పేరు : బండారు దత్తాత్రేయ.
దరఖాస్తు చేయు ఉద్యోగం:ఢిల్లీకి మంత్రి నయినా, గల్లీకి నేతగానే వుండాలి. శాశ్వతగల్లీనేతే నేను కోరుకునే ఉద్యోగం.
ముద్దు పేర్లు :’దత్తన్న’, ‘దత్త’పుత్రుడు.(కేంద్ర కేబినెట్లో, ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యం వుంది కానీ, తెలంగాణకు లేదనే ఉద్దేశ్యంతో, నన్ను దత్త పుత్రుడిగా స్వీకరించారు).
‘విద్యార్హతలు :‘ఖాకీ నిక్కరు, తెల్ల చొక్కా’ కన్నా గొప్ప అర్హత ఏదయినా వుందా? ‘ప్రచారక్’ అంటే, ‘కాషాయ రాజకీయాల్లో’ పీజీ చేసినట్లే. ఒకప్పటి (రాష్ట్రీయ స్వయం) ‘సేవక్’ లందరూ, ఇప్పుడు ‘నాయక్’లు అయిపోతున్నారు.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: సంపూర్ణమైన అనుభవం. నా జుత్తులో కానీ, మీసాల్లో కానీ ఒక్క నల్ల వెంట్రుక చూపగలరా? స్వరాజ్యానికి ఒక ఏడాది ముందు పుట్టేశాను లెండి.
రెండు: అజాత శత్రువుని( నాకు శత్రువులుండరు) ఎవరి మీదన్నా కోపం వస్తే, నోటికి పని చెప్పను. చేతికే. అపార్థం చేసుకోకండి. కలం పుచ్చుకుని ‘ప్రేమ లేఖలు’ రాసేస్తాను. మరీ ముఖ్యమంగా ముఖ్యమంత్రులకు ప్రేమ లేఖలు రాయటం చాలా ఇష్టం.
సిధ్ధాంతం : ఉత్తర,దక్షిణ ధృవాలను కలిపేయటం. ‘అలయ్, బలయ్’ కార్యక్రమం పెట్టి, చంద్రబాబునీ, కేసీఆర్నీ కలిపెయ్యలేదు. ప్లస్, మైనస్‌ల లాంటి వైర్లను కలిపితే ఏమవుతుంది? బల్బెలగదు? ఫ్యూజు కొట్టేస్తుంది. అదే అయ్యింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే వొట్టు.
వృత్తి : సికింద్రాబాద్‌లో ఏ మూలనుంచయినా ‘దత్తన్నా’ అని పిలవండి. నేను పలుకుతాను. అందరికీ అందుబాటులో వుండటం నా వృత్తి. ( పనులు చేసిపెట్టటానికి పలువురు నేతలు వుంటారు.)
హాబీలు :1. ఒక వైపే చూడండి. నాలోని రెండో వైపు చూడాలనుకోకండి. ఒక వైపు చూస్తే ‘నాయకుణ్ణి’. మరి రెండో వైపు? ‘గాయకుణ్ణి’. నేను క్రిక్కిరిసిన ఓ బహిరంగ సభలో ‘పాడవోయి భారతీయుడా..!’ అన్న పాట పాడాను. దాంతో ప్రాంగణం కొంత ఖాళీ అయి, మిగిలిన వారంతా సౌకర్యవంతంగా కూర్చోగలిగారు. అదీ మన ‘హాబీ ఎఫెక్టు’
2. ‘రిబ్బన్ కటింగ్’. ఏ చిన్న వ్యాపారి, ఏ చిన్న షాపు పెట్టుకున్నా, ‘దత్తన్నా.. నువ్వు రావాలి…!’ అంటారు. వెళ్ళాను. అయితే అక్కడ పాటలు పాడను లెండి.
అనుభవం : వాజ్‌పేయీ కేబినెట్ నుంచి మోడీ కేబినెట్ దాకా .. కేబినెట్లో మన స్థానం ‘సహాయమే’. అందుకే వారి ‘సహాయం’ నేనెప్పటికీ మరువ లేను.
మిత్రులు : ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల్లోనూ వుంటారు. కడకు ‘టీ’ పార్టీలో కూడా. ( అనగా టీఆర్ఎస్లో కూడా.)
శత్రువులు : రామ. రామ… ఈ మాటకు ‘స్పెల్లింగు’ కూడా నాకు తెలీదు.
మిత్రశత్రువులు : ఉండొచ్చు. కానీ వారు నన్ను ఏమీ చెయ్యలేరు. నేను ఎప్పుడూ ఇతరుల వెనుకే వుంటాను. నా వెనుక ఎవరూ వుండరు. కాబట్టి వెన్నుపోటు భయం వుండదు.
వేదాంతం : ‘న.మో’. ఇదే నా వేదాంతం. (మోడీ నామ స్మరణకు మించిన వేదాంతం ఇప్పటి యుగంలో మరొకటి వుంటుందా?’
జీవిత ధ్యేయం : ‘సహాయం’ అన్న మాట లేని కేంద్ర మంత్రి.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 15-21 నవంబరు 2014వ సంచికలో ప్రచురితం)