దూకమంటే దూకేది దూకుడు కాదు.

Photo By: Rhys Asplundh

చూడటానికి పతనం లాగే వుంటుంది. నిజమే. పడ్డాక లేవటమంటూ వుండదు. కానీ పాకవచ్చు. పైపైకి పాక వచ్చు. పడటం తెలిసినవాడికే, పాకటమూ తెలుస్తుంది.

దూకుడుకు ‘టైమింగ్‌’ ముఖ్యం. అంటే అదను చూసి దూకాలి.

అందుకే దూకుళ్ళకు రుతువులుంటాయి. ఎన్నికలకు ముందూ దూక వచ్చు. ఎన్నికలయ్యాకా దూకవచ్చు.

మొదటిది వోట్లు రాలు కాలం. రెండవది నోట్లు రాలు.

ఎన్నికల ముందు వాతావరణం వేరుగా వుంటుంది. ఆకాశం మేఘావృతమయి వుంటుంది. వీదురు గాలులు వీస్తుంటాయి. రాజకీయాల్లో ఏటికి ఎదురీద వచ్చు కానీ, గాలికి ఎదురు వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ గాలులకే వోట్లు రాలతాయి. ఇప్పుడు చూడండి. తెలంగాణ అయితే ‘సెంటిమెంటు’కీ, ‘సీమాంధ్ర’లో అయితే ‘సానుభూతి’కి వోట్లు రాలేటట్లుగా వున్నాయి.

ఎన్నికలయ్యాక ఒక్కొక్క సారి గాలే ఆడదు. ఒక్కొక్క సారి ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాక పోవచ్చు. అప్పుడు ఉన్న ఊపిరి తక్కువ పార్టీలలో పెద్ద పార్టీ సర్కారు ఏర్పాటు చేస్తుంది. దానికి ‘లెక్కకు’ సభ్యులు తక్కువవుతారు. అప్పుడే ‘నోట్లు’ రాలిపోతాయి.

ఎన్నికలయి మూడేళ్లు దాటాయి. ఎన్నికలు వాటంతటవి రావటానికి ఇంకా ఏడాదిన్నర పైన వుంది. మరీ ఇప్పుడేమిటి- ఈ దూకుళ్ళు?

తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీల్లోకి ఒక్కొక్కరుగా దూకుతున్నారు. సొంతపార్టీల చేత నెట్టించుకుని మరీ దూకేస్తున్నారు. ఈ నడమంతరపు దూకుళ్ళకు కారణం నోట్లా? వోట్లా?

చాలా మంది అమాయకులు పెళ్ళిళ్ళకే ముహూర్తాలు చూస్తుంటారు. కానీ అసలు చూడాల్సింది విడాకులకు. కొందరు నిత్య పెళ్ళికొడుకులుంటారు. వీరికి పెళ్ళప్పుడు ఇచ్చే కట్నకానుకల కన్నా, తెగతెంపులప్పుడు వచ్చిపడే చదివింపులే ఎక్కువ వుంటాయి. వదిలించుకునే ఆవిడ దగ్గరా ఆస్తి పొంది, కొత్తగా తగిలించుకునే భార్య దగ్గరా లబ్ధి పొందుతాడు.

వొడుపు తెలిసిన రాజకీయనాయకులందరూ ఇలాంటి ‘నిత్యపెళ్ళికొడుకులే’. ఉన్న పార్టీ దగ్గర ఎంత పొందాలో( కీర్తికావచ్చు, పదవులు కావచ్చు) అంత పొంది, కొత్త పార్టీలో అంతకు పదింతలు పొందే అవకాశాన్ని పదిల పరచుకుని వెళ్తారు.

అయితే చాలా మందికి రాష్ట్రంలో తమ తమ పార్టీలకు విడాకులు ఇవ్వాలని వున్నా, ఇది ఏ రుతువో ఎవరికీ అర్థం కావటం లేదు. కొందరు ‘నోట్ల’ రుతువు అంటారు. ఇంకొందరు ‘వోట్ల’ రుతువంటారు.

ఎన్నికలు ముందుకు జరిగిపోతాయంటారు. ‘మధ్యంతర’మని కొందరూ, ‘ముందస్త’ని కొందరూ- బెదరిస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల జ్యోతిష్కులు బాగా బాగుపడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌ చుట్టూరా చిలక జోస్యాల వాళ్ళు ఎక్కువ మంది తిరుగుతున్నారని వినికిడి.

‘ముఖ్యమంత్రిగారున్నారా?’ అని మామూలుగా అడిగినా సరే ‘ఈ రోజుకున్నారు.’ అని అతి జాగ్రత్తగా బదులిస్తున్నారు- ఆశ, నిరాశలకు గురికాకుండా.

దానికి తోడు పార్టీలకూ, పార్టీలకూ మద్య ‘మ్యాచ్‌ ఫిక్సింగు’ల భయమొక్కటే.

తీరా, మనం ఈ పార్టీలోనుంచి, ఆ పార్టీలోకి దూకిన తర్వాత ఏడాది తిరగకుండా రెండూ పార్టీలూ కలసిపోతే…!?

దూకామనుకుంటారు. కానీ ఉన్న చోటనే వెనకబడి వుండిపోతారు.

వెనకటికి, భార్యతో సమస్యలేక పోయినా, మామతో పడక పోవటంతో, భార్యకు విడాకులిచ్చి ఇంకొకామెను చేసుకున్నాడు. కానీ అత్త వారింటికి వెళ్ళాక గాని అతడికి అర్థం కాలేదు- మారింది భార్యేకాని, మామ కాదు- అని. అర్థం కాలేదా? అతడు చేసుకున్నది ఆ మామ మరోకూతుర్ని. (రెండో భార్య బిడ్డ కావటం చేత, ముందుగా పరిచయం కాలేదు.)

ఆ మధ్య కాంగ్రెస్‌నుంచి ప్రజారాజ్యంపార్టీలోకి దూకిన వారి స్థితి ఏమయ్యింది. కాంగ్రెస్‌నుంచి కాంగ్రెస్‌లోకే.

అందుకే,

దూకటం కన్నా, దూకాలనుకుని దూకకుండా వుండలేక పోవటం- ఎక్కువ మంది నాయకుల్ని ఇబ్బంది పెడుతోంది.

(ఆంధ్రభూమి దినపత్రిక 24-11-12 వ  తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply