సై- ఆట మళ్ళీ మొదలు

ఆట మళ్ళీ మొదలు.

మామూలు ఆట కాదు. రక్తసిక్తమైన క్రీడ.

ఒకప్పుడు రెండు టీమ్‌లు సరిపోయాయి. ఇప్పుడు మూడు టీమ్‌లు కావాలి. ఆట కోసం ప్రాణాలు అర్పించాలి. రోడ్ల మీద పరుగులు తీస్తూ నిలువునా దగ్థమవ్వాలి. నడిచే బస్సులు భస్మీపటలమయిపోవాలి.

కేకలు. ఆక్రందనలు. నినాదాలు. ఆమరణ దీక్షలు.

ఈ మృగయా వినోదానికి ముహూర్తాలు పెడుతున్నారు ఢిల్లీలో పెద్దలు.

 

చిన్న ఫ్లాష్‌ బ్యాక్‌

సీన్‌ వన్‌: ఆపరేషన్‌ తెలంగాణ

ఈ ఆట ఇప్పటిది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న వైయస్‌ అకాల మృతి తర్వాత మొదలయిన ఆట.

వైయస్‌ తర్వాత ఆ పదవిని పొందటానికి ఆయన తనయుడు జగన్మోహన రెడ్డి (150 శాసన సభ్యుల సంతకాలతో)సిధ్దమవుతన్నాడన్న సమాచారంతో మొదలయిన ఆట.

వైయస్‌ అంటే అధిష్ఠానానికి ఎంత అవసరమో, అంత ద్వేషం. కారణం వైయస్‌ కూడా రాష్ట్రంలో సమాంతర అధిష్ఠానమే.

ఇందిర, రాజీవ్‌, సోనియాలు గాలి చెయ్యి ఊపితే కేరింతలు కొట్టినట్టే వైయస్‌కీ కొట్టారు. ఒక వరలో రెండు కత్తులు ఇముడుతాయా? వైయస్‌ను తగ్గించాల్సిందే…! ఇలా అనుకునేలోగానే మృత్యువు వైయస్‌ ను మింగేసింది.

ఇదే అదను!

అని ఢిల్లీ పెద్దలు భావించారు. వైయస్‌ లేకున్నా వైయస్‌ ప్రతిరూపం గా జగన్‌ వున్నారు. మొక్కలోనే వంచెయ్యాలి. తండ్రిపై వస్తున్న సానుభూతిని నీరుకార్చాలి. అందుకు తెలంగాణ ఉద్యమం అవసరానికి ఉపయోగపడింది. పదేళ్ళనుంచీ ఈ ఉద్యమం మండతూనే వుంది. కానీ మహాజ్వాల కాలేదు. అదెంత పని? ముందు ఇస్తానని మురిపించి, తర్వాత వెనక్కి తీసుకుంటే, తెలంగాణ భగ్గుమంటుంది. ఈ జ్వాలను చూపించి సీమాంధ్రలో ‘సమైక్యాంధ్ర ఉద్యమాన్ని’రగిలించవచ్చు. పాచిక బ్రహాండంగా పండింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బలోపేతమయిపోయింది. పాచిక బ్రహ్మాండంగా పారింది. జగన్‌ తెలంగాణలో అడుగు మోపలేక పోయారు సరికదా- సీమాంధ్రలో ‘ఓదార్పుయాత్ర’కు ‘కమర్షియల్‌ బ్రేక్‌’ లాంటి ‘పొలిటికల్‌ బ్రేక్‌’ ఇవ్వాల్సి వచ్చింది. అలా జగన్‌ పరిధిని ఒక ప్రాంతానికి కుదించారు.

 

సీన్‌టూ: కేసులు పెట్టు, జనాకర్షణ కొట్టు

ఇద్దరు ముఖ్యమంత్రులు మారారు. పాపం వైయస్‌ మరణానంతర వచ్చిన రోశయ్య ‘ఆపధ్ధర్మ ముఖ్యమంత్రి’ లా ప్రవర్తించారు. కాకుంటే రెండు ప్రాంతాలలో జ్వాలలు రగులుతుంటే ఫిడేలు వాయించే నీరో చక్రవర్తిని జ్ఞాపకం తెచ్చుకుంటూ కాలం గడిపారు. తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డిని తెచ్చారు. ఈయనకు రెండు పనులు అప్పగించారు. ఒకటి: ‘చట్టం తన(మన) పనిని చేసుకు పోతూవుంటే చూస్తూ వుండటం. రెండు: వైయస్‌లాగా సంక్షేమ పథకాలతో మరీ వైయస్‌ అంత కాకపోయినా, పరిమిత మైన జనాకర్షణ పొందాలి.(అంటే సమాంతర అథిష్ఠానం అంత కాదు.) . మొదటి పని బ్రహ్మాండంగా చేసుకు పోయారు. రెండో పని మాత్రం ఆయన వల్ల కాలేదు. కిలో రెండు బియ్యం లో ‘రూపాయి’ తగ్గించాడు. పావలా వడ్డీ రుణాల్లో, ‘పావలా’ తీసేశారు. కానీ అర్థ రూపాయి కీర్తి రాలేదు. పైపెచ్చు ఆయన పరపతి రూపాయి విలువ పడిపోయినట్టు పడిపోయింది. రూపాయి యుస్‌ డాలర్‌ ముందు చిన్నబోయింది. కానీ కిరణ్‌ పరపతి ‘వైయస్‌’ డాలర్‌ ముందు చిన్నబోయింది.

 

సీన్‌ త్రీ: వలసలకు బ్రేకులు

వైయస్‌ పేరును ఎఫ్పయ్యార్‌లో చేర్చినందుకు నిరసనగా జగన్‌ వెంట వున్న ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఆ తర్వాత అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా వోటేసి అనర్హత వేటు పొందారు. ఉప ఎన్నికలకు వెళ్ళారు. మధ్యలో జగన్‌ జైలు పాలయ్యారు. వలసలకు బ్రేకు వెయ్యటమే ఈ చర్య ఆంతర్యమని ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు తప్ప మిగిలిన 15మంది తిరిగి ఎన్నికల్లోనూ గెలిచారు. ‘సానుభూతి పవనం ముందు అవినీతి ఆరోపణ’ చిన్న బోయింది. ఈ సానుభూతి పరకాలలో తెలంగాణ నినాదానికి కూడా పరీక్ష పెట్టింది. ఇంకా రెండేళ్లు కూడా లేవు ప్రధాన అసెంబ్లీ ఎన్నికలకు. ఏం చెయ్యాలి? ఆటే.. పాత ఆటే. అప్పటి మృగయా వినోదమే.

 

ఇంటర్వెల్‌ తర్వాత: మూడు టీమ్‌ల ఆట

వైయస్‌ పై సానుభూతిని నగానికి సగం కత్తిరించామనుకున్నాం. కానీ ఇప్పుడు జగన్‌ ప్రభంజనం తెలంగాణ వైపు వెళ్ళవచ్చు.

మిగిలిన సగంలో పావు భాగం చెయ్యాలి. అప్పుడు మూడు టీమ్‌లు అవుతాయి. సీమ- ఆంధ్ర- తెలంగాణ. ఇందుకు జస్టిస్‌ శ్రీకృష్ణుడు వుండనే వున్నారు. తాను సూచించిన ఆరు పరిష్కారాల్లో ఒక పరిష్కారం -తెలంగాణను సీమను కలపడం. అదే ‘రాయల తెలంగాణ’

ఎలాగూ జస్టిస్‌ శ్రీకృష్ణ నివేదిక మీద చర్చించటానికి రమ్మంటుంటే , ముందు కాంగ్రెస్‌ వైఖరి చెప్పాలని మిగిలిన పక్షాలు పట్టుపడుతున్నాయి. కాంగ్రెస్‌ తన వైఖరి చెప్పినట్టూ వుంటుంది. చిచ్చూ రేగుతుంది. ఈ ప్రతిపాదన వుందని తెలియగానే తెలంగాణా జెఎసి కన్వీనర్‌ కోదండరామ్‌ కస్సున లేచారు.

ఉంచితే రాష్ట్రాన్ని కలిపి వుంచండి- అంటూ సమైక్యాంద్ర వాదులూ రచ్చ కెక్కుతారు.

‘హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా వుంచి రాయలసీమ ను ప్రత్యేక రాష్ట్రంగా చేయండి’ అంటూ ప్రత్యేక సీమ వాదులూ లేస్తారు.

ఈ సమయంలో రాయలసీమ స్వస్థానంగా కలిగిన వైయస్‌ జగన్మోహన రెడ్డిని కోస్తాంధ్రలో నిరోధించ వచ్చు. అంతే కాదు. తెలంగాణలో ఆయన తరపున తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రవేశించాలన్న ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చు. ‘రాయల -తెలంగాణ’ ను అంతిమంగా ఇచ్చినా, ఇవ్వకున్నా- వైయస్‌ సానుభూతి పవనాన్ని మరి కాస్త కుదించ వచ్చు. ఈ ఆటను ఆడేటప్పుడు రాష్ట్రంలో వున్న ముఖ్యమంత్రి తట్టుకోగలడా? ఈ కోణం నుంచే ఆయన్ను మర్చాలా ? లేదా? అని ఆలోచిస్తారు తప్ప, ‘సమర్థుడా? కాదా?’ అన్నది ఇక్కడ అప్రస్తుతం.

ఈ క్రీడ సాగుతుందా? రెండు టీమ్‌లోతో ఆడించినంత పగడ్బందీగా మూడు టీమ్‌లతో ఆడించగలరా?

ఇదంతా సరే. ఇలా చెయ్యటం వల్ల కాంగ్రెస్‌ వోటు బ్యాంకు పెరుగుతుందా? ఇవన్నీ పగటి కలలుగానే మిగిలిపోతాయా? వేచి చూడాల్సిందే.

కాక పోతే, ఈ పేరు మీద మరింత హింస, మారణహోమం, ఆస్తి నష్టం జరుగుతుంది. ఇప్పటికే విసిగిపోయిన మధ్యతరగతి జీవులు మరింత వేదనకు గురవుతారు. అది మాత్రం వాస్తవం. కాబట్టి ఈ రాజకీయ ‘రగ్బీ’ను తమ తమ మోచిప్పలు పగలకుండానే కాంగ్రెస్‌ ఉపసంహరించుకోవటం మంచిది.

-సతీష్‌ చందర్‌

 

 

 

 

1 comment for “సై- ఆట మళ్ళీ మొదలు

Leave a Reply