‘కుట్టా’ లని వుంది!


‘కుట్టాలని వుంది.’

‘ఎవర్నీ? నన్నా?’

అనగనగా దోమ గురించో, చీమ గురించో చెబుతున్నట్టనిపిస్తుంది కదూ? కానీ కాదు. మనిషి గురించే. కాకుంటే కుట్టే మనిషి గురించి. కుట్టే మనుషులంటారా? ఉండటం ఏమిటి అదో వృత్తి. అలాగని ఏ టైలరింగో, ఎంబ్రాయిడరో అనుకునేరు. ఆ కుట్టటం వేరు. ఇంగ్లీషులో ఆలోచిస్తే ‘స్టిచ్‌’ చేయటం వేరు.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ‘స్టింగ్‌’ చెయ్యటం గురించి. ఇదీ కుట్టటమే. కాకుంటే సూది లాంటి అవయవాన్ని వాటంగా దించి, గుటుక్కున గుక్కెడు రక్తం తాగెయ్యటం. ఇలా చేసేటప్పుడు మత్తిచ్చే ఏర్పాటు కూడా వుంటుంది కాబట్టి, ఇది ‘ఆపరేషన్‌’ కిందికి కూడా వస్తుంది. వెరసి మొత్తం ప్రక్రియను ‘స్టింగ్‌ ఆపరేషన’్‌ అంటారు.

ఈ ‘కుట్టు పని’ వృత్తిగా కలిగిన వారు మీడియా వారు.

ఆ వృత్తిని చేపట్టిందే తడవుగా, ఉత్సాహంతో ఊగి పోతూ, ఎవర్నో ఒక్కరిని కుట్టేస్తానంటాడు ఒకానొక చానెల్‌ రిపోర్టర్‌. అది కూడా అడుగుతున్నదెవర్నీ అతడి మిత్రుడయిన ఒక ప్రయివేటు స్కూలు టీచర్ని.

‘నన్ను ‘స్టింగ్‌’ చేస్తే ఏ మొస్తుందీ? చుక్క నెత్తురు కూడా రాదు.’ అన్నాడా టీచర్‌.

‘ఏం? ఉన్నదంతా రక్తదానం చేశావా?’

‘ఆ ఆవకాశం కూడా ఇస్తాడా మా యజమాని? వాడంతట వాడే పీల్చేసుకున్నాడు.’

అయినా వదల్లేదు రిపోర్టర్‌.

‘అయితే ఇంకొకణ్ణి చూపించు’ అన్నాడు రిపోర్టర్‌

‘అయితే. రేపు నాతో రా. వద్దంటే వినకుండా, మా బాబు నన్ను పెళ్ళి చూపులకు తీసుకు వెళ్తున్నాడు.’

‘అక్కడ నేనెవరిని స్టింగు చెయ్యాలి?’ రిపోర్టర్‌ విసుక్కున్నాడు.

‘మా బాబుని.’ స్కూలు టీచరూ అదే రేంజ్‌లో విసుక్కున్నాడు.’ఎందుకంటావా? మా బాబు అక్కడ నన్ను బహిరంగంగా అమ్మేస్తాడు. అంటే కట్నం అడుగుతాడు. నువ్వు దర్జాగా రహస్య కెమెరాలతో కాకుండా, బహిరంగ కెమెరాలతో మా బాబు మాటల్నీ, కక్కుర్తి కనపడే హావ భావాలనీ రికార్డు చెయ్యవచ్చు. ఇంకా ఓపిక వుంటే, మా బాబు అడ్వాన్సు నొక్కే సన్నివేశాన్ని కూడా చిత్రీకరించ పచ్చు. ఆ దృశ్యాలను నువ్వు కనక మీ టీవీలో వదిలావనుకో. మా బాబు జైల్లో కూర్చుంటాడు. వరకట్నం తీసుకోవటం చట్ట రీత్యా నేరం కదా!’ అని వివరణ కూడా ఇచ్చాడు.

రిపోర్టర్‌ బిక్క ముఖం పెట్టి ‘ఈ రోజుల్లో కట్నం తీసుకోని వాడెవడ్రా?’

‘అయితే మా బాబు ను స్టింగ్‌ చెయ్యలేవన్న మాట. పోనీ, మా ముసిల్ది వుందే.. అదేరా మా బామ్మ. దాన్ని ‘కుట్టేయ్‌’!’

‘పాపం మీ బామ్మ మంచిది కదరా? నే వచ్చినప్పుడెల్లా పరమాన్నం లేక పోయినా, పులిహోరా- అయినా సరే కొసరి, కొసరి వడ్డిస్తుంది. ఆమెను ‘స్టింగ్‌’ చెయ్యటమా? కళ్ళు పోతాయ్‌!’

‘ఓహో! అది నీకు అలా కనిపించిందా? అయితే ఓ పన్జెయ్‌. ఈసారి ఆ ముసలి దయ్యం నీతల నిమురుతూ, పులిహోరా వడ్డిస్తుందే.. అప్పుడు కెమెరా ఆన్‌ చెయ్‌. ఆ తర్వాత నీ కులం పేరు చెప్పు. ఆ తర్వాత దాని చిందులు, తిట్లూ రికార్డు చెయ్యి. ఆ దృశ్యం చూపించి, దీనికి యావజ్జీవం వెయించెయ్య వచ్చు. అంటరాని తనం పాటించటం కూడా చట్ట రీత్యా నేరమే.’ స్కూల్‌ టీచర్‌ ఇలా అని రిపోర్టర్‌ వైపు వంకర గా చూశాడు.

‘ఒరేయ్‌! ఆవిడ పాతకాలం మనిషిరా?’ అన్నాడు రిపోర్టర్‌.

‘కానీ, అది ఈ కాలంలో బతికేస్తోంది. నీకు తెలీదు. దాన్నిలా ఇరికించేస్తే, పైనున్న మాతాతయ్య కూడా సంతోసిస్తాడు కూడా.’ స్కూల్‌ టీచర్‌ చిన్నగా నవ్వాడు.

‘నేను స్టింగ్‌ చేస్తానన్నది. ఇలాంటి బలహీనులను పట్టివ్వటానికి కాదు. పైగా ఈ నేరాలు అందరూ చేసేవే?’

‘నీకు బలవంతులు కావాలా? అయితే పక్క వీధిలో మా మేనత్త వుంది. కరణం మల్లీశ్వరితో కలిసి చదువుకుంది. కోపం వస్తే మా మావయ్యను ఎత్తి అవతల పారేస్తుంది. ఆమెకు కూతురు ఒక్కతె వుంది. దాన్ని నాకు కట్టి పారెయ్యాలని చూస్తుంది. కానీ, అంతబలవంతురాలూ ఒక నేరం చేస్తుంది. వాళ్ళింట్లో పనివాడు జబ్బు చేసి చనిపోతే, అతడి కూతుర్ని పెంచుకుంటుంది. ఆ అమ్మాయికి ఏడేళ్ళు కూడా లేవు. ఇంటి పనులు చేయించేస్తుంది. నేరం కదా! స్టింగ్‌ చేసెయ్‌! పీడ విరగడయిపోతుంది.’

‘అదుగో మళ్ళీ అలాంటిదే చెబుతున్నావ్‌. అయినా స్టింగ్‌ వున్నది మనవాళ్ళను పట్టివ్వటానికి కాదురా?’ అన్నాడు విలేకరి.

‘అదో నీతి వుందన్నమాట. అర్థమయ్యింది. అయిన వాళ్ళను కాకుండా, కాని వాళ్ళను పట్టించెయ్యటం. అంతే కదా! అయితే, నాకో బ్రహ్మాండమయిన ఐడియా వుంది. ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా! రేపు మన ఎగస్పార్టీ వాళ్ళ బహిరంగ సభ వుంది. లారీల్లో జనాన్ని తోలుకు వెళ్తారు. మనిషికి రోజు కూలి రెండు వందలన్నా ఇస్తారు. మనమిద్దరమూ కూలి వేషాలు కట్టి లారీ ఎక్కేద్దాం. ప్రతి లారీలోనూ ఒక కార్యకర్త పైసల్తో ఎక్కుతాడు. కూలిపేటలో వుండే కార్యకర్తను చూసుకుందాం మనం. నాకు రెండొందలు అతడు ఇస్తుంటే, నేను పుచ్చుకుంటాను. నువ్వు వీడియో తీస్తావ్‌? టీవీలో వేస్తావ్‌?’ అన్నాడు స్కూల్‌ టీచర్‌.

‘ఏడిసినట్టుంది ఐడియా. అలా చేస్తే, అసలు పార్టీవాళ్ళెవరూ ఇరుక్కోరు. ఈ కూలిపేట కార్యకర్తే దొరుకుతాడు. అలాంటి కార్యకర్తలు అన్ని పార్టీల్లోనూ వుంటారు. ఇతని ఒక్కణ్ణే పట్టివ్వటం అన్యాయం.’

‘కాదు. న్యాయం. పార్టీ విరాళంగా అందరూ తీసుకున్నట్టే బీజేపీ జాతీయాధ్యక్షుడిగా వున్న బంగారు లక్ష్మణ్‌ కూడా తీసుకున్నారేమో. నేరం ఎవరు చేసినా నేరమే. దొరికేట్టు చెయ్యటం ఇంకా పెద్దనేరం. లక్షల కోట్లు కాక పోవచ్చు. కేవలం లక్షరూపాయిలే కావచ్చు. లక్ష పైసలే కావచ్చు. చట్టం పట్టేస్తుంది. బలహీనుణ్ణి సులభంగా పట్టేస్తుంది. నీకు తెలుసు చట్టం తన పనిని తాను చేసుకు పోవటం అంటే ఇదే.’

-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 29-4-12 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *