‘హిందీ’త్వ మోడీ

caricature:Balaram

caricature:Balaram

పేరు : నరేంద్ర మోడీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: భారతీయ(జనతా) ప్రధాని

ముద్దు పేర్లు : మూడీ(వోటర్ల మూడ్స్‌ మారుస్తానని) త్రీడీ( మూడు సార్లు గెలవటమే కాదు, త్రీడీలోప్రచారం చేశానని), కేఢీ(అపార్థం చేసుకోకండి. ‘కే’ అంటే కేశూభాయ్‌ పటేల్‌, గుజరాత్‌లో రాజకీయ భీష్ముడు. ఆయన్నే ఎదుర్కొన్నాను.)

విద్యార్హతలు : బి.పి.ఎల్‌( అంటే ఐపిల్‌ అనుకునేరు. కానీ కాదు. బ్యాచిలర్‌ ఆఫ్‌ పోల్‌ మేనేజ్‌మెంట్‌. వోట్లు ఎలా వేయించుకోవాలో తెలిపే శాస్త్రం.) రాజనీతి శాస్త్రంలో నేను చేసిన మాస్టర్స్‌ డిగ్రీ కంటె ఇది పెద్దది.

హోదాలు : మీరు గమనించలేదా? నేనిప్పుడు మీడియాతో గుజరాతీలో కాదు, హిందీలో మాట్లాడటం మొదలు పెట్టాను. నాలో ఇన్నాళ్ళూ ‘హిందూత్వ’ నే చూశారు. ఇకమీదట ‘హిందీత్వ’ కూడా చూడవచ్చు. ఎర్రకోట బురుజుల మీదనుంచి స్వాతంత్య్ర దినోత్సవం నాడు గుజరాతీలో మాట్లాడితే బాగుండదు కదా! అందుకని ఇక మీదటయినా జాతీయ మీడియా నాతో జాగ్రత్త గా వుండాలి. నాకు కానీ కోపం వస్తే ఆ మీడియాను కూడా ‘మోడి’యా చేసేయగలను.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: మీకు తెలియదా? ఇప్పుడు ఏ ఇద్దరు గుజరాతీలు ఎదురు పడినా- నమస్తే- అనటం మానేశారు. ‘న.మో’ అనటం మొదలు పెట్టారు. (అవును. న.మో- అంటే నేనే. నరేంద్ర మోడీనే.)

రెండు: మీకో రహస్యం తెలుసా? గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్ర మోడీగా నేనొక్కణ్ణే వోటు హక్కు ఉపయోగించుకోలేదు. కోట్ల నరేంద్ర మోడీలు వోటు వేశారు. నా అభిమానులందరివీ నా ముఖాలే కదా?( నా ముఖం మాస్క్‌లే ధరించారు.)

అనుభవం :అన్ని ఎన్నికల్లోనూ ఒకే మంత్రం నడవదు. మొదటి సారి(2002లో) మతం జపించాను. రెండవ సారి(2007లో) అభివృధ్ది పఠించాను. ఇప్పుడు ఏ మంత్రమూ జపించలేదు. నా ‘ముఖం’ చూపించాను. జనం కూడా నా ‘ముఖం’ నాకే చూపించారు. అందుకే ఈ గెలుపు నా గెలుపు అంటారు జనం. జనం గెలుపంటాను నేను. (రెండూ ఒకటే కదా!)

సిధ్ధాంతం : గుజరాత్‌ ఎన్నికలలో182 సీట్లలో ఒక్కటీ ముస్లింలకు ఇవ్వలేదు. (నా సిధ్ధాంతం ఎప్పటికీ మారదు.) గాంధీగారి సొంత రాష్ట్రం కదా! ఆ మాత్రం న్యాయం చేయాలి.

వేదాంతం : యుధ్ధం తర్వాత శాంతి వుండదు, మళ్ళీ యుధ్ధమే వుంటుంది.(అసెంబ్లీ యుధ్దం ముగిసింది. తర్వాత పార్లమెంటు యుధ్ధం. కాబట్టే కదా, నా వోట్లను చీల్చిన కేశూభాయ్‌ దగ్గరకు నేను గెలిచిన రోజే వెళ్ళి, స్వీట్లు తినిపించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. పార్లమెంటులో ఈ వ్యతిరేకతను కూడా తగ్గించుకోవాలి కదా!)

వృత్తి : ‘భా.జ’కీయం( అవును రాజకీయాలందు ‘భా.జ’ కీయాలు- అనగా భారతీయ జనతా రాజకీయాలు వేరు.) పార్టీ వెలుపల కన్నా పార్టీలోపల సమర్థ వంతంగా చేయగలగాలి. అప్పుడే పెద్దల తలల మీదనుంచి నడచుకుంటూ పెద్ద పోస్టుకు చేరగలం. నన్ను గుజరాత్‌లో రాజకీయ ప్రవేశం చేయించింది అద్వానీ. ముఖ్యమంత్రిగా తాను తొలగి నాకు దారి వేసింది కేశూభాయ్‌ పటేల్‌. ఇప్పుడు ఇద్దరినీ ఢీకొన్నాను. లేకుంటే ప్రధాని అభ్యర్ధిత్వం అద్వానీకి కాకుండా నాకు ఎలా వస్తుంది?)

హాబీలు :1. నా మీద వచ్చిన భారీ ఆరోపణలను కూడా, నవ్వుతూ నవ్విస్తూ తీసి వేయటం. ( నారాష్ట్రంలో స్త్రీలకు పౌష్టికాహార లోపముందేమిటీ? అని మీడియా వాళ్లడిగితే ఏం చెప్పానో తెలుసా? ‘స్లిమ్‌ గా వుండాలని డైటింగ్‌ చేస్తున్నారని’.)

2. పెరిగే వాళ్ళను పెంచటం నా హాబీ. కొంచెం ప్రోత్సాహం ఇచ్చినా పారిశ్రామిక వేత్తలు పెరుగుతారు. ఎంత ప్రోత్సాహమిస్తే మాత్రం వ్యవసాయ కూలీలు పెరుగుతారా? ఏమిటి? అందుకే కూలి రేట్లలో 20 అభివృధ్ధి చెందిన రాష్ట్రాలలోనూ నాది 14 వ స్థానంలో వుంది.

మిత్రులు : చటుక్కున కాషాయం కట్టటానికి ఎవరు ముందు కొస్తారు చెప్పండి? అందుకే శివసేన కూ, బీజేపీకి మిత్రపక్షాలు తొందరగా దొరకవు..

శత్రువులు : యాచకుడికి యాచకుడే శత్రువు. నేను పార్టీలో ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నాను. శత్రువులు ఎవరు వుంటారు సహ ‘ప్రధాని యాచకులే’!

జపించే మంత్రం : హోం..! న.మో. స్వీపాయనమ:( టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఇదే హెడ్‌ లైన్‌ పెట్టారు. చూడలేదా?)

విలాసం : ఇంత వరకూ అహ్మదాబాద్‌ నుంచి మోడీ వార్తలు విన్నారు. ఇప్పుడు… ఓవర్‌ టు ఢిల్లీ.

గురువు : ఏం చెప్పమంటారు? ఒకప్పటి గురువులే నాకు పోటీదారులయ్యారు.

జీవిత ధ్యేయం : అయోధ్య రాజధానిగా ‘హిందువుల’ దేశాన్ని పాలించటం.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 22 -28 డిశంబరు 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

 

2 comments for “‘హిందీ’త్వ మోడీ

Leave a Reply