(ఏదీ గొప్ప కాదు. ఏదీ వింత కాదు. అలవాటయితే అన్నీ పాతవే. అసలు అలవాటే పాతదనం. పేదరికమూ భరించగా భరించగా పాతపడిపోతుంది. వాడెవడో వీపున కొరడా తీసుకుని కొట్టుకుంటాడు- పిడికెడు మెతుకుల కోసం. వాడికి దెబ్బలు పాతపడిపోయి వుంటాయి. సన్మానాలంత పురాతనమయిపోయి వుంటాయి. కానీ వాడిని కన్నతల్లికి మాత్రం ప్రతీ దెబ్బాకొత్తదే.)
నిజ జీవితం ముందు
నిప్పు ఒక లెక్కా..?
నిద్దురలేని రాత్రిపూట
నుదుటి మీద చెయ్యి వేసినా..
బువ్వలేని నాడు
కడుపంతా తడిమి చూసినా..
సూర్యుణ్ణి తాకినట్లే..!
ఈ భూప్రపంచంలో
ఆ పనిని చెయ్యగలిగింది
అమ్మ ఒక్కతే..!
– సతీష్ చందర్
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)