కులం ఉందంటే ఉంది; లేదంటే లేదు. కాలేజీ ‘ఫ్రెండ్‌షిప్పు’ల్లో ఒక్కొక్క సారి కులం నిపించదు. కానీ ప్రేమలూ, పెళ్ళిళ్ళూ వచ్చేసరికి- కులం ఎలా వచ్చేస్తుందో వచ్చేస్తుంది. అదేమి విచిత్రమో కానీ, తాను ‘ప్రేమించిన అమ్మాయిది తన కులమే- అని తేలుతుంది'( తనకులానికి చెందిన అమ్మాయి మీదనే తనకు మనసు మళ్ళింది- అని చెబితే అసహ్యంగా వుండదూ! అందుకని ఇలా అనుకోవటంలో ఓ తృప్తి వుంది)
పెళ్ళీ, పేరంటం వరకూ వచ్చిన కులం, రాజకీయం వరకూ రాకుండా వుంటుందా? రాజకీయంగా కులాలన్నీ రెండుగా చీలిపోతాయి:నడిపించే కులాలు, వెంబడించే కులాలు. డబ్బూ, దస్కం, భూమి, పుట్రా వున్న కులాలు మొదటి జాబితాలోకీ, అవేమీ పెద్దగా లేక పోయినా సంఖ్యాబలంతో తమ ఉనికిని చాటుకోవటానికి వాలును బట్టి వెళ్ళే కులాలు రెండో జాబితాలోకీ వస్తాయి. ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే ‘ధనబలం’ వున్న కులాలు ఒక వైపూ ‘జనబలం’ వున్న కులాలు మరోవైపూ వుంటాయి.
నడిపించే కులానికి ఒక్కో పార్టీ వుంటుంది.ఇప్పటి సమీకరణల ప్రకారం కమ్మవారికి తెలుగుదేశం, రెడ్లకు వైయస్సార్ కాంగ్రెస్, వెలమలకు టీఆర్‌ఎస్ లూ వున్నాయి. అయితే మళ్ళీ ఈ కులాలు జాబితా రెండు( వెంబడించే కులాల) నుంచి కొన్నింటిని వెంటబెట్టుకుంటాయి. తెలుగుదేశం ఇటీవలి కాలం వరకూ బీసీలనూ, దళితుల్లో ఒక ఉపకులాన్నీ వెంటతిప్పుకోగా, వైయస్సార్ కాంగ్రెస్ దళితుల్లో మరో ఉపకులాన్నీ, మైనారిటీలను తనవైపు మరల్చుకున్నాయి. టీఆర్‌ఎస్ పుట్టిందే ప్రాంతీయ ప్రాతిపదిక కావటంతో, వెంబడించే కులాలను ఏరుకుని వెంట తెచ్చుకునే ప్రయత్నం ఇంకా చేయలేదు.
ఎటొచ్చీ కాంగ్రెస్ పార్టీలో కులాల ఖాళీలు ఏర్పడ్డాయి. పూర్వం జాబితా ఒకటి( నడిపించే కులాల) నుంచి రెడ్లు వుండే వారు. వీరు చాలా వరకూ వై.యస్. జగన్మోహన రెడ్డి కారణంగా వైయస్సార్ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. ఈ స్థానంలోకి రావటానికి ‘కాపులు’ వచ్చారన్నది ఆ పార్టీలోని కాపు నేతల విశ్వాసం. అయితే రాష్ట్రంలో ని ‘కాపులు’ రాజకీయంగా ఏ జాబితాకు చెందుతారు. అందులో కూడా వాణిజ్య వేత్తలూ, పారిశ్రామిక వేత్తలూ గణనీయంగా వున్నారు కాబట్టి ‘నడిపించే కులాల్లో’కి వేయాలా? లేక ఇప్పటికీ కార్మికులుగా, వ్యవసాయ కూలీలుగా వారిలో అధిక శాతం వున్నారు కాబట్టి ‘వెంబడించే కులాల్లో’ వెయ్యాలా? అంతే కాదు ‘కాపులు’ పేరుతో పిలవబడే వారు ఒక ప్రాంతంలో ఆధిపత్య కులంలాగా కనిపిస్తే, మరో ప్రాంతంలో అణగారిన కులంలాగా కనిపిస్తారు.
ఆధిపత్యకులం తప్పకుండా రాజకీయ అవతారం ఎత్తుతుంది. కాపులు కూడా ఒక రాజకీయ పక్షం ఏర్పాటుకు ఎప్పటి నుంచో కృషిచేస్తున్నారు. అలా చేసిన కాపు నేతలు ఇప్పటికి నలుగురయ్యారు: వంగవీటి మోహన రంగా (కృష్ణా జిల్లా), ముద్రగడ పద్మనాభం( తూర్పుగోదావరి జిల్లా), దాసరి నారాయణ రావు(పశ్చిమగోదావరి జిల్లా), చిరంజీవి(పశ్చిమ గోదావరి జిల్లా). వీరు తమ తమ కాలాల్లో జనాకర్షక మైన కాపు నేతల్లా కనిపించారు. మొదటి ఇద్దరూ రాజకీయపక్షం ఏర్పాటు వరకూ రాలేక పోయారు. అయితే దాసరి నారాయణ రావు పార్టీ ఏర్పాటు సంకల్పం (తెలుగు తల్లి పార్టీ) వరకూ వచ్చారు. చిరంజీవి పార్టీ పెట్టారు. 18 శాతం వోట్లను సాధించారు. అయినా కాంగ్రెస్‌లో కలిపేశారు.(ఈ నేతలందరూ కృష్ణా, గోదావరి జిల్లాలవారయి వుండటం గమనార్హం. ఈ ప్రాంతంలో వీరు ఆధిపత్య కులస్తులుగా వుంటారు.) దాంతో, కాపుల రాజకీయావతారానికి మరో మారు గండి పడింది. అయతే రాష్ట్రంలో వరుసగా రెండో మారు కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత, ఆయన తనయుడు జగన్మోహన రెడ్డిని కాంగ్రెస్ వదలి వెళ్ళే వాతావరణాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సృష్టించటంతో, రెడ్డి కులస్తులలో కాంగ్రెస్ పై విశ్వాసం సన్నగిల్లింది. దాంతో మెల్లమెల్లగా వారు జగన్మోహన రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ వైపు వలసలు సాగించారు. వారు ఖాళీ చేసిన ఈ జాగాలోకి తాము రావాలని కాపునేతలు వ్యూహరచనలు చేశారు. అలా చేస్తే అప్రకటితంగా కాంగ్రెస్ కాపుల పార్టీగా మారుతుందని కూడా ఆశపడ్డారు. అలాంటి ఆశలోంచి వచ్చిందే చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం.
ఆధిపత్యకులంగా కాపుల స్వప్నం ఇలా వుంటే, అణగారిన కులంగా తమని బీసీలో చేర్చమన్న డిమాండ్ కూడా ఏక కాలంలో వచ్చింది. అయితే పలు జిల్లాలలో రాజకీయంగా ఇతర బీసీ కులస్తులు( గౌడ, మత్స్య కారులు) ఎస్సీకులస్తులూ కాపులతో వైరం కొనసాగిస్తుంటారు.( ఇటీవలనే లక్ష్మీంపేటలో దళితుల పై తూర్పు కాపులు దాడులు కూడా చేశారు.)అందుచేత, కాపులకు కాంగ్రెస్‌లో అధినాయకత్వం ఇవ్వటం వల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకొంటోంది. వెళ్ళిపోతున్న రెడ్డి కులస్తులను ఎలా నిలుపు చేసుకోవాలన్న అంశం మీద ఇంకా కసరత్తు చేస్తూనే వుంది. కుల రాజకీయాలకు ‘శుభం ‘కార్డు అంత తేలిగ్గా పడదు.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 18-26 మే 2013 సంచికలో ప్రచురితం)