అంతా ముందే. తర్వాత ఏమీ వుండదు. పెళ్ళికి ముందే, బాజాలయినా, భజంతీలయినా. పెళ్ళయ్యాక ఏమి మిగులుతాయి? ఎంగిలి విస్తళ్ళు తప్ప. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా పెళ్ళిళ్ళు లాంటివే. ఎన్నికలకు ముందే హడావిడి. అయ్యాక ఏమీ వుండదు.
కేలండర్ దాటితే( 2013 పోయి 2014 వస్తే) రెండు మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలే. అప్పుడు ఏమి మిగులుతాయి? వెలిసిపోయిన పోస్టర్లూ, హోర్డింగులూ మినహా. హడావిడి అంతా, ఎన్నికలకు ముందు సంవత్సరమే. అందుకే 2013 అంతా చప్పుడుతో గడిచింది.
‘ఖద్దరు’ సేన కిది రాహుల్ నామ సంవత్సరమయితే, ‘కాషాయ’ దళానికి మోడీ నామ సంవత్సరం. ప్రధాని అభ్యర్థులు ఖరారయ్యారు. రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీలో పోటీ ఎవ్వరూ లేరు.(ఉన్నా రారు కూడా.) కానీ, బీజేపీలో మాత్రం మోడీకి పోటీ వచ్చారు. సాక్షాత్తూ, గురువూ, కురువృధ్ధుడూ అద్వానీయే పోటీకి వచ్చారు. పాపం అద్వానీ! ఆయనకు ఎప్పుడూ అంతే. ‘ఆయన ఎక్కవలసిన ప్రధాని సీటు, ఎప్పుడూ ఒక పదవీ కాలం లేటు’. ఒకప్పుడు ఆయనకు వాజ్ పేయీ అడ్డువచ్చారు. కారణం అప్పుడు అద్వానీ ‘మత వాది’. వాజ్‌పేయీ సెక్యులరిస్టు. ఇప్పుడు మోడీ మతవాది, అద్వానీ సెక్యులరిస్టు. (నిజానికి అద్వానీ అంతటి సెక్యులరిస్టుగా మార లేదు, కానీ మోడీ తనను మించిన మత వాది అయ్యే సరికి, బీజేపీకి అలా కనిపించాడు.) అందుకే, ముందుగా అద్వానీ అలిగినా, తర్వాత మర్యాదగా తప్పుకుని మోడీకి దారివ్వాల్సి వచ్చింది.
యూపీయే-2 సర్కారుకి ఒంటినిండా ‘మరకలే’. (కడకు ‘బొగ్గు’ మసి ‘మిస్టర్ క్లీన్’ అయిన మన్‌మోహన్ సింగ్‌కు కూడా అంటుకుంది.) దాంతో ఆ సర్కారు మీద వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. కానీ ప్రధాని రాహుల్‌ని ‘అవినీతి వ్యతిరేక’ ఉద్యమ యోధుడి గా చూపించాలని, లోక్‌పాల్ బిల్లు ఆమోదపు ఖ్యాతిని పార్టీని ఆయన ఖాతాలో వేశారు. మోడీ విషయంలోనూ అంతే, ఆయన మీదవున్న ‘హిందూత్వ’ మత వాద ముద్రను తీసివేసి ‘అభివృధ్ధి’ ముద్రను పార్టీ వేయటానికి ప్రయత్నించింది. ఇద్దరికీ అసలు ముఖాలు వేరు. వేసుకున్న ‘మాస్క్’లు వేరు. ఏ ‘మాస్క్’కు పట్టం కడతారో అని అనుమాన పడేలోపుగానే, ఏడాడి ముగిసేలోగా, అయిదు రాష్ట్రాల( మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, మిజోరాం, ఢిల్లీ)కు ఎన్నికలు జరిగి ముఖాలు తొడుగులు సగం ఊడిపోయాయి.
ఒక్క రాష్ట్రం(మిజోరాం) మినహా, మిగిలిన అన్ని రాష్ట్రాలలోనూ ఓడిపోయినందుకు రాహుల్ బహిరంగంగా దు:ఖిస్తే, మూడు రాష్ట్రాలలో గెలిచి కూడా మోడీ రహస్యంగా దు:ఖించారు. ఈ ఎన్నికల్లో ఒకే ఒక్కడు రహస్యంగానూ, బహిరంగంగానూ ఆనందించాడు. అతడే అరవింద్ కేజ్రీవాల్. కాంగ్రెస్‌ను కాదని, బీజేపీ వైపు పోలేక, ఢిల్లీ జనం కేజ్రీవాల్ వైపు చూశారు. ఈ చిన్న ‘క్లూ’ చాలు.2014 సార్వత్రిక ఎన్నికలలో గెలుపు, ఓటములు ఎలా వుంటాయో ఊహించటానికి. కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంతా బీజేపీకి అనుకూలతగా మారదని తేలిపోయింది. రెంటికీ మధ్యస్తంగా ఎంత చిన్న ప్రత్యామ్నాయం వున్నా, వోటరు దాని వైపు మొగ్గు చూపుతారు. నేడు ఇలాంటి ప్రత్యామ్నాయాలకు దేశంలో లోటు లేదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో చిన్న పార్టీలూ, ప్రాంతీయ పార్టీలూ సిధ్ధంగానే వున్నాయి. రెండు జాతీయ పార్టీల మీద విసుగుతో, జనం వీటి వైపు చూసే అవకాశం వుందని కేజ్రీవాల్ నిరూపించారు. ‘నెలలు నిండని ఆద్మీపార్టీని’ చూపించే, ఆయన రెండు జాతీయ పార్టీలకూ ముచ్చెమట్లు పోయించారు.
ఇక బీజేపీ గెలిచిన రాష్ట్రాలలో కూడా, స్థానిక నేతల ముఖం చూసే వేశారు కానీ, మోడీని మాత్రమే చూసి కాదని నిరూపణ అయింది. దీంతో ‘మోడీ’ మార్కు ‘అభివృధ్ధి’ కి పెద్దగా మార్కెట్‌లేదని తేలిపోయింది. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటానికి ముందు, ప్రచార సారధిగా ప్రకటించిన నాటి నుండే దేశంలో రెండు రకాల అభివృధ్ధి మోడల్స్ చర్చకు వచ్చాయి. ఒకటి ‘గుజరాత్’ మోడల్; మరొకటి ‘బీహార్’ మోడల్. మొదటిది విహితాభివృధ్ధి(ఎక్స్‌క్లూజివ్ గ్రోత్); రెండవది సహితాభివృధ్ధి( ఇన్‌క్లూజివ్ గ్రోత్). కానీ దేశంలో నగర మధ్యతరగతి యువతరం మోడీ మార్కు ‘గుజరాత్’ మోడల్‌నే మోసుకు తిరిగింది. ‘సోషల్ మీడియా నెట్‌వర్క్’ నిండా ఈ మోడలే మోతెక్కి పోయింది. కానీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ లాంటి వారూ, గ్రామీణ యువకులూ ‘బీహార్ ‘ మోడల్‌ను కొనియాడారు.
మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లలో మరోమారు విజయం సాధించిన ముఖ్యమంత్రులు (శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌లు) ‘సహితాభివృధ్ధి’నే నమ్ముకున్నారు. కేవలం నగర మధ్య తరగతి వర్గాన్నే కాకుండా, గ్రామాల్లో వుండే పేదా, సాదా వర్గాలకు సైతం అభివృద్ధి ఫలాలను అందించే విధంగా వారు చేసిన కృషికి ఆ రాష్ట్రాలలో ప్రజలు గుర్తించి, వారికి పట్టం కట్టారు. అక్కడ ‘మోడీ మేజిక్’ కన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రుల ‘ఇన్‌క్లూజివ్ లాజిక్కే’ పనిచేసిందని, కడకు మోడీకూడా ఒప్పుకున్నారు. కేవలం తన గుజరాత్ మోడల్‌నే కాకుండా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మోడల్‌ను కూడా తన ప్రసంగాల్లో మోడీ మోసుకు తిరుగుతున్నారు. సారంలో చౌహాన్ మోడలే, నితిష్ మోడలే.
ఆ రకంగా 2013 వ సంవత్సరం జాతీయ రాజకీయాల్లో ఎవరికి చెప్పాల్సిన పాఠం వారికి చెప్పేసింది.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 28 డిశంబరు 2013- 3జనవరి 2014 సంచికలో ప్రచురితం)