‘హౌస్‌’ అరెస్ట్‌!

హౌస్‌ అంటే ఇల్లే కదా!

గౌరవ శాసన సభ్యులు చాలా మంది ఇలాగే అనుకుంటున్నట్లున్నారు. ‘హౌస్‌'(అసెంబ్లీ)లో కూర్చుంటే ఇంట్లో వున్నట్టే వారికి అనిపిస్తోంది. ఇష్టం వచ్చినట్టుండేదే ఇల్లు-అన్నది స్థిర పడిపోయింది.

ఆదర్శ పాలక పక్షనేత, ఆదర్శ ప్రతిపక్షనేతలో ఒకే ‘హౌస్‌’ లో వున్నట్టే ముట్టెపొగరు ఇంటాయనా, మూతివిరుపుల ఇల్లాలూ ఒకే ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ, ఇరుగుపొరుగువారికీ ఉచిత వినోదమే.

ఇద్దరి మధ్యా అన్యోన్యతా ఎప్పుడు పుట్టుకొస్తుందో తెలీదు. అది వచ్చాక క్షణం ఆగరు.

‘కట్నం చూపిస్తే కుక్కలా వెంట వచ్చావ్‌? నీదీ ఒక బతుకేనా?’ ఇంటావిడ దాడి

‘ఎందుకలా గాడిదలా అరుస్తావ్‌? నీదీ ఒక బతుకేనా?’ ఇంటాయన ప్రతి దాడి.

ఇంట్లో కలకలం. పిల్లలంతా చెరోవైపూ చేరిపోతారు. ఇరుగు పొరుగు వారు ప్రహరీ గోడల దగ్గర చెవులు రిక్కించారు. తట్టుకోలేని ఉత్కంఠ. పొరుగుంటి కూరే కాదు, గుట్టు కూడా పుల్లనే.

అనుకున్నట్టుగానే ఒకరి ఫ్యాష్‌ బ్యాకుల్లోకి ఒకరు వెళ్ళిపోతారు.

‘నీ వాళ్ళంతా దొంగకోళ్ళు పట్టే వాళ్ళు. నాకు తెలీదా?’ అంటుంది ఆ మహా ఇల్లాలు.

‘నీ వాళ్ళు బ్లాకులో టిక్కెట్లమ్ముకునే వాళ్ళు. ఏమిటి మాట్లాడతావ్‌?’ ఎదురు చెబుతాడు గొప్ప ఇంటాయన.

ఇరుగు పొరుగు వారికి బుగ్గలునొక్కుకునేటంత మహదానందం.

‘నీ తమ్ముడున్నాడు. వాడెంత దొంగో నాకు తెలీదనుకుంటున్నావా? ఏకంగా నీ జేబే కొడతాడు.’ పెళపెళ విరిచేస్తుంది పెళ్ళాం

‘మామా! మామా! అంటూ తిరిగే అదే మేనమామను వెనక నుంచి పొడిచి ఆస్తి రాయించుకోలేదా? నీ లీలలు నాకు తెలియవా?’ ఎడాపెఎడా ఏకేస్తాడు మగడు.

ఇరుగు పొరుగు వారిలో ఒకాయన ఆనందంలో వికృతనాట్యం చేశాడు. ఆయన భార్య ఎవరితోనే లేచిపోయిందట. అందుకనే ఎవరి భార్య ఎవరిని వేదించినా డుపుమంట చల్లారి, ఎంతో సేద తీరతాడు. గత ఎన్నికల్లో టిక్కెట్టు ఇవ్వనని మొండికేసిన తన పార్టీనేతను అసెంబ్లీలో తలంటుతుంటే పొందే మాజీ సభ్యుడి ఆనందం లాంటి ఆనందం అది.

‘వరకట్నం కేసు పెడితే జైల్లో కూర్చుంటావ్‌? తెలుసా?’ అంటుంది భార్యామణి

‘మామను మోసగించిన చీటింగ్‌ కేసు పెట్టి వుంటే, నువ్వూ జైల్లోనే వుండేవాడివి?’ అనేస్తాడు భర్తశిఖామణి.

ఈ చివరి సంభాషణ మాత్రం విని ఇరుగుపొరుగు వారు చప్పబడిపోయారు. గుళ్ళు చుట్టూ తిరగని వాళ్ళన్నా వున్నారేమో కానీ, జైళ్ళకు వెళ్ళి రాని వారంటూ వాళ్ళల్లో లేరు.

తన్నుకునే భార్యాభర్తల కన్నా, తామే గొప్పకాదని రుజువయ్యాక, ఇంక ఆ తన్నులాట చూడాలనిపించదు. ఈలోగా అరుగు మీద వాలు కుర్చీలో కూర్చుని, లంక చుట్ట కాలుస్తూ ఆలకించిన

పెద్దాయన (భర్త తండ్రి) గట్టిగా అరిచాడు. ‘చాలు చాల్లే! వాగుడు ఆపి చక్కబడండి. మిగిలిన తన్నులాట రేపు’ అంటాడు.

‘ది హౌస్‌ ఈజ్‌ ఎడ్జర్న్‌డ్‌..!’ అన్నప్పుడు, ‘హౌస్‌’లో అందరూ ఎలా చిత్తగిస్తారో, ఆ కుటుంబంలో భార్యా, భర్తలూ, పిల్లలూ అలా తమ గదుల్లోకి తాము వెళ్ళిపోయారు.

అందుచేత శాసన సభ్యులు ‘హౌస్‌'(శాసన సభ) ను ఇల్లుగా భావించటంలో ఏమాత్రం ఆశ్చర్యపోనవసరంలేదు.

ఇల్లన్నాక తిట్టుకోవచ్చు, కొట్టుకోవచ్చు. అలసిపోతే కునుకు తీయ వచ్చు. గుర్రు పట్ట వచ్చు. బోరు కొడితే మొబైల్‌లో సినిమాలు చూడవచ్చు (కొన్ని సభల్లో కొందరు అసభ్యమైనవి కూడా చూస్తారట? మన సభలో కాదు లెండి). ఆఫీసుల్లో, విద్యాలయాల్లో ఉపయోగించ కూడని పదజాలంతో నోరారా తిట్టుకోవచ్చు. (స్పీకర్‌ పోడియం ముందు) యోగసనాలు వేయవచ్చు. మైకులు విసర వచ్చు. బల్లలు చరచవచ్చు. లేదా బల్లలు ఎత్తవచ్చు.

ఇంత సరదాగా వుండటానికి వీలయిన ‘హౌస్‌’ ఏ సభ్యుడికి ఇష్టముండదు చెప్పండి.

ఇలా కొట్టుకుంటున్నారని, ఇది అన్యోన్యకాపురం కాదనటానికి వీలు లేదు. మరీ ‘హౌస్‌’ పీకి పందిరి వేసే (రాష్ట్రపతి పాలన) విధించే దూరాలోచన చేస్తే తప్ప, అయిదేళ్ళ కాపురానికి ఢోకా వుండదు.

కాపురమంటేనే ‘హౌస్‌’ అరెస్ట్‌!

లోపల వేసేటప్పుడే వోటరు చూసుకోవాలి- ఇద్దరు దొంగల్ని కలిపి వేస్తున్నానా? లేక ఇద్దరు దొరల్ని కలిపి వేస్తున్నానా- అని.

ఒక్కసారి వేసాక- ఇంటి పోరు వినాల్సిందే! వేరే మార్గం లేదు.

-సతీష్‌ చందర్‌

1 comment for “‘హౌస్‌’ అరెస్ట్‌!

Leave a Reply