టాపు(లేని) స్టోరీ:
ప్రజాస్వామ్యం కూడా నలుగు రంగులు వుంటాయి. అది కూడా ఒక రకంగా చూస్తే చాతుర్వర్ణ వ్యవస్థే. శాసన శాఖ ‘పచ్చ’గా వుంటుంది. అక్కడికి గెలిచి వచ్చేది ‘పచ్చ’ నోట్లతోనే కదా! న్యాయశాఖ నల్ల గా వుంటుంది. న్యాయవాదులూ, న్యాయమూర్తులు వేసుకునే (కొందరి విషయంలో జేబులో వేసుకునే) ‘కోట్ల’ సాక్షిగా ‘నల్ల’గా వుంటుంది. మరి ‘మీడియా’? ఏ రంగులో చూస్తే ఆరంగులో కనిపిస్తుంది. ఇంతకీ ప్రజాస్వామ్యం కీలకమైన ‘కార్యనిర్వాహక’ వాఖ (గవర్నమెంటు) ఏ రంగులో వుంటుంది? ఈ ప్రశ్న సాధారణ పౌరుణ్ణి అడగాలి. తడుముకోకుండా ‘ఖాకీ’ రంగులో వుంటుందని చెబుతాడు.
వెనకటికి ఒక సినిమాలో ఇద్దరు పసివాళ్లు తమకు దొరికిన పర్సును ‘గవర్నమెంటు’ కు ఇచ్చేయాలను నిర్ణయించుకుంటారు. కానీ ‘గవర్నమెంటు’ ఎక్కడ వుంటుంది? ఈ ప్రశ్న ఉదయించగానే, పోలీస్ స్టేషన్లో వుంటుందని వారి చిన్న బుర్రలకు తెలిసి పోయింది. అప్పుడక్కడున్న ఇన్స్పెక్టరు దగ్గరకు వెళ్ళి- ‘మీరేనా గవర్నమెంటు?’ అని అడుగుతారు. ‘కాదు. నేను గవర్నమెంటుకు బాబు’ని అని చెబుతాడు. దాంతో ఆ పసివాళ్లు తమ అదృష్టానికి మురిసి పోతారు. ‘మనం గవర్నమెంటు కోసం వస్తే, దాని బాబే దొరికాడు రా’ అని పొంగి పోయి, పైసలిచ్చి వెళ్ళిపోతారు.
పన్నులేసి, అడిగితే తన్ని తగలేసేదే ప్రభుత్వమని జనానికి గట్టి నమ్మకం కనుక ‘ఖాకీ’ దుస్తులతో వున్న పోలీసులను చూస్తే, సాక్షాత్తూ ‘గవర్నమెంటు’ దర్శనమయిందని సంతోషపడిపోతారు. తాము ‘వోట్లు’ వేసి గెలిపించుకున్న ప్రభుత్వం తమ మీదకు ‘బూట్ల’తో వస్తుందని వారికి తరతరాలుగా తెలుసు. కాబట్టే సర్కారుకు ‘ఖాకీ’ తప్ప వేరే రంగు వుంటుందంటే, వారికి నమ్మ బుధ్ధి కాదు. అయితే ప్రజలు ఎరిగిన ‘ఖాకీ’లు కానిస్టేబుళ్ళే. వారి పైన చాలా టోపీలుంటాయని తెలియదు. చిన్న టోపీ ఎప్పుడూ పెద్ద టోపీకి లోకువ- అని కూడా తెలియదు.
ఆకలితోనో, అవమానంతోనే తెగించి రోడ్లమీద కొచ్చి ధర్నాలూ, ఆందోళనలూ చేసే వారిమీద విరుచుకు పడేదీ కానిస్టేబుళ్ళే, కాబట్టి- వారికి కూడా ‘కన్నీళ్ళుంటాయి’ అంటే నమ్మ బుధ్ధి కాదు. అతడి వొంటి మీద ‘యూనిఫామే’ లేకుండా వుంటే, అతడూ అదే ధర్నాలో వుండే వాడు. కడుపాకలిలో సామాన్యుడికేమీ తీసిపోడు. అయినా కానిస్టేబుల్ ని చూస్తే, కొట్టే వాడిగానే కనిపిస్తాడు.
కొట్టించుకోవటమే కాదు, కొట్టటమూ కష్టమే. ఎప్పుడూ ఎరగని వాడిని, ఏమాత్రం కోపం లేనప్పుడు- కొట్టమంటే కొట్టగలరా! కానీ పైనుంచి ఎవరో ‘ఛార్జ్’ అంటే కొట్టాలి. సాటి బీద వాళ్ళని, సాటి బడుగు వాళ్ళని, పెద్దా, చిన్నా లేకుండా చితకగొట్టాలి. ఇంతకన్నా దిక్కుమాలిన కొలువువుంటుందా! ఇలా ‘ఛార్జ్’ అనే వాళ్లే కానిస్టేబుళ్ళను బయిట వాళ్ళకే కాదు, తమ సొంత ఇంటివాళ్ళకి కూడా శత్రువులుగా మారుస్తారు. పై టోపీలు తిట్టే బూతుల్నీ, హింసల్నీ భరించి భరించి ఇళ్ళకు చేరాక, ఆ ‘చికాకులన్నీ’ భార్యమీదో, పిల్లల మీదో చూపుతాడు కానిస్టేబుల్. అయితే ఈ హింస చాలనట్టు, తమ తమ కుటుంబాలకు నెలలు తరబడి దూరం చేసి, సెలవు అడిగితే ఇవ్వకుండా ఎ.పి. స్పెషల్ పోలీసు కానిస్టేబుల్‌ను అధికారులు వేయించుకు తింటున్నారని, వారి భార్యలు రోడ్ల మీదకు వచ్చారు. ఇప్పుడు అసలు ‘గవర్నమెంటు’ బయిటకు వచ్చింది. అదే సినిమాల్లో అంటారే కనిపించని ‘నాలుగో సింహం’ బయిటకు వచ్చింది. అవును. పై అధికారే కనిపించని సింహం. కానిస్టేబుల్ మాత్రం ‘ఖాకి’చర్మం కప్పుకున్న లేడి పిల్ల. సింహాలు బయిట బయిట లేళ్ళను వేటాడి నట్లే, లోన లేళ్ళనూ వేటాడతాయి. ఆ పై అధికారుల్ని సైతం వేటాడటానికి ఎలాగూ ‘మూడు సింహాలు’ ఉండనే వున్నాయి.
‘ఏ చాతుర్వర్ణ వ్యవస్థ’లోనైనా పాదాల దగ్గరనున్నవాడినే తన్నుతారు.
న్యూస్ బ్రేకులు:
ఆ ఒక్కటీ తప్ప!
ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి అవగాహనా రాహిత్యం వల్లనే పోలీసుల కుటుంబాలు రోడ్డెక్కాయి.
-వర్ల రామయ్య, తెలుగుదేశం పార్టీ నేత
పొరపాటు. పోలీసులకు జీతాలూ, యూనిఫారాలూ, లాఠీలూ- అన్నీ వుంటాయన్న అవగాహన వారికుంది. కాకపోతే, వారికి కూడా కుటుంబాలుంటయాన్న ఒక్క విషయంలోనే అవగాహన లేదు.
కాంగ్రెస్ పార్టీ చేతకానితనం వల్లనే, రాష్ట్రానికి రావలసిన గ్యాస్ మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాజెక్టుకు తరలి పోయింది.
-నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత
మాటల్లో వున్న దంతా ‘గ్యాసే’ కదా! చేతల్లోకూడా కావాలా? అన్యాయం!
‘ట్వీట్ ‘ఫర్ టాట్
ఏక్ నిరంజన్!
పలు ట్వీట్స్ :అన్నా హజారే పెట్ట పోయే పార్టీ ఎలా వుంటుంది?
కౌంటర్ ట్వీట్: జయప్రకాశ్ నారాయణ్ ‘లోక్‌సత్తా ‘లా వుంటుంది. ఆశయాల్లోనే కాదు. ఎన్నికల ఫలితాల్లో కూడా. ఒక్కటే సీటు. ఏక్ నిరంజన్.
ఈ- తవిక
అంతే తేడా!?
‘ఇల్లు కట్టి చూడు
పెళ్ళి చేసి చూడు’-
ఇది పాత సామెత.
బస్సెక్కి చూడు,
రైలెక్కి చూడు-
ఇది కొత్త సామెత.
అప్పుడు పోయేది ఆస్తి.
ఇప్పుడు పోయేది ఆయువు.
బ్లాగ్ (బ్లాక్) స్పాట్:
‘వానొస్తుందో, రాదో- ఎవరూ సరిగా చెప్పలేక పోతున్నారు.’
‘కేసీఆర్‌ను అడిగి చూడండి. ఆయన తెలంగాణ వస్తుందో, రాదో జోస్యం చెప్పటంలో అపారమైన అనుభవం వుంది.’
కొట్టేశాన్( (కొటేషన్):
‘కప్పు’ కొట్టామా, లేదా – అన్నది కాదు, ఆట ఆడామా? లేదా?
-సతీష్ చందర్
(సూర్య దినపత్రిక 6-8-12 వ సంచికలో వెలువడింది)
కడివెడంత గుమ్మడికాయ కత్తి పీటకు లోకువ.. అందుకే మన మగ మంత్రి ఇంటికెళ్ళి “హోమ్ మంత్రిణి” వచ్చారు. కాబట్టే పోలీసు లేడీస్ గెలిచారు. కాదంటే.. కౌంటర్ ఉండదు, కౌంటింగులేని ఎన్ కౌంటరే. ఫుడ్డూ బెడ్డూ క్లోజ్. అందుకే కస్సుమన్న పెద్ద’బాస్’ తుస్సు… ‘గృహమే’ కదా స్వర్గసీమ!!!