పేరు : రాజ్ నాథ్ సింగ్
ముద్దు పేర్లు : ‘నరేంద్ర’ నాథ్ సింగ్( పేరు కు పార్టీలో నా బృందాన్ని ‘టీమ్ రాజ్ నాథ్’ అంటారు. కానీ ఈ మధ్య ఓ ప్రముఖ దినపత్రికలో ఓ కార్టూను చూశాను. పార్లమెంటరీ బోర్డులో వున్న సభ్యులందరికీ నరేంద్ర మోడీ ముఖాలే( మాస్క్‌లే) వున్నాయి. నేను కూడా మినహాయింపు కాదు.
విద్యార్హతలు : చదివింది ‘భౌతికం’ (భౌతిక శాస్త్రం) అలోచన ‘వైదికం’. అందుకే నేను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయనప్పడు పాఠ్యపుస్తకాల్లో మామూలు గణితం తీసి పారేసి, వేద గణితం పెట్టాను. లేక పోతే ఏమిటి చెప్పండి! ఎవరు బడితే వారు ‘విజన్ 2020’ అంటారు. నా విజన్ అది కాదు. క్రీ.పూ 1010. అప్పటికి సమాజాన్ని నడిపించాలంటే మనకి వేదాలే మూలాధారాలు.
హోదాలు : బీజేపీలో ‘రాజ’ హోదాయే. అందుకు నేను నితిన్ గడ్కరీకి రుణపడి వున్నాను. (ఆయనేమో నేషలిస్ కాంగ్రెస్ పార్టీ వారికి నిజంగా ‘రుణ’ పడివున్నాడని అంటారు. మహరాష్ట్రలో వారు నితిన్ కి రైతుల భూమిని దానం చేశారన్నది ఆరోపణ.) వేళకు నీలాప నిందలు తెచ్చుకున్నారు.
గుర్తింపు చిహ్నాలు : ఒకటి: దృతరాష్ట్రుడిమీదా, ద్రోణుడి మీదా వచ్చిన ఆరోపణే నా మీదా వచ్చింది. నాకు పుత్రవాత్సల్యం ఎక్కువని ఆడిపోసుకుంటారు. అయినా నా కొడుకు పంకజ్ సింగ్‌ను ఎక్కడన్నా ముఖ్యమంత్రిని చేశానా? కేవలం యూపీలో పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశాను. దానికే అలిగి సీనియర్లు రాజీనామాలు చేయాలా?
రెండు: చెయ్యెత్తు మనిషిని. సంక్షోభంలో వున్నపు&్పడు చేతులెత్తేసే మనిషిని కూడా.
అనుభవం : నేను పార్టీ అధ్యక్షుడిగా వుండగానే దక్షిణాదిన( కర్ణాటకలో) తొలి సారిగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశానని సంబర పడ్డాను. కానీ తర్వాత కాలంతో యెడ్యూరప్ప తన విజయమని చెప్పుకున్నాడు.
వేదాంతం : ఉండే వాళ్ళంతా మోడీలు కారు. వెళ్ళే వారంతా నితిష్‌లు కారు( మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్త్తే తాను ఎన్డీయేని వీడతానని బీహార్ ముఖ్యమంత్రి, జె.డి(యు) నేత నితిష్ కుమార్ ప్రకటించారు. )
వృత్తి : రమ్మంటే రావటం, పొమ్మంటే పోవటం. ( ఎల్.కె. అద్వానీ పార్టీ అధ్యక్షపదవిని ఖాళీ చేయగానే రమ్మన్నారు. వచ్చాను. గడ్కరీ వస్తారూ వెళ్ళండీ -అనగానే వెళ్ళాను. గడ్కరీ పై ఆరోపణలున్నాయి మీరు రండీ- అన్నారు. మళ్ళీ వచ్చాను. రమ్మనేదీ ఎవరూ, పొమ్మనేదీ ఎవరూ అనడక్కండి. అది రహస్యం. రహస్యాలు కాపాడటం ఆరెస్సెస్‌లో వుండగానే ఒంట బట్టించుకున్నాను.)
హాబీలు :1. పార్టీలో శక్తి మంతుల్ని ‘సీనియారిటీ’ సంబంధం లేకుండా కీర్తించటం.
2.అప్పుడప్పుడూ జోస్యాలు చెప్పటం. ఈ మధ్యనే కాంగ్రెస్ ‘చెయ్యి’ చూసి చెప్పాను లెండి-అక్టోబరులో కానీ, నవంబరులోకానీ యూపీయే సర్కారు కూలిపోవచ్చని.
నచ్చని విషయం : ‘కాషాయ పార్టీ’లో కూడా కాంగ్రెస్ కల్చర్ రావటం.( అంతర్గతంగా కుమ్ములాడుకోవటం. వారయితే- అంతర్గత ప్రజాస్వామ్యమని బుకాయిస్తారు. మేమలా చేయలేం కదా!)
మిత్రులు :మా పార్టీలో ‘మిత్రులు’ లాంటి పిలుపులుండవు. అయితే గురువులూ- శిష్యులూ వుంటారు. లేదా బాబాలూ- భక్తులూ వుంటారు.
శత్రువులు : సారీ, మోడీ శత్రువులంతా నా శత్రువులు కారు. నితిష్ కుమార్ అన్నా నాకు అభిమానమే!
జపించే మంత్రం : మోడీ, నితిష్ భాయీ, బాయీ( ఇది హిందూ ముస్లిం అన్నంత సెక్యులర్ గా లేదూ! కాకపోతే నితిస్ ముస్లిం కాదు. కానీ ముస్లిం వోట్లను కూడా లెక్క పెట్టుకునే మనిషి. వారిని లెక్కనుంచి తప్పించే నేత మోడీ- ఎన్నికల కోసమే సుమండీ!)
విలాసం : ప్రతిపక్షంలో వున్న పార్టీ నేతకు విలాసం వుండదు. విలాపమే.
గురువు : అలా అన్నారు. బావుంది. ఆరెస్సెస్‌లో వున్నారు. పేరు చెప్పటం వారికి ఇష్టం వుండదు.
జీవిత ధ్యేయం : మోడీనీ పార్టీ అధ్యక్షుడి గా చూడటం. అప్పుడు కానీ ప్రధాని రేసులో నేను వుండటానికి వీలు పడదు. ః
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 6-13 ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం.)