ఎక్కవలసిన సీటు, ఒక జీవితం కాలం లేటు!

టాపు(లేని) స్టోరీ:

 

caricature: Sekhar

caricature: Sekhar

అదేమిటోకానీ, అద్వానీకి అందలం అందినట్టే అంది జారిపోతుంటుంది. ఒకప్పుడు వాజ్‌ పేయీ తన్నుకుపోతే, ఇప్పుడు మోడీ ఎత్తుకు పోయేటట్టు వున్నారు. ప్రధాని పదవే అలాంటిది. కొందరు ఎంత ఆశించినా దొరకదు. కొందరు ఆశించకపోయినా వచ్చేస్తుంది. బహుశా ఏకారణం చేతనేనేమో- మన్‌మోహన్‌ సింగ్‌ను చూస్తే, అద్వానీకి ‘అకారణం’గా కోపం వచ్చేది. ఇది గమనించిన మన్‌మోహన్‌ ఒకటి రెండు సందర్భాలలో ‘ఆయన బాధను నేను అర్థం చేసుకోగలను’ అని పైకి అనేశారు కూడా.

బీజేపీకి పార్లమెంటులో స్వంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థితి వుంటే వాజ్‌పేయీ కాకుండా, అప్పట్లో అద్వానీయే ప్రధాని అయ్యేవారు. కానీ ఇతర పార్టీల మద్దతుతో ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేయాల్సి రావటంతో అద్వానీ వెనక్కి తప్పుకోవాల్సి వచ్చింది. కారణం అద్వానీ ముఖం మీదనే ‘హిందూత్వ’ ముద్ర వుండేది. కానీ వాజ్‌ పేయీ మాత్రం లోపల ఎలాగున్నా పైకి మాత్రం ‘సెక్యులరిస్టు’లా కనిపించేవారు. దాంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఒప్పించటం సులభం అవుతుందని పార్టీ భావించింది.

ఇప్పుడు 2014 ఎన్నికలలో అద్వానీని ప్రధాని అభ్యర్థిగా అయ్యే అవకాశాన్ని, మోడీకి ఇవ్వటానికి వయసు అడ్డు వచ్చింది. అద్వానీ కురు వృధ్ధుడు. మోడీ ‘అరవయ్యేళ్ళ’ యవ్వనుడు( రాజకీయాల్లో యవ్వనం కాస్త ఆలస్యంగా వస్తుంది లెండి!) దాంతో ప్రధాని అభ్యర్థిత్వం స్థానంలోకి మోడీని తేవటాని అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు

నిజానికి భారతీయ జనతా పార్టీకి కర్త, కర్మ, క్రియ- అన్నీ అద్వానీ. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం జరిగిన ఉద్యమానికి ఆయనే కర్త. పార్టీ సంక్షోభంలో పడినప్పుడెల్లా అందరూ ఆయన చుట్టూనే చేరే వారు. (కడకు నరేంద్ర మోడీ కూడా. 2002 గుజరాత్‌ అల్లర్ల తర్వాత ముఖ్యమంత్రి పదవినుంచి మోడీని తొలగించాలన్న డిమాండ్‌ వచ్చినప్పుడు మోడీ కూడా అద్వానీనే ఆశ్రయించారు.) ఆ విధంగా ఆయన ‘కర్మ'( ‘ఖర్మ’ కాదు సుమీ!).బీజేపీ తరపున ఏమి చెయ్యాలన్నా ఆయనే. ఆవిధంగా ‘క్రియ’. అలాంటి అద్వానీని నేడు ‘నిష్క్రియా’పరుడిగా ప్రకటిస్తే ఆయన తట్టుకోగలరా?

అదే జరిగింది. గోవాలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మోడీని ప్రచార సారథిగా ఎన్నుకున్నట్టు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ప్రచార సారధి అయినంత మాత్రాన ప్రధాని అభ్యర్థిత్వం దక్కినట్టేనా? ఏమో! ‘న.మో'(నరేంద్ర మోడీ) అభిమానులకు మాత్రం అలాగే అనిపించింది. ఈ సమావేశానికి అద్వానీ గైర్హాజరు అయ్యారు.

కానీ ఆరోజు ఆయన తన ‘బ్లాగు’లో తన ఆవేదనను వెళ్ళకక్కి, మరుసటి రోజు పార్టీలోని అన్ని హోదాలకూ రాజీనామా చేశారు.

నిజానికి అద్వానీకి, మోడీకి ‘వయో’ బేధం తప్ప, సైద్ధాంతిక విభేదంలేదు. ఇద్దరూ ఒక దారిలోనే వెళ్ళారు. అద్వానీ ముదిరి మోడీ అయ్యారు. సెక్యురిస్టులిస్టు కొలమానాలతో చూస్తే ఇద్దరివీ ‘ద్వేష రాజకీయాలే’. మైనారిటీల మీద వ్యతిరేకతను పెంచి, మెజారిటీ వోట్లను మూటగట్టుకోవటమే ఇద్దరి విధానమూను. అందుకే ఇద్దరికీ రెండు ‘మచ్చ’లుండి పోయాయి. అద్వానీ ‘ఉద్యమం’ పర్యావసానంగా ‘బాబ్రీ మసీదు విధ్వంసం’ జరిగితే, మోడీ హయాంలో గుజరాత్‌ అల్లర్లు జరిగాయి. ఈ రెండూ ‘ముస్లిం పట్ల వ్యతిరేకత’కు అద్దం పట్టిన అంశాలే. కాకపోతే అద్వానీ పాకిస్తాన్‌ వెళ్ళినప్పుడు మహ్మద్‌ ఆలీ జిన్నాను పొగడివచ్చారు. బహుశా ‘ముస్లిం సోదరుల’ను ఊరడించటానికి కావచ్చు. అందుకు పార్టీ ఆయన మీద తీవ్రంగా విరుచుకు పడింది. మోడీ మాత్రం ఏమార్పూలేకుండా వుండి పోయారు. కాకుండే ముఖానికి ‘అభివృధ్ధి’ మాస్క్‌ను తగిలించుకున్నారు.

అయితే ఇద్దరి ప్రాచుర్యంలోనూ తేడా వుంది. అద్వానీకి దేశవ్యాపితంగా ఒకే జనాదరణ వుంది. కానీ ‘మోడీ’ సినిమా గుజరాత్‌లో ఎంతో సూపర్‌ హిట్టో, కర్ణాటకలో అంత సూపర్‌ ‘ఫ్లాప్‌’!

న్యూస్‌ బ్రేకులు

‘న.మోనియా’

నేను గోవా సభకు రాకపోవటానికి ఇతరుల లాగా అనారోగ్య కారణాలను చెప్పను. నాకు ఏ ‘న.మోనియా’ రాలేదు!

యశ్వంత్‌ సిన్హా, బీజేపీ సీనియర్‌ నేత

అంటే వెళ్ళిన వాళ్ళకి ‘న.మో(నరేంద్ర మోడి) నియా’ వచ్చిందనా!?

అద్వానీజీ తో ఫోన్లో మాట్లాడాను. ఆయన తన ఆశీస్సులను ఇచ్చారు.

-నరేంద్ర మోడీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి

తనంతట వ్యక్తి కావాలని ఆశీస్సులు ఇచ్చి వుండవచ్చు. అంటే ప్రధాని అభ్యర్థిత్వం కావాలంటే మోడీ కూడా 85 ఏళ్ళు వచ్చే వరకూ ఆగాలన్న మాట.

ట్విట్టోరియల్‌

భారత ‘హిట్లర్‌’ ఎవరు?

పిట్ట కథలు చెప్పటంలో కొణిజేటి రోశయ్య రికార్డును ఎవరూ కొట్టలేరు. మరీ ఆ స్థాయిలో కాకపోయినా అద్వానీ కూడా ఇలాంటి కథలు చెబుతుంటారు. సరిగ్గా మోడీ బీజేపీ ప్రచార సారథిగా ఎన్నికయిన రోజే తాను సినీనటుడు కమలహాసన్‌కు చెప్పిన పిట్ట కథ గురించి అద్వానీ తన బ్లాగులో రాశారు. కమల్‌ హాసస్‌ తీసిన ‘విశ్వరూపం’ చూపించిన తర్వాత ఈ కథ చెప్పినట్లు రాసుకున్నారు. అనగనగా ఇద్దరు నియంతలు ఒకరు: హిట్లర్‌, మరొకరు: ముస్సోలిని. ఇద్దరూ కలుసుకున్నారు. ‘(మన) పాపాలకు మనం నరకానికే వెళ్తాం. స్వర్గాని వెళ్ళం’ అన్నాడు హిట్లర్‌. ‘అలాగా నేనయితే పోప్‌ తో చెప్పించుకుని స్వర్గానికి పాస్‌ పొందుతాను’ అన్నాడు ముస్సోలిని. ‘నా గురించి కూడా పోప్‌కు శిఫారసు చెయ్యి’ అన్నాడు హిట్లర్‌. సీన్‌ కట్‌ చేస్తే, యధావిధిగా పోప్‌ స్వర్గంలోనూ, నియంతలు నరకంలోనూ వున్నారు. ఇప్పటి రాజకీయ సందర్భాన్ని బట్టి అద్వానీ తనను తాను ‘పోప్‌’ గా అభివర్ణించుకంటే, హిట్లర్‌ ఎవరో..? ఎంతోకొంత ‘నరమేధం’ చేసిన రికార్డు వుండాలి కదా!?

‘ట్వీట్‌ ఫర్‌ టాట్‌

ఫోర్‌ట్వంటీ’ల మ్యాచ్‌

పలు ట్వీట్స్‌: మన్మోహన్‌ స్వతంత్రుడు కాడు, మోడీ ప్రధాని అయితే సర్వస్వతంత్రుడు గా వుంటాడు

కౌంటర్‌ ట్వీట్‌: అవును. అవును అన్నీ ‘స్వయం'( సేవక్‌) నిర్ణయాలే తీసుకుంటాడు.

ఈ- తవిక

వోటు-వేటు

ఎమ్మెల్యేలు

ఇలా విప్‌ ధిక్కరించి

వోటేశారో లేదో,

అలా వేటు వేసేస్తారు.

అసెంబ్లీ ఆట కూడా

ట్వంటీ|- ట్వంటీ

మ్యాచ్‌ లాగే వుందే.

మ్యాచ్‌ మ్యాచ్‌ వరకేనా

ఫిక్సింగుల వరకూ వెళ్ళిందా!

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘సినిమా హీరోలు నిజజీవితంలో ఫైట్లకు కూడా డూప్‌లను పెడతారట!’

‘నిజంగా ఫైట్‌ చెయ్యలేక కాదు. విగ్గులు ఊడతాయని.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

మోడీ వచ్చి అద్వానీని వెక్కిరించినట్లు..!

-సతీష్ చందర్

(సూర్యదినపత్రిక 11-6-13 తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “ఎక్కవలసిన సీటు, ఒక జీవితం కాలం లేటు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *