‘తారా’ గణం!

‘తార’ల్ని సృష్టించ వచ్చు. కూల్చేయ వచ్చు.

చాలా తారలు స్వయంప్రకాశకాలు కావు. ముఖ్యంగా వెండితెర మీద తారలు అస్సలు కారు. ముఖానికి అంగుళం మందాన మేకప్‌ కొట్టి, ఫ్లడ్‌లైట్లు వేస్తేనే కానీ కనిపించరు.

వాళ్ళు కొట్టే పంచ్‌ డైలాగుల్లో, పంచె వాళ్ళదీ కాదు, డై’లాగూ’ వాళ్ళది కాదు. ఎవరో డైలాగ్‌ రైటర్‌ది.

కడకు స్వరమూ వాళ్ళది కాదు. ఎవరో ‘స్వరదాత’ డబ్బింగ్‌ చెప్పాల్సిందే.

ఇక డ్యాన్స్‌ అంటారా? ఈ మధ్య కొందరు జిమ్నాస్టిక్స్‌ నేర్చుకుంటున్నారు లెండి. దాన్నే కొరియోగ్రాఫర్‌ డ్యాన్స్‌గా మార్చి చూపిస్తుంటాడు. లేకుంటే, తారల తైతక్కలకి, ప్రేక్షకులు చిందులెయ్యాల్సిందే.

పాట! తారలు వెరైటీగా వుంటుందని స్వంతంగా వుంటుందని అప్పుడప్పుడూ పాడుతున్నారు కాబట్టి సరిపోయింది కానీ, ప్రతీ సినిమాకూ పాడితే, సినిమా హాళ్ళ చుట్టూ గాడిదల్ని తోలటానికి ప్రత్యేక భద్రతా సిబ్బందిని పెట్టాల్సి వచ్చేది. కాబట్టి గాయకులయిన అసలు గంధర్వులు వారి పరువు నిలబెడుతూ వుంటారు.

అన్నట్లు ‘రిజర్వేషన్‌’ లేకుండా తారలు రాలేరు. సర్కారీ కొలువులకు ‘కులాన్ని’ బట్టి కోటాలుంటే, సినిమాల్లో మాత్రం ‘కుటుంబాన్ని’ బట్టి కోటాలుంటాయి.

‘తార’కు కొడుగ్గానో, మనవడిగానో పుట్టేస్తే చాలు, తార అయిపోయినట్టే. ముఖం చొట్టలూ, ముక్కు వంకర్లూ తీయటానికి విదేశాల్లో సర్జన్లు సిధ్ధంగా వుంటారు. ఇదంతా మగతారల గొడవ.

మరి ఆడ తారలు.

వాళ్ళను రప్పించటానికి నిజంగానే ‘తార’లు దిగిరావాలి. అదే ఈ వారసత్వపు హీరోలే నిర్ణయించాలి. చేసుకోబోయే స్వంత భార్యను తాను స్వంతంగా నిర్ణయించుకోలేడు కానీ, మూడు నెలల మురిపానికి, తన పక్కన నటించే భామను ముంబయి నుంచి కోల్‌కొత్తానుంచో రప్పించ మంటాడు.

హీరోలకు ‘కుటుంబ’ ప్రాతిపదికన రిజర్వేషన్లనిచ్చిన పరిశ్రమ, తెలుగు అమ్మాయిలకు ‘ఒపెన్‌ కేటగరీ’లో కూడా అవకాశాన్నివ్వలేదు.

ఇంత స్పష్టంగా ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టినా పట్టించుకోకుండా, తెలుగు అమ్మాయిలు ‘హీరోయిన్‌’ కలలు కనటం మానలేదు. ‘పెద్దింట్లో’ స్థానం దొరక్క పోతే, చిన్నింట్లోనయినా దొరక్క పోతుందా- అని, గడప దాటేస్తున్నారు. వారనుకున్నట్లే, కొందరు ‘పెద్దతెర’ కలలు చిన్నబోయి ‘బుల్లి తెర’ సీరియల్స్‌లో అమ్మాయిగా, అమ్మగా, అమ్మమ్మగా ఒక మూడువందల ఎపిసోడ్లలో ‘రోజు కూలి’ తో నటించి మధ్యవయసులో రిటైరయిపోతున్నారు.

ఇంకొందరు అక్కడా ఇక్కడా ‘తార’లు కాలేక ‘తారా చౌదరి’ లవుతున్నారు.

కానీ ఇదెక్కడి చోద్యం?

నేను బస్సులో వెళ్తున్నప్పుడు, ఎవరయినా నా జేబు కొట్టేస్తే, నేనేం చేస్తాను. మహా అయితే బస్సులెక్కను. లేదా నా ఫ్యాంట్లకు జేబులే వుంచను. లేదా సామాజిక స్పృహ ఎక్కువయితే, నేను బస్సుఎక్కిన ప్రతీ సారీ ‘సార్‌! మీ జేబులు జాగ్రత్త’ అని అందరికీ చెబుతుంటాను. ఇదంతా నేను ‘నిదానంగా’ ఆలోచించినప్పుడు చేస్తాను.

కానీ, అడ్డంగా ఆలోచిస్తే…?

నాజేబే ఎందుకు కొట్టారు? నా పక్కింటి వాడి జేబు ఎందుకు కొట్టలేదనుకుంటాను. ఈ అడ్డగోలు ఆలోచనకు కాస్త తెగింపును జోడిస్తే..? ఎవడో ఎందుకు, నేనే నా పక్కింటి వాడి జేబు కొట్టేస్తాను.

అత్త వేధింపులకు గురయ్యే కోడలు కూడా అంతే! ‘నిదానంగా’ ఆలోచిస్తే… ‘నాకు కోడలు వస్తే, ఇలా చూస్తానా? కూతురు లా చూసుకోనూ?’ అనుకుంటుంది. ‘అడ్డంగా’ ఆలోచిస్తే, ‘నేను అత్తను కా పోనా? నా కోడల్ని ఒక పట్టు పట్టక పోతానా?’ అనుకుంటుంది. అందుకు ‘తెగింపు’ కూడా జోడించి, చాలా సింపుల్‌ గా స్టౌ పేల్చి ‘వర కట్న హత్య’ చేసేస్తుంది.

‘తారా చౌదరి’ కూడా ఇదే చేసింది.సినిమా కలలు ‘మూడు చిన్న పాత్ర’లతో కరిగి పోయాయి. ‘పిక్చర్‌’ పోయి బతుకే ‘డర్టీ పిక్చర్‌’ అయింది.

ఈ ‘మురికి’ తనకి మాత్రమే మిగలటం నచ్చినట్టు లేదు. ‘మురికి’ని ఇతరలకు అతికిస్తే,.. ? దాంతో అన్నెం పున్నెం తెలీని ఆడపిల్లల బతుకుల్ని ‘మురికి’ చెయ్యటమే వృత్తిగా పెట్టుకుంది.

సహజంగా ఒక్క చంద్రుడి చుట్టూ , వందల ఆడతారలు తిరుగుతారు. ఇది కవి ఊహ.

కానీ, ‘తారా చౌదరి’ చుట్టూ వందల చంద్రులు తిరిగారు. ఒక్కడూ మచ్చలేని వాడు లేడు.

ఎమ్మెల్యేలూ, ఎంపీ(లూ), అధికారులూ- ప్రజాస్వామ్యంలో రెండు శాఖల(శాసన నిర్మాణ, కార్య నిర్వాహక శాఖల) వారూ వీరిలో వున్నారన్నది అనుమానం, అభియోగం కూడా.

వాళ్ళు గప్పు ‘చిప్పు’గా సాగించిన కలాపాలానీ, సంభాషణల్నీ ఆమె ‘చిప్పు’ల్లో బంధించింది.

వారి నీచ చరిత్రను ‘పెన్‌’ తో రచించకుండా ‘పెన్‌ కెమెరా’లతో భద్రపరిచింది.

నిండు శాసన సభలో నీలి వీడియోలను వీక్షించగలిగిన వారున్నారని తేలి పోయాక, ఇలాంటి ‘తారల’ చుట్టూ ప్రదక్షిణాలు చేసే నేతలు వుంటారని తేల్చటం పెద్ద ఆశ్చర్యం కాదు.

గనుల్నీ, భూముల్నీ, చమురునీ, నీళ్ళనీ, ప్రజలకు చెందిన సమస్త వనరుల్నీ మింగగలిగిన నేతలు, ఏ నేరాన్నయినా బేరం చేయగలరు.

ఇలాంటి వారితో, ‘తారా చౌదరి’కి వున్న చెలిమి కూడా అసహజం కాదు

ఒకరు దేశాన్ని అమ్ముతుంటే ఇంకొకరు దేహాల్ని అమ్మ జూపుతున్నారు. అంతే తేడా!

-సతీష్‌ చందర్‌

4 comments for “‘తారా’ గణం!

  1. సతీష్ చందర్ గారూ! Pen is mightier than sword అని మీ రచనలు చదివే చెప్పుంటారు!చాలా selective గా రాయడం కూడా, మీ వార్తా వ్యాఖ్యల కోసం, మీ అభిమాన పాఠకులు ఎదురుచూసేలా చేస్తోంది! Hats off to you Sir!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *