‘ఎలా మాట్లాడతారో అలా రాస్తారు’

book release photo1aసతీష్‌ చందర్‌ ఎలా మాట్లాడతారో, ఆలా రాస్తారనీ, ఆయన చతురోక్తుల్లో విజ్ఞానం దాగి వుంటుందని, తెలంగాణ రిసోర్స్‌ సెంటర్‌ ఛైర్మన్‌ ఎం. వేదకుమార్‌ అన్నారు. సతీష్‌ చందర్‌ రచించిన వ్యంగ్య గ్రంథం ‘కింగ్‌మేకర్‌’ ను ఆయన 29 అక్టోబర్‌ 2013 న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్‌ లో ఆవిష్కరించారు. సతీష్‌ చందర్‌ తో తనకున్న రెండు దశాబ్దాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఏ పత్రికలో సంపాదకుడిగా పనిచేసినా, ఆ పత్రికను కొత్త పంథాలో నడిపించారన్నారు. ప్రత్యేకించి అట్టడుగు వర్గాల వేదనను ఆయన పలికిస్తారన్నారు. ఎ.పి.కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం అనే సంస్థను స్థాపించి ఇప్పటికి 1800 మంది పాత్రికేయులకు శిక్షణనిచ్చి వివిధ మీడియా సంస్థలకు పంపించారన్నారు. తన బాల్యంలో ఉపాధ్యాయుడిని ‘మాస్టర్‌’ అనే వారనీ, ఆ మాటకు ఆయన అన్ని విధాలా అర్హుడని అన్నారు.

సతీష్‌ చందర్‌ వ్యంగ్యం తాత్త్విక స్థాయిలో వుంటుందని సీనియర్‌ పాత్రికేయులు, వ్యంగ్యరచయిత ఉషా ఎస్‌.డానీ అన్నారు. చార్లీ చాప్లిన్‌ దృశ్యంలో సాధించిన వ్యంగ్యాన్ని, సతీష్‌ చందర్‌ అక్షరంలో సాధించారన్నారు. దు:ఖంలో నుంచే వస్తే తప్ప, అలాంటి వ్యంగ్యం సాధ్యం కాదని అన్నారు. కేవలం నవ్వించి వదలివేయకుండా, మనసును మెలిపెట్టే ఉద్వేగానికి గురిచేస్తారన్నారు. అంతే కాదు, వర్తమాన చరిత్రపై ఆయన అవగాహన కలగచేస్తూ, ఓ ఆర్థిక శాస్త్ర వేత్తలాగా, ఓ సామాజిక శాస్త్రవేత్తలాగా కలకాలం గుర్తుండి పోయే వ్యాఖ్యానాలు చేయటం చూస్తుంటే, ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని డానీ అభిప్రాయ పడ్డారు.

సతీష్‌ చందర్‌ వ్యంగ్యంలో గతంలో ఎవ్వరూ చెయ్యని ప్రయోగాలు చేశారనీ, ‘కింగ్‌ మేకర్‌’తో పాటు ఇంతవరకూ వెలువరించిన ఆరు వ్యంగ్యం గ్రంథాలూ, ఆరు భిన్నప్రక్రియలని ఆయా గ్రంథాలలోని కొన్ని భాగాలను ఉటంకిస్తూ సీనియర్‌ పాత్రికేయులు, వ్యంగ్య రచయిత తెలిదేవర భానుమూర్తి మాట్లాడారు. ‘మేడిన్‌ ఇండియా’లో స్వీయానుభావాల్లాగానూ, ‘ఇతిహాసం’లో రాజకీయాలనే జానపద కథల్లాగానూ, ‘చంద్రహాసం’లో గల్పికల్లాగానూ, ‘దరువు’లో కుష్వంత్‌ సింగ్‌ తరహాలో వ్యా’సంతో మొదలయి,జోక్‌ తో ముగిసే కాలమ్స్‌ లాగానూ, ‘వాలూ చూపులూ- మూతి విరుపులూ’ నాటకరచనలాగానూ రాశారన్నారు. ఇప్పుడు వెలువడిన ‘కింగ్‌ మేకర్‌’లో ‘వ్యాసాల’ రూపంలోనూ వున్నాయన్నారు. నవ్విస్తూ, నవ్విస్తూనే గాయం చేయటం, ఏడిపించటం ఆయన ప్రత్యేకత అన్నారు.

సతీష్‌ చందర్‌ వచనం భిన్నమైనదని ఆయన అన్నారు. ఇలా వ్యంగ్యపూరితమైన వచనాన్ని రాయటంలో పతంజలి తర్వాత సతీష్‌ చందర్‌ నిలుస్తారన్నారు. సతీష్‌ చందర్‌ ఆంధ్రప్రభ దినపత్రిక చీఫ్‌ ఎడిటర్‌ గావుండగా తాను రిపోర్టర్‌గా వుండే రోజులను గుర్తు తెచ్చుకున్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రగత శీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య, సతీష్‌ చందర్‌ ఈ గ్రంథంతో స్త్రీల పై వున్న ‘ఫిఫ్టీ- ఫిఫ్టీ’ అనే విభాగం నుంచి రచనల్లోని కొన్ని భాగాలను ఉటంకించారు

సభకు ఎ.పి.కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం కరస్పాండెంట్‌ ఎం. గౌరీ చందర్‌ స్వాగతం పలికారు.

-కిరీటి, ఎ.పి.కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం విద్యార్థి 

2 comments for “‘ఎలా మాట్లాడతారో అలా రాస్తారు’

  1. Yes…really….MS….stands for “MULTI…..SKILLS”……..From “KANKI” @ older days,
    to…todays….Kingmaker……..each n every one enhanced / explored/explained…..about the (MS) “Multi—Skills” of Dr MSC…..!!!..PeddiRaju!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *