‘ఆప్’ వింద్ ’చీపురు‘వాల్!

పేరు : అరవింద్‌ కేజ్రీవాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఏక్‌ నిరంజన్‌ ( ఢిల్లీ మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల తర్వాత ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. ఎవరు వెళ్ళిపోయినా సరే.. ఒంటరి పోరుకు సిధ్ధపడుతున్నాను.)

వయసు : పోరాడే వయసు.. పాలించే వయసు కాదు. ఈ విషయాన్ని ఢిల్లీ పౌరులు ఇప్పటికి గుర్తించారు. తొలి సారి ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నప్పుడే.. పోరాడటానికి రోడ్డెక్కాను. అయినా నేను పాలకుణ్ణేమోనన్న అనుమానంతో రెండో మారు అవకాశం ఇచ్చారు. మునిసిపల్‌ ఎన్నికలకు కానీ వారికి పూర్తిగా అర్థం కాలేదు. అందుకే పోరాడమని కార్పోరేషన్‌లో ప్రతిపక్షంగా ‘ఆప్‌’ను కూర్చోబెట్టారు.)

ముద్దు పేర్లు : ‘క్రేజీ’వాల్‌( నా నిర్ణయాలు అలా వుంటాయి. లేకుంటే ఒక్కొక్క కార్పోరేటర్‌కూ వంద కోట్ల పైన ఆశ చూపుతారు. అయినా పార్టీని వీడి వెళ్ళకండి అని చెప్పాను. ఇప్పుడనిపిస్తోంది… అనవసరంగా వాళ్ళకున్న మార్కెట్‌ రేటును బయిటపెట్టి.. నేనే ఊరించానా… అని.. క్రేజీగా వుంది కదూ..) ‘హర్రీ’ వింద్‌ గోపాల్‌(నేను నిర్ణయం తీసుకుని తర్వాత ఆలోచిస్తాను. అంత స్పీడు. ఆప్‌ నేత మీద ఆరోపణ వస్తే చాలు… ముందు చర్య తీసేసుకుంటాను. ఆ తర్వాత అనిపిస్తుంది. నా శత్రువులు నా పార్టీ మనుషుల్ని నా చేతే తీయించి వేస్తున్నారని.)

విద్యార్హతలు : ఐఐటీయే.. అంటే ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ…. అని కాదు. ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ ‘తిక్కాలజీ’. అవును మీరు కరెక్ట్‌ గానే చదివారు. అది నాకు ఒంటబట్టింది.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: గుర్తింపే నా చిహ్నం. లేకపోతే.. లోక్‌పాల్‌ ఉద్యమం అన్నా హజారే చెయ్యటమేమిటీ… గుర్తింపు నాకు రావటమేమిటి..?

రెండు:ఎన్నికల్లో దిగితే ‘తుడుపు’ ఖాయం. (ఎన్నికల గుర్తు చీపురు కదా) పక్క వాడి పార్టీని తుడిచే అవకాశం లేకుంటే … సొంత పార్టీని ‘తుడుచే’సుకుంటాను.( 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని తుడిచేస్తే, ఇప్పుడు జరిగిన ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల(ఎంసీడీ ఎన్నికల)లో నా సొంత పార్టీని తుడిచేసుకున్నాను. ( మొత్తం 181 వార్డులకీ 48 వార్డులే వచ్చాయి. బీజేపీకి 181 వచ్చాయి.)

సిధ్ధాంతం : పార్టీ గెలవటానికి సిధ్ధాంతమెందుకనే .. ఇంతవరకూ ఊరుకున్నాను. జనానికి వరాలు ఇచ్చేస్తే సరిపోతుంది కదా- అనుకున్నాను. దాంతో బీజేపీకీ, ఆప్‌కీ తేడా ఏమిటీ- అనుకున్నారు. బీజేపీ వైపుకు సులభంగా వెళ్ళిపోయారు.

వృత్తి : ముందు ‘ఆఫీసరు’ వృత్తే. తర్వాత ‘పాలిటిష్యన్‌’ని అయ్యాను. అయినా ‘అధికారి’గానే ప్రవర్తిస్తుంటాను.

హాబీలు :1. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తో తగవులు పెట్టుకోవటం.

2. ఓడిపోయినప్పుడెల్లా ఎలక్ట్రానింగ్‌ మెషిన్ల(ఈవీఎంల)ను అనుమానించటం.

అనుభవం : నేల విడిచి సాము చెయరాదు. ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రాన్ని కాదని పలు రాష్ట్రాలలో పాగా వెయ్యలేవు.. నేను ఢిల్లీని మరచి పంజాబ్‌ వంటి రాష్ట్రాలలో గెలుపు కోసం ప్రాకులాడాను.

మిత్రులు :ఎంత వేగంగా ఏర్పడతారో… అంత వేగంగా వదలిపోతారు.

శత్రువులు : ఒకే ఒక్కడు… మోడీ.

మిత్రశత్రువులు : ఉండరు. మిత్రులు మిత్రులే.. శత్రువులు శత్రువులే. అందుకే నాకు రాజకీయం పూర్తిగా అబ్బలేదంటారు.

వేదాంతం : ఓటరు నాడి దొరికి నట్టే దొరికి ఎప్పటికప్పుడు జారిపోతుంటుంది.

జీవిత ధ్యేయం : ఏముందీ.. మంచి ‘మాజీ’ వాల్‌ ( అనగా మాజీ ముఖ్యమంత్రి గా.. మాజీ ప్రధాన మంత్రిగా ఎక్కువ కాలం తిరగాలి. ఆ పదవులు వస్తే చాలు.. ఎన్ని రోజులున్నామన్నది ముఖ్యం కాదు.

-సతీష్‌ చందర్‌

1 comment for “‘ఆప్’ వింద్ ’చీపురు‘వాల్!

Leave a Reply