కయ్యానికి చిరు- నెయ్యానికి కెవిపి!

కేరికేచర్: బలరాం

ఏ కాంగ్రెస్‌ ను వోడిస్తానని తొడలు చరిచారో, అదే కాంగ్రెస్‌కు ద్రోహం జరుతోందని కుమిలి పోయారు. రెండు పాత్రలూ ఒకే హీరో పోషించారు. మామూలు హీరో కాదు. ‘మెగా’ హీరో చిరంజీవి. తొడలు చరిచినప్పుడు ‘ప్రజారాజ్యం’ వ్యవస్థాపకుడు. కుమిలి పోయినప్పుడు కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు. కొందరు ‘ఇక్కడి(కాంగ్రెస్‌) తిండి తిని, అక్కడి( వైయస్సార్‌ కాంగ్రెస్‌) పాట పాడుతున్నానన్నారు. ఇదే సామెతను ఆయనకు అనువుగా పేరడీ చేయవచ్చు. ‘అక్కడి( ప్రజారాజ్యం) వోటుతో గెలిచి, ఇక్కడి(కాంగ్రెస్‌) సీటులో కూర్చున్నారు’ అని.

కాంగ్రెస్‌లో ‘ప్రజారాజ్యాన్ని’ కలిపాక కూడా, కాంగ్రెస్‌లో ఒక ప్రత్యేక గ్రూపులాగా వ్యవహరిస్తూ వచ్చి ‘తమ వారికి’ పదవులు వేయించుకుంటూ వచ్చిన చిరంజీవి ఇలాంటి వ్యాఖ్య చేస్తే ఆశ్చర్యంగానే వుంటుంది. అయితే ఏమాటకా మాటే చెప్పుకోవాలి. ఆయన తన పార్టీని కాంగ్రెస్‌లో కలపక ముందు ఆయన లక్ష్యం ‘సామాజిక న్యాయం’. కాంగ్రెస్‌లో కలిపాక మాత్రం ‘సామాజిక వర్గ న్యాయం’. అప్పటి ‘సామాజిక న్యాయం’ నిర్వచనం ప్రకారం ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల’కు న్యాయం చేయటం. ఇప్పటి ‘సామాజిక వర్గ న్యాయం’ పరిధిలోకి కేవలం తన ‘సామాజిక వర్గంవారికి'(కాపులకు) మాత్రమే న్యాయం చేయటం. కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత తన కోటాలో మంత్రి పదవులు, నామినేట్‌ పదవులు పొందిన వారు ఎక్కువ మంది కాపులే. తన ప్రమేయం లేకుండా ఇటీవల సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికలలో గెలిచిన ఇద్దరు కాంగ్రెస్‌ అభ్యర్థులూ గతంలో తన పార్టీలో వున్న కాపులే. ఫలితంగా కాంగ్రెస్‌ పార్టీలో కాపులకు చిరంజీవి ‘అప్రకటిత ప్రతినిథి’ గా మారారు. అంతకు ముందు ఈ పాత్రను ఏదో మేరకు బొత్స పోషించారు. అయితే ముఖ్యమంత్రి తో ఆయనకు వచ్చిన వ్యత్యాసాల కారణంగానూ, ఎక్సైజు దాడుల కారణంగానూ ‘బొత్స’ చిన్నబోయారు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావం తర్వాత సీమాంధ్రలో ఎస్సీలతో పాటు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఆ పార్టీ వైపు వలసల బాట పట్టారు. ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్‌ నుంచి ప్రజారాజ్యం లోకి వెళ్ళిన కాపు సామాజిక వర్గం తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చింది. అంటే వెలుపలకు వెళ్ళి తమ నేతను ఎంచుకుని వచ్చినట్లయింది. ఆ మేరకు మేలు జరిగింది కానీ, ఈ కారణంగా కాంగ్రెస్‌ ఎస్సీలతో పాటు, ఇతర బీసీల మద్దతు కూడా కోల్పోయింది. సీమాంధ్రలో పలుచోట్ల కాపులకూ, ఇతర (మత్స్యకారులు, గౌడ, శెట్టి బలిజ వంటి) ఇతర కులస్తులకూ మధ్య పారంపర్యంగా రాజకీయ వైరం వుంది. దాంతో వీరు, ఇతర పార్టీలను వెతుక్కునే స్థితి వచ్చింది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు వీరంతా కాంగ్రెస్‌తోనే వున్నారు. నిజానికి జగన్మోహన రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌ స్థాపించిన తర్వాత కూడా ఈ బీసీలు అంత వేగంగా ఆ పార్టీలోకి వెళ్ళ లేదు. కానీ, చిరంజీవి నేతృత్వంలో కాంగ్రెస్‌లో కాపులు ఒక కూటమిలాగా పనిచేస్తున్నారన్న భావన కలిగినప్పటి నుంచీ ఆయా వర్గాల నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వలసలు పెరిగాయి. ఇంకా కొంత మంది తేల్చుకోలేని స్థితిలో వున్నారు. వీరికోసమే తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ‘బీసీ డిక్లరేషన్‌’ వల విసిరారు.

కేరికేచర్ :బలరాం

ఫలితంగా ‘ప్రజారాజ్యం’ విలీనం వల్ల తాత్కాలికంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌ కొంత సంఖ్యను పెంచుకోగలిగినా, పలుచోట్ల వోటు బ్యాంకును కోల్పోయింది. కేవలం కాపుల ప్రభావం ఎక్కువగా వున్న రెండు స్థానాల్లో గెలిచారు కానీ, పలుస్థానాల్లో ఓటమికి ఈ భావన కూడా పనిచేసింది. అంటే చిరంజీవి వల్ల కాంగ్రెస్‌ పార్టీకి తక్షణ ప్రయోజనమూ, శాశ్వత నష్టమూ జరిగింది.

అయితే కాంగ్రెస్‌కు ఇంకా చిరంజీవి జనాకర్షణ శక్తి మీద నమ్మకం పోలేదు. ఆయన సినీ గ్లామర్‌ ఇంకా పార్టీకి మేలు చేస్తుందనే అభిప్రాయంతో వున్నారు. అతి ఎక్కువ గ్లామర్‌ వుందనుకున్నప్పుడే ఆయనకు 18శాతం వోట్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్డీటీవీ సర్వే ప్రకారం- కేవలం ఆరు శాతం మందే చిరంజీవిని ముఖ్యమంత్రిగా ఊహించుకోగలుగుతున్నారు. వీరిలో కూడా ఆయన సినీ అభిమానులూ, ఆయన సామాజిక వర్గం వారు మాత్రమే అధికంగా వుండి వుండాలి.

చిరంజీవికి రాష్ట్రంలో పార్టీ పదవో, కేంద్రంలో మంత్రి పదవో ఇచ్చి, ఆయన సేవలు ఉపయోగించుకుంటారన్నది దాదాపు తేట తెల్లం కావటంతో, తానే అసలు సిసలయిన కాంగ్రెస్‌ వాదిగా ప్రవర్తిస్తున్నారు.

అయితే రాష్ట్రంలో ఏక కాలంలో రెండు విచిత్ర సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యం. ఒకటి: చిరంజీవి కాంగ్రెస్‌ భవిష్యత్తు గురించి బెంగపడటం. రెండు: రెండేళ్ళ తర్వాత తన నేస్తం వైయస్‌. రాజశేఖర రెడ్డిని తలచుకుని కె.వి.పి రామచంద్రరావు దు:ఖపడటం. ఈ రెండూ అత్యంత అసాధారణ సన్నివేశాలే. రెండు కాంగ్రెస్‌ అధిష్ఠానం అభీష్టం మేరకే జరిగి వుండాలి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ వృధ్ధిని అడ్డుకోవటానికి ప్రయత్నిస్తూనే మరో పక్క కేంద్రంలో యూపీయే మద్దతు కోసం ‘చేతులు’ చాచే సందర్బంలో కేవీపీ ఇలా దు:ఖించారు. కాంగ్రెస్‌ నుంచి శ్రేణులూ, నేతలూ వైయస్సార్సీలోకి వెళ్ళకుండా ఆపటం కోసం చిరంజీవి ముందు కొచ్చారు. వీరిద్దరూ కాంగ్రెస్‌ లో స్వతంత్రంగా వ్యవహరించేంతగా వేళ్ళూన లేదు. కాబట్టి ఈ రెండు పాత్రల్నీ పార్టీ అధిష్ఠానమే ఆడిస్తుందని అర్థం చేసుకోవాలి. కయ్యానికి చిరంజీవి! నెయ్యానికి కేవీపీ. ఇదీ కాంగ్రెస్‌ అంతర్నాటకం.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక లో 14 సెప్టెంబరు 2012లో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *