కాంగ్రెస్‌ ‘మానియా’!

caricature:balaram

caricature:balaram

పేరు : సోనియా గాంధీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఉత్తమ మాతృమూర్తి (పిల్లల్ని ప్రయోజకుల్ని చేసిన తల్లిని ఈ దేశంలో ఇలా పిలుస్తారని తెలుసుకున్నాను. ఎంత సమయం పట్టినా సరే రాహుల్‌ గాంధీని ప్రయోజకుణ్ణి చేసి తీరతాను.)

వయసు : భారత స్వాతంత్య్రానికున్న వయసు కన్నా, నా వయసు తొమ్మిది నెలలు ఎక్కువ. అంతే.

ముద్దు పేర్లు : సో ‘నియంత’! ( నేను పార్టీలో ఎంత ప్రజాస్వామికంగా వున్నా- నియంత లా వున్నావు, నియంత లా వున్నావు- అని అంటే నాకు విసుకొచ్చి ‘సో.. నియంత నే!.. అయితే ఏమిటి?’ అని అనాలని కూడా అనిపిస్తుంది. కానీ నేను నిజంగానే ప్రజాస్వామ్యవాదిని కదా, అందుకనే అలా అనలేదు.), ‘మేనియా’ గాంధీ (వరుసగా 15 యేళ్ళ పాటు, అతి ఎక్కువ కాలం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా పనిచేయటం వల్ల, నా నాయకత్వాన్ని తప్ప, మరొకరి నాయకత్వాన్ని పార్టీ శ్రేణులు అంగీకరించలేక పోతున్నాయి. అది మేనియాగా మారిపోయింది. కడకు నా తనయుణ్ణి కదా!)

‘విద్యార్హతలు : మా అత్తయ్య ‘ఇందిరా గాంధీ’ కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివాను. పార్టీలో ఆమె ‘అమ్మ’గా ఎలా పేరు తెచ్చుకున్నారో, నేను ‘మేడమ్‌’గా అంతే పేరు తెచ్చుకున్నాను. అదీ తేడా! ‘అమ్మ’ దగ్గర చనువు వుండవచ్చు. కానీ ‘మేడమ్‌’ దగ్గర పనికి రాదు.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ‘సింపిల్‌ ఈజ్‌ స్టయిలిష్‌’ అన్నది నా నినాదం. అందుకే 2013లో ప్రపంచంలోనే అతిగొప్పవస్త్రాలంకరణ చేసుకునే 50 మందిలో నన్ను కూడా చేర్చింది ‘గార్డియన్‌’ పత్రిక.

రెండు:ఎప్పుడో కానీ 10, జనపథ్‌ వీడి బయిటకు రాను. వచ్చానంటే ఉద్యమమే. ఇటీవల రెండు సార్లు వచ్చాను. ఒకటి: నిజాయితీకి మారుపేరయిన మన్‌మోహన్‌ సింగ్‌ బొగ్గు కుంభకోణంలో అభియోగం మోపినందుకు. రెండు: రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా భూసేకరణ చట్టంలో ఎన్డీయే ప్రభుత్వం సవరణలు చేస్తున్నందుకు.

సిధ్ధాంతం : కాంగ్రెస్‌ వ్యవస్థాపనలో గాంధీ ఒకలాగా, నెహ్రూ ఒకలాగా ఆలోచించేవారు. అప్పటినుంచీ ఎవరిలాగా వారు ఆలోచించటమే కాంగ్రెస్‌ సిధ్ధాంతమయింది. అందుకే కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం వుంటుంది. కిట్టని ‘మాధ్యమాలు’ దీనిని ‘కాంగ్రెస్‌లో కుమ్ములాటలు’ అని రాస్తుంటాయి.

వృత్తి : పార్టీలో ఎవరు ఏం చెప్పినా వినటం. అంతిమంగా నా నిర్ణయం నేను తీసుకోవటం.

హాబీలు :1. పెంచటం, తుంచటం.(కేరళలో కరుణా కరన్‌, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ రాజశేఖరరెడ్డి లాంటి వారిని ఎదిగే లా చెయటం, మన మాట విననంత ఎత్తుకు ఎదిగితే మాత్రం తుంచటం.)

2. కొత్త తరాన్ని ముందుకు నెట్టి, పాతతరాన్ని కాపలా పెట్టటం. దీనివల్ల పార్టీ సుస్థిరంగా వుంటుంది. కానీ రాహుల్‌ కి నచ్చటం లేదు. అంతా కొత్త కావాలంటాడు. అలా చేస్తే దేశానికి కాంగ్రెస్‌ నిజంగానే ‘కొత్త’ది అయి పోతుంది.

అనుభవం : ఉన్నత పదవిలో వుండటం కన్నా, బయిట వుండి ఆ పదవిని నియంత్రించటంలో అసలు అధికారం వుంటుంది. (నా ఉద్దేశ్యం ప్రధాని మంత్రి పదవి కన్నా, యూపీయే చైర్‌పర్సన్‌ పదవి ముఖ్యమని కాదు.)

మిత్రులు : ‘మేడమ్‌’ కు విధేయులుంటారు కానీ, మిత్రులు వుంటారా?

శత్రువులు : నా పార్టీలో ఇప్పటికీ నాలోని ‘విదేశీయత’ చూసేవారు.

మిత్రశత్రువులు : కమ్యూనిస్టులు. అవసరం లేనప్పుడు మద్దతు ఇచ్చి, అవసరం వున్నప్పుడు జారుకుంటారు.

వేదాంతం : సేవకూ, రాజకీయానికీ స్వల్పమే తేడా. కానీ ఈ రహస్యం రాహుల్‌కు తెలియటం లేదు.

జీవిత ధ్యేయం : రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణం చెయ్యటం దగ్గర వుండి చూడటం.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 1-6 మే 2015 సంచికలో ప్రచురితం)

1 comment for “కాంగ్రెస్‌ ‘మానియా’!

  1. తల్లి మనసు ఆరాటం అంతేనండీ.. ప్రతి తన సంతానం సంతోషంగా ఉండాలనుకుంటుంది. (మొన్ననేగా మదర్స్ దే కూడా జరుపుకున్నాం.) మీరూ కొంచెం అర్ధం చేసుకోరూ..

Leave a Reply