ఒక గ్రాము ప్రేమ

ఏమిటో. ఇలా అనుకోవటం పాపం, అలా జరిగిపోతుంది. సరిగ్గా చిట్టి చేపను చూసి వల వేస్తుంటాడతడు. పిచ్చిచేప పిల్ల పారిపోతే బాగుండునూ అనుకుంటాను. అది అనుకున్నట్టే తుర్రుమంటుంది. అదేదో చానెల్లో లేడిపిల్లని పులి వేటాడుతుంటుంది. దగ్గరవరకూ వచ్చేస్తుంది. పులి ఆగిపోతే బాగుండుననుకుంటానా, సరిగ్గా అదే సమయానికి దాని కాలికి రాయి తగిలి బోర్లా పడుతుంది. లేడి పిల్ల తప్పుకుంటుంది. ఇలా ఎలా జరిగిపోతోంది? ఏదయినా అతీత శక్తా? అవును. దాని పేరే ప్రేమ.

ఫొటో: కిషన్ చందర్ (పమ్ము)

ఫొటో: కిషన్ చందర్ (పమ్ము)

ఆపేయవచ్చు.

చీకటినీ, చిరుత పులినీ

అరచేతితో ఆపేయవచ్చు.

అదుగో, ఆ బిడ్డ

నది మీద నావ దాటుతున్నాడు.

ఇంకాస్సేపు ఈ సంధ్య

ఇలాగే వుండిపోవాలి.

వాలి పోతున్న కనురెప్పల్ని ఆపినట్లు

కుంగుతున్న సూర్యుణ్ణి కొద్దిసేపు

అదిమిపట్ట వచ్చు.

భూగోళం తిరిగితేనే కదా

పగలు పోయి రాత్రి వచ్చేది

కమాన్, క్యాచ్

క్రికెట్ బంతిని అందుకున్నట్టు

పట్టేసి ఆపేయవచ్చు

కావాల్సిందెల్లా కాసింత ప్రేమే!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో 6-13 ఏప్రిల్ 2013 సంచికలో ప్రచురితం)

Leave a Reply