అడిగింది స్టేటు! చీల్చేది వోటు!!

Sharmila-padayatraఅడిగినది ఇస్తే సహాయం. అడగినిది ఇస్తే రాజకీయం

రాష్ట్రం విషయానికి వస్తే, ఇక్కడి నుంచి వచ్చిన కోరికలు రెండు. సీమాంధ్రనుంచి ‘సమైక్యాంధ్ర’ అడిగారు. తెలంగాణ నుంచి ‘ప్రత్యేక తెలంగాణ’ అడిగారు. ఈ రెండింటిలో ఏది ఇచ్చినా ఎవరో ఒకరికి సహాయం చేశారు- అనుకోవటానికి వీలుండేది. కానీ ఆ రెండూ కాకుండా ‘రాయల తెలంగాణ’ అనేది ఇస్తామంటున్నారు. అంటే రాయల సీమలో వున్న కొన్ని జిల్లాలూ, తెలంగాణను కలిపి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. ఇది ఎవరూ అడగనిది. పనిగట్టుకుని ఈ డిమాండ్‌ కోసం ఎవరూ రోడ్లెక్కలేదు. చొక్కాలు చించుకోలేదు. బంద్‌లు చెయ్యలేదు. ప్రాణాలు తీసుకోలేదు. అయినా ‘ప్యాకేజీ’ ప్రతిపాదనతో పాటు, ‘రాయల తెలంగాణ’ను కూడా వీలుచిక్కినప్పుడెల్లా ముందుకు తెస్తున్నారంటే ఇది ఖచ్చితంగా రాజకీయం.

వైయస్‌ మృతి తర్వాత, చాలామంది వైయస్‌ గురించి బాధ పడితే, కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం వైయస్‌ వారసత్వం గురించి బెంగ పడింది. రాష్ట్రంలో అప్పటికే వైయస్‌ ప్రత్యామ్నాయ అధిష్ఠానం లాగా ఎదిగిపోయారనీ, ఆ స్థానంలో జగన్‌ వస్తే, ఆయనకు సానుభూతి తోడై అంతకు మించి ఎదిగిపోతారనీ సోనియా గాంధీకి దిగులు.( ఈ దిగులు ఆమెకు స్వయంగా పుట్టి వుండవచ్చు. లేదా కొంతమంది కాంగ్రెస్‌ నేతలే కలిగించి వుండవచ్చు.) అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం జగన్‌ అనే ఒకే వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ వచ్చింది. ఇది బహిరంగ రహస్యం. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వక పోవటమూ, స్వంతంగా పార్టీ పెట్టుకున్నాక ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద దర్యాపు సంస్థల చేత విచారణను ముమ్మరం చేయించటమూ ఒక యెత్తు .( ఎవరి మీద ఈ ఆరోపణలు వచ్చిన నిష్పాక్షికమయిన విచారణ చేయించాల్సిందే. అది వేరే విషయం.)తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోయటం మరొక యెత్తు.

నిజమే. తెలంగాణ ఉద్యమం ఈ నాటిది కాదు. రెండు ప్రాంతాలను ముడి వేసిన అయిదేళ్ళకే ‘విడిపోతామన్న’ డిమాండ్‌ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చింది. ఇది నిజంగానే ఉద్యమంగా మారింది. అయితే ఉద్యమం చేసేది ఒకరయితే, వాటి ఫలితాలను వాడుకునేది మరొకరు. అప్పుడూ, ఇప్పుడూ దాదాపు ఇదే జరుగుతోంది. అయితే అప్పుడు చెన్నా రెడ్డి లాంటి రాష్ట్ర నేత తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఈ ఉద్యమాన్ని నీరుగార్చి, కాంగ్రెస్‌లో కలిసి పోయారు. అయితే ఈ సారి పరిస్థితి భిన్నం. 2009 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ డజను స్థానాలను కూడా పొందలేని దశలో చతికిల బడి వున్నప్పుడు, ఉద్యమాన్ని విద్యార్థులు తీసుకున్నారు. ఇదే అదను అనుకుని, కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తానని ప్రకటించి, మూడు వారాలు కూడా తిరక్కుండా మాట మార్చి, ‘తెలంగాణ సెంటి మెంటు’ తీవ్రతరం కావటానికి పరోక్ష సహకారం అందించింది. మళ్ళీ ఈ సెంటిమెంటును ఉపయోగించుకుని కూలబడ్డ టీఆర్‌ఎస్‌ కొత్త జవసత్వాలు పొందింది. సీమాంధ్రకు చెందిన నేత కావటం వల్లనూ, తన తండ్రి ఎప్పుడూ ‘రెండవ ఎస్సార్సీ'( ఒక రకంగా సమైకాంధ్ర)వైపే మద్దతు చూపే నేత కావటం వల్లనూ, తెలంగాణ ప్రాంతానికి వెళ్ళటం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇది కావాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం పన్నిన పన్నాగమే.

ఆ తర్వాత ఇటు తెలంగాణ ఉద్యమంతో పాటు, సీమాంధ్రలో వచ్చిన ‘సమెక్యాంధ్ర’ డిమాండ్ల తగవును తీర్చే పేరు మీద శ్రీకృష్ణ కమిషన్‌ వేసింది. అప్పట్లో కేవలం మజ్లిస్‌ అడిగారన్న మిష మీద ‘రాయల- తెలంగాణ’ ను కూడా వారు చేసిన ఆరు ప్రతిపాదనల్లో ఒకటిగా శిఫారసు చేశారు.

ఆ శిఫారసును మాటి మాటికీ బయిటకు తీయటం వెనుక ఆంతర్యం ఒక్కటే. మరో మారు జగన్‌ను రాజకీయంగా కట్టడి చేయాలనే. రాయలసీమలో కొన్ని జిల్లాలను కలిపినా, అన్ని జిల్లాలను కలిపినా సీమ నుంచి వచ్చిన నేత జగన్‌ను ఇరకాటంలో పెట్టవచ్చనే వ్యూహమే స్పష్టంగా కనిపిస్తోంది కానీ, వెనుకబడ్డ ప్రాంతాలకు మేలు చేద్దామని చిత్త శుధ్ధి ఎక్కడా కనిపించటం లేదు.

తెలంగాణలో ఎన్ని అసెంబ్లీ ముట్టడిలూ, బంద్‌లూ జరుగతున్నా ఇటీవలి కాలంలో సీమాంధ్ర నేతలు ‘సమైక్యాంధ్ర’ నినాదాన్ని బలంగా బయిటకు తీసుకురావటం లేదు. అందుకు కారణం లేక పోలేదు. ఇప్పటికే కృష్ణా , గుంటూరు కు చెందిన కొందరు కాంగ్రెస్‌ శాసన సభ్యులు, కాంగ్రెస్‌ మదిలోని ఈ వ్యూహాన్ని బాహాటంగానే చర్చిస్తున్నారు. ఒక్క చిత్తూరు జిల్లా మినహా, మిగిలిన రాయలసీమ జిల్లాలను తెలంగాణతో కలిపి ‘రాయల తెలంగాణ’ ఇవ్వబోతున్నారన్న ప్రచారం పెద్ద యెత్తున సాగుతోంది. అలా చేస్తే జగన్‌ ‘రాయల-తెలంగాణ’ కు పరిమితం అవుతారని వారి ఊహ. ఎలాగయితేనేం ‘హైదరాబాద్‌ తో కూడిన తెలంగాణ’ వచ్చిందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను సంతృప్తి పరచి, కాంగ్రెస్‌కు దగ్గర చేసుకోవచ్చనీ, అదే విధంగా, కోస్తా ఆంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభావం తగ్గించ వచ్చని కాంగ్రెస్‌ ఆశ పడుతున్నట్టుగా కోస్తా కాంగ్రెస్‌ నేతలు కొందరు తమ ప్రయివేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. తెలంగాణను వేరుచేస్తే తాము కోస్తా ఆంధ్ర వారి ఆధిపత్యానికి బలి కావలసి వస్తుందన్న సీమ నేతలకు ‘రాయల- తెలంగాణ’ ఊరట నిస్తుందని కూడా వీరు సరిపెట్టుకుంటున్నారు.

కేవలం ఒకే ఒక వ్యక్తికి రాజకీయంగా నష్టం చేయటం కోసం, వివిధ ప్రాంతాల ప్రజల ఆకాంక్షల్ని దెబ్బతీయటం అపరాథం కాదా! ఈ మాత్రం రాజకీయాన్ని ప్రజలు అర్థం చేసుకోలేరా?!

-సతీష్ చందర్

(గ్రేట్ అంధ్రవార పత్రిక 29 జూన్- 5జూలై 2013 వతేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply