పేరు : బొత్స సత్యనారాయణ
దరఖాస్తు చేయు ఉద్యోగం: సమైక్యవాద నేత (నేను కూడా సమైక్యవాదినని, సీమాంధ్ర వాసులు ఒప్పుకుంటే అదే పదివేలు. గతంలో నేను రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు మరచిపోవటం కోసం, నేను ఏం చెయ్యటానికయినా సిద్ధంగా వున్నాను.)
ముద్దు పేర్లు :సత్తి బాబు, ‘సమైక్య’ బాబు. గొడ మీద బొబ్బిలి పులి.( ఎటు కావాలంటే అటు దూకుతుంది.)
విద్యార్హతలు : బ్యాచిలర్ ఆఫ్ ‘హార్ట్స్’ ( సీమాంధ్ర వాసినయినా కానీ, నేను తెలంగాణ వాసుల హృదయాలను గెలిచాను. ఎటొచ్చీ సొంత ప్రాంతంలో, సొంత ‘సామాజిక వర్గం’ వారి హృదయాలను గెలవ లేక పోతున్నాను. వారు నా సొంత ఆస్తుల మీద కూడా దాడి చేశారు.)
హోదాలు : ఒక్క హోదాతో సరిపెట్టుకుంటే పోయేది. కేవలం రవాణా శాఖ మంత్రిగా వుండి పోయి వుంటే బాగుండేది. పీసీనీ అధ్యక్ష పదవిని ఆశించాను. అది కూడా ఎప్పుడు? ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధ్ధృతంగా వున్నప్పుడు. సీమాంధ్ర వాసినయినా కానీ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూల వైఖరి అవలంభించిన కారణంగా, పార్టీ హైకమాండ్ ఈ పదవి నిచ్చింది. ‘జోడు గుర్రాల స్వారీ’ ఇప్పటి వరకూ బాగానే సాగింది. కానీ ఎప్పుడయి తే సీమాంధ్రలో సమైక్య ఉద్యమం వచ్చిందో… నాది ‘రెండు పడవల ప్రయాణం’లాగా అయిపోయింది. నా ప్రాంతం వాళ్ళే నన్ను వెలివేయటం మొదలు పెట్టారు. ఇప్పుడు చచ్చినట్టు సమైక్యవాదినయ్యాను. అయినా నమ్మటంలేదు.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఏదీ దాచుకోలేను. వైయస్ మృతి చెందిన తర్వాత, నా లాగా చాలా మంది ముఖ్యమంత్రి పోస్టు చెయ్యాలని అనిపించింది. అందరూ మనసులోనే దాచుకున్నారు. కానీ నేను పైకి అనేశాను. తప్పేముంది? దాంతో ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న కిరణ్‌కు సహజంగానే కోపంగా వుంటుంది.
రెండు: ఎక్సయిజు నా శాఖ కాదు. కానీ అందరూ అదీ నేను నిర్వహిస్తున్న శాఖ అని అనుమానపడుతున్నారు. నాకు సంబంధం లేక పోయినా సరే, ‘బినామీ’ పేరు మీద నడుపుతున్నానని కొన్ని మద్యం శాఖల మీద దాడులు చేయించారు. లేని విషయాలను ఎవరు నిరూపించగలరు.
సిధ్ధాంతం : కులం కార్డు మిస్సయితే ప్రాంతపు కార్డునీ, ప్రాంతపు కార్డు మిస్సయితే కులం కార్డునీ తీయటం చాలా మంది నేతలు చేస్తుంటారు. ఈ సిధ్ధాంతాన్ని కలిగి వున్నందుకు ఎవరినీ తప్పు పట్టరు కానీ, నన్ను మాత్రం తప్పు పడుతున్నారు. నా ఆస్తుల మీద దాడులు చేయటానికి ‘కులమే’ కారణమని చెబుతున్నా వినరేమిటి?
వృత్తి : విధేయత. అదే కొంప ముంచింది. నేను పార్టీ హైకమండ్‌కూ, ప్రాంతానికీ, కులానికీ ఏక కాలంలో విధేయంగా వుంటాను. కానీ ఈ విధేయతలు ఒక్కసారి ‘క్లాష్ ‘ అయ్యాయి. పార్టీ హైకమాండ్‌కు విధేయంగా వున్నానని, ప్రాంతానికి విధేయంగా లేనంటున్నారు. కిరణ్ మాత్రమే ‘ప్రాంతానికి’ విధేయంగా వున్నారంటున్నారు. ఇది అన్యాయం.
హబీలు :1. కార్లు తయారు చెయటం. చిన్నప్పుడు హాబీగా బొమ్మ కార్లు తయారు చేయించాను. మంత్రయ్యాక ఉత్తరాంధ్రలో (ఓక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ) పెట్టించాలనుకున్నాను. నీలాపనిందలు మిగిలాయి ( అవి అబధ్ధమని తర్వాత తేలిపోయాయి అనుకోండి.) కానీ నా కల నిజం కాలేదు.
2. కుటుంబంతో ఎక్కువ గడపటం. ( అందుకోసమే కీలకమయన స్థానాలనుంచి కుటుంబ సభ్యుల చేత పోటీ చేయిస్తుంటాను. నా భార్య ఝాన్సీ లక్ష్మి ని (2006) లో బొబ్బిలి నుంచి ఎంపీగా పోటీ చేయించానా? లేదా?
అనుభవం : గ్రూపు లేకుండా రాజకీయాల్లో మనగలగటం కష్టం. అలాగని నేను గ్రూపు కట్టను. కానీ నాకు మాత్రం ఏదో ఒక గ్రూపును అంటగడుతూనే వుంటారు.
మిత్రులు : ఒకే రాష్ట్రంలో వుంటారు. కానీ ఒకే ప్రాంతంలో వుండరు. అందుకే కదా, నా అస్తుల మీద దాడి చేసినప్పుడు, తెలంగాణ నేతలు నన్ను పరామర్శించారు.
శత్రువులు : చెప్పలేం? సొంత పార్టీలో, సొంత ప్రాంతంలో, ఒక్కొక్క సారి సొంత కులంలో కూడా వుంటారు. అందుకే మా (విజయనగరం) జిల్లాలో నా ఆస్తుల మీద జరిగిన దాడులే నిదర్శనం.
మిత్రశత్రువులు : అంటే వెన్నుపాటు దారులే కదా! రాజకీయాల్లోకి వచ్చిన రెండో రోజున నుంచే ప్రతీ నేతకూ ఏర్పడతారు. నేను మినహాయింపు.
వేదాంతం : కలవమంటే ‘తెలంగాణ’ కు కోపం, ‘విడవమంటే’ సీమాంధ్రకు కోపం.
జీవిత ధ్యేయం : రాష్ట్రం విడిపోక ముందు ముఖ్యమంత్రి అవుదామనుకున్నాను. విడిపోయినంత మాత్రం ధ్యేయం మారుతుందా? మహా అయితే కుర్చీ చిన్నదవుతుంది. అంతే…!!
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 11-17 అక్టోబరు 2013 తేదీ సంచికలో ప్రచురితం)
baagundhi sir
Very nice and many times I had an opportunity to listen U at Press Club, Basheerbagh. Your analysis and analyzed comments on the deep subject is marvelous Sir, I salute U.,