దేశమంటే మెతుకులోయ్‌!

సతీష్‌ చందర్‌

ఎగిరిపడ్డాను. మెలకువ వచ్చింది.
ఒక జీవితంలోంచి, మరొకజీవితంలోకి మారినట్లు ఒక కుదుపు. కానీ, ప్రయాణిస్తున్నది అదే బస్సు.
కళ్ళు తెరిచేటప్పటికి ఇద్దరు ఆడపిల్లలు- ఆగుతున్న బస్సు లోనికి వస్తూ.
క్షణం క్రితం చెదిరిన నా కలలోని ఆడపిల్లలే. ఒకరు నలుపు. ఇంకొకరు తెలుపు
నల్లని అమ్మాయి పగలబడి నవ్వింది. విన్నాను
తెల్లని అమ్మాయి మెత్తగా నవ్వింది. చూశాను.
ఎప్పుడూ అంతే. శబ్దాన్ని వినివదిలేస్తాం. నిశ్శబ్దాన్ని మాత్రం చూస్తూ వుంటాం.
ముందు సీట్ల దగ్గరే నిలబడి పోయారు వాళ్ళిద్దరూ. ఎన్ని ముచ్చట్లో! మాట నల్లని అమ్మాయిది. మౌనం తెల్లని అమ్మాయిది.
మాటదో చరిత. మౌనానిదో చరిత.
ఇలాగే వుండే వారు వాళ్ళిద్దరూ.
వెనక్కి వెనక్కి వెళ్ళి పోయాయి నా గురుతులు. బస్సు ముందు ముందుకి వెళ్తోంది ఎగరేసుకుంటూ. ……. ……. ………

అప్పటి నల్లని అమ్మాయితో లంకలకోడేరులో రైల్వే స్టేషన్‌ వద్ద. తెల్లవారు ఝామునుంచి పొద్దు పొడిచే వరకూ మాటలే మాటలు. ఏడుపు మాటలు. నవ్వు మాటలు. నవ్వేడ్పు మాటలు.
ఆపరేషన్‌ టేబుల్‌ మీద పేషెంట్‌కు క్లోరోఫారం ఇస్తే, మూడు గంటల వరకూ కిక్కురు మనడు. నేను ఆమెకు ఒక అబధ్దాన్నిచ్చాను. అది అంతకన్నా మత్తయినది. ఈ మత్తు మౌనం కోసం ఇచ్చింది కాదు. మాటల కోసం ఇచ్చింది.
‘చెల్లెమ్మా! మీ ఆయన విన్సెంట్‌ వస్తున్నాడు. పొద్దున్న బండికే..!’
‘నిజ్జంగా…! సెప్పు రాజన్నా?’ ఆమె నన్నలాగే పిలుస్తుంది.
ఆమెకు నేనెప్పుడూ నిజమే చెబుతాను. ఎప్పుడో కానీ అబధ్ధం చెప్పను. అందుకే ఈ అబధ్ధానికి అంత మత్తు.
‘మూణ్ణెల్లు ముందే ఎందుకొత్తన్నాడు…?’
‘ఆస్తమా వుంది కదా! అక్కడ చలికి ఎక్కువ అయింది. సెలవు ఇచ్చారు’
ఈ వివరానికి ముందు ఏడుపొచ్చేసింది. కానీ, తగ్గుతుందని నమ్మకం. ఇక్కడి వేడికి అదే తగ్గిపోతుందన్న భరోసా.
‘కోడేపుడూ, సేపల పులుసూ తగిలిచ్చానంటే… ఆస్తమా లేదు.. గీస్తమా లేదు.’ అని కొంగుతో కళ్ళూ ముక్కూ తుడిచేసుకుంటూ తేరుకుంది.
ఈ లోగా కొంచెం దూరంగా వున్న రైల్వే క్వార్టర్స్‌నుంచి ‘కొక్కొరోకో’ అన్న కోడి కూత వినిపించింది.
‘సచ్చం! కోడి కూసింది. సూడు రాజన్నా నా మాట అబద్దం కాదు.’
మేము కూర్చున్న చెక్కల సోఫా పైన వున్న రావిచెట్టు ఆకులు గుసగసలాడాయి- నన్ను వెక్కిరిస్తూ.
నేను చెప్పిన అబధ్ధం- ఆశను పెంచటానికి కాదు.. పురుగు ఆకును తొలిచినట్లు మెల్లమెల్లగా ..ఆశను తుంచటానికి.
‘జబ్బుజబ్బే కదమ్మా.. ఎంతయినా..?’ నిర్దయగా, కటువుగా అన్నాను.
‘ఆ మాట నిజమే. ఈడికి రేత్తిరికీ, పొగులుకీ తేడా తెలీదన్నియ్యా..ఇక్కడయినా అంతే… తిరుగుడే తిరుగుడు. పెద్దక్కుందని బట్లమోటూరుకీ, చిన్నక్కుందని సింగిచ్చానికీ… ఒక్క ఊరేంటి.. సెలవు మీదొచ్చినా పట్టుమని రెండ్రోలయినా పెల్లాం దగ్గిరుంటాడేంటీ…? మిలట్రీ మొగుడని పేరుకే గానీ, యీడు యింటిపట్టునెప్పుడున్నాడనీ…!! జబ్బు రమ్మంటే రాదా…! వత్తన్నాడు కదా.. రానీ… గుమ్మం కదిలాడా.. కాల్లిరగ్గొడతాను.’ అని ఆవేశపడిపోయింది.
సగం చిరిగిన రావి ఆకు నా వొళ్ళో పడింది. ‘హమ్మయ్య! ఆశ సగం సడలింది’ అనుకున్నాను.
‘అక్కడకీ మిలట్రీ హాస్పటల్‌లో, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారట!’
‘ లేదు రాజన్నా! ఇది ఇంగిలీసు వైజ్జానికి లొంగే జబ్బు కాదు. రాజోల్లో రాజుగారొకాయనున్నారు. పసరేదో యిత్తాడు. దెబ్బకి నయమయిపోద్దంట. నేను సూసుకుంటాను కదా! మాట యినక పోతే నేను సేసేది సేత్తాను. ఆడే దారి కొత్తాడు. పెల్లయిన కొత్తలో.. ఓపాలి.. ఈడి యవ్వారం సూసి మా పుట్టింటికి సెక్కేసా. ‘ఏయే ముదనట్టపు దానా. మొగుణ్ణొదిలేసి ఎందుకు వొచ్చేసావే’ అనీ మా యమ్మ సీపురు కట్ట తీసింది. అప్పుడికే పేటలో వోళ్ళంతా సూత్తన్నారు. ‘ఆడు పొగులు తొంగుంటాడే..!’ అని అరిత్తే… మా యమ్మ సీపురు కట్ట అవతలడేసి.. ఒకిటే నవ్వు.. దాన్ని సూసి ఈదిలో వోల్లంతా నవ్వు.. నా కెంత సిగ్గేసిందో…!’ అంటూ పగలపడి నవ్వింది…!
చిన్న చిరుగుకూడా లేని పండుటాకు నా ముంజేతి మీద వాలింది. నాకు తెలిసిపోతోంది. నా అబధ్ధం మత్తు విడిపోతోంది. అయినా నా ప్రయత్నం నేను మాన లేదు.
‘నాకు చెప్పకమ్మా! మా విన్సెంట్‌ గాడి మీద తోస్తున్నావ్‌ కానీ, మీ అమ్మ మీద బెంగతోనే పుట్టింటికి పారిపోయేదానివి.’
‘ఆ మాట నిజమే రాజన్నా. అందుకనే.. మీ యిన్సెంట్‌కి తెగేసి సెప్సేసాను- ‘నా అమ్మా, బాబూ నా దగ్గరుంటేనే, నీతో కాపరం సేత్తా’ నని.. ఒప్పేసుకున్నాడు..! ‘ అని కొంచెం సేపు నిట్టూర్చి, ‘అయినా ఏం లాబం..! మా యమ్మకి వొచ్చిన నెల్రోజులకే పచ్చవాతమొచ్చి ఓ కాలూ, ఓ సెయ్యా పడిపోయాయి కదా..’
కొంచెంలో కొంచెం నయం. దృష్టి తల్లి మీదకు మళ్ళటం మంచిదే అనుకున్నాను.
ఇంతలోనే, దూరంగా రైలు వస్తున్న చప్పుడు..!
చీకట్లు కూడా విడిపోతున్నాయి. అంత వరకూ వెనకే వెనకే వుండిపోయిన పేట జనం గుమిగూడుతున్నారు.
ఎమ్మార్వో, ఎస్సయితో పాటు, ఎమ్మెల్యేలు ప్లాట్‌ఫాం మీదకు వచ్చేశారు. ఎమ్మెల్యే గారి గన్‌మన్‌ చేతిలో దండ కూడా వుంది.
‘రాజన్నా! మినిట్టరు గాని వత్తన్నాడా..?’ అడిగింది.
‘అంతకన్నా పెద్దవాడే అయివుంటాడమ్మా!’
‘మినిట్టరూ, మిలట్రీవోడూ ఒకే రైల్లో వత్తన్నారన్నమాట!’ మురిసిపోయింది.
నిర్దాక్షిణ్యంగా, నిర్మొహమాటంగా, క్రూరాతి క్రూరంగా… చీకటినీ, నేను అల్లిన అబధ్ధాన్నీ చీల్చుకుంటూ వచ్చేసింది రైలు.
అందరూ ఒకే బోగీ దగ్గరకి వెళ్ళారు.
ఆలివ్‌గ్రీన్‌ యూనిఫాంలో ఆఫీసరులా వున్న పెద్దాయన ఒకరు దిగారు.
‘హూ యీజ్‌ గెడ్డం కృప, వైఫ్‌ ఆఫ్‌ గెడ్డం విన్సెంట్‌?’ అని అడిగాడు.
అప్పటి నల్లని అమ్మాయిని ముందుకు నెట్టాను.
ఆయన వినయంగా టోపీ తీసి తల వంచి, ‘అయామ్‌ సారీ సిస్టర్‌!’ అని అన్నాడో,లేదో- మూడు రంగుల శవపేటిక ను కిందకు దించారు.
‘అమర్‌ రహే! గెడ్డం విన్సెంట్‌ అమర్‌ రహే! జోహార్‌ గెడ్డం విన్సెంట్‌ జోహార్‌!’
అప్పుడు ఆ నల్లని అమ్మాయి నా మీదకు దూకింది. నా కాలరు పట్టుకుంది.
‘రాజన్నా! సెలవిప్పించేశావా? మా ఆయనకి నిజంగా సెలవిచ్చేశారా?’ అని అరిచింది.
ఆమె అరుపుకి రావి చెట్టు మీద పిట్టలన్నీ ఎగిరపోయాయి. పురుగు తొలిచేశాక ఈనెలు మాత్రం మిగిలివున్న రావి ఆకు శవ పేటిక మీద పడింది.
పేటిక ముఖ భాగం తెరిచారు.
నల్ల అమ్మాయి కృప ఆ ముఖంతో మాట్లాడటం మొదలు పెట్టింది.
ఈలోగా, ‘ నీ భర్త వీరుడమ్మా! సరిహద్దులో పాకిస్తాన్‌ సైనికులతో పోరాడి మరణించాడు. భారత దేశపు ముద్దు బిడ్డ, మడమ తిప్పని సైనికుడు గెడ్డం విన్సెంట్‌ అమర్‌ రహే.’ అంటూ శవపేటిక మీద పూలమాల వేసి దండం పెట్టాడు ఎమ్మెల్యే.
‘అబధ్ధం! నువ్వు సావలేదు. యిన్సెంట్‌ సావడు. యుద్దమూ లేదు గిద్దమూ లేదు. నీకు ఆస్తమా కదా.. సలి పడదు… నేనిత్తానయ్యా… నీకు యేడి నేనిత్తానయ్యా. నా గుండెల్లో యేడంతా యిత్తానయ్యా.. నువ్వెల్తావ్‌. మల్లీ మిలట్రీకెల్తావ్‌.. ఎల్లక పోతే ఎల్లాగ… నాకు బువ్వెవరెడతారూ… మా యమ్మకు మందులెవరు కొంటారూ… ‘ అంటూ కాస్సేపు పిచ్చిదానిలా కలియ చూసింది.
‘రాజన్నా! సచ్చినోణ్ణి పెట్టినట్టు, మా ఆయన్ని పెట్లో ఎట్టేరేంటీ… దా సాయమట్టు. నిలబెడదాం. రాజోలు తీసుకెల్లి పసరేయిత్తే.. ఆడే నడుత్తాడు… దా రాజన్నా!’ అని మాట్లాడింది.
తన భర్తను సమాధి చేసి, అతడి శిరస్సు వద్ద శిలువ ను వుంచే వరకూ మాట్లాడి, తర్వాత కృప స్పృహ తప్పింది.
. ……….. …… …..

బస్సు మధ్యలో చాలా స్టాపుల దగ్గర ఆగుతోంది. చాలా మంది దిగుతున్నారు. ఖాళీ అయిన సీట్లను నిలుచున్న వాళ్ళు భర్తీ చేస్తూనే వున్నారు. కానీ ఆడపిల్లలిద్దరూ మాత్రం ఏ స్టాపులోనూ కూర్చోవటం లేదు. ఏ స్టాపులోనూ దిగటం లేదు.
బస్సు కొత్తగా వేసిన రోడ్డెక్కింది. సాఫీగా పోతోంది. కుదుపుల ప్రయాణంలో ఇదో మెత్తని విరామం. అలజడి నడుమ ప్రశాంతత గుర్తుండిపోతుంది- మాటను మింగేసిన మౌనం లాగా.
……. …….. ……
అప్పటి తెల్లని అమ్మాయి కూడా అంతే. ఆమె మౌనం మా అందరి మాటల్నీ మింగేసింది.
‘వైదేహీ! నీభర్త వస్తున్నాడు. ఏడ్వకూడదు. ఒక్క కన్నీటి బొట్టు రాల్చకూడదు. శాల్యూట్‌ చెయాలి. జెండాకి చేస్తారే… అలాంటి గౌరవ వందనం చెయ్యాలి’.
మా రఘుపతివర్మ మాస్టారు మా అందరి ముందే తన కోడలిని కోరారు.
అవునని ఆమె కళ్ళతోనే సమాధానమిచ్చింది. దు:ఖాన్ని మింగేసిన కళ్ళ తీక్షణతను, అరక్షణం మించి చూడలేకపోయాను. అంత కన్నా ఆమె నుదుటి మీద ఉదయబింబంలాంటి కుంకుమ బొట్టును చూడటం నయమనిపించింది. అది కూడా క్షణం పాటే. ఆ తర్వాత ఆమె వాకిట్లో పెడుతున్న రంగుల ముగ్గును చూడటం మేలనిపించింది.
అప్పటికే మాస్టారు గ్లాస్కో పంచె, ఖద్దరు సిల్కు లాల్చీ, పచ్చని అంచు వుండే కండువా వేసుకుని తాజాగా.. మా చిన్నప్పుడు క్లాసులో ప్రత్యక్షమయినట్టే వున్నారు.

ఆయన పాఠంలోని సారం అర్థం కానప్పుడెల్లా ఆయన రూపమే చూస్తుండేవాణ్ణి. అందుకే ఆరూపం అంటే అంత భయం, అంత ప్రియం.
నాకే కాదు. సొంతుకొడుకు చిత్తు గాడికీ అంతే.
‘ఒరేయ్‌. ఈయన ఇంట్లోకూడా నాన్న లాగ వుండడ్రా! అక్కడా మాస్టారే’ అని మురిపెంగా వణికి పోతుంటాడు మాచేత చిత్తుగాడు- అనిపించుకునే చిత్తరంజన్‌.
రఘుపతివర్మ మాస్టారు కొట్టినంత పనిచేస్తారు కానీ, కొట్టరు. అందుకు భయం
చరిత్రను చెబుతూ దానిని వర్తమానంగా మార్చేస్తారు. అందుకు ప్రియం.
‘కొట్టినా బావుణ్ణు రా… భయం పోయేదీ!’ అని చిత్తుగాడు అన్నాడు ఓసారి. అది ఎప్పుడో కూడా నాకు గుర్తు.
వాడు వైదేహిని ఇష్టపడ్డాడు. అది పెద్దవిషయం కాదు. ఆమెను అందరూ ఇష్టపడతారు. కానీ, ఆమె వీణ్ణి ఇష్టపడింది. ఆవిషయం తెలిసిన రోజునుంచీ వాడి కలలోకి వైదేహి రావడం మానేసింది.
‘కళ్ళు మూసుకుంటే చాలురా. గ్లాస్కో పంచె, ఖద్దరు శిల్కుచొక్కా…! నిద్రవుండటంలేదురా!’
‘ఆయనకు చెప్పెయ్‌! ఒక్క రోజులో పోతుంది.’ అన్నాను కానీ, వాడు వాళ్ళనాన్న దగ్గరకు వెళ్ళి చెప్పిందేమిటో తెలుసా..! ‘నాన్నారూ! నేను సైన్యంలో చేరతాను’ అన్నాడు.
‘చిత్తూ! ఎందుకలా చేశావురా!’ అంటే, ‘ఏమోరా! ఆయన కళ్ళలోకి చూశాక, ఆయనకిష్టమైన మాటొక్కటయినా చెప్పాలనిపించింది’ అనేశాడు.
అలా మా చిత్తుగాడు.. మేజర్‌ చిత్తరంజన్‌ అయి వచ్చినప్పుడు, మాస్టారే చెప్పేశారు. ‘నీకూ, వైదేహికీ పెళ్ళి’ అని. మా చిత్తుగాడికి మహదానందం కలిగింది కానీ, ఆ వెనువెంటనే మాస్టారన్న మాటలకి కొంచెం చిన్న బుచ్చుకున్నాడు. ‘నా పిరికి కొడుక్కి, దైర్యవంతురాలయిన భార్య దొరికిందోయ్‌ రాజూ’ అని నాతో అనేశాడు. అప్పుడు వైదేహి పక్కనే వుంది. కళ్ళతో నవ్వేసింది. మాస్టారితో చిత్తుగాడు చెప్పలేని వాడి ప్రేమ విషయం ఆమె చెప్పగలిగింది కాబోలు.

మాస్టారు ఎదురుగా మా చిత్తుగాడి నిలువెత్తు చిత్రపటం కనిపిస్తున్నా, తలెత్తి చూసే తెగువ లేక, వైదేహి పెట్టిన ముగ్గు వైపే చూస్తున్నాను. ఎన్నో చ్కులు. సగం వరకే గీతలతో కలపగలిగింది.
‘రాజూ! అడుగో చూడవయ్యా! నా కొడుకు మేజర్‌ చిత్తరంజన్‌ వస్తున్నాడు. దేశబంధు చిత్తరంజన్‌ దాస్‌ పేరు పెట్టానయ్యా వీడికి. పిరికి వాడు కాదు వాడు. ధైర్యవంతుడు. చచ్చే ముందు పందొమ్మిది మంది ఉగ్రవాదులను చంపాడు. చస్తూ చస్తూ తనను చిత్రహింసలు పెట్టిన ఇరవయ్యవ వాడిని చంపాడు. అంటే దానర్థం నీకు తెలుసా..?’
చరిత్ర మాస్టారి ప్రశ్నకి నేనే కాదు, ముగ్గు పూర్తి చేసి పైకి వచ్చిన వైదేహి కూడా చూసింది.
‘అహ్హహ్హహ్హ…! తన చావును కూడా చంపాడయ్యా..!’
ముందు క్రమ బధ్ధంగా మార్చింగ్‌ చేస్తూ స్కూల్‌ పిల్లలూ, వెనుక పూలతో అలంకరించిన గన్‌ క్యారేజ్‌ లాంటి ప్రత్యేక వాహనం..దాని పైన మువ్వన్నె పతాకం చుట్టిన శవపేటికా… అన్ని కలిసి ఒక నిశ్శబ్ద ప్రవాహంలా మాస్టారి వాకిలిని ముంచెత్తాయి.
‘ధైర్యవంతుడి ముఖాన్ని ధైర్యవంతులే ముందు చూడాలి. వైదేహీ!’ అని కోడలిని పిలిచారు.
శవపేటిక ముఖభాగాన్ని తెరచిన చోటకి వైదేహి వెళ్ళింది.
శాల్యూట్‌! అవును శాల్యూట్‌ చేస్తూ వుండిపోయింది. పరమ నిశ్శబ్దం. ఆమె గుండె చప్పుడు వినిపించేంత నిశ్శబ్దం. మామా, కోడళ్ళిద్దరూ అగ్నిని మింగినట్టు మింగేశారు – అంతటి దు:ఖాన్ని. ఆ శక్తిని, వారికెవరిచ్చారో..!
…….. ….. …….
దిగిపోయాను. బస్సునుంచే కాదు. నా జ్ఞాపకాల నుంచి, ఎప్పుడు దిగిపోయారో, బస్సులో ఇద్దరు ఆడపిల్లలూ లేరు. పదేళ్ళ క్రితం కృప, వైదేహీలను చూసిన అనుభూతిని మాత్రం మిగిల్చారు
సాయింత్రపు ఎండ. పొదున్నుంచి కాస్తున్న ఎండే. అయినా నాకు కొంత కొత్తగా, కొంత పాతగా వుంది.
నేను పెరిగిన వూరే. ఎరిగీ ఎరగనట్టు వుంది.
ముందు చిత్తుగాడింటికే వెళ్ళాను.
అది ఇప్పుడు ఇల్లు కాదు. అనాథ పిల్లల ఆశ్రమం. పేరు ‘మదర్స్‌ ఎబోడ్‌’
వరండాలోనే- మదర్‌ థెరిసాతో పాటు, యూనిఫాంలో వున్న చిత్తుగాడి ఫోటో, రఘుపతివర్మ మాస్టారి ఫోటోలు సాక్షాత్కరించాయి.
పాత కాలపు చెక్క వాలు కుర్చీలో తెల్లని చీరలో అంతే తెల్లగా వైదేహి. ఎదురుగా ఇద్దరు కుర్రాళ్ళు. వయసు అయిదారేళ్ళకు మించి వుండవు.
ఎర్ర చొక్కా కుర్రాడి తలకు కొబ్బరినూనె రాస్తోందామె. పక్కనే గళ్ళచొక్కా కుర్రాడు పొట్టలు చెక్కలయ్యేలా పడీ పడీ నవ్వుతున్నాడు.
‘అమ్మా! నేన్జెప్పానా..? ఆడి తల సెరుకుతోటని. నువ్వెంత రాసినా అంతే. వంగదు.’ అని మళ్ళీ నవ్వాడు.
‘అయితే ఏం చెయ్యాలి?’ అని నోటితో ఆమె అడగలేదు.ఆ ఆర్థం వచ్చేటట్టు ఆమె కళ్ళు తిప్పింది.
‘సెరుకు తోటను ఏంసేత్తారు? కొట్టిత్తారు..!’ అని నవ్వాపు కుని చెప్పాడు గళ్ళచొక్కా కుర్రాడు.
ఎర్ర చొక్కా కుర్రాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ‘సూడమ్మా…!’ దీర్ఘాలు తీసి గారాబాలు పోతూ, ‘నీకే గుండు కొట్టించాలి. నీది పిచ్చుగ్గూళ్ళ జుట్టు’ అన్నాడు. అంతే .. ఆమె కుర్చీ చుట్టూ ఒకడిని తరముతూ, ఇంకొకడు తిరుగుతున్నారు. ఆమె నవ్వు ముఖం మరింత ప్రకాశించింది.
‘రాజన్నా!’
ఒకే ఒక్క మాట- తపస్సు వీడిన ముని వాక్కులా.
పలకరించి గంభీరంగానే వుండిపోయింది వైదేహి. చూసి ఏళ్ళయిందేమో నా కళ్ళే జలజలా నీళ్ళు రాల్చేశాయి.
‘మాస్టారూ లేరు. చిత్తుగాడూ లేడు. ఇన్నేళ్ళూ ఎలాగడిచిందమ్మా!’ అనగానే, ఆమె మదర్‌ థెరిసా వైపు చూపించింది. మతం మార్చుకున్నట్టుంది, అనుకున్నాను.
ఆ ఎర్రచొక్కా కుర్రాడూ, గళ్ళచొక్కా కుర్రాడూ ఆమె చుట్టూ తిరుగుతూ వున్నారు.
‘వీళ్ళేనా నీకు తోడు?’ అన్నాను.
వాళ్ళను అడ్డగిస్తూ, లేచి నిలబడింది. నన్ను లోనికి తీసుకు వెళ్ళింది. పిల్లలే పిల్లలు. నాకు కొన్ని గంటల పాటు లోకం తెలియలేదు.
‘మావయ్య వచ్చారు కదా! ఈ సాయింత్రం పాయసం తిందామే!’ అన్నదో లేదో.. వాళ్ళ చేతుల్లోకి చెంచాలు వేసిన పాయసం ప్పులొచ్చాశాయి.
‘అమ్మా! రా!’ అని చెంచాతో పాయసం తీసి ముందు వైదేహికి చూపించబోయాడు. ఆమె ఆ ఆప్యాయతను నాకు బదిలీ చేసింది.
‘మావయ్యా! రా’ అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెంచాడు ప్రేమను పంచారు. ఇరవై చెంచాల పాయసం. ఆనందంతో కడుపు నిండిపోయింది.
ఆమె శిరసు వంచి మౌనంగా ప్రార్థన చేసుకుంది.
ఏం మార్పులేదు .మాస్టారు ఎంతో. చిత్తుగాడూ అంతే. చిత్తుగాడెంతో వైదేహీ అంతే. మాస్టారిదీ చిత్తుగాడిదీ దేశభక్తి, వైదేహిది దైవ భక్తి. వీళ్ళకి భక్తి అంటే ఇవ్వటమే.
…… ……. ……
విన్సెంట్‌ గాడి ఇంటికి వెళ్ళాలంటే రైలు కట్టలు దాటాల్సిందే.
పూర్వం చీకటి పడితే పేట కనిపించేది కాదు. కానీ ఇప్పుడు కనిపిస్తోంది. సిమెంటు రోడ్డు, కరెంట్‌ లైట్లూ వచ్చాయి. చిత్రం ఇంట్లో పనులన్నీ రోడ్ల మీదే చేసుకుంటున్నారు. అంట్లు తోముకునే ఆడ వాళ్ళు అంట్లూ, వేడివేడి నీళ్ళతో స్నానాలు చేసే మగవాళ్ళూ స్నానాలూ, చుట్టలు కాల్చుకునే ముసలాళ్ళు చుట్టలూ, ఆటలాడుకునే పిల్లలు ఆటలూ ఆడుకుంటూ… మాటలు, మాటలు.. మాటలాడుతూనే వున్నారు. రోడ్డు ముగిసే చోట చర్చి. పాతదే. శిఖరం మీద వుండే సిలువకు కొత్త లైట్లమర్చారు. చర్చికి కొంచెం ముందే విన్సెంట్‌ వాళ్ళ ఇల్లు.
ఏం మార్పులేదు. అదే తాటాకు ఇల్లు.
వాకిలి బదులు రోడ్డు. దాని మీదే నులక మంచం. అందులో కూర్చున్న ముసలాయన కృప వాళ్ళ నాన్న.
అయనకు దగ్గరగా నిలబడ్డాను.
నన్ను తేరిపార చూసి, వొళ్ళంతా తడుముతూ..
‘బాబా..యిన్సెంటా..!’ అన్నాడు. నేను పెద్దగా ఆశ్చర్యపడలేదు. నన్ను తన అల్లుడనుకున్నట్టున్నాడు.
‘వొచ్చేసావా? మిలట్రీనుంచి వొచ్చేసావా? నిను సూడకుండా సచ్చిపోతాననుకున్నాయ్యా.. నాకు అల్లుడువయినా, కొడుకు వయినా నువ్వే కదా బాబా! ఏంటలా.. సిక్కిపోయవ్‌… నీ జీతమంతా నా తిండికీ, మీ అత్త మందులకే పంపేత్తన్నావ్‌ … ఇంకేం తింటావ్‌లే..! ఓ పది రోజులుంటావా..? మీ యావిడ సేపలూ, రొయలూ వొండి పెడద్ది…’ అని అన్నాడు.
‘ఇంటికి ఎవరొచ్చినా అంతే. అల్లుడే వచ్చాడనుకుంటాడు.’ అని అలా దారిన వెళ్తున్న ఒకాయన అంటూ వెళ్ళి పోయాడు.
విన్సెంట్‌కు చిన్నప్పుడే తల్లీ, ఇంటర్డీయట్‌ చదివే టప్పుడు తండ్రీ-పోయారు. తనకన్నా ముందు పుట్టిన ఇద్దరు అక్కలకీ పెళ్ళిచెయ్యాలని చదువు మానేసి సైన్యం లో సిపాయిలా చేరాడు. అనుకున్నట్టే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. మిలట్రీ ఉద్యోగం చూసి మురిసి పోయి, ఇదుగో ఈ పెద్దాయన తన ఒక్కగానొక్క కూతురు కృపనిచ్చి పెళ్ళి చేశాడు. కాబట్టే అల్లుడే కొడుకయ్యాడు.
ముసలాయన ఆనందాన్ని కొనసాగించాలనుకుని విన్సెంట్‌ లాగే ప్రవర్తించాను. ఆయన నా తల నిమిరాడు. జుట్టు పెరిగిందన్నారు.. పొద్దున్నే లేవగానే తానే క్రాపింగ్‌ చేస్తానన్నారు. ఇంకా ఏవేవో హామీలిచ్చేస్తున్నాడాయన.
పేటపేటంతా మాటలాడుతున్నట్టే వున్నా, వాటి మధ్యలో కృప మాటలు ప్రత్యేకంగా వినిపించాయి. చూస్తే దూరంగా తెల్లని చీరలో నల్లగా కృప. అందరినీ పలకరించుకుంటూ ఇంటికి వస్తోంది.
కాస్త బరువుగా వున్న సంచి ఒక చేత్తోనూ, బైబిలు ఒక చేత్తోనూ మోసుకుంటూ వస్తోంది కృప. నేను వచ్చివున్నట్లు గమనించుకోలేదు.
‘ఏంటమ్మో కృపమ్మా! బరువుగా వత్తన్నావ్‌?’ అని విన్సెంట్‌ పక్కయింటి అరుగుమీదనుంచి ఎవరో పలకరించారు.
‘ఏం లేదొదినా. ఆగ్నీసమ్మ పార్దన చేయించుకుని మూడు తవ్వల బియ్యం కొలిచింది. మనవడికి జొరమొచ్చిందని కవురెడితే ఎల్లాను. డయివరు జాన్‌ గారి ఆవిడ రొండు కోడి గుడ్లిచ్చింది.. ..’ అని చెబుతూ నా వైపు చూసింది.
‘ఎవరూ…! అమ్మో…! రాజన్నే…!’ అంటూ దగ్గరకొచ్చి, ‘ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా…! ” అని, అదే నులక మంచం మీద కూర్చోబడిపోయిందో.లేదో
‘కుపమ్మా… ఇన్సెంటొచ్చి సేనా సేపయింది. ఎక్కడ తిరుగుతున్నావే..! వణ్ణమొండవా?’ అని కేకలు పెట్టాడు ముసలాయన.
కృప నవ్వేసింది. ఆ నవ్వులో దిగులుంది.
‘అమ్మ ఎలా వుంది? ‘ అనడిగాను.
‘ఎప్పుడిలాగానే అన్నయ్యా! మంచం మీదే!’ అని అంటూ లేచి కాళ్ళు కడుక్కోమని, వాకిలి లాంటి రోడ్డు మీద వున్న బకెట్‌ వైపు చూపింది. నేను లేచాను.
‘నువ్వు వణ్ణం తినాల్సిందే. లేపోతే ముసలోడు వూరుకోడు’ అని లోపలికి వెళ్ళింది. చాలా సేపటికి గాని రాలేదు. నేను విన్సెంట్‌లా మారి ఆయనతో మాట్లాడుతున్నాను.
కృప మళ్ళీ బయిటకొచ్చి, ఇప్పుడే వత్తానే, అని చెప్పి, ఎదురుగా వున్న చిన్న డాబాలోకి వెళ్ళింది.
ఏవేవో ఏర్పాట్లు చేసేస్తోంది. విన్సెంట్‌ గాడు బతికున్నప్పుడూ అంతే. ఆమె ఆప్యాయతను తట్టుకోవటం కష్టం.
మొత్తానికి గంటలో ఏర్పాట్లు పూర్తి చేసేసింది. తన ఇంట్లో కాదు. ఎదురింటి డాబాలోనే నాకు భోజనం.
‘మన ఇంట్లోనే తిందాం’ అని ఎంత చెప్పినా వినలేదు.
‘అప్పుడంత సుబ్బరంగా ఇప్పుడు లేదన్నియ్యా.. అమ్మ జబ్బు మనిసి కదా!’ అని నాకు నచ్చ చెప్పేసింది. కోడి గుడ్లతో కూర చేసి, ఉన్నంతలో కొసరి కొసరి పెట్టింది..తృప్తిగా తిన్నాను. ఆమె నాకు వడ్డించింది అన్నం కాదు.. ఆ రోజు చేసిన ఆమె ఆర్జనంతా.. అప్పటికే తొమ్మిదన్నర అయ్యింది. పదిగంటలకే రైలు.
‘ఇక నేను దేశం లోనే వుంటా. తరచు వస్తుంటాలే’ అని చెప్పి రైల్వే స్టేసన్‌కు బయిల్దేరాను.
నా ప్రయాణం క్షేమంగా సాగాలని కృప బిగ్గరగా ప్ర్రార్థన చేసింది. ప్రార్థన నిండా మాటలే, మాటలు.
నా పర్సులో వున్నది మాత్రమే ఆమె చేతిలో పెట్టగలిగాను
వద్దన్నా సరే- నన్ను సాగనంపడానికి కూడా వచ్చింది. ఆమెతోపాటు, ఆడా,మగా ఓ పదిమంది వరకూ వచ్చారు.
స్టేషనేమీ మారలేదు. అదే రావి చెట్టు. వెన్నెలా, విద్యుద్దీపాల వెలుతురూ, గాలీ… పక్కనే కృపా, మళ్ళీ విన్సెంట్‌ చివరి ప్రయాణాన్ని గుర్తు చేసాయి.
‘ఇక్కడే కదా… అన్నయ్యా…’ అని కృప అనబోయింది.
‘వద్దమ్మా! గుర్తు చెయ్యకు.’ అన్నాన్నేను- ఆమె మళ్ళీ ఏడుస్తుందేమోనని.
రైలు వస్తున్నట్టు గుర్తుగా గంట కొట్టారు
‘ఇల్లు ఎలా నడుపుతున్నావమ్మా?’ అన్నాను.
‘ఏసు ప్రభువే నడుపుతున్నాడు. రోజుకు ఎవర్నో ఒకర్ని చూపెడతాడు రాజన్నా! ఎల్లి బైబిలు సదివి పార్దన సేత్తాను. లేదనకుండా ఎంతో కొంత సేతిలో యెడతారు. మా ఆయన పించనొత్తాదనుకో..! కానీ ఏమూలకి..!’ అని దాచుకోకుండా చెప్పేసింది కృప.
వీరికి బువ్వే భక్తి అన్నమాట. అది విన్సెంట్‌ గాడికి దేశ భక్తి అయితే, కృపకు దైవభక్తి అయ్యింది.
రైలు దగ్గరవుత్ను అలికిడి.
పురుగు మొత్తం తొలిచి ఈనెలు మాత్రమే వున్న రావి ఆకు నా చేతి మీద పడింది.
అప్పుడు హఠాత్తుగా నేను మరచిపోయిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది.’మీ ఇంటికి వచ్చి కూడా మీ అమ్మను చూడలేక పోయానమ్మా!’ అని ఆమె చెయ్యిపట్టుకున్నాను.
ఆ మాటకు ఆమె గుండె బద్దలయింది.
‘అన్నయ్యా..!’ అని బావురు మంది. ఆ ఏడుపు రైలు శబ్దంలో కలిసిపోయింది.
రైలు వచ్చి ఆగింది.
‘అమ్మ సచ్చిపోయిందన్నయ్యా. నువ్వొచ్చాక నేను ఇంట్లో కెల్లానా.. అప్పటికే పేనాలుదేలిసింది. నీకు సెప్పితే బువ్వ తినకుండా ఎల్తావని సెప్పలేదు.’
నాకు మాట రాలేదు. మళ్ళీ ఆమే మాట్లాడింది.
‘సేతిలో పైసాలేనప్పుడు సచ్చిందేంట్రా బగవంతుడా… అనుకున్నాన్నయ్యా. దేవుడిలా వొచ్చి నా సేతిలో ఈ డబ్బులెట్టావ్‌. దానికి మంచి సమాది పెట్టి సేయిత్తాను. నీ రుణం మరిసి పోనన్నయ్యా.. ‘ అని రెండు చేతులు జోడించింది. ఆమెతో వచ్చిన వాళ్ళు కూడా భోరుమన్నారు.
నేను రైలు ఎక్కాను.
ఎంత దు:ఖం? ఈ దు:ఖాన్నే సంపదిచ్చిన మౌనం తో వైదేహి మింగితే, దరిద్రమిచ్చిన మాటలతో కృప దిగ మింగేసింది.
….. ….. …..
రైలు కదిలింది. కుడివైపున చిత్తుగాడి ఊరు. ఎడమగా విన్సెంట్‌ గాడి వాడ.
చీకట్లను కాదు, నా దేశాన్ని రెండుగా చీల్చుకుంటూ వెళ్ళి పోతోందీ రైలు.

(ఈ కథ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో 7 ఆగస్టు 2011 నాడు ప్రచురితమయినది)

———

17 comments for “దేశమంటే మెతుకులోయ్‌!

  1. If any one asks what is Intimacy, i can ask them to read this story. it is like a real life movie than a story. you can see only the characters than words.

  2. Its not story, only Characters are played keyrole,
    mottam story chaduvutunnathasepu reppa veyaledu,nenu asalu story marchi poyi charecters matrame gurtu vunchukunna.
    Hats off to you Satish Chandar ..

  3. the story had been written is heart touching if it is may be it story but while reading i forget every thing my surroundings and after few minutes i am unable to come back from the movement really great u showed me (i thought i am really experiencing the situation)

  4. His pen writes writes and laughs, and at times strikes us in the heart.”Always be a poet, even in prose” said Charles Baudelaire.i always thought how? now i have an answer.

  5. kada chadivina tarvata nenu vydehi,krupa la to paatu satish chandra gaariki kuda runapadi untaanu anipinchindi!aa rendu charactors ni creat chesina 3va charctor great kada!

  6. No words to say , if i can get knowledge like this to write a story ……….want to write a story like this and die……. well described sir….awesome. hats off to you.

Leave a Reply to శ్రీ Cancel reply