కొయ్య గుర్రానికి కొత్త రౌతులు!

మొదలయ్యింది.

ఆట మొదలయ్యింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆట మొదలయ్యింది.

ఈ ఆట పేరు ఇల్లు చక్కబెట్టుకోవటం.

అవును. నేడు కాంగ్రెస్‌కు దేశమంతా ఒక యెత్తు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒక్కటీ ఒక యెత్తు. లేకుంటే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరడజను రాష్ట్రాలను సైతం పెద్దగా పట్టించుకోకుండా, ఈ రాష్ట్రం మీద, ఇంతగా దృష్టి సారించదు.

ఇందుకు మొదటి సంకేతం: కేంద్రమంత్రి వర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు పెరిగిన ప్రాతినిథ్యం. ఇంచుమించు రాష్ట్రం నుంచి ఎన్నికయిన కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యుల్లో, ప్రతి ముగ్గురులోనూ ఒకరికి స్థానం లభించింది. మొత్తం మంత్రిపదవులు సంఖ్య పదికి చేరింది. ఇది పైకి కనిపించే అతి మామూలు కాకి లెక్క.

ఈ లెక్కలోపలి లెక్క వుంది. ఇప్పుడు తాజాగా చేసిన మంత్రుల ఎంపిక లోనూ, కీలకమైన శాఖ నుంచి జైపాల్‌ రెడ్డిని తప్పించిన తీరులోనూ ఒక వ్యూహం కళ్ళముందు కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ ‘పాదయాత్రికుడు’ చిరంజీవి

ఒక పక్క షర్మిల, మరొక పక్క బాబుల పాద యాత్రలు జరిగిపోతున్నాయి. ఊహించినట్టే షర్మిలకు పెద్ద యెత్తునా, పెద్దగా ఆశించకపోయినా బాబు కు సైతం ఒక మోస్తరు గానూ జనం వస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ‘పల్లె బాట’కు సమూహాలు ఎలా వున్నా, వివాదాలు వస్తున్నాయి. ( ఇటీవల మెదక్‌లో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో వచ్చిన స్ఫర్థ అలాంటిదే). ఎగబడి చూడాలనిపించే నేతలు నేడు రాష్ట్ర కాంగ్రెస్‌లో కరవయ్యారు. ఒక స్థాయిలో వుంటే, గింటే – ఆ అవకాశం చిరంజీవికే వుండాలి. ఎంతకాదన్నా ఆయనకున్న సినిమా గ్లామర్‌ జనాన్ని రప్పిస్తుంది. కాబట్టి ఎంతగానో కేంద్రంలో బెర్త్‌ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు ‘కేబినెట్‌ హోదా’ గల పర్యాటక శాఖనిచ్చి కాంగ్రెస్‌ తనకు అవసరమయిన వేళకు మాత్రమే సత్కరించింది.

అయితే కాంగ్రెస్‌వైపే ఎక్కువ మొగ్గుచూపుతున్న కాపు సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించటంలో కూడా ఈయన నియామకం ఒక భాగమనే వాదన కూడా వుంది. అది కూడా కొంత వాస్తవం కావచ్చు కాని, ఇప్పుడున్న స్థితిలో మాత్రం చిరంజీవికి ఈ పదవినిచ్చింది కేవలం అధికార హోదాలో దేశాన్ని ‘పర్యటించ’మని మాత్రమే కాదు, తనకున్న గ్లామర్‌తో ‘రాష్ట్రాన్ని’ పర్యటించమని కూడా.

 

‘కిరణా’నికి గుడ్‌ బై!

నేడుమారుస్తారు, రేపు తీసేస్తారు-అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మార్పు గురించి ఎప్పటి నుంచో పుకార్లు నడుస్తున్నాయి. అయితే ఈ విషయంలో కూడా నిర్ణయం తీసుకునే రాజకీయ సందర్భం కూడా రానే వచ్చింది. కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలన తన సొంత పార్టీ అధిష్ఠానానికి మోదాన్నీ, తన సొంత రాష్ట్ర ప్రజలకు ఖేదాన్నీ మిగిల్చాయి. అధిష్ఠానానికి దాదాపు వ్యక్తిగత శత్రువుగా మారిన వై.యస్‌ జగన్మోహన రెడ్డి పైనా, ఆయన అనుయాయుల పైనా కేసులు నడిచి, వారుకు జైలు కు వెళ్ళిన నేపథ్యంలో శాంతి భద్రతలను అదుపులో వుంచటంలోనూ, తెలంగాణ వాదులు నిర్వహించిన సకల జనుల సమ్మె, మిలియన్‌ మార్చ్‌, తెలంగాణ మార్చ్‌లను ఎదుర్కోవటంలోనూ, జీవవైవిధ్య సదస్సును నిర్వహించటంలోనూ అధిష్ఠానం నుంచి ఆయన పొందాల్సిన మెప్పే పొందారు. అయితే ప్రజల మన్ననలను పొందలేక పోయారు. ఆయన నెతిమీద ‘రూపాయి’ (కిలోబియ్యం పెట్టినా), అర్థరూపాయి విలువ చేయలేక పోయారు. రుణాల మీద ‘పావలా’ వడ్డీ తీసి వేసినా, మహిళలు విజయమ్మ, షర్మిలల వెంటే వెళ్ళిపోవటం మొదలు పెట్టారు. ఏ విద్యుత్తును చూపించి 2004లో వైయస్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారో, ఆ విద్యుత్తే నేడు కిరణ్‌కు ప్రాణాంతకమయింది. ఆయన పేరులో ‘కిరణ’ ముంది కానీ, ఆయన పాలించే రాష్ట్రంలో రుతువులతో సంబంధంలేకుండా చీకట్లు అలుముకున్నాయి. కాబట్టి కిరణ్‌కున్న ‘విధేయత’ ను చూస్తే మార్చకూడదు, కానీ ఆయన తెచ్చుకున్న ‘అపఖ్యాతి’ ని చూస్తే మార్చాలి. పాలన వరకూ విధేయత పనిచేస్తుంది. కానీ ఎన్నికలకు మాత్రం ‘సమర్థతో’, ‘ఆకర్షణో’- రెండూనో వుండాలి. తెలియకుండానే రాష్ట్రంలో అన్ని పార్టీలూ ఏడాదిన్నర ముందే ఎన్నికల సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి, అధిష్ఠానానికి కిరణ్‌ కుమార్‌ మీద ఎంత మక్కువ వున్నా మార్చితీరాలి.

ఈ ప్రశ్న ఉదయించిన వెంటనే- ఏ ప్రాంతం నుంచి- అన్న సమస్య ఉత్పన్నమవుతూ వుండేది. ఇప్పుడా సమస్య సులభంగానే పరిష్కారం కావచ్చు. తెలంగాణకు రాష్ట్రానికి బదులుగా పెద్ద యెత్తున ‘వరం’ కేంద్రం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. (కేసీఆర్‌కు వచ్చే ‘సంకేతాలు’ ఇవా? కావా? అన్నది వేరే విషయం.) బహుశా ‘ప్రాంతీయ అభివృధ్ధి మండలి’ లాంటి ప్రతిపాదన కావచ్చు. అదే జరిగితే తెలంగాణలో బాగా నొచ్చుకునేది కోదండ రామ్‌ లాంటి ‘ఉద్యమ రాజకీయ వాదులు’. వీరికీ ఇతర ‘అధికార రాజకీయ వాదుల’కీ మధ్య వున్న విభేదాలు ఇప్పటికే తెలంగాణలో రోడ్డెక్కాయి. ఏమయినా తెలంగాణ రాష్ట్రం మినహా మరే యితర పరిష్కారానికి సిధ్దంగా లేని స్థితి తెలంగాణ సాధారణ ప్రజాసీకం వరకూ వెళ్ళిపోయింది. ఈ స్థితిని చల్లబరచాలంటే ముఖ్యమంత్రిని తెలంగాణ నుంచే ఎంపిక చేయాలి.

 

ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి తనయుడు?

అయితే ఎవరు? ఎప్పటినుంచే వినపడతున్న జైపాల్‌ రెడ్డి పేరు ఇప్పుడు జాబితా నుంచి తొలగిపోయినట్లే, పైపెచ్చు ‘రిలయస్స్‌తో ఢీ కొన్న వీరుడి’ లాగా ప్రతిపక్షాలు ఆయనను కొనియాడుతున్నాయి. కాబట్టి అధిష్ఠానానికీ, ఆయనకీ మధ్య ఇప్పట్లో పూడ్చలేని అంతరం ఏర్పడింది. ఇక మిగిలింది ఎవరన్నది శేష ప్రశ్న.

వైయస్‌ జగన్‌ ప్రస్తావన వచ్చినప్పుడెల్లా, అధిష్ఠానం మెప్పు పొందే వారంతా ఒక ప్రశ్న వేసేవారు: ముఖ్యమంత్రి తనయులంతా ముఖ్యమంత్రులే అయ్యారా? అలాగయితే రాష్ట్రంలో ముఖ్యమంత్రుల తనయులు ఇంకా వున్నారు- అని అంటూండేవారు. వీరి ప్రభావమోలేక, యాధృచ్చికమో తెలియదు కానీ, కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఒక ముఖ్యమంత్రి (కోట్ల విజయభాస్కర రెడ్డి) తనయుడు కోట్ల సూర్యప్రకాశ రెడ్డికి స్థానం దక్కింది. విశేషమేమిటంటే, ఇటీవల ఏ రాజకీయ సందర్భంలోనూ ఆయన ప్రముఖంగా లేరు. ఆ తర్వాత అంతే పేరు ప్రఖ్యాతులున్న మరో ముఖ్యమంత్రి(మర్రి చెన్నారెడ్డి) తనయుడు మర్రి శశిధర రెడ్డి. ఈయన పేరులో అధిష్ఠానానికి మరో అదనపు ఆకర్షణ వుంది. వైయస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా, పి.జనార్థన రెడ్డితో పాటు, శశిధర్‌( హైదరాబాద్‌ బ్రదర్స్‌) రాజశేఖరరెడ్డికి ఎదురు నిలుస్తూ వచ్చారు. అదీ కాక, ఆయన తెలంగాణ వాసి. అంతే కాదు. తొలివిడత తెలంగాణ ఉద్యమానికి శశిధర్‌ తండ్రే సారధి.( అయితే ఆ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ కలిపేశాడనే విమర్శకూడా ఆ పేరుతో వుంది.) అందుచేత ఆయనను ‘ఎన్నికల ముఖ్యమంత్రి’ గా ముందుకు తెస్తే ఎలా వుంటుందీ- అన్న యోచన అధిష్ఠానం ఎప్పటి నుంచో చేస్తున్నట్లు వార్తలు వస్తూండేవి. ఇప్పుడు ఆ ఊహాగానాలకు ఊపందుకుంటోంది.

ఒక వేళ శశిధర్‌ కాకపోతే, విధేయుడూ, తెలంగాణ ప్రాంతానికీ, బీసీ వర్గానికీ చెందిన డి.శ్రీనివాస్‌కు ఇస్తారని కూడా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఈయనను ఇతర ప్రాంతాలలో అంతగా ఆదరణ వుండక పోవచ్చు.

బండికి ఒక యెద్దును మారిస్తే, మరొక యెద్దును కూడా మార్చాల్సిందే. ముఖ్యమంత్రీ, పీసీసీనేతా కాంగ్రెస్‌ బండికి జోడెద్దులు లాంటి వారు. కాబట్టి పీసీనీ నేతగా వున్న బొత్సను కూడా మార్చే అవకాశమున్నది. ఎలాగూ కాపు సామాజిక వర్గం చిరంజీవి కి దక్కిన గౌరవంతో సంతోష పడతారు కాబట్టి, అందుకోసం మళ్లీ బొత్సను బుజ్జగించాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి తెలంగాణ నుంచయితే, పీసీసీనేత సీమాంధ్రనుంచి వుంటారని సులభంగా చెప్పవచ్చు.

ఇక ‘గులాబి’ ‘చేతి’కే…!

అలాగే వెంటనే చక్కబెట్టుకునే అంశాల్లో టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే అంశం మరొకటి. అవసరమయితే మరో ఢిల్లీలో వుండి, తెలంగాణ పై అమీతుమీ తేల్చుకుని వస్తానని ఆ పార్టీ అధినేత ప్రకటనలు గుప్పిస్తూనే వున్నారు. ఇప్పటికి ‘అభివృధ్ధి మండలి’ ఏర్పాటు చేసి, 2014 తర్వాత యూపీయే-3లో ‘తెలంగాణ రాష్ట్రం పై బిల్లు’ పెడతామనే హామీ మీద కేసీఆర్‌ , పార్టీని కాంగ్రెస్‌ లో విలీనం చేసినా చేయవచ్చు. అప్పుడు తాను ‘ప్రత్యేక రాష్ట్రం సాధించానన్న’ భావనను ప్రజలలోకి పంపించనూ వచ్చు. ఆయన ఈ స్థితిలో కనీసం కోరుకుంటున్నది ‘తెలంగాణ రాష్ట్రం పై ప్రకటన’. రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను తర్వాత చేపట్టినా ఆయనకు అభ్యంతరం కాక పోవచ్చు.

ఈ పనులన్నింటికీ ముహూర్తం పెట్టారన్న సంకేతాన్ని, పార్టీ అధిష్ఠానం ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ద్వారా తేట తెల్లం చేసింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్‌ ‘కొయ్య గుర్రం’ గా మారింది. రౌతులు మారినంత మాత్రాన అది పరుగెత్తుతుందంటారా? వేచి చూడాల్సిందే..!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 2-8 నవంబరు 2012 సంచిక లో ప్రచురితం)

1 comment for “కొయ్య గుర్రానికి కొత్త రౌతులు!

Leave a Reply