కూలిపోతున్నానని తెలిసి కూడా కులాసాగా వున్నానని చెప్పటం కష్టమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇదే స్థితిలో వుంది. కాంగ్రెస్ పై వోటర్ల విశ్వాసం సన్నగిల్లిందని, సర్వేల సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడుపార్లమెంటు ఎన్నికలు వస్తే, రాష్ట్రం వరకూ (మొత్తం 42 స్థానాల్లో) కాంగ్రెస్ కు వచ్చే సీట్లు ఏడు లేదా ఎనిమిది అని చెబుతున్నారు. 2009 ఎన్నికలలో 33 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీకి ఎంత నిరుత్సాహం కలగాలి? కేవలం అయిదో వంతు స్థానాలను మాత్రమే మిగుల్చుకో బోతోందంటే, ఎంత దిగులు వుండాలి? అయినప్పటికీ 2014లో పార్లమెంటుకూ, అసెంబ్లీకూ ఎన్నికలకు వచ్చేలోగా ఏదో వింత జరిగి, ఫలితాలు తారు మారు అవుతాయన్నంత భరోసాతో కాంగ్రెస్ వుంది?
ఈ నమ్మకానికి కారణమేమిటి? ‘సర్వేలు సర్వేలే కావచ్చు కానీ, మా లెక్కలు మాకున్నాయి.’ అంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్గీయులు-తమ ప్రయివేటు సంభాషణల్లో. అవి ‘పొత్తు’ల లెక్కలు. ఎంత కాదన్నా రాష్ట్రం ‘రెండు ఉద్వేగాల'( సెంటిమెంటు, సానుభూతి) కారణంగా రెండు ముక్కలుగా చీలింది. ఫలితంగా ఒక చోట(సీమాంధ్రలో) వైయస్సార్ కాంగ్రెస్, మరొక చోట( తెలంగాణలో) టీఆర్‌ఎస్ ప్రధానశక్తులుగా అవతరించాయి. 2009 నాటికి మొదటిది ఉనికిలో లేదు; ఎన్నికలలో చతికిలపడింది. వీటిని శత్రుపక్షాలుగా మార్చుకున్నది కాంగ్రెస్ పార్టీయే. మళ్ళీ ఇప్పుడు వాటిని ‘మిత్ర’ పక్షాలుగా మార్చుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. టీఆర్‌ఎస్ తో ఎన్నికల ముందూ, వైయస్సార్ కాంగ్రెస్‌తో ఎన్నికల తర్వాత చెలిమి చేయాలన్నది కాంగ్రెస్ సంకల్పం. టీఆర్‌ఎస్ తో ఏకంగా ‘విలీనం’ కోసమే కాంగ్రెస్ గతంలో వ్యూహరచన చేసినట్లు సాక్షాత్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆరే బయిట పెట్టారు. ‘తెలంగాణ ఇచ్చేస్తాం, టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? ‘అన్నప్రతిపాదనను తన ముందు చేసారని, అందుకు కూడా తాను సమ్మతించానని ఒక దశలో ఆయన బహిర్గతం చేశారు. బహుశా ఇప్పటికీ కాంగ్రెస్ వ్యూహంలో పెద్దగా మార్పు వచ్చి వుండదు. ‘వీలయితే విలీనం. లేకుంటే పొత్తు’ అన్న రీతిలో టీఆర్‌ఎస్‌కు స్నేహ హస్తాన్ని అందించటానికి కాంగ్రెస్ సిధ్దంగానే వుంటుంది. కానీ, వైయస్సార్ కాంగ్రెస్‌తో మాత్రం ఎన్నికల అనంతరం ‘పొత్తు’కే సిధ్దంగా వుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం వరకూ కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయేకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పింది కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తానని ఎప్పుడూ అనలేదు.అయినప్పటికీ, 2014 ఎన్నికల అనంతర ‘అవసరాల’ రీత్యా, కాంగ్రెస్ మద్దతు వైయస్సార్ కాంగ్రెస్‌కు కానీ, లేదా వైయస్సార్ కాంగ్రెస్ మద్దతు కాంగ్రెస్‌కు కానీ రాష్ట్రంలో వుండవచ్చన్నది కాంగ్రెస్ నేతల నమ్మకం.
జనాదరణ రోజు రోజుకూ తగ్గిపోతున్న పార్టీకి వున్న ఈ అంచనాలను, ఈ దశలో ఎవరూ అంచనాలని పిలవరు. ‘అత్యాశలు’ అంటారు. అయితే ఈ రెండు పార్టీలను తన ‘దారి’లోకి తెచ్చుకోవటానికి కాంగ్రెస్ భిన్న ‘ఉపాయాలను’ ప్రయోగిస్తోంది. సర్కారు అధీనంలో తప్ప, పనిచేయటానికి పూర్తి స్వాతంత్య్రంలేని దర్యాప్తు సంస్థలు వుండనే వున్నాయి. అవినీతి ఆరోపణల మీద పెట్టే కేసులను సర్కారు ‘బిగించమంటే’ బిగించే విధంగానూ, ‘సడలించమంటే’ సడలించే విధంగానూ ఈ సంస్థలు ప్రవర్తిస్తుంటాయన్నది ఎప్పటినుంచో వున్న విమర్శే. వైయస్సార్ కాంగ్రెస్‌ను ఈ ‘కేసుల’తో నియంత్రించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్న వాదన ఇప్పటికే బలంగా వినిపిస్తోంది. ఎన్నికలలోపు జగన్మోహన రెడ్డి బెయిలు మీద రాలేని విధంగా ‘ఉచ్చు’ బిగుసుకుంటోందని, ఆయన వర్గం న్యాయకోవిదులు కూడా అనుమానిస్తున్నారు. దైనందిన వ్యూహ, ప్రతివ్యూహాలకు జగన్ అందుబాటులో లేకుంటే నిజంగానే కొంత నష్టం వుంటుంది. దీనిని తమవైపు లాభంగా మలుచుకోవాలన్నది కాంగ్రెస్ ఆంతర్యం.
టీఆర్‌ఎస్ విషయంలో కాంగ్రెస్ వ్యూహం వేరు. ఆ పార్టీకున్న జనాదరణను ఏదోలా తగ్గించాలన్నది కాంగ్రెస్ ఉద్దేశ్యం. అందుకే టీఆర్‌ఎస్‌కు ఇసుమంత ఖ్యాతిని తెచ్చి పెట్టే పనిని చేయటానికి కూడా కాంగ్రెస్ పూనుకోవటం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేస్తే( అది సులభం కాక పోవచ్చు.) ఖ్యాతి ‘ఇచ్చిన పార్టీ’ (కాంగ్రెస్)కు కాకుండా ‘తెచ్చే పార్టీ”(టీఆర్‌ఎస్, బీజేపీ)లకు పోతుంది. అందుకే ఆ పని వెంటనే చేయకుండా కొన్నాళ్ళు ‘ప్యాకేజీలిచ్చి’, భారీ యెత్తున నిధులనూ, ఉద్యోగకల్పనలను తెలంగాణలో చేయాలని యోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలా చేస్తే, ముందుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇరుకున పడతారు. అయితే అందుకు వారు ముందుగానే సిధ్ధమవుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఇవ్వని పక్షంలో ఎన్నికలలో పోటీ చేయబోమని ముందస్తు ప్రకటనలు చేసి, తమ తమ నియోజక వర్గాలలో వచ్చే తక్షణ వ్యతిరేకతనుంచి బయిట పడాలని చూస్తున్నారు. ఈ ‘ప్యాకేజీ’ల వల్ల టీఆర్‌ఎస్ హవాను కొంత తగ్గించి, ఎన్నికలకు కాస్త ముందు తెలంగాణ ఇవ్వక పోయినా ‘ఇచ్చినంత పని చేసినట్టు’గా ప్రకటన కాంగ్రెస్ వెలువరించవచ్చుచ. అలా ‘కుదింపు’నకు గురయిన, టీఆర్‌ఎస్‌ను విలీనంచేసుకోవటమో, ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవటమో చేయవచ్చని కాంగ్రెస్ కలలు కంటోంది.
ఎవరిని మిత్రులగా చేసుకోవాలనుకున్నదో, వారిని ముందుగా కత్తిరించాలన్నది కాంగ్రెస్ ‘రాజనీతి’!
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 22-29 జూన్ 2013 వ సంచికలో ప్రచురితం)