(సతీష్ చందర్ ‘కింగ్ మేకర్’ గ్రంధం నుంచి)
ఈ మధ్య ఓ కుర్రతెలుగు హీరోను ఓ పత్రికవాళ్లు ఓ ప్రశ్నవేశారు.
‘ఇవాళ ఇండియాలో ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులున్నారు?’
అతడు దీర్ఘంగా ఆలోచించి –
‘ముగ్గురు’ అని చెప్పాడు.
హీరోలకు బుర్ర వుండాలన్న రూలేమీ లేదనుకోండి.
ఒకవేళ వున్నా…. అందులో వున్న కొద్దిపాటి జాగాలో ఇలాంటి మహిళా నాయకులపేర్లు ఎందుకు గుర్తుంటాయి?
అలా కాకుండా
‘తెలుగులో స్థిరపడ్డ ముంబయి తారలెందమందీ?’ అని అడిగితే ఠక్కున చెప్పేవాడు.
ఎవరిరంగం వారిది.
వయసుమళ్లాక గాని సినిమావాళ్లు రాజకీయరంగం గురించి ఆలోచించరు కదా!
III III III
నేడు, పంచరత్నాల్లాగా, దేశంలో అయిదుగురు మహిళా ముఖ్యమంత్రులున్నారు.
అందులో ఇద్దరు (జయలలిత, రబ్రీదేవి) పాతవాళ్లు, ముగ్గురు (షీలాదీక్షిత్, వసుంధరారాజె సింధియా, ఉమాభారతి) కొత్తవాళ్లు.
అయిదుగురు కలిసి అతికీలకమైన అయిదురాష్ట్రాలను పరిపాలిస్తున్నారంటే… దేశంలోని సగం లో సగభాగాన్ని పరిపాలిస్తున్నట్లే లెక్క.
‘మినీభారతం’ లాంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని, మాయావతి జారవిడుచుకోకుండా వుంటే మొత్తం ఆరుగురూ కలసి సగం దేశాన్ని పరిపాలించేవారే!
దాదాపు దశాబ్దకాలంగా ఆడవాళ్లు అతిమర్యాదగా అడుగుతున్నారు- చట్టసభల్లో మూడోవంతు రిజర్వేషన్ కల్పించమని!
ఏ ఒక్కవిషయంలోనూ కలవని వివిధపార్టీల మగమహానాయకులు – ఆడవాళ్ల విషయంలో ఒకటయిపోయి – అడ్డుపడుతూ వచ్చారు.
మూడోవంతు కాదు.. చాలా చాకచక్యంగా అంతకుమించి ఎక్కువే పుచ్చేసుకున్నారు.
అయితే ఈ అయిదుగురు మహిళామూర్తులూ స్వతంత్రంగా ఎదిగిన మహిళలేనా? లేక మగవారి నీడలా…?
జయలలిత – ఈమె పేరెత్తగానే ఎం.జి.ఆర్. గుర్తుకొస్తారు. ఆవిడ వితంతువు కాని వితంతువు.
రబ్రీదేవి – భర్తచాటు భార్య. బిడ్డల్ని కనిపెంచిన మామూలు తల్లి.
షీలాదీక్షిత్ – మామ తెచ్చిన కోడలు.
వసుంధరారాజెసింధియా – శ్రీలంకలో సిరిమావో బండారునాయకేకు చంద్రికా కుమారతుంగ ఎలాగో, రాజమాట విజయరాజ సింధియాకు ఈవిడ అలాగ. (పురుషప్రమేయం ఏమాత్రం లేదు)
ఉమాభారతి – మపేరు చెబితే మండిపడే సన్యాసిని.
ఈ అయిదుగురిలో కొందరికి ‘మగదిక్కు’ వుంది, కొందరికి లేదు.
అందరికీ ఒకే ‘సామాజికవర్గం’ కూడా కాదు.
రిజర్వేషన్లు ఇస్తే …
కొన్నివర్గాల వారే అవకాశాలను కబళిస్తారన్న అపోహలు వీరితో పటాపంచలు అయిపోయాయి.
అయితే… వీరిని చూసి… ‘ఇంకేముంది? మహిళల సాధికారత వచ్చేసింది’ అని మురిసిపోవాల్సినంత సంబరం లేదు.
అది నిజమైతే, ఇందిరాగాంధీ ప్రధాని అయినప్పుడే మురిసిపోయి వుండాల్సింది.
వీరు ఏర్పాటుచేసే మంత్రివర్గాల్లో … మహిళల ప్రాధాన్యం అంతగా వుండదు.
రేపు వీరి పాలనలో కూడా మహిళలపై అత్యాచారాలు యధావిధిగా జరుగుతూనే వుంటాయి.
ఆడపిల్లలు పుట్టకముందే కన్నుమూస్తూనే వుంటారు. వరకట్న చిహ్నాలుగా వంటిళ్లలో గ్యాస్‌స్టౌలు పేలుతూనే వుంటాయి. ఆ ప్రమాదాల్లో కుటుంబసభ్యులంతా క్షేమంగా వుండి, కొత్తకోడళ్లు మాత్రమే కాలిపోతూ వుంటారు. ఇలా సింహాసనాలు ఎక్కిన మహిళామూర్తులంతా, మహిళలకు ‘ప్రతినిధులు’ కాలేరు.
మహా అయితే ‘ప్రతీక’లు కాగలరు.
అలాగని మహిళాభ్యుదయానికి .. ఇది కాలం కాదని కాదు.
వనితలకిది వసంతరుతువే.
కాని కోయిలలకు బదులు రామచిలుకలొచ్చాయి.
రామచిలుకను పట్టుకుని… ‘ఓ పాట పాడవూ?’ అని అడిగితే ఏమంటుంది?
‘అమ్మా! ఆశ! అందానికి నేను కానీ, రాగానికి మాత్రం మా అక్కే (కోయిలే)’ అంటుంది. అంగ్‌సాన్‌సూకీ లాంటి అసలు సిసలు రాజకీయ మహిళలు భారతావనిలోనూ వస్తారు… కాస్త ఆలస్యంగా. వాళ్లే ‘ప్రతినిధు’లవుతారు.
అందాకా… ఈ ‘ప్రతిక’లే వసంతానికి శోభనిస్తారు!!
-సతీష్ చందర్
(పదేళ్ళ క్రితం ఆంధ్రప్రభ దినపత్రికలో ‘కింగ్ మేకర్ ’ శీర్షిక కింద నేను రాసిన వ్యంగ్య వాసాలను పుస్తకంగా తెచ్చాను. అందులోనుంచి ఈ వ్యాసం. పుస్తకం చదవాలనుకున్నవారు ప్రజాశక్తి, నవోదయ, విశాలాంధ్ర పుస్తకాల షాపులలో పొందవచ్చు. లేదా mschandar@yahoo.com కు ఈ- మెయిల్ చెయ్యవచ్చు. వెల: రు180)
మహిలావుమణులు