‘పక్కా’ ‘మగ’పతిరావు!

కేరికేచర్: బలరాం

పేరు : తమ్మారెడ్డి చలపతి రావు

దరఖాస్తు చేయు ఉద్యోగం: స్త్రీజనోధ్ధారకుడు (‘పక్క’లోకి మాత్రమే స్త్రీలు పనికి వస్తారని లోకానికి ఎలుగెత్తి చాటటం.)

వయసు :నాది బాబాయి వయసూ… తండ్రి వయసూ… తాత వయసూ అని పరిచయం చేస్తారు కానీ..నాది మళ్ళని వయసు.( లేకుంటే కొన్ని దశాబ్దాల పాటు ఒకే ‘రేపిస్టు’ పాత్రను ఎలా చెయ్యగలుగుతాను…?)

ముద్దు పేరు : ‘పక్కా’ రెడ్డి ‘మగ’పతి రావు( ‘మగ’ళ్ళకి స్త్రీలు ఏమవుతారో పబ్లిక్‌ పంక్షన్లో సిగ్గులేకుండా నిరూపించిన వాణ్ణి)

విద్యార్హతలు :భాషాప్రవీణ( ‘పక్కలోకి’ అనే మాటకు మరో గొప్ప అర్థం వుంది.. అని నేను చెబితే కానీ మీడియా, సోషల్‌ మీడియా వాళ్ళకి తెలియటం లేదు. ‘మనశ్శాంతికి స్త్రీ హానికరం కాదు… పక్కన వుంచుకో వచ్చు’ అని నా అర్థం. అదేమిటో ఈ అర్థం నాకు తప్ప వేరెవ్వరికీ స్ఫురించటం లేదు. అనేక సినిమాల్లో ‘రేప్‌ చేస్తా’ అని స్త్రీ పాత్రను అన్నాను. అప్పుడూ ప్రేక్షకులు ఇలాగే అపార్థం చేసుకున్నారు. ఆమె ఒక చెల్లిగానో, తల్లిగానో వచ్చి తన సహాయం చేయమని అడిగితే.. ‘ఇవాళ చెయ్యనూ… రేపు చేస్తానూ..’ అని అనే వాణ్ణి. ఆ మాత్రం దానికే నేను పోషించిన పాత్రలన్నింటికీ ‘రేపిస్టు పాత్ర’ల ముద్ర వేసేశారు. తప్పు కదూ…!)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: పెద్ద మనిషిలా కనిపిస్తాను. ( కాబట్టే ‘పెద్దలకు మాత్రమే’ సినిమాల్లో వుండదగ్గ మాటలు మాట్లాడతాను.)

రెండు:మిత భాషిని( ఎక్కువ మాట్లాడితే వివాదాస్పదమవుతాను. ఆ రోజు సినిమా ఫంక్షన్లో చూడండి..ఒక్క వాక్యం మాట్లాడతేనే ఇంత రాధ్ధాంతం జరిగిపోయింది.( స్త్రీ హానికరం కాదు కానీ… పక్కలోకి పనికొస్తుంది అన్నాను.) రెండో వాక్యం మాట్లాడితే… ఇంకే మయ్యేదో..!

సిధ్ధాంతం : బూతులో కూడా నీతిని చూడండి.

వృత్తి : మహిళలకు సేవ చెయ్యటం. అందుకే నా క్షమాపణ వీడియోలో ‘జై మహిళాలోకం’ అనే నినాదాన్ని రెండు సార్లు ఇచ్చాను.

హాబీలు :1. పొగడినట్టు తిట్టడం( నాకు భార్యావియోగం అయినా కూడా పరస్త్రీ వైపు కన్నెత్తి చూడలేదు అని చెప్పాలి. నేను ‘భాషాప్రవీణుణ్ని’ కదా. అలా ఎందుకు చెబుతాను? ‘అడ్డమైన ఆడవాళ్ళ’ దగ్గరకూ వెళ్ళలేదు. అని అంటాను. (స్త్రీలకు క్షమాపణ చెప్పబోయి వాళ్ళను మళ్ళీ నిందించానూ’ అంటే నేనేం చేసేదీ…!)

2. చుట్టు ‘పక్క’ల్ని శుభ్రంగా ఉంచుకుంటాను. ( సేవలో భాగంగా)

అనుభవం : నాతో ఒక్క నిమిషం మాట్లాడితే..’వంద జబర్దస్త్‌ స్కిట్లు’ చూసినట్టు లెక్క. ( అంత వినోదం.. నాకు తెలీకడుగుతానూ… వినోదం అంటే బూతు కాదా..?)

మిత్రులు : మీకు తెలియదా..? మాకో ‘అడల్ట్‌ క్లబ్‌’ వుంది. కమెడియన్‌ ఆలీ అధ్యక్షుడు. నేను కార్యదర్శిని. బాలయ్యబాబుని గౌరవాధ్యక్షులుగా వుండమని కోరుతున్నాం. ఆయన ముఖమాట పడుతున్నారు. ఆయనకు సభ్యత ఎక్కువ లెండి. నాదృష్టి స్త్రీల చుట్టు ‘పక్క’ల మీద వుంటే, ఆలీకి చుట్టు కొలతల మీద వుంటుంది. ( అందుకే హీరోయిన్ల నడుముల గురించీ, తొడల గురించీ యధేచ్ఛగా మాట్లాడుతుంటాడు)

శత్రువులు : నేను నోరు విప్పితే చాలు… బూతు.. అని ప్రచారం చేసే ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, మహిళా సంఘాలు.

మిత్రశత్రువులు : నేను మాట్లాడినప్పుడు ‘బూతు’అనుకుని పగలబడి నవ్వి.. తర్వాత ‘నీతులు’ పలికే చిత్రపరిశ్రమలోని నా సహచరులు.

వేదాంతం : న’బూతో’ న’రేపు‘. ( అంటే.. బూతు లేనిదే…’రేప’నేది లేదు.)

జీవిత ధ్యేయం : ‘పక్కా’ ప్రణాళికే వుంది. బహుశా ‘జబర్దస్త్‌’ పేరుతో బాహుబలి స్థాయి బడ్జెట్‌తో ప్రపంచంలో ‘పెద్దలు మాత్రమే’ లొట్టలేసుకునే చిత్రాన్ని నిర్మిస్తానేమో..!?

-సతీష్‌ చందర్‌

26 మే 2017

1 comment for “‘పక్కా’ ‘మగ’పతిరావు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *