‘దేశ‘మును ప్రేమించుమన్నా.. పొత్తు అన్నది ఉంచుమన్నా.!

టాపు(లేని) స్టోరీ:

Narendra modiమోడీకి నిజంగానే దేశం భక్తి తన్ను కొచ్చింది. ఇది ఒక రకం కాదు, రెండు రకాలు. ఒకటి: ‘హిందూ’ దేశభక్తి.(భారత దేశం అనే మాట కంటే, హిందూదేశమనే మటే ఆయనకు ఎంతో వినసొంపుగా వుంటుంది.) రెండవది: ‘తెలుగుదేశ’భక్తి. ఈ రెంటినీ ఏకకాలంలో ఆయన హైదరాబాద్‌లో ప్రకటించాడు.

బీజేపీకి ‘రామ’భక్తే కాదు, దేశభక్తి కూడా గతంలో రాజకీయంగా పనికి వచ్చింది. ఈ పార్టీ రామభక్తిని అయోధ్యలోనూ, దేశభక్తిని కార్గిల్‌లోనూ గతంలో చూసింది. కడతానన్న ‘రామమందిరాన్ని’ కట్టలేకపోయినా లాభపడింది. ‘కార్గిల్‌’యుధ్ధంలోనూ అంతే. శాశ్వతంగా పాక్‌ దూకుడును కట్టడి చేయలేక పోయినా అభ్ధి పొందింది.

వోట్లకు పడగలెత్తడం తెలిసిన నేత మోడీ. అంతే కాదు. ఎవరో ఒకరి మీద ‘పడగలెత్తితేనే’ కానీ వోట్లు రాలవన్న బ్రహ్మరహస్యం ఆయనకు తెలుసు. ఈ ‘రాజనీతి’నే కిట్టని వాళ్ళు ‘ద్వేష రాజకీయం’ అంటారు. సంఖ్యాపరంగా వోట్లు తక్కువ వున్న సమూహాన్ని ఎంచుకుని వారిని ‘శత్రువు’ ప్రకటిస్తే చాలు, ‘మెజారిటీ వోట్లు’న్న సమూహాలు ఒకే ఒక సమూహంగా మారి, మరీ గెలిపిస్తాయి.

ఇది మోడీ సూత్రం మాత్రమే కాదు. మోడీకి ముందు అద్వాని సూత్రం కూడా. ఇద్దరికీ పెద్ద తేడాలేదు. కాకపోతే, అద్వానీ తన రాజకీయావతారం చాలించకుండానే, మోడీ రాజకీయ ప్రవేశం అద్వానీకి నచ్చలేదు అంతే.

నేడు ‘అభివృద్ధి’ ముసుగువేసేసినా, కొన్నింటినుంచి వీరిద్దరినీ దూరం చేయలేం. బాబ్రీ విధ్వంసానికి అద్వానీకి ప్రత్యక్ష సంబంధమేమీ లేక పోవచ్చు. కానీ ‘మందిర్‌’ ఉద్యమాన్ని ఆయన లేవదీయకుండా వుంటే, కరసేవకులు ఉధ్భవించేవారు కారు. వారే ఉద్రేకపడక పోతే, బ్రాబీ మసీదు, ఒక ప్రాచీన కట్టడంగా నేటికీ నిలిచి వుండేది.

అలాగే గుజరాత్‌ అల్లర్లకు మోడీకీ ఏమిటి సంబంధం- అంటే, వుందా, లేదా- అన్నది కోర్టులు చూసుకుంటాయి. గోద్రా ఘటనలో కరసేవకులు మృతి చెందారన్న వార్త వెలువడిన వెంటనే మైనారిటీల మీద జరిగిన మారణ కాండ చిన్నది కాదు. అప్పుడు నరేంద్ర మోడీయే ముఖ్యమంత్రిగా వున్నారు. కానీ ముష్కర మూకలు వారి ప్రాణాలను బలికొంటూంటే నివారించలేక పోవటం ఒక యెత్తయితే, వారిని పట్టి చట్టం ముందు నిలబెట్టలేక పోవటం మరొక యెత్తు. ‘ఇదింకా విడ్డూరం! ఈ అల్లర్లకు ముఖ్యమంత్రిని ఎలా బాధ్యుల్ని చేస్తాం?’ అని వెంటనే అడిగేయాలనిపిస్తుంది, మోడీని కాస్తో, కూస్తో అభిమానుస్తున్న వాళ్ళకి,

నిజమే. కానీ మన సరిహద్దుల్లోని అరడజను సైనికుల్ని, వేరే దేశానికి చెందినవారు అకారణంగా వచ్చి కాల్చి చంపేస్తే ప్రధానిని, రక్షణ మంత్రిని మనం తప్పుపట్టకుండా వుంటామా? మన సంగతి అలా వుంచితే మోడీ అయినా ఉండగలుగుతారా?ఉండలేరు. ఉండలేక పోయారు కూడా. యూపీయే ప్రభుత్వాన్నీ , ఆ ప్రభుత్వాన్ని నడిపే ప్రధానినీ దుమ్మెత్తి పోశారు. ‘ ఆ స్థానంలో నేనుంటేనా..!’ అని నేరుగా అయితే అనలేదు, కానీ, ‘మోడీయే ప్రధాని అయితే, ఏం చెయ్యాలో అది చేసేవారు’ అని ఆయిన్ని ఆకాశానికెత్తేశారు, ఇతర బీజేపీ నేతలు. కానీ, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సొంత రాష్ట్ర పౌరులను ముష్కరులనుంచి కాపాడలేని మోడీ, రేపు ప్రధాని అయి విదేశీ సేనలనుంచి భారత పౌరుల్నీ, సరిహద్దు సైనికుల్నీ ఎలా రక్షిస్తారు?

కార్గిల్‌ యుధ్ధమప్పుడు దేశ భక్తి వల్ల పొత్తు పెట్టుకున్న తెలుగుదేశానికీ, బీజేపీకీ రెండు పార్టీలకూ లాభించింది. ఇప్పుడు మళ్ళీ జపిస్తున్న దేశభక్తి వల్ల తెలుగుదేశానికి లాభం కలుగుతుందని మోడీ ఆశ చూపిస్తున్నారు. సీమాంధ్రలో ఎలా వున్నా, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణలో, రెండు పార్టీలూ జతకడితే, ఎన్డీయే ఖాతాలో ఓ అరడజను ఎంపీ సీట్లయినా పడక పోతాయా- అని మోడీ ఆశిస్తున్నట్లున్నారు. ఇటీవలి కాలంలో ‘సెక్యులరిజం’ మంత్రాన్ని తరచు జపించిన చంద్రబాబు, మోడీ పంపిన ఈ ప్రేమ సందేశాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి.

న్యూస్‌ బ్రేకులు

మోడీ’ జిరాక్స్‌

ఎస్‌. వియ్‌ కెన్‌. వియ్‌ విల్‌ డూ.

-నరేంద్ర మోడీ, బీజేపీ ప్రచార సారథి

ఎంద ‘మోడీ జిరాక్స్‌’ అయితే మాత్రం, ఓబామా ప్రసంగశైలిని- అలా మక్కికి మక్కి దించేస్తారా?

(ఆంధ్ర, తెలంగాణలకు) నెహ్రూ పెళ్ళిచేస్తే.., సోనియా విడాకులిచ్చారు.

-నందమూరి హరికృష్ణ, తెలుగుదేశం నేత

కానీ మీ బావగారు(చంద్రబాబు) విడాకులకు సాక్షి సంతకం కూడా పెట్టినట్టున్నారు!!

ట్విట్టోరియల్‌

భయపెడుతూ భయపడవచ్చు.

భయం! ఈ ఒక్క మాటా రాష్ట్రంలో రాజకీయమయి కూర్చుంది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలన్నిటికీ భయమే కేంద్ర బిందువు. హైదరాబాద్‌లో సీమాంధ్రుల పరిస్థితి ఏమిటి? ‘ఆంధ్ర ఉద్యోగులు తమ రాష్ట్రానికి పోవాల్సిందే, ఆప్షన్లూ, గీప్షన్లూ వుండవు’ అని కేసీఆర్‌ ఈ భయాన్ని పెంచటానికి తొలుత తన వంతు కృషి చేశారు. తర్వాత భయపెట్టే వంతు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిది అయింది: ‘నేను ఇక్కడే(హైదరాబాద్‌లోనే) పుట్టాను. ఇక్కడే చదివాను. ఇక్కడే పెరిగాను. ఈ నగరానికీ నాకు సంబంధంలేదంటే ఎలా?’ అని ఈ భయాన్ని ఇంకాస్త పెంచారు. ముఖ్యమంత్రిగా చేసిన సీమాంధ్రుడికే అంత భయంగా వుంటే, మిగిలిన సీమాంధ్రుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్సించుకోవటంతో భయం మరికాస్త పెరిగిపోయింది. అయితే ఈ భయాన్ని పోగొట్టేస్తానంటూ కేసీఆర్‌ మీడియా మీటింగు పెట్టారు. కానీ ఆ మీటింగుకు ఆయన ‘బులెట్‌ప్రూఫ్‌ కారు’లో వచ్చారు. ఇంతకీ భయపడిందెవరు? ‘ఇంకెవరూ? కేసీఆరే’ అంటారు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేత ఉండవిల్లి అరుణ్‌ కుమార్‌. ‘అంటే హైదరాబాద్‌లో అందరికన్నా ముందు భధ్రత కరువయింది, కేసీఆర్‌కే నన్న మాట’ అని ఆయన లాజిక్కు తీశారు. భయాన్ని ఎంత పెద్దగా చూపిస్తే, అంత గొప్పగా సీమాంధ్రనేతలకు ఉపయోగపడుతుందని, కేసీఆర్‌ నేతలు గ్రహించలేరా? అయినా ‘భయం’ వెనుక వ్యూహమేమిటో…!?

‘ట్వీట్‌ ఫర్‌ టాట్‌

‘హిట్‌’

పలు ట్వీట్స్‌: మోడీ మీటింగ్‌ హిట్‌!

కౌంటర్‌ ట్వీట్‌: కాదంటే అంతర్జాలంలోని మోడీ ఈ-బ్రిగేడ్‌ హిట్‌ చేస్తుంది. కాబట్టి హిట్టే!

ఈ- తవిక

‘స్టేటు’ కోసం కోటి విద్యలు

 సమస్త కళలూ రోడ్డెక్కాయి.

అర్చన చేసి ఒకరూ,

జాతీయ రహదారి మీద

అభ్యంగన స్నానం చేసి ఒకరూ,

అర్థ నగ్నంగా ఒకరూ,

శిరోముండనంతో ఒకరూ.

కూటి కోసమే కాదు,

కలిసివుండే స్టేటు కోసమూ

కోటి విద్యలు

అక్కరకొచ్చాయి

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘మోడీ సభలో దత్తాత్రేయ పాట పాడారు.’

‘కాదు. పాట చదివారు.’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

సిఎంకి ఎగరలేని వాడు, పిఎంకి ఎగిరాడట

-సతీష్‌ చందర్‌

(సూర్య దినపత్రిక 13  ఆగస్టు 2013 వ తేదీ సంచికలో  ప్రచురితం)

1 comment for “‘దేశ‘మును ప్రేమించుమన్నా.. పొత్తు అన్నది ఉంచుమన్నా.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *