‘తెచ్చేదీ మేమే, ఇచ్చేదీ మేమే’
‘చిచ్చుపెట్టేదీ మేమే. చల్లార్చేదీ మేమే.’
‘ప్రశ్నవేసేదీ మేమే. బదులిచ్చేదీ మేమే’
‘ఆందోళనలు చేసేదీ మేమే. అరెస్టులు చేసేదీ మేమే’
‘జాప్యం చేసేదీ మేమే, బలిదానం అయ్యేదీ మేమే’
‘ప్రతిపక్షమూ మేమే, పాలక పక్షమూ మేమే’
అంతా నేనే, సర్వమూ నేనే- అన్న గీతోపదేశంలా వుంది కదూ! కాంగ్రెస్ అధికారంలో వుంటే ప్రతిపక్షానికి పనేమీ వుండదని- అనాదిగా ఓ నమ్మకం స్థిరపడిపోయింది. కేంద్రంలో ఏమో కానీ, రాష్ట్రంలో మాత్రం గత మూడేళ్ళుగా ఆ నమ్మకాన్ని స్థిరపరచే పరిణామాలే వరసగా జరిగిపోయాయి.
కాంగ్రెస్‌లో అన్నీ వుంటాయి. అయితే కాంగ్రెస్‌లో వున్న ప్రతిపక్షాన్ని ప్రతిపక్షం అని పిలవకుండా, అసమ్మతి పక్షం అని పిలుస్తారు. ఇతరులు కాంగ్రెస్ ను ఆక్షేపించకుండా చూసే బాధ్యత వీరిది. అందుకనే ప్రతి చిన్న విషయానికీ ముఖ్యమంత్రి స్థానంలో వున్న వారినీ, ఆయన ‘కోటరీ’నీ వీలున్నప్పుడెల్లా గిల్లుతూ వుంటారు.
దశాబ్దాల క్రితమూ ఇలాగే జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది. ఇప్పటి కథనే ‘కట్టె-కొట్టె- తెచ్చె’ లాగా చెప్పుకోవచ్చు. ( ఈ మూడు ముక్కల్లో కూడా నాయకుడి పాత్రే తప్ప, ప్రతి లేదా ప్రతి పక్ష నాయకుడి పాత్రలేదు గమనించారా?)
ఒకప్పుడు అసమ్మతి నేత. అధిష్ఠానం ఆశీస్సులతో నేతగా మారాడు. ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. చూస్తూ చూస్తూ వుండగానే ‘మహానేత’ గా మారిపోయాడు. అంతవరకూ అందరికీ బాగానే అనిపించింది. కానీ పార్టీ అధిష్ఠానానికి నచ్చలేదు. ఈ ‘మహానేత’ అన్న పదమే చికాకుగా అనిపించింది. అంటే తనతో సమానమనో, తనకన్నా మించిన వ్యక్తి అనో అనిపించింది. అయినా అధిష్ఠానం వెంటనే చేయగలిగిందేమీ లేదు. రెండో దఫా కూడా కాంగ్రెస్ రాష్ట్రంలో గెలవటానికి కారణం తానే అని ఆ ‘మహానేత’ బహిరంగంగా సంకేతాలతో పాటు, భారీ సంఖ్యలో ఎం.పీలను కూడా కేంద్రానికి పంపిచారు. ఇక అధిష్ఠానం తనకున్న బాధనంతా కడుపులోనే వుంచుకోవాల్సి వచ్చింది. అయితే దురదృష్ట వశాత్తూ, ‘మహానేత’ అనబడే నేత మరణించారు. ‘మహానేత’ చెప్పుల్లో ‘మినీనేత'( అప్పటికి ‘మినీ’యే లెండి. ఇప్పుడయితే ఆయనకూడా ‘మాక్సీ’ నేత అయిపోయారు) కాళ్ళు పెట్టాలనుకున్నారు. అధిష్ఠానానికి భయం పదింతలయ్యింది. ఇతను కూడా ‘మహానేత’ లా ముదిరిపోతాడేమోనని. ‘మినీనేత’ను దూరంపెట్టారు. ‘మినీ నేత’ ఊరుకుంటారా? ‘ఇంతింతయి, వటుడింతయిన్నట్లు’ ఎదిగిపోయి పార్టీ పెట్టేశాడు. తండ్రి పై సానుభూతి రాష్ట్ర మంతటా నిండిపోయింది. దాని మీదే మొత్తం రాజకీయం నడిపించేస్తున్నాడు మినీ నేత. రాష్ట్రంలో సగభాగంలోనయినా ఇతనిని అడ్డుకునే పథకం వేశారు. అప్పటికే మంద్ర స్థాయిలో రగులుతున్న తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోశారు. ఇస్తానని ప్రకటించి, వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ సైతం రెండుగా చీలిపోయింది. అదుగో అప్పటి నుంచి మొదలు పెట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు- ‘తెచ్చేదీ మేమే, ఇచ్చేదీ మేమే’ అని. మూడేళ్ళు దాటిపోయింది. మళ్ళీ అదే మాట. ‘మినీనేత’ చొరబడ్డ సగభాగాన్ని కూడా సగానికి సగం చేసేస్తే ఎలా వుంటుంది? ఈ ఆలోచనలోంచే ‘రాయల- తెలంగాణ’ వచ్చింది. రాయల సీమ జిల్లాలను తెలంగాణలో కలిపేస్తే, ‘మినీనేత’ మరో మారు ఇరుక్కు పోతాడు. ‘చీల్చేదీ మేమే- తేల్చేదీ మేమే’ అని అందుకే కాంగ్రెస్ నేతలు శపథాలు చేస్తున్నారు. ఇదే ‘హస్తం’ పైకి చూపించి ఆ పార్టీ అధిష్ఠానం చెప్పిస్తున్న భగవద్గీత.
న్యూస్ బ్రేకులు
కాంగ్రెస్ క్యాలెండర్
రాష్ట్రపరిస్థితుల పై కేంద్రం త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటుంది
-దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి.
త్వరలో అంటే.. ఏడాదా? వారమా?
రాష్ట్రాన్ని ఐక్యంగా వుంచాలనే కోరాం
-శైలజా నాథ్ , సమైక్యాంధ్ర కాంగ్రెస్ నేత
కాంగ్రెస్‌ను ఐక్యంగా వుంచాలని కోరే వారే లేరు.
ట్విట్టోరియల్
పావుగంటలో ప్రపంచ ఖ్యాతి
కేంద్రంలో టూరిజంగా మంత్రిగా వున్నదీ తెలుగువాడే. జాతీయ ప్రకృతి బీభత్సాల సంస్థ ను నిర్వహిస్తున్నదీ తెలుగువాడే. అయినా సరే. చార్‌ధామ్‌లో తెలుగు యాత్రికులూ, పర్యాటకులూ అష్ట కష్టాలు పడుతున్నారు. వారి జాడ తెలీక పడుతున్నారు. ఈ ఇద్దరు తెలుగు వారూ మాత్రం ‘సానుభూతి’ ని కురిపించే ప్రకటనలతో సరిపుచ్చుతున్నారు. చిత్రమేమిటంటే ఈ ఇద్దరు తెలుగువారికీ ఇంత వరకూ రాని ఖ్యాతి, ఒక్క రోజులో, ఒక్క పావుగంటలో మరో ఇద్దరు తెలుగువారికి వచ్చేసింది. వారే విహెచ్. హనుమంతరావు, రమేష్ రాథోడ్‌లు. వీరిద్దరూ కూడా జాడ తెలీని తెలుగువారికోసం తపించలేదు. అప్పటికే రక్షింపబడి డెహరాడూన్ విమానాశ్రయానికి రప్పించబడ్డ వారిని, తిరిగి రక్షించటం కోసం ‘కుస్తీలు’ పట్టుకున్నారు. అక్కడినుంచి సొంత రాష్ట్రానికి తీసుకురావటాని తమ తమ విమానాల్లో ఎక్కాలని పోరాటానికి దిగి ఖ్యాతినార్జించారు. రాష్ట్రంలో ఎవరికీ ఆలోచనరాలేదు కానీ, అక్కడనుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరిన ‘రక్షితులను’ మరో మారు రక్షించి హైదరాబాద్‌లోని తమ స్వంత కాలనీలకు చేర్చేందుకు ఏర్పాటు చేస్తే వారు కూడా ‘రక్షకుల్లా’ పోజు కొట్టటానికి వీలుండేది.
‘ట్వీట్ ఫర్ టాట్
వెయ్ళేళ్ళ యువకుడు
పలుట్వీట్స్: నెల్సన్ మండేలా నూరేళ్ళూ బతకాలి.
కౌంటర్‌ట్వీట్: వద్దన్నా ఆయన విశ్వచరితలో మరో వెయ్యేళ్ళు బతుకుతారు.
ఈ- తవిక
వాపు
వాపుకీ
బలుపుకీ
తేడా ఏమిటో- అని ప్రశ్నిస్తే,
తెలుగు సినిమాకీ
ప్రపంచ సినిమాకీ
వున్నంత తేడా
అని చెప్పాల్సి వస్తుంది.
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘ఇద్దరు ‘గే’ లమధ్య వివాహాన్ని ఇతర దేశాల్లో అనుమతిస్తున్నారు.’
‘మనం ఇంకా ముందున్నాం. మనిషికీ,మృగానికీమధ్య పెళ్ళికి అనుమతిస్తున్నాం. లేకుంటే ఈ వరకట్న హత్యలేమిటి. చెప్పండి? ‘
కొట్టేశాన్( కొటేషన్):
ఓడిన వాడు ఒక్కసారి ఏడుస్తాడు. గెలిచిన వాడు రెండు సార్లు ఏడుస్తాడు. (రాష్ట్రంలో 2009లో గెలిచిన పార్టీని చూస్తున్నారు కదా!)
-సతీష్ చందర్
(సూర్యదినపత్రిక 2 జూలై 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)
Top secret..There is a Under standing between KCR…,KK,,and dog Vijay singh that….KK..will be first CM..of Telangana State…,KCR…will be First Governer of Separate ..ANDHRA state
అంతా కాం’గ్రీసు’ మాయ
సతీష్ గారూ! చిన్న విన్నపం. మీ తపాలను “తెలుగు అక్షరాలు” బృందంలోనూ పెట్టండి.