చూసిందే చిత్రం కాదు, తలకిందులగా చూసింది కూడా చిత్రమే. అందుకేమరి. చిత్రాన్ని తియ్యటమే కాదు, చూడటం కూడా తెలియాలి. ఆలోచనలు తలకిందులు వున్నప్పుడు అన్నీ విపరీతంగా అనిపిస్తాయి. కాళ్ళతో చప్పట్లు కొడుతున్నట్లూ, చేతులతో పరుగెత్తుతున్నట్టు కూడా అనిపిస్తాయి. ఇప్పుడు దేశంలో ఈ వైవరీత్యం నడుస్తోంది.
పాపం ఆవిడెవరో దేశం కానీ దేశం నుంచి వచ్చి, మన దేశాన్ని కుదిపేసిన ‘నిర్భయ’ ఘటన మీద ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆవిడ పేరు లెస్లీ ఉడ్‌విన్. ఆవిడ తీసిన సినిమా పేరు ‘ఇండియాస్ డాటర్’ (భారతీయ తనయ). ఈ సినిమాను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ‘బిబిసి’ ప్రసారం చెయ్యాల్సి వుంది. అయితే ఈ సినిమాను నిషేధించాలంటూ, కొందరు ఆందోళనలు చేశారు. వీటికి తలవొగ్గి కేందప్రభుత్వం అన్నంత పనీ చేసేసింది. దేశంలో ఎక్కడా ప్రసారం కావటానికి వీల్లేదని చెప్పి, ఫర్మానా జారీ చేసింది. దేశంలో మీడియా సంస్థలు అవాక్కయ్యాయి. కానీ ‘బిబిసి’ మాత్రం, ఈ డాక్యుమెంటరీకి వస్తున్న విశేష స్పందన చూసి, మార్చి8 నుంచి ఓ నాలుగు రోజులు ముందుకు జరిపి మార్చి4న ప్రసారం చేసేసింది. మన దేశంలో మాత్రం ఎలక్ట్రానిక్ మీడియాలో నిషేధం అమలు జరిగింది. ఇక ఇంటర్నెట్‌లో కూడా అమలు జరపటానికి నిర్ణయం తీసుకున్నా, ఆచరణలో అది సాధ్యం కాలేదు. అప్పటికే దేశమంతటా ‘నెట్’లో ‘వైరల్'(అల్లరి) అయిపోయింది. ‘యూట్యూబ్’ మీద కూడా కేంద్రం వత్తిడి తెచ్చింది. ‘యూట్యూబ్’ కు అప్‌లోడ్ అయిన అన్ని ‘యూఆర్‌ఎల్’లోనుంచీ ఈ డాక్యుమెంటరీ ని ‘బ్లాక్’ చెయ్యటం ‘యూట్యూబ్’ కు కూడా సాధ్యం కాలేదు. దాంతో నిషేధం తర్వాత కూడా ‘నెటిజన్ల’కు ఈ చిత్రం సులభంగా లభ్యమయ్యింది.
చిత్రమేమిటంటే ఈ చిత్రాన్ని చూసి కొందరూ , చూడక కొందరూ నిషేధాన్ని కోరుతున్నారు. వీరికి అభ్యంతరంగా కనిపించినవి ‘నిర్భయ’ అత్యాచారం కేసులో నేరస్తుడుగా నిర్ధారించబడి, జైలులో వున్న ముఖేష్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. అతడు ఒక పక్క శిక్ష అనుభవిస్తూ కూడా, తానూ, తన సహచరులూ చేసిన పనికి ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా మాట్లాడాడు. ఇతని మాటల్లో ముఖ్యమైన కొన్ని:
– అత్యాచారానికి ఆమె(నిర్భయ) సహకరించి వుంటే, ఆమెకు ఆ గతి పట్టేది కాదు.
– మహిళల్లో 20 శాతం మంది మాత్రమే మంచివారు. వారు రాత్రి తొమ్మిది తర్వాత బయిటకు రారు. వచ్చినా, ‘బోయ్‌ఫ్రెండ్’తో రారు.
– ఆడవాళ్ళు వేసుకునే డ్రస్సులు సరిగా వుండటంలేదు.
ఇంత జరిగాక కూడా ఇతనిలో మార్పురాలేదంటే, ‘రేపిస్టు’ మనస్తత్వంలో లోపం వుంది. ఈ ఒక్క రేపిస్టులోనేకాదు, ఇతర ‘రేపిస్టులు’ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. అంతే కాదు, ఈ ‘రేపిస్టు’ చేసిన వ్యాఖ్యలనే గతంలో ఇంచుమించుగా, ఘనత వహించిన బాబాలూ, అధికారులూ, నేతలూ చేశారు. అంతేకాదు, ఈ డాక్యుమెంటరీలో రేపిస్టు వల్లించిన ఈ దిక్కుమాలిన నీతి సూత్రాలనే, కొందరు పేరొందిన న్యాయవాదులు కూడా వెల్లడించారు. స్త్రీ స్వీట్ లాంటింది. బహిరంగంగా వుంచితే ఏ కుక్కయినా తీసుకుపోతుందని ఒకరూ, తన కూతురే పెళ్ళికి ముందే వేరే అబ్బాయితో సంబంధం పెట్టుకుంటే, చంపేస్తానని ఇంకొక న్యాయవాదీ ఈ డాక్యుమెంటరీలో చిందులు తొక్కారు. అంటే ‘రేప్ మనస్తత్వం’ తాలూకు సామాజిక ఆర్థిక కారణాలను అన్వేషించాల్సిన అవసరం వుందనీ, ఆ కారణాలు ఎలా వున్నాయో బహిర్గతం కావాలనీ, లెస్‌లీ వుడ్‌విన్ ఈ చిత్రం తీశారు.
వీరి వాదనలతో పాటు, ‘నిర్భయ’కు సహాయపడిన వారివీ, నిర్భయ తల్లిదండ్రులవీ, మాజీ న్యాయమూర్తులవీ, పోలీసు అధికారులవీ వాదనలను రికార్డు చేశారు. ‘రేపిస్టులను’ ఉరితీసేసి, ‘రేప్ భావజాలాన్ని’ మిగుల్చుకుంటే, రేపిస్టులూ పుట్టుకుంటూనే వస్తారనే హెచ్చరిక ఈ చిత్రంలో వుంది.
లెస్‌లీ ఉడ్ విన్ మగవాడు కాదు. ఆమె కూడా ఒక స్త్రీ. మామూలు స్త్రీ కాదు. ధైర్యవంతురాలైన స్త్రీ. తాను కూడా అత్యాచారానికి గురయ్యానని ప్రకటించి మరీ పోరాడుతున్న మహిళ. అంతే కాదు, ‘నిర్భయ’ అత్యాచారానికి నిరసనగా మన దేశంలో పెల్లుబుకిన నిరసనకు స్ఫూర్తి పొంది, ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్న మహిళ. సాక్షాత్తూ, ప్రభుత్వ అనుమతితోనే జైల్లో వున్న ముఖేష్ సింగ్ తదితరులను ఇంటర్వ్యూ చేశారు. అత్యాచార సన్నివేశాన్ని నామమాత్రంగా కూడా చూపించ కుండా, కేవలం ‘రేపిస్టు సంస్కృతి’ బట్ట బయిలు చేసిన గొప్ప చిత్రం. కానీ నేడు ఆమెను అనరాని మాటలంటున్నారు. ‘కులం పోవాలీ’ అని అరచిన వాడినే ‘కులవాది’ అన్నట్లుగా, ఈ ‘రేపిస్టు సంస్కృతి పోవాలీ’ అని నినదించిన లెస్లీని ‘రేప్ మద్దతు దారు’లాగా చిత్రిస్తున్నారు. ఇది దారుణం. రేపిస్టునే కాదు, రేప్ మనస్తత్వాన్ని కూడా ఉరితీయాలని భావించే వారు, ఈ చిత్రాన్ని స్వాగతించాలి.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 7-13మార్చి2015 వ సంచికలో ప్రచురితమైన సంపాదకీయం)