‘దేశ’మంటే ‘వోటు’ కాదోయ్‌!!

pada pic-sarabjitదేశం గుర్తుకొచ్చింది.కాస్సేపు ప్రాంతం,కులం, వర్గం, మతం పోయి భారతీయులకు దేశం గుర్తుకొచ్చింది. అందుకు కారకుడు సరబ్‌జిత్‌.

ఇరవయి మూడేళ్ళు పాక్‌ జైలులో మగ్గి,విడుదలకు అన్ని అర్హతలూ వుండి చిత్రహింసలకు గురయి, కోమాలోకి వెళ్ళి కడకు మరణించాడు. పాకిస్తాన్‌ ఎంత బుకాయించినా, ఇది ఆ ప్రభుత్వం చేసిన ‘దారుణ హత్య’. సాధారణంగా చేసే హత్య ‘ఎన్‌కౌంటర్‌’ పేరు మీదనో, ‘లాకప్‌డెత్‌’ పేరు మీదనో జరుగుతుంది. ఇది మూడో రకం. ఈ హత్యను ‘అధికారులు’ చెయ్యలేదు. సాటి ఖైదీలు చేశారు. కాకుంటే వారు ‘పాక్‌’ ఖైదీలు.

మరి అధికారులు ఏంచేశారు? ఇందుకు సమాధానాలు రెండు. ఒకటి: మూగ సాక్షులుగా మిగిలారు.రెండు: అసలు చేయించిందే వారు. ఇందులో రెండవ కారణమే నిజం కావటానికి వీలుంది.

ఎందుకు చేసినట్లు? పాకిస్తాన్‌లో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికారంలో వున్న పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ రకరకాల సమస్యల్లో కూరుకుపోయింది. పాక్‌ అధ్యక్షుడుగా వున్న జర్దారీ మళ్ళీ పీఠం ఎక్కడం కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, సరబ్‌జిత్‌ సోదరి దల్‌బీర్‌ కౌర్‌ బహిరంగంగానే అంటున్నారు. సరబ్‌ జిత్‌ విడుదల కోసం ఆమె రెండుదశాబ్దాలుగా అలుపెరుగని పోరు చేస్తున్నారు. అయినా కడకు సరబ్‌జిత్‌ను ప్రాణాలు తీసికాని భారత్‌ పంపలేదు.

నిజానికి సరబ్‌జిత్‌ మీద పెట్టిందే తప్పుడు కేసు అన్నది బలమైన వాదన. అభం శుభం తెలియని సరబ్‌జిత్‌ను భారత గూఢచారిగా పరిగణించి, అక్కడ జరిగిన బాంబుకేసుతో ముడిపెట్టారు. ముందు మరణశిక్ష విధించినా, తర్వాత యావజ్జీవంగా మార్చారు. పాక్‌ లెక్కల ప్రకారం అతడు జైలులో వున్న కాలం, యావజ్జీవానికి సరిపోయింది. ఇక విడుదలకావటమే తరువాయి అన్న తరుణంలో, అక్కడి ఖైదీలు, బ్లేళ్ళతోనూ, కర్రలతోనూ సరబ్‌జిత్‌ మీద వికృతంగా దాడిచేశారు.

కౌర్‌ అనుమానించినట్లుభారతీయ ఖైదీని చంపటాన్ని చూపించి, పాక్‌ దేశ భక్తిని పాక్‌వోటర్లలో కలిగిద్దామన్న దుగ్ధ పాక్‌ అధినేతకు వున్నట్లే కనిపిస్తోంది.గతంలో కూడా, సరిహద్దు వద్ద ఇద్దర భారతీయ జవాన్ల తలలను తెగ నరికి తీసుకుపోవటం వెనుక కూడా ఈ రకమైన కుట్ర వుండవచ్చు.

భారత్‌వ్యతిరేకత- అన్న ఎజెండాతో అక్కడి రాజకీయపక్షాలు ఎన్నికల్లో గెలుద్దామనుకుంటే, రానురాను అది భారత్‌ కంటే, పాకిస్తాన్‌కే ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తుంది. ఉగ్రవాద శిక్షణకు పాక్‌ భూభాగం ఉపయోగపడటం వల్ల ముందు భారత్‌ గాయపడితే పడి వుండవచ్చు. కానీ అంతిమంగా నష్టపోయింది పాకిస్తాన్‌. నేడు ఉగ్రవాదుల దాడులు భారత్‌లో కన్నా పాకిస్తాన్‌లోనే ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుకు అమాయకులయిన పాక్‌ పౌరులు సైతం గాయపడుతున్నారు. ఇవాళ సరబ్‌జిత్‌ మృతి మీద రాజకీయం చేసుకోవాలని చూసినందుకు కూడా ఇలాంటి ఫలితాన్నే అనుభవించాల్సి వస్తుంది.

అయితే ఇదే సరబ్‌ జిత్‌ నేడు భారత్‌కు ‘అమర వీరుడు’. ఆయనకు నివాళులర్పించటానికి ప్రజలందరూ ముందుకొస్తున్నారు. అయితే కేంద్రంలో వున్న యుపీయే మొత్తం నిందను మోయాల్సి వస్తుంది. సరబ్‌జిత్‌ను జైలు శిక్ష అనుభవించాక కూడా వెనక్కి ప్రాణాలతో స్వదేశం రప్పించ లేకపోయిందన్న అపప్రదను ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ మూటగట్టుకోవాల్సి వస్తోంది. అయితే సరబ్‌జిత్‌ విడుదల కోసం చేస్తున్న డిమాండ్‌ ఈ నాటిది కాదు. ఎన్డీయే ప్రధాని గా వాజ్‌ పేయీ వున్నప్పుడు కూడా వచ్చింది. కానీ పాకిస్తాన్‌ ప్రతీ సారి నమ్మించి మోసం చేస్తూనే వుంది. కానీ ఈ సారి మరీ బరి తెగించింది. సరబ్‌జిత్‌ను విడుదల చేయకపోగా అత్యంత పాశవికంగా చంపింది.

నిజానికి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి అయిన తర్వాత క్షమాభిక్ష దరఖాస్తులను తిరస్కరించటంతో వరుసగా కసబ్‌, అఫ్జల్‌ గురులను భారత్‌లో ఉరితీశారు. అయితే ఈ శిక్షలు భారత శిక్షాస్మృతి ప్రకారం చేసినవి. అఫ్జల్‌ గురు ఉరి విషయంలో అయితే పౌరహక్కుల ఉల్లంఘన ఆరోపణలు తలెత్తాయి. అది వేరే విషయం. కానీ పాకిస్తాన్‌ జైల్లో సరబ్‌జిత్‌కు జరిగింది అది కాదు. అది ఉగ్రవాద చర్యకన్నా హీనమైనది.

ఈ ఘటనల పరంపర నేడు భారత దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చివేస్తోంది. భారత్‌లో కూడా ‘పాక్‌ వ్యతిరేకత’ దేశభక్తిగా చెలామణి అవుతోంది. 1999 లో ‘కార్గిల్‌’ యుధ్ధం ఎన్డీయేకు అలాగే పనికి వచ్చింది. అయితే అది విజయ చిహ్నం.

కానీ ఇప్పటి పరిస్థితి వేరు. యూపీయే సర్కారుకు వ్యతిరేకంగానే ఇది పనికి వచ్చే అవకాశం వుంది. దానికి తోడు ‘అధీన రేఖ’ను దాటి వందల కిలోమీటర్లు వచ్చేసిన చైనా సైనికులు మరో సవాలు విసిరారు. దాంతో దేశ భద్రత భారత్‌లో రానున్న 2014 ఎన్నికలకు కొత్త ఎజెండా సృష్టించ వచ్చు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 4-10 మే 2013 వ సంచిక లో ప్రచురితం)

2 comments for “‘దేశ’మంటే ‘వోటు’ కాదోయ్‌!!

  1. బాగా రాశారు.ఈ రోజే చైనా తన బలగాలను వెనక్కి పిలవటానికి అంగీకరించింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *