కవులూ.. కొన్ని ‘లవ్వు’లూ…!

కవిత్వమా? అంటే ఏమిటి?

ఆ మాత్రం కూడా తెలియదా- అని అంటారని అడగరు కానీ, చాలా మందికి ఈ ప్రశ్న వేయాలనే వుంటుంది.

ఒక వేళ నిజంగా చొరవచేసి అడిగేశారనుకోండి. చెప్పేవాడు మాత్రం ఏమి చెబుతాడు? కవి అయితే మళ్ళీ కవిత్వం మీద కవిత్వం చెబుతాడు. ‘కదిలేదీ, కదిలించేదీ, పెను నిద్దుర వదిలించేదీ’ అని అనొచ్చు. అలా అని ఏ విమర్శకుణ్టో, పరిశోధకుణ్ణో అడిగితే, ఎవరి ‘కొటేషన్నో’ చెప్పి ఊరుకుంటాడు. ‘విశ్వ శ్రేయస్సును కోరేది కావ్యం’ అనో, మరొకటి అనో చెబుతాడు.

చిత్రమేమిటంటే, కవిత్వం మీద జరిగే చాలా సభల్లో- కవిత్వం గురించి తప్ప అంతా నడుస్తుంది. లేదా ‘వాదాల’ గురించి, కవిత్వంలో వున్న ‘సామాజిక సమస్య’ గురించో మాట్లాడేస్తారు.

ప్రసంగిస్తున్న సతీష్ చందర్ తో పాటు, బి.యస్.రాములు

ఈ మధ్య ఇలాగే (మే 15 నాడు) ‘షేర్‌ ఎ బుక్‌’ అన్న స్కీము లో నన్ను ఇరికించి, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఒక సభలో’శివసాగర్‌ కవిత్వం’ మీద మాట్లాడించారు. వచ్చిన వాళ్ళల్లో పదేళ్ళ వయసు నుంచి యూభయ్యేళ్ళ వాళ్ళ వరకూ వున్నారు. అభం శుభం పిల్లలకి కవిత్వం మీద లెక్చరివ్వటం ముందు అన్యాయమనిపించింది. కానీ, ఒక్క సారి ఇప్పుడొస్తున్న సినిమాలు గుర్తొచ్చాయి. ప…ప…పదోక్లాసు కుర్రాడు, తొ..తొ..తొమ్మిదో క్లాసు కుర్రదాన్ని ప్రేమిస్తాడు. ఇవేకదా సినిమాల్లో కథలు…!?

వీళ్ళ కు ప్రేమను చెప్పగా ప్రమాదం లేనిది, కవిత్వం చెబితే ఏం ప్రమాదమని అనుకొని మొదలు పెట్టాను.

శ్రీశ్రీ కి వరసకి గురవయ్యే పెద్దాయన పేరు రోణంకి అప్పలస్వామి.

అయన్నో కుర్ర విలేఖరి కలిశాడు. ‘కవిత్వం రాయాలంటే ఏం చెయ్యాలి?’ అన్నాడు.

‘ఎవర్నయినా పిల్లను చూసి ప్రేమించెయ్‌’ అన్నాడు రోణంకి.

‘ప్రేమిస్తే ఏమవుతుంది?’

‘ఏమవుతుందా? జ్వరమొస్తుంది.’

‘ఎందుకండీ?’

‘ఎందుకేవిటయ్యా? నువ్వు ప్రేమించాలనుకో..? ఆ అమ్మాయి కనీసం హేమమాలిని లా వుండాలా?( ఇప్పుడయితే కత్రీనా కైఫ్‌ అనే వాడు లెండి?) తెలివయినదయి వుండాలా? అన్నింటినీ మంచి మనసుండాలా? ‘

‘అవునూ?’

‘ఇన్ని వుంటే, ఆమె వెంట నువ్వొక్కడవే ఎందుకు పడతావ్‌? మీ కాలనీ లో కనీసం రెండొందలు కుర్రాళ్ళు లైన్లో వుండి వుంటారు. అవునా ? కాదా?’ అని ముసలాయన అడిగేసరికి కుర్ర విలేఖరి నోరు వెళ్ళ బెట్టాడు.

అయనా సరే ముసలాయన వదలిపెట్ట లేదు.

‘ ఆ రెండు వందల మందీ దొంగలూ, నేనే మంచి వాణ్ణి- అని చెప్పటానికి ప్రయత్నిస్తావ్‌. అంతే కాదు నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావ్‌ కాబట్టి, రాత్రీ, పగలూ ఆమె గురించే పలవరిస్తావ్‌. తిండి తినవు. నీళ్ళు తాగవు. నలిగిపోతావ్‌. నరకాన్ని అనుభవిస్తావ్‌. ఈ వేదనను కాగితం మీద పెట్టి చూడు. కవిత్వం తన్ను కుంటూ వస్తుంది.’ అన్నాడు.

ఆ కుర్ర విలేఖరి లేచి వెళ్ళిపోయాడు. అప్పటికే అతనికి జబ్బు చేసినంత తీవ్రంగా జబ్బు చేసింది. ఇప్పుడు కవిత్వం కూడా చేసింది.

ప్రేమించే పిల్ల స్థానంలోకి .. ప్రపంచం వచ్చేస్తే..?

మురికి వాడలో , బూడిదలో ఆడుతూ, దిసమొలతో తిరుగుతున్న పసివాడు- నీ చేతిలో వున్న చాక్లెట్‌ చూసి పరుపరుగున వస్తుంటే… ఇలాగే చంటివాడి మీద ప్రేమలో పడతావ్‌.

మదర్‌ థెరిసా కూడా ఇలాంటి ప్రేమలో పడింది. మురికి పిల్లల్ని కూడా మనసారా హత్తుకుంది. వాళ్ళ కోసం నలిగి పోయింది. కవి కూడా అంతే..!

ఇలాంటి కబుర్లు చెప్పి నా శ్రోతల్ని నా దారికి తెచ్చుకున్నాను. తర్వాత పాపం.. ఓ గంటన్నర సేపు వారి తలలు నాకు ఇచ్చేశారు. ఏం మాట్లాడానన్నది తర్వాత ఎప్పుడయినా ఒక వ్యాసంలో…!

– సతీష్‌ చందర్‌

3 comments for “కవులూ.. కొన్ని ‘లవ్వు’లూ…!

Leave a Reply