అబధ్ధం చురుకయినది. పుట్టగానే పరుగెత్తుతుంది.
నిజం సోమరి. వెళ్ళవచ్చులే- అని బధ్ధకిస్తుంది.
పుకారు కున్న స్పీడు, వార్తకు వుంటుందా? పుకారును వ్యాప్తి చేయటానికి ప్రత్యేకించి ప్రసార సాధనం అవసరం లేదు. దానంతటదే వ్యాప్తి చెందుతుంది. కానీ, వార్తకంటూ ఒక సాధనం వుండాలి.
అందుకే అంటారు మరి- ‘సత్యం చెప్పులు వేసుకునేలోగా అసత్యం లోకం చుట్టి వస్తుందని’.
కారణం మార్కెట్. అబధ్దానికున్న డిమాండ్, నిజానికి వుండదు. అబధ్ధానికి ఎదురువెళ్ళి స్వాగతిస్తారు. అసత్యవాక్కులను ఎగబడి కొంటారు.
మీకు తెలుసా? సాహిత్యంలో ‘బెస్ట్ సెల్లర్స్’ అన్నీ అబధ్ధాలు కావు కానీ, ‘అబధ్ధాలన్నీ’ బెస్ట్ సెల్లెర్సే. ఎప్పుడో కానీ, బెస్ట్ సెల్లెర్స్‌కు నోబెల్ బహుమానాలు రావు.
అబధ్ధానికి వున్న రుచి నిజానికి ఎక్కడ వుంటుందీ? ‘గాసిప్’ను సిప్ చేసినట్టు, ‘చేదు’ నిజాన్ని నోట్లో వేసుకోగలడు.
‘ పక్కింటి పంకజం అత్తయ్య, పాతికేళ్ళ కుర్రాడితో లేచిపోయిందిట? అదేం పోయే కాలమట?’ అని ఒకావిడ అంటే, ‘అవును. నేనూ విన్నాను. ఇది పోయే కాలం కాదుట! లేచి పోయేకాలమట’ అని ఇంకొకావిడ అంటూంటే జనం మొత్తం మూగిపోతారు.
ఇలా అబధ్దాలను చక్కగా ‘ట’ భాషలో మాట్లాడుతుంటే, పుకార్లను లొట్టలు వేసుకుంటూ వింటారు.
‘పంకజం కాబట్టి మొగుడితో అన్నేళ్ళు కాపురం చేసింది. తాగి వచ్చి రోజూ చిత్రహింసలు పెట్టేవాడు. రెండు సార్లు ఉరేసుకోబోయింది. మూడు సార్లు నిద్ర బిళ్ళలు మింగింది.’ మధ్యలో వచ్చి ఇలాంటి నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే, చెవి కూడా ఇవ్వరు. ఎవరికి ‘ఏమోలేమ్మా?’ అంటూ నీరసంగా వెళ్ళిపోతారు.
కాబట్టే నిజం తొందరగా కదలదు. నిలకడ మీద వస్తుంది.
అందుకే చాలా మంది పండు ముసలివాళ్ళయ్యాకనో, పదవీ విరమణ చేశాకనో, లేదా, ‘ఇక ప్రమాదం లేద’నుకున్నాకనో- నిజాలు చెబుతుంటారు.
అందుకోసం అక్కరకు వచ్చేవే ‘స్వీయ చరిత్ర’లు. కొందరు వీటిని కొందరు ‘జ్ఞాపకాలు’ అంటారు. ఇంకొందరు ‘అనుభవాలు’, ఇంకా కొందరు ‘అనుభవాలూ, జ్ఞాపకాలూ’ అని కూడా అంటారు.
మద్యం లాగా నిజాన్ని ఎంత ఊరబెడితే, అంత నిషానిస్తుంది.
కాబట్టే వృధ్దులయ్యాక ఊరబెట్టి ,ఊరబెట్టి చెప్పిన నిజాలు- మాంచి కిక్కెక్కిస్తాయి. ఊపేస్తాయి. కలవరపెడతాయి. కలతలు తెస్తాయి.
తెలుగులు పలువురు ఇలా పాత విషయాలను కొత్తగా బయిటపెట్టి, సంచలనాలను సృష్టించారు. మహాకవి శ్రీశ్రీ , హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణ దాసు వంటి వారు, తమ ‘స్వీయ చరిత్ర’ల్లో తమ తమ వ్యక్తిగత బలహీనతలతో కూడిన నిజాలను బయిట పెడితే, అందరూ నోళ్లు నొక్కుకున్నారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ‘అనుభవాలూ, జ్ఞాపకాలూ’ లో రచయితలను లోకం ఎంత నిర్దయగా చూస్తుందో చెబితే, కిక్కురు మనకుండా చదివి, తర్వాత పదేపదే పలవరించారు.
ఆ మధ్య వామపక్ష రాజకీయాలతో అనుబంధం వున్న పాత్రికేయుడు చలసాని ప్రసాదరావు ‘ఇలా మిగిలేం’ అని కమ్యూనిస్టు ప్రముఖుల వైఖరుల గురించి రాస్తే, పెద్ద పెద్ద గొడవలయ్యాయి. (అయితే స్వీయ చరిత్రలో రాసే వన్నీ నిజాలా? అంటే అదీ చెప్పలేం. కానీ నిజం చెప్పే అవకాశం అక్కడ వుంటుంది.)
జీవిత చరమాంకంలో కూడా అవిశ్రాంతంగా రాస్తున్న ‘డర్టీ ఓల్డ్ మాన్’ ఫేం కుష్యంత్ సింగ్ కూడా తన స్వీయ చరిత్రల్లో పలు మార్లు పలు పాత సంగతులను బయిట పెట్టారు. ఒక సారి ‘సెక్స్, స్కాచ్ అండ్ స్కాలర్ షిప్స్’ అనే స్వీయ చరిత్మ్రాత్మక రచనను వెలువరించారు.( ఆయన రచనకు ఏదీ నిషిధ్ధం కాదనుకోండి.) అందులో తమ కుటుంబాన్ని ‘స్కాచ్’ కుటుంబంగా పరిచయం చేసుకున్నారు. తన తల్లి వృధ్దురాలయి మరణించేటప్పుడు కూడా ‘తులసి నీళ్లు’ కాకుండా ‘స్కాచ్ నీళ్ళ’నే చివరి గుటక గా స్వీకరించందంటాడాయన.
అయితే ఈ మధ్యన ఇద్దరు మర్యాదస్తులయిన బహుళ ప్రాచుర్యం కలిగిన ఇద్దరు వృధ్దులు తమ స్వీయ చరిత్రల్ని దేశం మీద కొదిలేసి, పెద్ద దుమారం సృష్టించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ‘టర్నింగ్ పాయింట్’ అని గతాన్ని నెమరు వేస్తే, సుప్రసిధ్ద పత్రికా రచయిత, బ్రిటన్‌లో భారత మాజీ హైకమిషనర్ కులదీప్ నయర్ ‘బియాండ్ ది లైన్స్’ అంటూ ‘ఆఫ్ ది రికార్డ్’ సంగతుల్ని వెల్లడించారు.
‘ఓహో అలాగా?’ అని కొందరూ, ‘అబ్బే. అది నిజం కాదు’ అని మరి కొందరూ గిలగిల లాడుతున్నారు.
కేంద్రంలో 2004 లో సోనియా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వచ్చి ప్రధాని పదవిని చేపట్టాలని తొలుత భావించి అప్పటి రాష్ట్రపతి కలామ్‌ను కలిసాక మనసు మార్చుకుని , మన్‌మోహన్ సింగ్ పేరును ప్రతిపాదించారని- ఇప్పటి వరకూ లోకం నమ్మింది.
ఎనిమిదేళ్ళ తర్వాత ఆ నమ్మకాన్ని ‘తూచ్’ అన్నారు తన పుస్తకంలో కలామ్. ‘నేను ఆమెనే ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి ఆహ్వానించాలనుకున్నాను. ఈ మేరకు నా కార్యాలయం పత్రాలను కూడా సిధ్దం చేసుకుంది. ఆమె రాజ్యాంగ బద్ధంగా భారతీయ పౌరురాలే. ఆమె ప్రధాని కావటం పట్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆమే మనసు మార్చుకున్నారు’ అని తేల్చేశారు
‘బాబ్రీ మసీదు కూల్చుతున్నప్పుడు పీవీ ఏం చేస్తున్నారో తెలుసా? పూజలో వున్నారు. మసీదు చిట్టచివరి ఇటుక కూలినట్లు ఆయన చెవిలో చెప్పాక పూజను ముగించారు’ అని తనకు సమాచారం వున్నట్టుగా కులదీప్ నయ్యార్ రాశారు.
లాల్ బహదూర్ శాస్త్రి కూడా ‘పదవీ వ్యామోహం’ వున్న వాడే నన్న విషయాన్ని కూడా బయిట పెట్టారు.
నిజాలేనా? ఏమో? ‘ఊరించి ఊరించి, ఊరబెట్టి ఊరబెట్టి చెబుతున్నారేమో’ నిజాలకున్క కిక్కుమాత్రం కనిపిస్తుంది.
-సతీష్ చందర్
‘సర్’- నమస్తే..
‘ఊరించిన విషయానికి కిక్కేక్కువ’ అన్న మీ విరచితము మాంచికిక్కు ఇచ్చింది. వకటికి రెండుసార్లు
చదువుతుంటే..వస్తువు స్వభావాన్నిబట్టి సీనియర్ నటులు,రచయిత గొల్లపూడి మారుతీరావు చదివి వినిపిస్తున్నారా.?! అన్నట్లుగా అనుభూతికి లోనయ్యా.
పొంతన లేని ఈ వ్యాఖ్యానం ఏమిటి?అని చిరాకు పడకండే. వ్యాసము నచ్చింది.
ధన్యవాదములు.
మీ విధేయుడు —