అవిశ్వాసం అరక్షణమే!

assembly‘పచ్చనోట్లిచ్చి పంచమన్నారు కదా- అని పంచేశాను. వోటేస్తారో లేదో?’

ఇది వోటరు మీద బ్రోకరుకు కలిగే అవిశ్వాసం.

‘వార్డుకు పదిలక్షలని…మొత్తం కోటి నొక్కేశాడు. వోటుకు వందయినా ఇచ్చాడోలేదో..?’

బ్రోకరు మీద అభ్యర్ధికి కలిగే అవిశ్వాసం.

‘టిక్కెట్టుకు పదికోట్లన్నానని, లెక్కెట్టుకుని పదీ ఇచ్చేసి ఎమ్మెల్యే టిక్కెట్టు పట్టుకు పోయాడు. ప్రచారానికీ, పంపిణీకి ఖర్చు పెడతాడో లేడో..?’

అభ్యర్ధి మీద నాయకుడికి కలిగే అవిశ్వాసం.

‘పార్టీకి ఫండు ఇస్తే, పవర్లోకి వచ్చాక, వెయ్యెకరాల భూమి కొలిచిచ్చేస్తానన్నాడు. ఇస్తాడో? లేదో?’

నాయకుడి మీద కార్పోరేటు వ్యాపారికొచ్చే అవిశ్వాసం.

III III III III

ఇలా ప్రజాస్వామ్యం మొత్తం సంపూర్ణ ‘అవిశ్వాసం’తోనే మొదలవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ ఎప్పటికప్పుడు ‘అవిశ్వాసం’ వీగి పోతూనే వుంటుంది. అంటే విశ్వాసమే గెలుస్తుంది.

‘కిలో రూపాయి’ బియ్యం పంపిణీ విఫలం కావచ్చు. కానీ ఎన్నికల్లో అప్రకటితంగా అమలు జరిగే ‘బీరు- బిర్యానీ’ పథకం మాత్రం ఎన్నటికీ విఫలం కాదు. చిట్టచివరి తాగుబోతు కడుపు నింపి సఫలమవుతుంది.

ఒక నీతిమంతుడు, మరొక నీతిమంతుణ్ణి నమ్మడు. కానీ, ఒక దొంగ, మరొక దొంగను నమ్ముతాడు.

‘రూపాయి లంచం తీసుకోని’ నిజాయితీ పరుడు, తనలాంటి మరోనిజాయితీ పరుడున్నాడంటే నమ్మడు. వాడి నమ్మ బుధ్ధి కాదు. అలా నమ్మితే, నిజాయితీ కారణంగా ఇన్నాళ్ళూ తాను కొట్టిన ‘పోజు’ గంగలో కలిసి పోతుందని భయం.

‘వంద కొట్టాక కానీ, వృధ్ధాప్య పించను పంపిణీ చెయ్యని’ ఫోర్‌ ట్వంటీ ఉద్యోగిని అడగండి. ‘నేనే కాదు, నాలంటి ఫోర్‌ట్వంటీ’లెందరో.!’ అని ఏ మాత్రం గర్వం లేకుండా ఒప్పుకుంటాడు.

అంచేత దొంగకి, దొంగ మీద పొరపాటున అవిశ్వాసం కలిగితే, అది క్షణికమే.

తెల్ల ధనం లావాదేవీల్లో మోసం వుంటుంది కానీ, నల్ల ధనం వ్యవహారంలో వీసమెత్తు మోసముండదు.

రూపాయి, రూపాయి పోగుచేసి, సహకార బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే, రశీదూలూ, పాస్‌ బుక్‌లూ అన్నీ ఇచ్చి, ఆనక బోర్డు తిప్పేస్తాడు. అదే ‘హవాలా’ బాబు అయిదు కోట్లిచ్చి, చెప్పిన చోట డెలివరీ చెయ్యమంటే, రూపాయి తక్కువ కాకుండా ‘పువ్వుల్లో పెట్టి’ బర్త్‌డే గిఫ్ట్‌లాగా పైన కేకూ, కింద కట్టలూ పెట్టి డెలీవరీ చేస్తాడు. ఎక్కడ సంతకాలుండవు, స్టాంపు పేపర్లుండవు, రశీదులుండవు. విశ్వాసం. నీతి మీద నీతికి లేని విశ్వాసం, అవినీతి మీద అవినీతికి వుంటుంది.

చట్ట బద్ధంగా ‘పొట్టలు ఎలా కొయ్యాలో’ సర్కారు ఖర్చు మీద చదువుకున్న వైద్యుడు, తన రోగిని మోసం చేయవచ్చు. చచ్చిపోయాడని తెలిసి కూడా ,బతికిస్తానని అబధ్దమాడి శస్త్ర చికిత్స చెయ్యవచ్చు.

కానీ వృత్తి హంతకుడు ఆ పని చెయ్యడు. చంపిపెడతానని పైసలు తీసుకుంటే, మాట తప్పడు. మోసం చెయ్యడు. కత్తి దించుతాడు. ప్రాణం తీస్తాడు.

నేరం మీద నేరానికున్న విశ్వాసం, ధర్మం మీద ధర్మానికి వుండదు.

అంతెందుకు? భర్త భార్యనీ, భార్య భర్తనీ మోసం చేసుకుంటారు. ప్రియుడు ప్రియురాలినీ, ప్రియురాలు ప్రియుణ్డీ దగా చేసుకుంటారు.

కానీ ఏ ‘సెక్స్‌ వర్కరూ’ (వేశ్య- అని అగౌరవ పరచటం ఇష్టం లేదు) విటుణ్ణి మోసగించదు. ఆ గంట జీవితమూ అతనికే అర్పిస్తుంది. అతని మీద విశ్వాసం ప్రకటిస్తుంది.

దేహం మీద దేహానికి వున్న విశ్వాసం, మనసు మీద మనసుకు వుండదు.

III III III III

లేళ్ళు లేళ్ళే. పులులు పులులే.

లేళ్ళకు తమ మీద తమకు అవిశ్వాసం. తామన్నీ కలిసి ఒక్క పులిని ఎదరించలేమన్న అవిశ్వాసం.

అంతవరకూ కలిసి తిరిగినవే. పులికనపడగానే, ఒక్కక్కటిగా విడి పోయి, దేని దారిలో అది పరుగులు తీస్తుంది.

పులికి ఒక్కతే వుండొచ్చు. సాటి పులిమీదే కాదు, తనమీద కూడా తనకు విశ్వాసం ఎక్కువ. నోరు ఒక్కటే కావచ్చు. ఎన్ని లేళ్ళనయినా తినగలను- అని అనుకుంటుంది. అది నిజం కాక పోవచ్చు. అయినా అదే గెలుస్తుంది.

పీడితులు పీడితులే, పీడకులు పీడకులే.

స్త్రీ,స్త్రీనే ఆడిపోసుకుంటుంది. పురుషుణ్ణి కాదు.

వెనుబడిన వర్గస్తుడు, వెనుకబడిన వర్గస్తుణ్ణే తప్పుపడతాడు. పెత్తందారీని కాదు.

బీద దేశాలు, బీద దేశాలనే కవ్విస్తాయి. సంప్న దేశాలను కాదు.

కారణం అవిశ్వాసం.

ఎక్కడయినా సరే, ఏరంగంలో అయినా సరే, దమ్ముల్లేని మంచితనం అవిశ్వాసంతో చస్తుంది.

పిరికివాడయిన నిజాయితీ పరుడు, ధైర్యవంతుడయిన అవినీతి పరుడుకన్నాప్రమాద కారి.

అందుకే నిజాయితీ మీద నిజాయితీకి కొండంత ధైర్యాన్నివ్వాలి, నిలువెత్తు విశ్వాసాన్ని నూరిపోయాలి. అప్పుడే ధర్మాన్ని ధర్మం రక్షిస్తుంది.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 16-313 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *