదు కదా! ఎలాగూ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రాదు కదా! అందుకయినా ఏ హామీ అయినా ఇచ్చెయ్య వచ్చు. ఇంట్లో ఆడపిల్ల పుడితే చాలు, ‘వంద గజాల స్థలం రాసిచ్చేస్తార’ట. అంతేకాదు, ఆ పిల్ల ఎదిగి పెళ్ళి చేసుకునే సరికి మళ్లీ వచ్చి ఆ స్థలంలో ఇల్లు కట్టి ఇచ్చేస్తారట. ఎలా సాధ్యం? ఇందుకు అవసరమయ్యే భూమి ఎక్కడది? అన్ని ఇళ్ళు కట్టటానికి ఎంత బడ్జెట్‌ అవుతుంది? ఇలాంటి ప్రశ్నలతో మనం బుర్రలు బద్దలు కొట్టుకోవద్దు. ఆ మాట కొస్తే, ఆ పని కాంగ్రెస్‌ వారే చేసి వుండరు. తాము అధికారంలోకి వస్తే( రాలేమనే గట్టి నమ్మకం వుంది లెండి.) అవశేషాంధ్ర ప్రదేశ్‌ లో వుంటే, గింటే కరెంటు లేని ఇళ్ళుంటాయి కానీ, ‘కలర్‌ టీవీ, డిషకనెక్షన్‌’ లు లేని నివాసాలుండవు. ఈ రెండూ ఉచితంగా ఇచ్చేస్తారట. అలాగే ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు మహా అయితే కూర్చోవటానికి బెంచీలు వుండక పోవచ్చు. కానీ ‘లాప్‌ టాప్‌’లు వుంటాయి. అవును మొత్తం ‘ఫ్రీ’యే నట. ఇలా ఇంకెన్నో. ఏవయినా ‘ఉచితం’. ఎందుకంటే సీమాంధ్ర ప్రజలు అక్కడి క్రాంగ్రెస్‌ పార్టీకి, ‘ఘోర పరాజయాన్ని’ కూడా ఉచితంగా నే ఇవ్వబోతున్నారు.

ఎలా చూసినా, సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌ నాయకులు ఫలితాలను ఆశించకుండా పనులు చేసుకుబోతున్నారు. ఎమ్మెల్యే అయ్యామనీ, ఎంపీ ఆయ్యామనీ చెప్పుకోవటమే కాదు. ఒక్కొక్కప్పుడు వాటికి పోటీ చేసి ఓడిపోయామని చెప్పటానికి కూడా నాయకులు గర్విస్తుంటారు. ఆ రకమైన ప్రాచుర్యాన్ని పొందాలనుకునే వాళ్ళకి, ఈ సారి మాత్రం సీమాంధ్రలో గొప్ప సదవకాశాన్ని కల్పిస్తోంది. ఉపయోగించుకునే వాళ్లు ఉపయోగించుకుంటున్నారు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 19-26 ఏప్రిల్ 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “సీమాంధ్ర కాంగ్రెస్ ‘మాయ’ఫెస్టోై!

  1. ఆంధ్రప్రదేశ్ లో (కొత్త అయినా, అవశేష అయినా) పెద్ద పాములు పుట్టల్లో దాక్కుంటే, చిన్నపాములూ, బురదపాములూ బయటికి వచ్చాయి కాంగ్రెస్ ముసుగులతో. యే పామునయినం బుర్ర చితక్కొట్టేయవలసిన సమయం వచ్చింది. ఇంక ఆలోచన వద్దు. వెంటనే కర్రలు చేతపట్టుకోండి..

Leave a Reply