కాకా..కేకే..కికు!

కేరికేచర్: బలరాం

ప్రవేశ పరీక్షలు రాజకీయాల్లో కూడా తప్పవు.

ఏ పార్టీ నేతయినా నేడు తెలంగాణలో ప్రవేశించాలంటే, ప్రవేశ పరీక్ష రాయాల్సిందే. ఈ పరీక్షలో ఒకే ఒక పేపరు. ఆ పేపర్లో ఒక్కటే ప్రశ్న. ‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తారా?’ అందులో సమాధానాలు రెండు: అవును, కాదు. ఈ రెంటిలో ఒక్కటే టిక్కు పెట్టాలి. అలా కాదని ఏ సమాధానం రాసినా పరీక్షలో తప్పుతారు. పరీక్ష తప్పిన వారికి ప్రవేశం వుండదు.

ఈ ప్రశ్నను తెలుగుదేశం అధినేత చంద్రబాబునడిగారు. ఆయన రెంటికీ టిక్కు పెట్టేశారు.( ఆయనది సీమాంధ్ర, తెలంగాణ రెండూ సమానమనే- రెండు కళ్ళ సిధ్ధాంతం కదా!) టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కేసీఆర్‌ ను అడిగితే అసలు ఈ పేపర్‌ తయారు చేసిందే తానని చెప్పి, ‘ప్రశ్న అడక్క ముందే నా జవాబు- అవును’ అన్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సరేసరి. సీమాంధ్రలో పార్టీ భవిష్యత్తుకు ఏనాడో నీళ్ళొదొలేసుకున్నారు కాబట్టి, ‘అవును’ అని అందరి కంటే ముందు కాకినాడలో టిక్కు పెట్టేసామన్నారు.

ఇక కమ్యూనిస్టులు. రెండు ‘కాదు’లను గుణిస్తే ఒక ‘అవును’ అన్నది సీపీఎం వారి గణితం. ‘కాదు’ అన్న దానికే టిక్కు పెడతాం, కాని ఎవరన్నా ఆఘమేఘాల మీద తెలంగాణను ఇచ్చేస్తానంటే ‘అడ్డుకోం’ అని చెప్పారు సిపిఎం రాష్ట్ర నేత రాఘవులు. ‘కోడి కూస్తానంటే నేను కాదంటానా?’ అంటూ ‘అవును’ మీదనే ‘పందెం’ కట్టారు సిపిఐ నేత నారాయణ.

‘అసలు ఈ ప్రశ్న ప్రజాస్వామికమే కానీ, సమాధానాలు రెండు వుండటం అప్రజాస్వామికం. సీమాంధ్రులు గణనీయంగా వుండే కుకట్‌పల్లి, తెలంగాణలో అంతర్బాగమా? కాదా? అది తేలాలి’. అని అనలేదు కానీ, లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్‌ నారాయణ్‌ ని అడిగి వుంటే, దాదాపు ఇలాంటి జవాబు ఇచ్చి వుండే వారు.

ఈ ప్రవేశ పరీక్ష కు వేళ మించి పోయినా, రాయటానికి రాని మరో ముఖ్యఅభ్యర్థి వుండి పోయారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి.

పార్టీ హైకమాండ్‌ ఢిల్లీలో వుండి పోవటం వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేత ఎవరో పరీక్షలను నిర్వహించిన వారికి బోధపడలేదు. ఇక్కడ అందరూ నేతలే కదా! దాంతో ప్రశ్నాపత్రాన్ని కొరియర్‌ ద్వారా గాంధీ భవన్‌ కు పంపారు. ఎంత వేగంగా ప్రశ్నా పత్రం పంపారో, అంతే వేగంగా పూరించి పంపించారు.

చిత్రం. ‘అవును’, ‘కాదు’- ఈ రెంటిలో ఏ ఒక్క సమాధానం మీదా టిక్కు పెట్టలేదు. కాకుంటే కింద వున్న ఖాళీ జాగాలో ఒకే ఒక్క సమాధానం రాసి పంపారు:

‘కాకా, కేకే, కికు’

పరీక్షల నిర్వాహకులు ముందు జుట్టు పీక్కొన్నారు. సమాధానం అడిగితే ‘క’ గుణింత రాసారేమిటని సణుగుకున్నారు. కానీ తర్వాత నిపుణులను పిలిపించి ‘డీకోడ్‌’ చేయించారు.

ఇది కేవలం ‘క’ గుణింతం కాదనీ, ‘కాంగ్రెస్‌’ గుణింతమని, నిపుణులు తేల్చారు. అంతే కాదు ఈ గుణింతాన్ని ఎలా చదవాలో కూడా చెప్పారు:

‘క’కు ఆశపెడితే ‘కాకా’; ‘క’ను ఎత్తి కుదేస్తే ‘కేకే’; ‘క’కు గోడకుర్చీ వేస్తే, ‘కికు’- ఇలా చదవాలిని సూచించారు.

ఈ మాత్రం చాలదా- కాంగ్రెస్‌లో వారెవరో పోల్చుకోవటానికి.

కాకా అంటే ‘కాకా’యే (జి.వెంకటస్వామి.). కేకే అన్నా కూడా ‘కేకే’యే (కె. కేశవరావు).

ఎటొచ్చీ ‘కికు’ అంటేనే కాస్త ఆలస్యంగా ‘బల్బు వెలుగుతుంది’. కికు- అంటే కిరణ్‌ కుమార్‌ రెడ్డి.

‘ప్రత్యేక తెలంగాణ’ మీద అభిప్రాయం చెప్పమంటే, చెప్పకుండా గాంధీ భవన్‌ వర్గాలు ఈ మూడు పేర్లనూ రాసి పంపటంలో ఆంతర్యమేమిటి?

ఇదే ప్రశ్నను అడిగినప్పుడు, తెలంగాణ మీద కాంగ్రెస్‌ లో ‘ఏకాభిప్రాయం’ లేనప్పుడు ఏం సమాధానం చెబుతామని, పేరు కూడా చెప్పుకోలేని గాంధీభవన్‌లోని ఒక ప్రతినిథి చెప్పారు

నిజమే కదా, ‘తెలంగాణ ఇచ్చేదీ మేమే, తెలంగాణ తెచ్చేదీ మేమే’ అని రాష్ట్రపతి పదవికి ఆశపడి భంగ పడ్డ కాకా ఏనాడో చెప్పేశారు.( ‘చచ్చేది మాత్రం మేమే’ అని పేద విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది వేరే విషయం.)

కేకేను ఎప్పుడు తెలుగులో అడిగి ఆయనదయిన ఆంగ్లంలో చెబుతారు. దానికి మళ్ళీ అయినే తెలుగు ‘డబ్బింగ్‌’ చెబుతారు. అయినా సరే. అర్థమయిన వాళ్ళు అరుదుగా వుంటారు. ‘తెలంగాణ సాధించుకుని తీరతామని, సాధించాలని అనుకోక ముందదే, సాధన కోసం కృషి చేస్తూ, అధిష్ఠానాన్ని ఒప్పించే విషయాన్ని సాధించాలను కున్నాం.’ ( ముక్క అర్థమయిందా? దటీజ్‌ కేకే.)

ఇక కికు ఎలియాస్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారు మాట్లాడుతూ ‘ఈ తెలంగాణ విషయం అనేది- కేంద్రం అనే ప్రభుత్వం చేతిలో వుంది. నిర్ణయం అనేదాన్ని వారే తీసుకోవాలి’ అని చక్కని కాన్వెంటులో తెలుగులో చెప్పేస్తారు.

సమాధానాలు మీముందున్నాయి. ఈ ప్రవేశ పరీక్షలో ఎవరు ఉత్తీర్ణులయ్యారో, మీరే నిర్ణయించవచ్చు.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రిక 31-3-12 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *