రెండు బొమ్మల దేశం!

 

 

 

 

 

 

ఎవరి అమ్మ వారి కున్నట్లే
ఎవరి బొమ్మ వారికున్నది

ఊరి బొమ్మ ఊరిది
వాడ బొమ్మ వాడది.

ఊరికి పేరున్నది, నోరున్నది
తిని తిరిగే తీరున్నది,

వాడలోన గాలిలేదు, నీరులేదు
కూర్చుంటే కూడు లేదు.

ఊరిలోన బొమ్మచూడు
ఉన్నదొకటె అంగ్రోస్త్రం

వాడలోని బొమ్మదిగో
సూటు,బూటు దొర వస్త్రం!

మేడవద్ద బక్క జీవి
గుడిసె ముందు రాచఠీవి

అగ్రహారం చిన్నబోయె
మురికి పేట మెరిసిపోయె

వెండిపాత్రలో గంజివొలికెను
సత్తుగిన్నె లో పాలుపొంగెను

ఊరి బొమ్మకు ఊత కర్రా, కిర్రుచెప్పులు
వాడ బొమ్మకు రాతకలమూ, కొత్త బుక్కులు

పల్లెపల్లెలోని వింత
వేదభూమి వెక్కిరింత

ఊరి బొమ్మ కు వినయమెందుకు?
వాడ బొమ్మ కు దర్పమెందుకు?

కట్టుబట్టలు లేని వారు,
రెండుబొమ్మలనడిగినారు.

త్యాగమన్నది బోసినవ్వుల ఊరి బొమ్మ
న్యాయమన్నది చండ్రనిప్పుల వాడ బొమ్మ

‘మీకులేనిది నాకు మాత్రం
ఎందుకన్న’ది ఊరిబొమ్మ

రవికె తొడగని నాయనమ్మను
తలచుకొన్నది వాడబొమ్మ

పట్టు వస్త్రాల్‌, గుట్టు వస్త్రాల్‌
కట్టెనెన్నో ఊరు గుమ్మలు

గుండెమీద వాయవస్త్రాల్‌
కప్పిరప్పుడు వాడ తల్లులు

పొడుగు పంచెలు, కండువాలూ ఊరిస్వామికి అంబరం
ఒంటి కంతకి గోచిపాతే వాడనాన్నకు సంబరం

ఉన్న వస్త్రం వలచివేస్తే
బక్కపల్చని ఊరి బొమ్మ..,

అమ్మకట్టని, నాన్నకట్టని
బట్టకట్టెను వాడబొమ్మ.

ఉలికిపడ్డది ఊరుమొత్తం.
పాడుకున్నది వాడ తత్త్వం:

ఉన్నది వదలటం ఊరికి ఆశయం
లేనిది పొందడటం వాడకు సాహసం

‘రాట్నమి’దిగో వడక మన్నది ఊరి బొమ్మ
రాజ్యమదిగో ఏలమన్నది వాడ బొమ్మ

-సతీష్ చందర్

రచనా కాలం: 2008
(సతీష్ చందర్ కవితా సంకలనం ‘ఆదిపర్వం’ లోని కవిత ఇది. ఈ గ్రంథం 2008 వ సంవత్సరంలో ముద్రితమయినది.)

14 comments for “రెండు బొమ్మల దేశం!

  1. “ఉన్నది వదలటం ఊరికి ఆశయం, లేనిది పొందడం వాడికి సాహసం”….
    రెంటికీ అది అవసరం కూడా…
    ఊరికి అది అవసరమైన వేషం..వాడకి అది అవసరమైన వేదం.
    అద్భుతంగా రాశారు.

  2. ‘వెండిపాత్రలో గంజివొలికెను
    సత్తుగిన్నె లో పాలుపొంగెను’
    కవిత్వం చాలా భాగుంది సార్
    ( ఎవరి బోమ్మవారికున్నాది ) super poem ….

  3. రాట్నం, రాజ్యం …. అబ్బ్బబ్బబ్బా కడుపు నిండిపోయింది సార్..

Leave a Reply