నం’దమ్మూ’రి!

జూనియర్ ఎన్టీఆర్ కేరికేచర్: బలరాం

పేరు : నందమూరి తారక రామారావు( జూనియర్‌)

దరఖాస్తు చేయు ఉద్యోగం: వారసుడు (సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా)

ముద్దు పేర్లు : కుర్ర తాత( తాత ఎన్టీఆర్‌ మనవడి ఎన్టీఆర్‌ను -తాతా- అని పిలిచేవాడు లెండి), జూనియర్‌( సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ‘సీనియారిటీ’ అన్ని వేళలా నిలవదు.(బాబాయ్‌లు అబ్బాయ్‌ లు కావచ్చు, అబ్బాయ్‌లు బాబాయ్‌లు కావచ్చు.) తాతకు తగ్గ మనవడు. నం’దమ్మూ’రి!

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ ‘హార్ట్స్‌’ (మనసుల్ని ఇట్టే దోచెయ్య గలరు. అభిమానులదయినా, కార్యకర్తలదయినా సరే.) నన్ను ఎవరయినా అనుబంధాలతో కొనగలరు. ‘ఎస్టేట్స్‌’ తో కాదు.

హోదాలు : చాలా వున్నాయి. (మహానాయకుడి) మనవడి హోదా, (ఒక పార్టీనేతకి వరసకి) అల్లుడి హోదా, (ఒక తిరుగుబావుటాకి) కొడుకు హోదా..! మనకి మాత్రం- ‘మనవడి’ హోదాయే సరిపోతుంది. ‘రోడ్‌ షో’ చేసినా తాతనే తలపిస్తాను. ‘ఫిల్మ్‌షో’లోనూ తాతనే గుర్తుచేస్తారు

గుర్తింపు చిహ్నాలు : ఎన్టీఆరే నాడూ, నేడు తెలుగుదేశం పార్టీకి గుర్తింపు చిహ్నం. పక్కనే పెడితే పార్టీని గుర్తు పట్టే వారుండరు.

సిధ్ధాంతం : (మిత్రుడు) ‘వంశీ’ గౌరవమా? ‘వంశ’ గౌరవమా? అన్నప్పుడు- సమాధానం చెప్పటానికి ‘తాత’లు దిగివస్తారు. అందుకే రెంటికీ మధ్యస్తంగా ‘తాత గౌరవమే’ ముఖ్యమని చెబుతారు.

వృత్తి : ‘దమ్ము’ చూపటం- ఇంటా, బయిటా.

హబీలు :1. పాడటం.(ప్రయివేటుగానూ, పబ్లిగ్గానూ.) ప్రయివేటు పాటలు ‘యూట్యూబ్‌’లోనూ, పబ్లిక్‌ పాటలు సీడీల్లోనూ లభ్యమవుతాయి.

2. ‘సైకిల్‌ తొక్కటం’ ( ఒకరు తొక్కమన్నప్పుడు కాదు.. నాకు తొక్కాలని పించినప్పుడు. ఎందుకుంటే ఆయన తొక్కే సైకిలు ఏ ‘బాబు’ ది కాదు, ఆయన తాతయ్యది.)

అనుభవం : ఒక్క ఐడియా కాదు, ఒక్క ‘కౌగలింత’ జీవితాన్నే మార్చేస్తుందని తెలుసుకున్నాను. ( సినిమాకు సరిపోయే స్టోరీలైన్‌ లా వుంది కదూ! కానీ ఇది జరిగిన కథ. బెజవాడ నడిరోడ్డు మీద జగన్‌, వంశీల ఆలింగనం, పలువురి రాజకీయ జీవితాన్ని మార్చేసింది.)

మిత్రులు : రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరట కదా! ఈ పాఠం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఒక్కొక్క సారి ప్రాణమిత్రుల్ని కూడా పరిచయస్తులని చెప్పుకోవాల్సి వస్తుంది.

శత్రువులు : ‘దమ్ము’ సినిమా చూడొద్దని ఎస్‌ఎమ్మెస్‌లు పంపింపించిన వాళ్ళు, పంపించమని చెప్పినవాళ్ళూ- వాళ్ళు బంధువులయినా సరే.

మిత్రశత్రువులు : బా… బా….లు( ఇప్పటికి ఆ ఇద్దరి పేర్లూ పొడి అక్షరాల్లోనే.)

జీవిత ధ్యేయం : తాత ఎలా జీవించారో, అలా జీవించటం. ఎక్కడ నిలబడ్డారో అక్కడ నిలబడటం. ఏ కుర్చీల్లో కూర్చున్నారో, ఈ కుర్చీలో కూర్చోవటం.

-సర్‌

1 comment for “నం’దమ్మూ’రి!

  1. తాతకు తగ్గ మనవడు అని.. ప్రూవ్ చేసుకున్నాడు.. ఇక రాజకీయాల లోకి వచ్చే వయసు కాదు.. ఇప్పుడు తగిన సమయము కాదు.. కావున కాస్త ఓపిక పడితే మంచిది.. ఎందుకంటే నందమూరి వారసుల విలువ 2014 కి గాని తెలిసి రాదు .. తెలుగు దేశం పార్టీ కి..

Leave a Reply